అతీక్ మర్డర్: గుడ్డు ముస్లిం ఎవరు? చనిపోవడానికి కొద్దిసెకన్ల ముందు అష్రఫ్ మాట్లాడింది ఇతని గురించేనా?

ఫొటో సోర్స్, TWITTER
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో శనివారం రాత్రి పోలీసుల సమక్షంలోనే మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను ముగ్గురు దుండగులు కాల్చి చంపారు.
సోదరులిద్దరినీ వైద్య పరీక్షల కోసం పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ హత్య జరిగింది.
దాడికి పాల్పడిన ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఇద్దరి హత్యకు రెండు రోజుల ముందు అతీక్ అహ్మద్ కుమారుడు అసద్, అతని సహచరుడు గులాం మహ్మద్ కూడా ఝాన్సీలో యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ చేతిలో హతమయ్యారు.
తనపై కాల్పులు జరగడానికి కొద్ది సెకన్ల ముందు అతీక్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు.
ఆ సమయంలో అతని సోదరుడు అష్రఫ్.. 'గుడ్డు ముస్లిం' అనే వ్యక్తి గురించి కెమెరాలో ఏదో చెప్పడం ప్రారంభించారు.
అప్పుడే దుండగులలో ఒకరు అతీక్ అహ్మద్‌ను పిస్టల్‌తో కాల్చారు. అతీక్ కింద పడిపోయాడు. ఆ తర్వాత వెంటనే అష్రఫ్ అహ్మద్‌పై కూడా పలు రౌండ్లు కాల్పులు జరిగాయి.

ఫొటో సోర్స్, TWITTER
ఎవరీ గుడ్డు ముస్లిం?
గుడ్డు ముస్లింను 'బొంబాజ్' అని పిలుస్తారు. ఆయన బాంబుల తయారీలో నిపుణుడిగా పేరుపొందారు.
ఉత్తరప్రదేశ్‌లోని పెద్ద మాఫియా గ్యాంగ్‌ల కోసం గుడ్డు పనిచేసేవారు. అనంతరం అతీక్ అహ్మద్ పిలుపుతో ఆయనతో కలిసి పనిచేశారు.
గుడ్డు ముస్లిం 15 ఏళ్లకే చిన్నచిన్న దొంగతనాలతో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టారని చెబుతుంటారు.
అయితే, కొంతకాలం తర్వాత బాడీబిల్డర్ల వద్ద ఆశ్రయం పొంది, బాంబులు తయారు చేయడం ప్రారంభించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ముఖ్యమైన క్రిమినల్ కేసులలో గుడ్డు ముస్లిం పేరు కూడా చేరడం ప్రారంభమైంది.
గుడ్డు ముస్లిం గత రెండు దశాబ్ధాల నుంచి మాఫియా లీడర్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రకాష్ శుక్లా, ముఖ్తార్ అన్సారీ, ధనంజయ్ సింగ్, అభయ్ సింగ్‌ల వంటి వారితో కలిసి పనిచేశారని బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ ప్రభాత్ వర్మ చెప్పారు.
గుడ్డు ముస్లిం అతీక్ అహ్మద్‌కు కుడి భుజంగా ఉండేవాడు. లక్నో పీటర్ గోమ్స్ హత్య కేసులో గుడ్డు పేరు కూడా తెరపైకి వచ్చింది.
ఫిబ్రవరి నెలలో ఉమేష్ పాల్ హత్య తర్వాత వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజీలో గుడ్డు ముస్లిం బాంబు విసిరినట్లు కనిపించింది.
ఉమేష్ పాల్ హత్య కేసులో అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్, అతని సహచరుడు గులామ్‌తో పాటు గుడ్డు ముస్లిం ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఉమేష్ పాల్ హత్య తర్వాత గుడ్డు ముస్లిం పరారీలో ఉన్నాడు. గుడ్డు ముస్లింపై పోలీసులు 5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు.

ఫొటో సోర్స్, ANI
అతీక్ అహ్మద్‌పై 100కు పైగా కేసులు
అతీక్ అహ్మద్‌పై చాలా కేసులు నడుస్తున్నాయి. ఆయనపై దాదాపు 100కు పైగా కేసులు నమోదయ్యాయి.
చాలారోజుల నుంచి సబర్మతి జైలులో ఉన్న ఆయనపై ఎంపీఎంఎల్‌ఏ కోర్టులో 50కి పైగా కేసుల విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతోంది.
నేర ప్రపంచం నుంచి బయటకు వచ్చి రాజకీయాల్లోకి చేరిన నాయకుల్లో అతిక్ ఒకరు.
అయితే అతని బాహుబలి ఇమేజ్ రాజకీయాల్లో అలాగే ఉండిపోయింది. అతను ఏదో ఒక కారణంతో హెడ్‌లైన్స్‌లో నిలిచేవారు.
ప్రయాగ్‌రాజ్ ప్రాసిక్యూషన్ అధికారుల ప్రకటన ప్రకారం 1996 నుంచి అతీక్ అహ్మద్‌పై 50 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
అతీక్ అహ్మద్ బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకేసులో ప్రధాన నిందితుడు. దీనిపై సీబీఐ విచారణ జరుగుతోంది.
ఈ ఏడాది మార్చి 28న ప్రయాగ్‌రాజ్‌లోని ఎంపీఎంఎల్‌ఏ కోర్టు '2006లో ఉమేష్ పాల్‌ను కిడ్నాప్ చేసిన కేసు'లో అతీక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించింది.
రాజుపాల్ హత్యకేసులో ఉమేష్ పాల్ తొలి సాక్షిగా ఉన్నారు. అయితే ఆ తర్వాత కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ అతడిని సాక్షిగా గుర్తించలేదు.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 24న పట్టపగలు ఉమేష్ పాల్‌ను దుండగులు కాల్చి చంపారు.

