లూసిడ్ డ్రీమింగ్: కోరుకున్నట్టు కలలు కనొచ్చా, మన కలకు మనమే దర్శకత్వం వహించవచ్చా?

లూసిడ్ డ్రీమింగ్

ఫొటో సోర్స్, Emmanuel Lafont

ఫొటో క్యాప్షన్, మీరు నిద్రపోతూ కలలో ఉన్నప్పుడు కూడా కలలో ఉన్నామని మీకు తెలియడమే లూసిడ్ డ్రీమింగ్.
    • రచయిత, జోసెలిన్ టింపర్లీ
    • హోదా, బీబీసీ ఫ్యూచర్ కోసం

కోరుకున్న కలలు కనడం గురించి టీనేజ్‌లో మొదటిసారి విన్నప్పుడు వెంటనే ఆకర్షితులమైపోతాం. కలలో ఉన్నప్పుడు కూడా స్పృహతో ఉండి, ఆ కల ఎలా ఉండాలనుకుంటున్నామో సరిగ్గా అలాగే కల కనాలనే ఆలోచన మంచి అనుభూతిని కలిగిస్తుంది.

ఎప్పుడైనా గాల్లో ఎగరాలనుకున్నారా? గోడలపై నడవాలనుకున్నారా? ప్రముఖ వ్యక్తిని కలవాలనుకున్నారా? లూసిడ్ డ్రీమ్‌తో అవన్నీ సాధ్యమవుతాయి. కనీసం కలలోనైనా నెరవేరతాయి.

మీరు నిద్రపోతూ కలలో ఉన్నప్పుడు కూడా కలలో ఉన్నామని మీకు తెలియడమే లూసిడ్ డ్రీమింగ్. అందులో చాలా అర్థం ఉంది. మీరు కలలో ఉన్నప్పుడు, పూర్తిగా స్పృహలో లేకపోయినా ఆ కలను మీకు నచ్చినట్టుగా నియంత్రించవచ్చు.

సాధారణంగా నిద్రపోయిన తర్వాత కలలు వచ్చే దశను ఆర్ఈఎంగా వ్యవహరిస్తారు.

ప్రయోగాత్మకంగా ల్యాబ్‌లో పరిశోధించినప్పడు, ఆర్ఈఎం(ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్‌) వంటి నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ కళ్లతో సంకేతాలు ఇవ్వగలిగితే ''వారు లూసిడ్ డ్రీమింగ్‌లో ఉన్నట్టు భావిస్తాం'' అని ఇలినాయిస్‌లోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ రీసర్చర్ కరెన్ కాన్‌కోలి చెప్పారు.

కొందరు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే కోరుకున్న కలలు (లూసిడ్ డ్రీమింగ్) కనగలుగుతారు. కానీ మరికొందరిలో బయటి విషయాల ప్రభావం వల్ల అలా జరగొచ్చు. ఎవరితోనైనా సంభాషణ, ఏదైనా వీడియో, ఏదైనా కథనం ప్రభావం వల్ల కోరుకున్న కలలు రావొచ్చు. ఏదైనా సాధించాలనే తపనతో బాగా కష్టపడి పనిచేసిన తర్వాత కూడా కొన్నిసార్లు అలాంటి కలలు వచ్చే అవకాశం ఉంటుంది.

'' తాము కోరుకున్న కలలు కనే ప్రక్రియను కొందరు కొద్దిరోజుల్లోనే నేర్చుకోగలుగుతారు. మరికొందరికి మూడు నెలలు కూడా పడుతుంది'' అని మైఖేల్ ష్రెడిల్ తెలిపారు.

ఆయన జర్మనీలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మన్‌హీం స్లీప్ ల్యాబొరేటరీలో రీసెర్చర్‌గా ఉన్నారు.

''ఉదాహరణకు, లూసిడ్ డ్రీమ్స్ కనేందుకు నేను మూడు నెలల శిక్షణ పొందాను. అది వ్యక్తుల మధ్య ఉన్న తేడా'' అని ఆయన చెప్పారు.

మెరుగవుతున్న సామర్థ్యం

గాల్లో ఎగరడం, సెక్స్ చేయడం వంటి ఫాంటసీలలో గడపడమే లూసిడ్ డ్రీమింగ్‌‌‌కు ప్రేరణ అని అధ్యయనాల్లో తేలింది. కానీ, చాలా మంది పీడకలల నుంచి బయటపడేందుకు, సమస్యల పరిష్కారం కోసం, సృజనాత్మక ఆలోచనలు, నైపుణ్యాలను పెంచుకునేందుకు కూడా లూసిడ్ డ్రీమింగ్‌ను ఉపయోగిస్తున్నారు.

కొన్ని అంశాలను పాటిస్తూ లూసిడ్ డ్రీమ్స్‌లోకి వెళ్లిన వారి సామర్థ్యంలో గణనీయమైన మార్పులు కనిపించినట్లు అధ్యయనంలో తేలింది. నిద్రలేచిన తర్వాత వారి రోజువారీ సామర్థ్యాలు మెరుగయ్యాయి.

సాధారణ సమూహాలతో పోల్చినప్పుడు ఆ తేడా కనిపించింది.

నిద్ర లేచే సమయంలో లూసిడ్ డ్రీమ్స్‌లో ఉండి చేతులు బిగించి పట్టుకున్న వారిలో మార్పు కనిపించినట్టు మరో అధ్యయనంలో తేలింది.

క్లినికల్ డిప్రెషన్, పీటీఎస్‌డీ(పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్) లాంటి తీవ్రమైన మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు లూసిడ్ డ్రీమింగ్‌ ఉపయోగపడుతుందని ఆ అధ్యయనం సూచించింది.

అయితే, ''వాస్తవానికి, విపరీతానికి తేడాను గుర్తించడంలో ఇబ్బందులు పడే షిజోఫ్రీనియా లాంటి మానసిక సమస్యలు ఉన్న వారు, లూసిడ్ డ్రీమ్స్ టెక్నిక్స్ పాటించడం అంత మంచిది కాదు'' అని డెనోమ్ యాస్పి గుర్తించారు.

ఆయన ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్, సైకాలజీ విభాగంలో విజిటింగ్ రీసర్చర్.

2000వ సంవత్సరం తొలినాళ్లలో లూసిడ్ డ్రీమింగ్ గురించి విన్న తర్వాత కలలను డైరీలో రాయడం మొదలుపెట్టాను. కొద్దిరోజులకే ఒక కల వచ్చింది. అది మామూలుగా జరిగిన వ్యవహారమే. నేను స్కూల్‌‌కు దగ్గరలో ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తూ నేను మాట్లాడటం మానేసిన ఓ స్నేహితుడిని ఢీకొట్టాను.

అయితే, ఆ మాటలు నిజం కావని, నేను కలలో ఉన్నానని అర్థమైంది. ఇదంతా నిజం కాదని గట్టిగా అరిచి చెప్పాలనుకున్నా. ఆ వెంటనే గాల్లోకి ఎగిరిపోవాలనుకున్నా. అతను భయంతో చేతులు ఊపుతున్నాడు. ఇంతలోనే కల నుంచి మెలకువ వచ్చింది.

కొన్నేళ్లుగా చాలా కోరుకున్న కలలు కంటూనే ఉన్నాను. మీడియా ప్రభావంతో వచ్చిన కలలు కూడా వాటిలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా కలల్లో చిక్కుకుపోయానని తెలుసుకున్న ఓ వ్యక్తి సినిమా ''వేకింగ్ లైఫ్'' చూసిన తర్వాత వచ్చిన కలలు వాటిలో ఉన్నాయి.

లూసిడ్ డ్రీమింగ్

ఫొటో సోర్స్, Emmanuel Lafont

కౌమార దశలో కోరుకున్న కలలు

1998లో వెయ్యి మంది ఆస్ట్రియన్లను సర్వే చేస్తే కేవలం 26 శాతం మంది మాత్రమే అప్పుడప్పుడూ లూసిడ్ డ్రీమ్స్ వచ్చినట్లు తేలింది.

