భూపిందర్ సింగ్ గిల్: బ్రిటన్ ప్రీమియర్ లీగ్ రిఫరీగా ఎన్నికైన తొలి సిక్కు-పంజాబీ వ్యక్తి

భూపిందర్ సింగ్ గిల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భూపిందర్ సింగ్ గిల్

భూపిందర్ సింగ్ గిల్.. బ్రిటన్‌లో జరిగే అతిపెద్ద ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రీమియర్ లీగ్‌కు అసిస్టెంట్ రిఫరీగా ఎన్నికైన తొలి సిక్కు-పంజాబీ వ్యక్తి. ఆ క్షణం ఆయన కుటుంబానికి ఎంతో అమూల్యమైనది.

బుధవారం జరిగిన సౌతాంప్టన్‌-నాటింగ్‌హామ్ మ్యాచ్‌లో భూపిందర్ రిఫరీగా ఉన్నారు.

మ్యాచ్ తరువాత భూపిందర్ మాట్లాడుతూ "ఇది కలా, నిజమా అనిపించింది. కొంచం కంగారుపడ్డాను కూడా" అన్నారు. 

భవిష్యత్తులో మరింతమంది బ్రిటిష్ ఆసియన్లు ప్రీమియర్ లీగ్‌లో భాగం పంచుకోవాలని భూపిందర్ కోరుకుంటున్నారు.

"మాకు ఆసియా ముఖం ఉంది కాబట్టి టిక్ పెట్టడం కాదు. ఎంతో కష్టపడి పైకొచ్చాం. దాన్ని గుర్తించాలి" అని ఆయన బీబీసీ ఆసియా నెట్‌వర్క్‌తో అన్నారు. 

ఫుట్‌బాల్ భుపిందర్ రక్తంలోనే ఉంది. ఆయన అన్నయ్య సన్నీ కూడా ఈ ఆటకు చెందిన ఒక అధికారి. తండ్రి జర్నైల్ సింగ్ మాజీ ఈఎఫ్ఎల్ రిఫరీ. ఇంగ్లిష్ ఫుట్‌బాల్ లీగ్ (ఈఎఫ్ఎల్) బ్రిటన్‌లో రెండవ పెద్ద ఫుట్‌బాల్ టోర్నమెంట్. సిక్కు తలపాగాతో ఈఎఫ్ఎల్‌లోకి ప్రవేశించిన తొలి రిఫరీ ఆయన.

తన కొడుకు సాధించిన విజయం భవిష్యత్తు తరాలకు స్పూర్తినిస్తుందని జర్నైల్ సింగ్ అన్నారు.

జర్నైల్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జర్నైల్ సింగ్

బుధవారం మ్యాచ్‌లో భూపిందర్ సింగ్ గ్రౌండ్‌లో రిఫరీగా ఉన్నప్పుడు, ఆయన తండ్రి, అన్న కూడా ప్రేక్షకుల్లో కూర్చుని మ్యాచ్ చూశారు.

"అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమింటంటే, వాళ్లు ఫుట్‌బాల్‌లో నల్లజాతి, ఆసియా, మైనారిటీ సమూహాల భవిష్యత్తు తరాలకు రోల్ మోడల్‌ అవుతారు. మాకు సామర్థ్యం ఉంది, కావలసిందల్లా అవకాశమే అని చెప్పినట్టు" అన్నారు జర్నైల్ సింగ్.

బీబీసీ రేడియో డబ్ల్యూఎంలో అంబర్ సంధు కార్యక్రమంలో జర్నైల్ సింగ్ మాట్లాడుతూ తన కొడుకులు 13, 14 వయసులోనే రిఫరీలుగా ఆటలోకి ప్రవేశించారని చెప్పారు.

కానీ, ఆ పని వాళ్లకు నచ్చక స్థానిక క్లబ్బుల్లో స్నేహితులతో ఫుట్‌బాల్ ఆడడం మొదలుపెట్టారు. 

మళ్లీ కొన్నేళ్ల తరువాత రిఫరీలుగా కెరీర్ ప్రారంభించారు. అన్నదమ్ములిద్దరికీ జర్నైల్ సింగ్ ప్రోత్సాహం ఇచ్చారు.