ఫొటో సోర్స్, ANI
అతీక్ సోదరుడు అష్రఫ్ నేర చరిత్ర ఏంటి?
1992లో అష్రఫ్ అలియాస్ ఖలీద్ అజ్మీపై తొలి క్రిమినల్ కేసు నమోదైంది. అతనిపై ఇప్పటివరకు 52 కేసులు నమోదయ్యాయి.
ఇందులో హత్య, హత్యాయత్నం, అల్లర్లు తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉమేష్ పాల్ హత్యకేసులో అష్రఫ్ నిందితుడిగా ఉన్నారు. ఉమేష్ పాల్ 2006 సంవత్సరంలో కిడ్నాప్ అయ్యాడు.
'ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు' తీర్పులో అష్రఫ్ నిర్దోషి అని వెల్లడించారు.
ఈ కేసులో ఎంపీఎంఎల్‌ఏ కోర్టు అతీక్‌తో పాటు మరో ఇద్దరిని దోషులుగా నిర్ధారించి, ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించింది.
2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకేసులో అష్రఫ్ కూడా నిందితుడిగా ఉన్నాడు. లక్నోలోని సీబీఐ కోర్టులో ఆ కేసు విచారణ జరుగుతోంది.
అష్రఫ్ చాలారోజులు బరేలీ జైలులో ఉన్నారు. అనంతరం అతన్ని ప్రయాగ్‌రాజ్‌కు తరలించారు.
బీబీసీ హిందీ అసోసియేట్ జర్నలిస్ట్ ప్రభాత్ వర్మ కొంతమంది నిపుణుల అభిప్రాయాలను ఉటంకిస్తూ ''అతీక్ అహ్మద్ పనులు అష్రఫ్ అహ్మద్ ప్లాన్ చేసేవాడు.
2015 సెప్టెంబరు 25న ధూమన్‌గంజ్ ప్రాంతంలోని మరియాడిహ్ గ్రామంలో అతీక్ సన్నిహితులైన అబిద్ ప్రధాన్ డ్రైవర్ సుర్జిత్, అల్కమా హత్యకు గురయ్యారు.
ఈ కేసులో తొలుత పలువురిపై కేసు నమోదైంది. ఆ వ్యక్తులు హత్యకు ప్రణాళిక వేయలేదని, అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ల బృందం ఈ హత్య వెనుక ఉన్నారని తరువాత తెలిసింది'' అని వివరించారు.

ఫొటో సోర్స్, PRABHAT VERMA AND PUJA PAL
రాజుపాల్ హత్యలో అష్రప్ ప్రమేయం?
2004 సార్వత్రిక ఎన్నికలలో అతీక్ అహ్మద్ సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై ఫుల్‌పూర్ నుంచి లోక్‌సభ ఎన్నికలలో గెలిచి, పార్లమెంటు సభ్యుడయ్యారు.
ఆ తర్వాత అలహాబాద్ పశ్చిమ అసెంబ్లీ స్థానం ఖాళీ కావడంతో దానికి ఉప ఎన్నికలు జరిగాయి.
ఈ ఉప ఎన్నికల్లో అతీక్ తమ్ముడు అష్రఫ్‌కు ఎస్పీ టికెట్ ఇవ్వగా, బహుజన సమాజ్ పార్టీ తరఫున రాజుపాల్ పోటీచేశారు.
బీఎస్పీ అభ్యర్థి రాజుపాల్ అష్రఫ్ అహ్మద్‌పై విజయం సాధించి, తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.
అయితే, ఎమ్మెల్యే రాజుపాల్‌ను 2005 జనవరి 25న పట్టపగలు కాల్చి చంపారు.
ఈ ఘటనలో దేవి పాల్, సందీప్ యాదవ్ కూడా చనిపోయారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ హత్య కేసుతో అప్పట్లో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి.
ఉమేష్ పాల్ హత్యకేసులో కూడా ప్రధాన సూత్రధారి అష్రఫ్ అని చెబుతున్నారు.
మీడియా కథనాల ప్రకారం అతీక్ అహ్మద్ బరేలీ జైలులో ఉన్న అతని సోదరుడు అష్రఫ్‌కు ఉమేష్ పాల్‌ను చంపే బాధ్యతను అప్పగించాడు.
మూడుసార్లు విఫలమైన తర్వాత ఉమేష్ పాల్‌ను నాల్గో ప్రయత్నంలో హత్య చేశారని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
- హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం మునిగిపోయినప్పుడు ఏం జరిగింది?
- మారుమూల దీవిలో ఆ వింత రాళ్లు ఎలా ఏర్పడ్డాయి? అక్కడేం జరుగుతోంది?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 104 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది
- విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తెలంగాణ ప్రభుత్వం కొనగలదా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- పుష్ప: అంధులు, వికలాంగుల కోసం ఉచితంగా వెయ్యి పరీక్షలు రాసిన మహిళ కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