2011లో 900 మంది పెద్ద వయసున్న జర్మన్లను ప్రశ్నించినప్పుడు వారిలో సగం మంది లూసిడ్ డ్రీమ్ అనుభవం ఉందని చెప్పారు. మహిళలు, యువతలో అది చాలా సాధారణ విషయంగా తేలింది.

2016లో జరిపిన అధ్యయనం(ఇతర అధ్యయనాలను కలిపి రూపొందించిన అంచనా)లోనూ అలాంటి ఫలితాలే వచ్చాయి.

లూసిడ్ డ్రీమ్స్‌ అనుభూతి చెందేవారికి కూడా ఉద్దేశపూర్వకంగా వచ్చే కలల కంటే సహజంగా, అప్రయత్నంగా వచ్చే కలలే ఎక్కువగా ఉంటాయి.

''ఈ కలలు చాలా వరకూ కౌమార దశలో ప్రారంభమవుతాయి. కొన్నిసార్లు తరచుగా వచ్చే పీడకలలు కూడా'' అని లిథువేనియాలోని విల్నియస్ యూనివర్సిటీ సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ టాడస్ స్టంబ్రిస్ చెప్పారు.

అప్రయత్నంగా, లేదా ఉద్దేశపూర్వకంగా లూసిడ్ డ్రీమ్స్ ప్రారంభించినా అలాంటి కలల సంఖ్య, కలలపై నియంత్రణ దాదాపు ఒకేలా ఉంటాయని స్టంబ్రిస్ తెలిపారు. సొంతగా నేర్చుకున్న వారిలో వచ్చే లూసిడ్ డ్రీమ్స్ కంటే, సహజంగా వచ్చే లూసిడ్ డ్రీమ్స్ ఎక్కువ సేపు ఉంటాయన్నారు.

లూసిడ్ డ్రీమ్స్ తరచూ వచ్చే వారు చాలా తక్కువ. లూసిడ్ డ్రీమ్స్‌ను పెంపొందించడం కూడా అంత సులభం కాదని, అత్యధిక సక్సెస్ రేటు సాధించడం చాలా కష్టమని పరిశోధకులు తేల్చారు.

ముఖ్యంగా ల్యాబ్‌లలో అధ్యయనం చేయడం మరింత కష్టమని గుర్తించారు. అందుకు ఎలాంటి టెక్నిక్స్ బాగా ఉపయోగపడతాయనే విషయాలపై భారీగానే పరిశోధనలు జరుగుతున్నాయి.

''విశ్వసనీయత, అత్యధిక సక్సెస్ రేటుతో లూసిడ్ డ్రీమ్స్‌ని ప్రేరేపించేందుకు ఒక్క టెక్నిక్ కూడా ప్రస్తుతం మన వద్ద లేదు'' అని స్టంబ్రిస్ చెప్పారు.

అయినప్పటికీ లూసిడ్ డ్రీమ్స్‌‌ను సులభతరం చేసేందుకు సులభమైన మార్గాలున్నాయని ఆయన అన్నారు. మంచి కలలను మనుషులు మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటారని చెప్పారు.

గుర్తించడమెలా?

''డ్రీమ్ జర్నల్ రాసుకోవడం ద్వారా డ్రీమ్స్‌ను గుర్తుకు తెచ్చుకోవచ్చని, లేదంటే కలలు వచ్చినప్పుడు మీ అనుభవాన్ని ఫోన్‌లో రికార్డ్ చేయడం, నిద్ర లేచిన వెంటనే పది నిమిషాల పాటు కలను గుర్తుకు తెచ్చుకోవడం వంటి విధానాలతో లూసిడ్ డ్రీమ్స్‌ని గుర్తుంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది'' అని యాస్పి చెప్పారు.

మీ కలల ప్రపంచానికి మీరు మరింత దగ్గరయ్యేందుకు, మీ కలల్లో సాధారణంగా కనిపించే లక్షణాలు తెలుసుకునేందుకు అవి ఉపయోగపడతాయి.