"తల్లిదండ్రులుగా మనం చేసే పనిలో మన పిల్లలు కూడా రాణించాలని కోరుకుంటాం. ఫుట్‌బాల్ అయినా, బిజినెస్ లేదా చదువులైనా. నా పిల్లలు నా అంచనాలను మించిపోయారు. కుటుంబ జీవితం, వాళ్ల అభిరుచులు, అలవాట్లు, ఇప్పుడు ఫుట్‌బాల్‌లో నా వెనుకే వస్తున్నారు" అంటూ జర్నైల్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. 

ప్రీమియర్ లీగ్ రిఫరీగా భూపిందర్ తొలి మ్యాచ్ రోజు చాలా ఒత్తిడి ఎదుర్కున్నామని, మీడియా దృష్టి అంతా తమపైనే ఉందని ఆయన చెప్పారు. 

"తొలి మ్యాచ్‌లో ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. సాఫీగా సాగిపోయింది" అన్నారాయన. 

భూపిందర్ సింగ్ అన్న సన్నీ, తండ్రి జర్నైల్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భూపిందర్ సింగ్ అన్న సన్నీ, తండ్రి జర్నైల్ సింగ్

ఆసియా కుటుంబాలకు సూట్ అవ్వదన్న చిన్నచూపు

జర్నైల్ సింగ్ కుటుంబం భారతదేశం నుంచి లండన్‌కు వచ్చి స్థిరపింది. ఆయన మెట్రోపాలిటన్ పోలీస్‌లో పనిచేశారు.

తన జీవితం అంతా వోల్వర్‌హాంప్టన్‌లోని ఫుట్‌బాల్ చుట్టూ తిరిగిందని, ఇప్పుడు తన కొడుకులు తన అడుగుజాడల్లోనే నడవడం అద్భుతంగా ఉందని జర్నైల్ సింగ్ అన్నారు. 

"నేను నా స్కూలు, కాలేజీ టీంలలో ఫుట్‌బాల్ ఆడాను. వోల్వర్‌హాంప్టన్‌లోని పంజాబ్ రోవర్స్, పంజాబ్ యునైటెడ్ జట్లలో కూడా ఉన్నాను. మా జీవితం బ్రహ్మాండంగా గడిచింది. మేమంతా ఒకరి నుంచి ఒకరం నేర్చుకున్నాం" అని జర్నైల్ సింగ్ చెప్పారు. 

రిఫరీల అభివృద్ధికి ఫుట్‌బాల్ అసోసియేషన్, ప్రీమియర్ లీగ్ ఆర్థికంగా కట్టుబడి ఉండడం భవిష్యత్తుకు మంచి సూచన అని ఆయన అన్నారు. 

"డబ్బు లేకుండా ముందుకు వెళ్లలేం. యువతకు నేనిచ్చే సందేశం ఒకటే.. ఆడ, మగ ఎవరైనా సీరియస్‌గా రిఫరీ కెరీర్‌ను ప్రారంభించండి. పూర్వకాలంలో రిఫరీగా ఉండడం కేవలం ఒక అభిరుచి. కానీ, ఇప్పుడు అదొక కెరీర్‌గా మారింది. ప్రతిఫలాలు కూడా బాగుంటాయి. మంచి స్నేహాలు ఏర్పడతాయి. అందులో కెరీర్ ఉంది" అన్నారు జర్నైల్ సింగ్.

భూపిందర్ సింగ్ 14 ఏళ్లల్లో రిఫరీ అయ్యారు. ఆసియా కుటుంబాల నుంచి వచ్చినవారు సంప్రదాయేతర కెరీర్లలో స్థిరపడలేరన్న అభిప్రాయం ఉండేది.

కానీ, తన తండ్రి ఇదే ఫీల్డ్‌లో ఉండడం తనకు కలిసివచ్చిందని భూపిందర్ అన్నారు. 

37 ఏళ్ల భూపిందర్ స్కూల్ టీచర్ కూడా. ప్రీమియర్ లీగ్ రిఫరీగా ఎన్నికైన తరువాత తన స్కూల్లో విద్యార్థులు చాలా ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. 

"మా నాన్న రిఫరీగా ఉన్నప్పటి కంటే ఇప్పుడు మద్దతు పెరిగింది. అవకాశాలు, సౌకర్యాలు మెరుగయ్యాయి. నిజాయితీగా మన పని మనం చేస్తూ, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడమే" అంటున్నారు భూపిందర్.

ఇవి కూడా చదవండి: