బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల అభియోగాల నమోదు, హర్షం వ్యక్తం చేసిన మహిళా రెజ్లర్లు

ఫొటో సోర్స్, BajrangPunia
భారత రెజ్లింగ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ పై ఆరుగురు మహిళలు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి.
అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రియాంక రాజ్‌పుత్ ఈమేరకు ఆదేశాలు జారీచేశారు.
ఆయనతోపాటు ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ పైనా కోర్టు అభియోగాలు నమోదుచేసింది.
భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 354 (మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం), సెక్షన్ 354ఏ ( లైంగిక వేధింపులు), సెక్షన్ 506 ( క్రిమినల్ బెదిరింపులు) కింద బ్రిజ్‌భూషణ్ కు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది.
తోమర్‌పై ఐపీసీ 506 కింద అభియోగాలు నమోదయ్యాయి.
కోర్టు విచారణ ప్రక్రియలో అభియోగాల నమోదు మొదటి దశ. ఇప్పుడు డిఫెన్స్, ప్రాసిక్యూషన్ లాయర్లు తమ వాదనలు వినిపించే దశకు విచారణ చేరుకుంది.
ప్రధానంగా భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. అయితే వారి ఆరోపణలను ఆయన ఖండిస్తూ వచ్చారు.
బ్రిజ్ భూషణ్ పై వచ్చిన ఆరోపణలు ఎన్నికల అంశంగా మారాయి.
బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ బీజేపీ ఎంపీ.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆయనకు మళ్లీ సీటు ఇస్తారని అనుకున్నా, బీజేపీ అధిష్టానం ఆయన కొడుకును అభ్యర్ధిగా నిలబెట్టింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, @BAJRANGPUNIA
హర్షం వ్యక్తం చేసిన మహిళా రెజ్లర్లు
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై అభియోగాలు నమోదు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మహిళా రెజ్లర్లు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్‌లు ఈ ప్రకటనను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
“మహిళా రెజ్లర్లపై లైంగిక నేరాలకు పాల్పడినవారికి వ్యతిరేకంగా మేము చేస్తున్న 18 నెలల పోరాటంలో ఇది ఒక కీలక మైలురాయి. మాకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. నిశ్పక్షపాత విచారణ జరుగుతుందని, మాకు న్యాయం జరుగుతాయని ఆశిస్తున్నాం" అని వారు అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ట్రోలింగ్ చేసిన వారు సిగ్గుపడాలి: బజరంగ్ పునియా
మహిళలపై లైంగిక వేధింపుల కేసులో బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై అభియోగాలు మోపడంపై భారత ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ బజరంగ్ పునియా దిల్లీ కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఆయన మహిళా రెజ్లర్లపై కొందరు ట్రోలర్లు విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు.
"ఆడపిల్లలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ, కోర్టు నిర్ణయం మాకు చాలా ఉపశమనం కలిగించింది. మహిళా రెజ్లర్లను ట్రోల్ చేసిన వారు కూడా సిగ్గుపడాలి" అని రాశారు.

ఫొటో సోర్స్, ANI
బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ఎవరు?
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధించారంటూ పలువురు మహిళా రెజ్లర్లు గత ఏడాది దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ధర్నా చేశారు. వినేశ్ పోగట్, సాక్షి మాలిక్, భజరంగ్ పూనియా వంటి ప్రముఖ రెజ్లర్లు వీరిలో ఉన్నారు. అయితే, వీటిని ఆయన ఖండిస్తూ వచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోండాకు చెందిన బ్రిజ్ భూషణ్ సింగ్, కైసర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ ఎంపీ.
చదువుకునే రోజుల్లోనే ఆయన రాజకీయంగా చాలా చురుకుగా ఉండేవారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ యువకుడిగా ఉన్నపుడు అయోధ్యలోని కుస్తీ అఖాడాలలో ఎక్కువగా గడిపారు.
రెజ్లర్ అయిన బ్రిజ్ భూషణ్, తనను తాను 'శక్తిమంతుడు' అని పిలుచుకుంటారు.
కాలేజీ రోజుల్లో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై, ఆ తరువాత క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
1991లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికైన బ్రిజ్ భూషణ్ సింగ్ ఆ తరువాత 1999, 2004, 2009, 2014 , 2019లో ఇలా ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
బ్రిజ్ భూషణ్ సింగ్ 2011 నుంచి రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. 2019లో మూడోసారి రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1988లో బీజేపీలో చేరిన ఆయన 1991లో రికార్డు స్థాయి ఓట్ల మెజారిటీ సాధించి తొలిసారి ఎంపీగా గెలిచారు.
అయితే భారతీయ జనతా పార్టీతో విభేదాల కారణంగా ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్లారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కైసర్‌గంజ్ నుంచి సమాజ్ వాదీ పార్టీ టికెట్‌పై పోటీచేసి ఎంపీగా గెలిచారు.
ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు మరోసారి బీజేపీలో చేరారు. అయితే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ప్రాబల్యం గోండాతో పాటు బలరాంపూర్, అయోధ్య చుట్టుపక్కల జిల్లాలలో విస్తరించింది. 1999 నుంచి ఆయన ఒక్క ఎన్నికలో కూడా ఓడిపోలేదు.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు ప్రతీక్ భూషణ్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. ప్రతీక్ గోండా బీజేపీ ఎమ్మెల్యే.
బీజేపీలో చేరిన తర్వాత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ హిందుత్వ నాయకుడిగా ఇమేజ్‌ను తెచ్చుకున్నారు.
1992లో అయోధ్యలోని బాబ్రీ మసీదు నిర్మాణాన్ని కూల్చివేసిన వ్యక్తుల్లో ఆయన కూడా ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి.
విచారణ ఎదుర్కొన్న 40 మందిలో బ్రిజ్ భూషణ్ సింగ్ పేరు కూడా ఉంది. అయితే 2020 సెప్టెంబర్‌లో కోర్టు బ్రిజ్ భూషణ్‌ను నిర్దోషిగా ప్రకటించింది.
బ్రిజ్ భూషణ్ ఎక్కువగా కుస్తీ పోటీలు నిర్వహించేవారని గోండా స్థానిక ప్రజలు చెబుతున్నారు.
బ్రిజ్ భూషణ్‌కు ఖరీదైన వాహనాలంటే ఇష్టం. లక్నోలోని లక్ష్మణపురి ప్రాంతంలో ఒక విలాసవంతమైన బంగ్లా ఉంది. బ్రిజ్ భూషణ్‌పై గతంలో హత్య, దహనం, విధ్వంసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇటీవల జార్ఖండ్‌లో జరిగిన అండర్-19 జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ సందర్భంగా వేదికపైనే ఓ రెజ్లర్‌ను చెంపదెబ్బ కొట్టారు.
ఆ ఛాంపియన్‌షిప్ 15 ఏళ్లలోపు వయస్సు గలవారిది. ఆయన చెంపదెబ్బ కొట్టిన ఆటగాడు 15 ఏళ్ల కంటే పెద్దవాడు కావడంతో పోటీలో పాల్గొనేందుకు నిర్వాహకులు అనుమతించలేదు.
దీనిపై ఆ యువకుడు ఫిర్యాదు చేస్తూ వేదికపైకి వెళ్లాడు. ఆ సందర్భంలో ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌తో యువకుడు వాగ్వాదానికి దిగాడు. దీంతో వేదికపైనే ఎంపీ అతన్ని కొట్టాడు.

ఫొటో సోర్స్, ANI
వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రచారంలోకి...
2022 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సమాజ్ వాదీ పార్టీకి ఓటు వేస్తే పాకిస్తాన్ సంతోషిస్తుందని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
గతేడాది నవంబర్‌లో గోండాలో జరిగిన రెజ్లింగ్ పోటీల్లో అసదుద్దీన్ ఒవైసీపై కూడా బ్రిజ్ భూషణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఒవైసీ పూర్వీకులు హిందువులని, ఆయన తండ్రి పేరు తులసీరామ్ దాస్ అని నేను గ్యారెంటీ ఇస్తున్నాననంటూ వ్యాఖ్యానించారు.
కొద్ది రోజుల క్రితం కూడా ''రాహుల్ గాంధీ, బిలావల్ భుట్టోలు 'ఒకే జాతి' వారు. వారు ఇక్కడ, అక్కడ ఎలా ఉన్నారో తెలియదు'' అని బ్రిజ్ భూషణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఫొటో సోర్స్, ANI
సొంత పార్టీపేనే విమర్శలు
యోగా గురు రామ్‌దేవ్‌పై బ్రిజ్ భూషణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. పతంజలి నకిలీ నెయ్యిని విక్రయిస్తోందని ఆయన ఆరోపించారు.
ఆ సమయంలో క్షమాపణలు చెప్పాలంటూ పతంజలి బ్రిజ్ భూషణ్‌కు లీగల్ నోటీసు పంపింది. కానీ, ఎంపీ క్షమాపణ చెప్పలేదు.
అనంతరం పతంజలి ఆయనకు మరో నోటీసు పంపింది.
దీంతో మహర్షి పతంజలి జన్మస్థలం నిర్లక్ష్యానికి గురవుతోందని, పతంజలి పేరును ఉపయోగించడం మానేయాలని బ్రిజ్ భూషణ్ డిమాండ్ చేశారు.
పతంజలి పేరును దుర్వినియోగం చేయడం ఆపకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
బ్రిజ్ భూషణ్ సింగ్ బహిరంగ ప్రకటనలకు ప్రసిద్ధి. ముక్కుసూటిగా మాట్లాడటం వల్ల ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఆయన ఒకసారి ఏకంగా తన పార్టీనే టార్గెట్ చేశారు.
గతేడాది ఉత్తరప్రదేశ్ వర్షాలు, వరదలతో అతలాకుతలమైనప్పుడు తన నియోజకవర్గానికి చేరుకుని అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను చూసి సొంత పార్టీపై విమర్శలు గుప్పించారు.
"ఇంతకుముందు ఏ ప్రభుత్వమైనా వరదలకు ముందు ఒక మీటింగ్ పెట్టేది. ఈసారి అడ్మినిస్ట్రేషన్ అంతగా పట్టించుకోవట్లేదు. ప్రజలు దేవుడిపై భారం వేశారు" అని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు.
అలాగే వరద సాయం కోసం ఇంత అధ్వాన్నమైన ఏర్పాట్లను తన జీవితంలో చూడలేదని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, ANI
కాంట్రాక్ట్ పద్ధతి ఏంటి?
జాతీయ, అంతర్జాతీయ స్థాయి, సీనియర్ టోర్నమెంట్‌లు లేదా జూనియర్ ఏదైనా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ప్రతి వేదికపైనా కనిపించేవారు.
చేతిలో మైక్రోఫోన్‌తో ఆయన తరచుగా రిఫరీకి సలహాలు ఇచ్చేవారు. కొన్నిసార్లు వారికి నిబంధనల పుస్తకాన్ని వివరిస్తూ కనిపిస్తుండేవారు.
రెజ్లింగ్‌లో కాంట్రాక్టు వ్యవస్థను ప్రారంభించిన వ్యక్తి బ్రిజ్ భూషణ్ సింగ్. 2018లో అమలైన ఈ విధానంలో ఆటగాళ్లను వివిధ గ్రేడ్‌లలో ఉంచుతూ ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ఇస్తారు.
దీని కింద గ్రేడ్ ఏ ఆటగాళ్లకు రూ.30 లక్షలు, గ్రేడ్ బి ఆటగాళ్లకు రూ. 20 లక్షలు, గ్రేడ్ సీ రెజ్లర్‌లకు రూ.10 లక్షలు, గ్రేడ్ సీ ఆటగాళ్లకు రూ.5 లక్షలు ఇచ్చేవారు.
ఈ విధానం అమలులోకి వచ్చినప్పుడు మొదటిసారిగా బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, పూజా ధండా గ్రేడ్ ఏలో స్థానం సంపాదించారు.
మరోవైపు సుశీల్ కుమార్, సాక్షి మాలిక్‌లు గ్రేడ్ బిలో ఉండగా రీతూ ఫోగట్, దివ్య కక్రాన్ వంటి ఆటగాళ్లు గ్రేడ్ సిలో ఉన్నారు.
బహ్రైచ్, గోండా, బలరాంపూర్, అయోధ్య, శ్రావస్తి ప్రాంతాలలోని 50కి పైగా విద్యా సంస్థలతో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు భాగస్వామ్యం ఉంది.
అయితే బ్రిజ్ భూషణ్ సింగ్ మంత్రి పదవి పొందలేకపోవడంపై అసంతృప్తితో ఉండేవారు. గతేడాది ఓ కార్యక్రమంలో ఆయన తన బాధను బయటపెట్టారు.
'నాకు మంత్రిని కావాలని రాసి లేదు, నా చేతిలో ఆ గీత కూడా లేదు, అది శాస్త్రి గారికి మాత్రమే' అంటూ వ్యాఖ్యానించారు.
రమాపతి శాస్త్రి ఎంపీ బ్రిజ్ భూషణ్ గ్రామానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు, రెండుసార్లు కేబినెట్ మంత్రిగా పనిచేశారు.
ఇవి కూడా చదవండి
- ఈ ఊరిలో ఫోన్లు, టీవీలు లేవు, ఇంటర్నెట్ లేదు, అసలు కరెంటే లేదు... మరి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?
- పాకిస్తాన్ ఆర్థికసంక్షోభం: ఈసారి చైనా, సౌదీ అరేబియా కూడా కాపాడలేవా
- జేపీ నడ్డా మీద నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఎందుకంత నమ్మకం?
- జల్లికట్టు, కోడి పందేలు తరహాలో కుక్కల కొట్లాటలు... జంతువులతో ఇలా ఎన్ని రకాల పోటీలు జరుగుతున్నాయో మీకు తెలుసా?
- నేపాల్: విమానం కూలిపోయే ముందు ఏం జరిగిందో తెలుసుకోవడం ఎలా
- చైనా: 60ఏళ్లలో తొలిసారి తగ్గిన జనాభా... ఇది దేనికి సంకేతం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