ఎక్కువగా ఉపయోగించే టెక్నిక్స్‌లో రియాలిటీ టెస్టింగ్ ఒకటి. ఇందులో అది కలేనా, కాదా అని మిమ్మల్ని మీరే పలుమార్లు ప్రశ్నించుకుని నిర్ధరించుకోవాలి. కలలు కనే సమయంలోనూ కలలో అలా జరగాలని మనం కోరుకుంటున్నామో, లేదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ''సాధారణంగా మనం కలలో ఉన్నప్పుడు, కల ఎలా ఉంటే అలా, విమర్శలతో సంబంధం లేకుండా అంగీకరిస్తాం'' అని స్టంబ్రిస్ చెప్పారు.

స్వీయ అవగాహన, విమర్శనాత్మక ఆలోచనకు మూలమైన ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌లో కొంత భాగం ర్యాండమ్ ఐ మూవ్‌మెంట్ సమయంలో కాస్త నిస్తేజంగా ఉండటమే దీనికి కారణం.

లూసిడ్ డ్రీమింగ్‌లో ఉన్నప్పుడు మెదడులోని ముందు భాగాలు కొంత ఎక్కువ చురుగ్గా ఉండొచ్చని ఓ అధ్యయనం చెబుతోంది.

లూసిడ్ డ్రీమింగ్

ఫొటో సోర్స్, Emmanuel Lafont

లూసిడ్ డ్రీమ్ పరికరాలు

క్రమంగా లూసిడ్ డ్రీమ్స్‌ను ప్రేరేపించే పరికరం కోసం క్రౌడ్‌ఫండింగ్ కోసం ప్రచారం కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకూ మార్కెట్‌లో ఏ పరికరం పక్కాగా నిరూపితం కాలేదు.

పరికరాలు సాధారణంగా రెండు రకాలుగా ఉంటాయని ష్రెడిల్ చెప్పారు. ఆర్ఈఎం స్లీప్‌లో ఉన్నప్పుడు వేలిపై లైట్లు వెలగడం, వైబ్రేషన్ రావడం, శబ్దాలు చేసే పరికరాలు. శిక్షణ తర్వాత అవి కల గురించి అవగాహన కలిగించే అవకాశం ఉంది.

నేరుగా మెదడుని ప్రభావితం చేసే పరికరాల తయారీకి కృషి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇవి చాలా ప్రమాదకరం. ఒకవేళ వాటిని అభివృద్ధి చేసినా ఇంట్లో ఎట్టి పరిస్థితిలోనూ ఉపయోగించకూడదని ష్రెడిల్ చెప్పారు.

లూసిడ్ డ్రీమ్స్‌ను ప్రేరేపించేందుకు పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఎక్కువ టెక్నిక్స్‌ను ఉపయోగించి లూసిడ్ డ్రీమ్స్‌ను ప్రేరేపించేందుకు ప్రయోగాలు చేస్తున్నారు.

నాలుగు గంటల నుంచి ఆరు గంటల నిద్ర, ఒక గంట మెలకువలోకి వచ్చి లూసిడ్ డ్రీమ్స్‌ని ప్రేరేపించే విధానాలను ప్రయత్నించడం, మళ్లీ నిద్రపోవడం వంటి విధానాలతో ప్రయోగాలు జరుగుతున్నాయి.

''అందుకోసం నిద్ర నుంచి మేలుకునే రెండు గంటల ముందు లూసిడ్ డ్రీమ్స్‌ని ప్రేరేపించే ప్రక్రియ చేపట్టే ఆలోచన ఉంది. ఎందుకంటే కలలు ఎక్కువగా రాత్రి ముగిసే సమయానికి ఎక్కువగా వస్తుంటాయి'' అని యాస్పి చెప్పారు.

''చాలా మందిలో చివరి రెండు గంటల నిద్రలోనే వచ్చే కలల్లో 50 శాతం ఉంటాయి.'' అని ఆయన అన్నారు.

ఇది ఇంట్లో చేయదగిన ప్రభావవంతమైన టెక్నిక్ అని కాన్‌కోలి తెలిపారు.

''అయితే అందులో ఓ ఇబ్బంది ఉంది. నాలుగు గంటల సమయంలో నిద్ర లేవడం అంత మంచిది కాదు'' అని ఆమె చెప్పారు.

