ఇండోర్: ప్రియురాలు మోసం చేసిందని అపార్ట్‌మెంట్‌కు నిప్పంటించాడు... ఏడుగురు చనిపోయారు

ఇండోర్

ఫొటో సోర్స్, SHURAIH NIAZI/BBC

    • రచయిత, షురైహ్ నియాజీ
    • హోదా, బీబీసీ కోసం

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ అపార్ట్మెంటుకు నిప్పంటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియురాలు తనను మోసం చేసిందనే కోపంతో అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. తొమ్మిది మంది గాయపడ్డారు.

స్వర్ణ్‌బాగ్ కాలనీలోని ఇన్సాఫ్ పటేల్ అపార్ట్మెంటులో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు శుభంను శనివారం రాత్రి ఇండోర్ పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు శుభంను హాజరుపరచినప్పుడు చేతికి గాయాలతో కనిపించాడు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే గాయాల పాలయ్యాడని పోలీసులు తెలిపారు. నేరం చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.

నిందితుడిని పోలీసులు స్టేషన్ నుంచి తీసుకువెళుతుండగా, ఓ అమ్మాయి వచ్చి చెంపదెబ్బ కొట్టింది. 'ఎందుకిలా చేశావు? దీనివల్ల నీకేం ఒరిగింది?' అంటూ నిలదీసింది. ఈ అమ్మాయి శుభం ప్రేమించిన యువతి చెల్లెలని చెబుతున్నారు.

ఇండోర్

ఫొటో సోర్స్, SHURAIH NIAZI/BBC

అసలేం జరిగింది?

ఈ ఘటనతో సంబంధం లేని వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతో ఇండోర్ నగరం కంపించింది. నిందితుడు శుభం దీక్షిత్‌పై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

"మొదట పోలీసులు ఇది షార్ట్ సర్క్యూట్ వలన జరిగిన ప్రమాదం అనుకున్నారు. కానీ సీసీటీవీ ఫుటేజి చూస్తే, ఒక వ్యక్తి నిప్పంటించడం కనిపించింది. వెంటనే ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించాం. నిందితుడు ఆ అపార్ట్మెంటులో నివసిస్తున్న ఓ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ, ఆమె మరొకరిని వివాహం చేసుకోబోతున్నట్టు అతడికి తెలిసింది. దాంతో, ఈ చర్యకు పాల్పడ్డాడు" అని పోలీసు కమిషనర్ హరినారాయణ చారి చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన జరగడానికి కొద్దిసేపటి క్రితం వారిద్దరి మధ్య గొడవ జరిగింది. డబ్బుల విషయంలో కూడా మాటా మాటా అనుకున్నారు. కోపంతో ఊగిపోయిన శుభం ఆ అమ్మాయి వాహనానికి నిప్పంటించాడు.

కానీ, మంటలు చెలరేగి ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని తాను ఊహించలేదని, కేవలం ఆ అమ్మాయి బండిని తగులబెట్టాలనుకున్నానని నిందితుడు శుభం చెప్పాడు.

వీడియో క్యాప్షన్, ప్రేమ, పెళ్లి గురించి యువత చెబుతున్నదేంటి? చేస్తున్నదేంటి?

'ఆ అమ్మాయికి గుణపాఠం చెప్పాలనుకున్నా.. '

ఝాన్సీ నివాసి అయిన శుభం ఏడాది కాలంగా ఇండోర్‌లో ఉంటున్నాడు. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తుండేవాడు. ఏడాది కాలంలో చాలాచోట్ల పనిచేశాడు. ఆరు నెలలు ఇన్సాఫ్ పటేల్ అపార్ట్మెంటులోనే ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉన్నాడు. ఆ అమ్మాయితో గొడవలు అయ్యాక, ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు.

శుభం మీడియాతో మాట్లాడుతూ, "ఆ అమ్మాయికి గుణపాఠం చెప్పేందుకే నిప్పంటించా" అని చెప్పాడు.

ఝాన్సీలోని అతడి కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేసినా, ఫలితం లేకపోయింది.

"విషయం తెలిశాక పోలీసులు నిందితుడి ఆచూకీ వెతికారు. అతడి మొబైల్ నంబర్ పనిచేస్తూనే ఉంది. దాన్ని ట్రేస్ చేసి శుభం ఉన్న లొకేషన్ పట్టుకున్నారు. వెంటనే అతడిని అరెస్ట్ చేశారు" అని స్టేషన్‌ ఇన్‌చార్జి తహజీబ్‌ ఖాజీ చెప్పారు.

సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత, సుమారు మూడు గంటల ప్రాంతంలో శుభం ఆ అపార్ట్మెంటులో కనిపించాడు. పార్కింగ్‌కు వెళ్లాడు. ఆ అమ్మాయి స్కూటీ నుంచి పెట్రోల్ తీసి, బండిని తగులబెట్టాడు. తరువాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

ఇండోర్

ఫొటో సోర్స్, SHURAIH NIAZI

మోదీ సంతాపం తెలిపారు

మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

భవనంలో మంటలు చెలరేగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేయనందుకు ఆ భవనం యజమానిపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

విజయ్ నగర్ పోలీసులు శుభం దీక్షిత్‌పై సెక్షన్ 302 కింద హత్యానేరం నమోదు చేసి అరెస్ట్ చేశారు. అదే రోజు రాత్రి అతడిని పెద్దాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.

ఈ ప్రమాదంలో ఈశ్వర్ సింగ్ సిసోడియా, ఆయన భార్య నీతు సిసోడియా, ఆశిష్, గౌరవ్, ఆకాంక్ష, దేవేంద్ర, సమీర్ మరణించారు. గాయపడ్దవారు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంటలు బలంగా రేగడంతో వారికి తప్పించుకునే అవకాశం లేకపోయింది.

వీడియో క్యాప్షన్, పరువు హత్యలు కాదు, అహంకార హత్యలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)