సూడాన్‌లో ఏం జరుగుతోంది? మిలిటరీ, పారా మిలిటరీ మధ్య యుద్ధం ఎందుకు?

సూడాన్

ఫొటో సోర్స్, Getty Images

సైనిక నాయకత్వంలోని ఆధిపత్య పోరాటం ఫలితంగా సూడాన్‌ రాజధాని ఖార్టూమ్ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో హింస చెలరేగింది.

దేశ రాజధాని సహా మరికొన్ని కీలక ప్రాంతాల్లో పారా మిలిటరీ ఫోర్స్ అయిన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్(ఆర్ఎస్ఎఫ్) సభ్యులు, సూడాన్ ఆర్మీ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.

మిలిటరీ నేతల మధ్య వివాదం ఎలా మొదలైంది?

2021 అక్టోబర్‌ తిరుగుబాటు నాటి నుంచి కౌన్సిల్ ఆఫ్ జనరల్స్ పాలనలో ఉన్న సూడాన్‌లో ఇద్దరు మిలిటరీ నేతల కేంద్రంగా వివాదం మొదలైంది.

వారిద్దరూ సూడాన్ ప్రస్తుత అధ్యక్షుడు, ఆర్మీ చీఫ్ జనరల్ అబ్డెల్ ఫత్తా అల్ - బుర్హాన్. డిప్యూటీ ప్రెసిడెంట్, ఆర్ఎస్‌ఎఫ్ చీఫ్ జనరల్ మొహమద్ హమ్దాన్ డగాలో. ఈయన హెమెడ్తీగా సుపరిచితులు.

సూడాన్‌లో ప్రజా ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనలతో ఈ ఇద్దరు నేతలు విభేదించారు.

లక్ష మందితో బలంగా ఉన్న ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌ను సైన్యంలో విలీనం చేయాలనే ప్రతిపాదన, ఆ తర్వాత సైన్యాధ్యక్షుడిగా ఎవరు ఉండాలనేది కూడా ప్రధాన సమస్యగా మారాయి.

జనరల్ మొహమ్మద్ హమ్దాన్ డగాలో

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, జనరల్ మొహమ్మద్ హమ్దాన్ డగాలో

హింస ఎందుకు చెలరేగింది?

ఆర్ఎస్‌ఎఫ్‌ను దేశవ్యాప్తంగా మోహరించడాన్ని ఆర్మీ ముప్పుగా భావించింది. దీంతో కొద్ది రోజులుగా హింస చెలరేగి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు.

ఏప్రిల్ 15 శనివారం ఉదయం నుంచి హింస చెలరేగింది. ఎవరు మొదట కాల్పులు ప్రారంభించారనే విషయంలో స్పష్టత లేదు. కానీ, ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితిని కాల్పులు మరింత దిగజార్చాయి.

ఇరు వర్గాలు కాల్పులు విరమించాలని దౌత్యవేత్తలు కోరుతున్నారు.

సూడాన్

ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అంటే ఎవరు?

ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ 2013లో ఏర్పాటైంది. డర్ఫర్‌లో తిరుగుబాటుదారులతో క్రూరంగా పోరాడి అప్రతిష్టపాలైన జాంజవీద్ మిలీషియా మూలాలు ఆర్ఎస్ఎఫ్‌లో ఉన్నాయి.

అప్పటి నుంచి జనరల్ డగాలో ఆర్ఎస్‌ఎఫ్‌ను ఓ శక్తిమంతమైన ఫోర్స్‌గా మార్చారు. యెమెన్, లిబియా వివాదాల్లోనూ ఆర్ఎస్ఎఫ్ జోక్యం చేసుకుంది. సూడాన్‌లోని కొన్ని బంగారు గనులపై ఆధిపత్యం కూడా సాధించింది.

మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. 2019 జూన్‌లో 120 మంది ఆందోళనకారుల సామూహిక హత్య ఆరోపణలు అందులో ఉన్నాయి.

అంతటి శక్తిమంతమైన ఫోర్స్ సైన్యంలో భాగంగా లేకపోవడమే దేశంలో అస్థిరతకు కారణంగా పరిగణిస్తున్నారు.

ఖార్టుమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఖార్టుమ్ విమానాశ్రయంలో నుంచి వస్తున్న పొగ

సైన్యం ఎందుకు రంగంలోకి దిగింది?

సూడాన్‌‌కు సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన ఒమర్ అల్ - బషీర్ పదవి కోల్పోయిన తర్వాత దేశంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను ఈ ఘర్షణలు అమాంతం పెంచేశాయి.

బషీర్‌ మూడు దశాబ్దాల పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. ఆయన్ను పదవి నుంచి దించేందుకు సైన్యం తిరుగుబాటు చేసింది.

అయితే, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగాలని సూడాన్ ప్రజలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

అప్పట్లో మిలిటరీ - ప్రజల సంయుక్త భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే 2021 అక్టోబర్‌లో వచ్చిన తిరుగుబాటుతో అది కుప్పకూలింది.

అప్పటి నుంచి జనరల్ బుర్హాన్, జనరల్ డగాలో మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.

సూడాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను చేపట్టే దిశగా 2022 డిసెంబర్‌లో చర్చలు జరిగాయి. ప్రతిపాదనలను ఆమోదించే చివరి దశలో ఆ చర్చలు విఫలమయ్యాయి.

వీడియో క్యాప్షన్, హింసను తక్షణం ఆపాలని పిలుపునిచ్చిన అంతర్జాతీయ సమాజం

ఇప్పుడేం జరుగుతోంది?

ఈ ఆధిపత్య పోరు ఇలాగే కొనసాగితే దేశంలో పరిస్థితులు మరింత దిగజారి రాజకీయ అనిశ్చితికి దారితీసే అవకాశం ఉంది.

దేశంలో ప్రజాప్రభుత్వాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు జరిగిన చర్చల్లో కీలకంగా వ్యవహరించిన దౌత్యవేత్తలు ఆ ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. అయితే దౌత్యవేత్తలు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.

దీంతో ఈ గందరగోళ పరిస్థితుల్లోనే సూడాన్ పౌరులు బతకాల్సి వస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)