అంతర్జాతీయంగా 300 మంది ప్రతినిధులు పాల్గొన్న ఓ అధ్యయనం 2020లో ప్రచురితమైంది. అందులో లూసిడ్ డ్రీమ్స్ ప్రేరేపించేందుకు ఐదు విధానాలను ప్రతిపాదించారు. వాటిలో మైల్డ్ (ఎంఐఎల్‌డీ - నిమోనిక్ ఇండక్షన్ ఆఫ్ లూసిడ్ డ్రీమ్స్ ) టెక్నిక్ అత్యంత ప్రభావవమైనదిగా యాస్పి గుర్తించారు.

సుమారు 5 గంటల పాటు నిద్రించిత తర్వాత ''నేను మళ్లీ కల కంటున్నాను. నేను కల కంటున్నట్టు నాకు తెలుసు'' అని అనుకుంటూ నిద్రలోకి వెళ్లిపోయి లూసిడ్ డ్రీమ్స్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడమే మైల్డ్ విధానం.

ఈ టెక్నిక్ ప్రకారం ఐదు నుంచి పది నిమిషాల్లో నిద్రలోకి వెళ్లిపోయి, మంచి కలలు వస్తే అత్యధిక సక్సెస్ రేటు సాధించినట్లు భావించాల్సి ఉంటుందని యాస్పి చెప్పారు.

లూసిడ్ డ్రీమ్స్ వచ్చేందుకు మైల్డ్ విధానమే అత్యంత ప్రభావవంతమైనదిగా 2022లో పరిశోధనా సమీక్షలో కూడా వెల్లడైంది.

మైల్డ్ టెక్నిక్‌ చెబుతున్న ప్రాథమిక అంశాలను అనుసరించిన వారిలో 18 శాతం మంది రాత్రివేళల్లో లూసిడ్ డ్రీమ్స్‌లోకి వెళ్లారని ష్రెడిల్ తెలిపారు. ఈ విషయాన్ని ష్రెడిల్, ఆయన సహచరులు సోఫీ డిక్, అంజా కునెల్ 2020లో జరిపిన ఓ అధ్యయనంలో గుర్తించారు.

ఐదు వారాలు నిర్వహించిన ఈ అధ్యయనంలో పాల్గొన్న పది మందిలో సగం మందికి అసలు లూసిడ్ డ్రీమ్ రానే లేదని తేలింది. మరో ఐదుగురు ఒకసారి మాత్రమే లూసిడ్ డ్రీమ్ అనుభూతి పొందినట్లు వారు గుర్తించారు.

భావోద్వేగాలను ప్రేరేపించే టెక్నిక్‌

అయితే ఇంకా పరిశోధనలు జరగని చాలా ప్రభావవంతమైన టెక్నిక్స్ ఉన్నాయని యాస్పి చెబుతున్నారు. లూసిడ్ డ్రీమ్స్‌ను ప్రేరేపించేందుకు మరో నమ్మకమైన ప్రక్రియను ఆయన తన అధ్యయనంలో గుర్తించారు. భావోద్వేగాలను ప్రేరేపించడం ద్వారాలూసిడ్ డ్రీమ్స్‌లోకి వెళ్లే టెక్నిక్‌ను ఆయన ప్రతిపాదించారు.

అయితే, ఈ ప్రక్రియపై గతంలో ఎలాంటి శాస్త్రీయ పరిశోధనలు జరగలేదు. ఇందులో ఐదు గంటలు నిద్రించిన తర్వాత భౌతికంగా ఉద్రేకం కలిగించే ఏదైనా దృశ్యాలు, శబ్దాల్లాంటివి చేస్తారు. ఆ తర్వాత మళ్లీ నిద్రపోవాల్సి ఉంటుంది.

రియాల్టీ టెస్టింగ్ టెక్నిక్ కూడా అంత ప్రభావవంతమైనది కాదని యాస్పి చెప్పారు. వేర్వేరు వ్యక్తులపై వేర్వేరు టెక్నిక్స్ ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆయన గుర్తించారు.

అత్యుత్తమ టెక్నిక్ కూడా ఎక్కువసార్లు వాడితే పనిచేయకపోవచ్చని ష్రెడిల్ చెప్పారు. వ్యక్తులు, అలాగే టెక్నిక్‌ను ఎంపిక చేసుకోవడం ముఖ్యమేనని ఆయన తెలిపారు.

టార్గెటెడ్ లూసిడిటీ రీయాక్టివేషన్ విధానం ప్రకారం కొందరిపై ల్యాబొరేటరీలో పరిశోధన చేసినట్లు న్యూయార్క్‌లోని యూనివర్సిటీ ఆప్ రోచెస్టర్‌లో న్యూరోఫిజియాలజీ విభాగంలో పరిశోధకుడిగా పనిచేస్తున్న మిచెల్ కర్ తెలిపారు.

లూసిడ్ డ్రీమ్స్ గురించి ముందుగానే తెలియజేసి, వారికి కొన్ని దృశ్యాలు, శబ్దాలు వినిపించామని చెప్పారు. 90 నిమిషాల నిద్ర తర్వాత వారు సాధారణంగా కలలు వచ్చే దశలో మరోసారి వారికి అవే దృశ్యాలు, శబ్దాలు వినిపించామని, లూసిడ్ డ్రీమ్స్‌లోకి వెళ్లినట్లు వారి కంటి కదలికల ద్వారా గుర్తించినట్లు మిచెల్ తెలిపారు.

'' మనుషుల్లో లూసిడ్ డ్రీమ్స్ ఉంటాయని అది స్పష్టం చేసింది'' అని పరిశోధనలో సహ అధ్యయనం చేసిన కాన్‌కోలి తెలిపారు. ఐదుగురిలో ముగ్గురికి ల్యాబ్‌లో పరిశోధనలకు ముందు లూసిడ్ డ్రీమ్ ఎప్పుడూ రాలేదని ఆమె చెప్పారు.

లూసిడ్ డ్రీమింగ్

ఫొటో సోర్స్, Emmanuel Lafont

ఔషధాలు, ఇతర విధానాలు

అల్జీమర్స్ వ్యాధి చికిత్సకు వాడే గాలంటమైన్ అనే ఔషధం కూడా లూసిడ్ డ్రీమ్స్‌ను ప్రేరేపించేందుకు ఉపయోగపడుతుందని తేలింది. ఇది జర్మనీ వంటి దేశాల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు వినియోగించేందుకు అనుమతి ఉంది.

మరికొన్ని దేశాల్లోనూ ఈ ఔషధం అందుబాటులో ఉన్నప్పటికీ, దానిని వినియోగించడం సురక్షితమా కాదా అనే విషయంపై ఇంకా అధ్యయనాలు జరగాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

తక్కువ సంఖ్యలో అధ్యయనాలు, విధానపరమైన సమస్యలు ఎదురవుతున్నప్పటికీ లూసిడ్ డ్రీమింగ్ పరిశోధనలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే, 1980లలో చాలా మంది సైకాలజిస్టులు లూసిడ్ డ్రీమ్స్‌ను అసలు నమ్మేవారు కాదు. ఆ తర్వాత కాలంలో జరిగిన పరిశోధనల్లో నిద్రలో ఉండి కూడా బయటికి సంకేతాలు ఇచ్చినట్లు కొన్ని కీలకమైన అధ్యయనాలు స్పష్టం చేశాయి.

అప్పటి నుంచి కాన్‌కోలి పరిశోధనల మాదిరిగా లూసిడ్ డ్రీమ్స్‌పై చాలా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అసలు మనకు కలలు ఎందుకు వస్తాయి? ఎలా వస్తాయి? అనే విషయాలను అర్థం చేసుకునేందుకు ఈ పరిశోధనలు ఉపయోగపడతాయని కాన్‌కోలి బలంగా నమ్ముతున్నారు.

ప్రయోగాత్మక, విశ్లేషణాత్మక పరిశోధనల ద్వారా ఇది సాధ్యమతుందని ఆమె భావిస్తున్నారు.

''నిద్ర నుంచి మెలకువ రావడానికి, కోరుకున్న కలలు కనే దశకి మధ్య తేడాను మనం అర్థం చేసుకోగలిగితే, అది మన మెదడు ఎలా పనిచేస్తుందనే విషయాలను అర్థం చేసుకోవచ్చు'' అని కాన్‌కోలి నమ్ముతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)