విమర్శలు విడాకులకు దారి తీస్తాయా, పాజిటివ్ కన్నా నెగెటివ్ కామెంట్లనే ఎందుకు ఎక్కువ పట్టించుకుంటాం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సారా గ్రిఫిత్స్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
ఒంటికి దెబ్బ తగిలితే నాలుగు రోజుల్లో ఆ గాయం మానిపోతుంది. కానీ మనసుకు తగిలితే ఆ గాయం అంత తొందరగా మానిపోదంటారు.
మనల్ని ఎవరైనా మెచ్చుకుంటే ఎంతగా సంతోషపడతామో ఎవరైనా తిట్టినా, అరిచినా, తప్పు పట్టినా... అంతకు మించి బాధపడతాం.
పొగడ్తలను తొందరగానే మరచిపోయినా తెగడ్తలను మాత్రం చాలా కాలం గుర్తు పెట్టుకుంటాం. కొందరికి జీవితాంతం గుర్తుండి పోతాయి కూడా.
దీన్నే ‘నెగిటివ్ బయాస్’ అంటారు.
ముఖ్యంగా నేటి సోషల్ మీడియా యుగంలో వచ్చే ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ యువతను మానసికంగా చాలా కుంగదీస్తాయి.
ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటోకు వెయ్యి పాజిటివ్ కామెంట్స్ వచ్చినా పెద్దగా మురిసిపోరు, కానీ ఒక్క నెగిటివ్ కామెంట్ వచ్చినా అల్లాడిపోతారు. పదేపదే దాని గురించి ఆలోచిస్తారు.
‘నీ ముఖానికి ఆ అద్దాలు అవసరమా..?’ అని ఎవరైనా కామెంట్ చేస్తే రోజుల తరబడి మనసు ఆ మాటల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.
‘నీ ముఖం వల్ల ఆ అద్దాలకు అందం వచ్చింది’ అని ఎవరైనా రాసినా కూడా ఆ ప్రశంసను మనసు పట్టించుకోదు.
స్కూల్లో టీచర్ తిట్టినా, ప్రేమించే వ్యక్తి కఠినంగా మాట్లాడినా, అప్పటి వరకు వారి మీద ఉన్న పాజిటివ్ ఇమేజ్ స్థానంలో నెగిటివ్ ఆలోచనలు వచ్చి చేరతాయి.
నెగిటివ్ కామెంట్స్ ఇలా ఎందుకు లోతైన గాయాలు చేస్తాయి?

ఫొటో సోర్స్, Getty Images
ఇందుకు కారణం మానవనైజంలో ఉంది. మనుషులు సహజంగా బెదిరింపులు, ప్రమాదాల వంటి వాటికి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీకి చెందిన సోషల్ సైకాలజిస్ట్ రాయ్ బవుమిస్టర్ అన్నారు.
‘మన పూర్వీకుల్లోనూ నెగిటివ్ బయాస్ ఉంది. అది వారి మనుగడకు ఉపయోగపడింది. ప్రమాదాలను ఎదుర్కొవడంలో భాగంగా మనుషుల్లో ఆ వ్యవస్థ పరిణామం చెందింది. నెలల పిల్లలు కూడా హాని కలిగించని కప్ప కంటే ప్రమాదికారి అయిన పాము మీదనే ఎక్కువ ఫోకస్ పెడతారు. ఇది సహజంగా అబ్బే గుణం.
అంటే సమస్యల మీద ఫోకస్ పెట్టడం అనేది మనుషులు పెంపొందించుకున్న ఒక మంచి వ్యూహం. ముందు ప్రతికూలతల మీద దృష్టి పెట్టి ఆ సమస్యలకు పరిష్కారం కనుగొనాలి.
నెగిటివ్ బయాస్ వల్ల నష్టాలు కూడా ఉంటాయి. రోజూవారీ జీవితంలో అది మనకు పెద్దగా ఉపయోగపడదు. ఆ నెగిటివిటీని తొలగించుకోకుంటే సమస్యలు తలెత్తుతాయి’ అని రాయ్ తెలిపారు.
ఉదాహరణకు వార్తా పత్రికల్లో వచ్చే నేరాలు, ప్రమాదాలు, అవినీతి, పుకార్లు వంటి వార్తలు మనుషుల మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. అలాంటి వార్తలను చదవడానికి, ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడతారని మెక్‌గిల్ యూనివర్సిటీ చేపట్టిన పరిశోధన చెబుతోంది.
మీకు ఎలాంటి వార్తలు ఇష్టం అంటే... మాకు మంచి విషయాలకు సంబంధించిన వార్తలు కావాలని పాఠకులు సర్వేల్లో చెబుతారు. కానీ వాస్తవంలో మాత్రం వారి కళ్లు నేరాలు, ఘోరాలు వంటి ‘బ్యాడ్ న్యూస్’ కోసం వెతుకుతాయి.
అందుకే అమ్మకాలు పెంచుకోవడానికి ‘బ్యాడ్ న్యూస్’కు పత్రికలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
అంతగా పరిచయం లేనివారు, స్నేహితులు కాని వారు చేసే ‘నెగిటివ్’ కామెంట్స్‌ను చాలా మంది పెద్దగా పట్టించుకోరు.
కానీ అయినవారు, ప్రేమించే వ్యక్తులు, ఆప్త మిత్రులు చేసే ‘నెగిటివ్’ కామెంట్స్ మనసును తీవ్రంగా బాధిస్తామని రాయ్ అంటున్నారు. ఎందుకంటే వారి మీద మనకు అంచనాలు ఉండటమే అందుకు కారణం.
వారు మనతో ఎలా ఉండాలో ముందుగానే ఒక ఫ్రేమ్ గీసుకుని ఉంటాం. అందుకు విరుద్ధంగా జరిగితే మనోభావాలు దెబ్బతింటాయి.
‘నెగిటివ్’ కామెంట్స్‌ను ఎక్కువగా పట్టించుకోవడం వల్ల ఒక్కోసారి బంధాలు కూడా దెబ్బతింటాయి.
పెళ్లి అయిన తొలి రెండేళ్లలో భాగస్వాములు వ్యక్తం చేసే నెగిటివ్ ఫీలింగ్స్ లేదా చేసే నెగిటివ్ కామెంట్స్ ఆధారంగా వారు రానున్న సంవత్సరాల్లో విడిపోగల అవకాశాలను అంచనా వేయొచ్చు.
విడాకులు తీసుకునే జంటల్లో ఎక్కువగా ఇలాంటి నెగిటివిటీనే ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియాలో ఎదురయ్యే నెగిటివిటీని హ్యాండిల్ చేయడం అంత సులభం కాదని, అందరికీ ఆ శక్తి ఉండదని రాయ్ హెచ్చరిస్తున్నారు.
తెలిసిన వాళ్లు ఒక్క మాట అన్నా తెగ బాధపడే వాళ్లు, సోషల్ మీడియాలో ఎక్కువ మంది నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తే ఇంకా కుంగి పోతారు.
ఒత్తిడి, యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్ వంటివి పెరిగి పోతాయని బిహేవియరల్ సైంటిస్ట్ లూసియా అన్నారు.
అయితే వయసు పెరిగే కొద్దీ ‘నెగిటివ్’ విషయాల కంటే ‘పాజిటివ్’ విషయాలనే మనుషులు ఎక్కువగా గుర్తు పెట్టుకుంటారని పరిశోధనలు చెబుతున్నాయి. 50ఏళ్లు దాటిన తరువాత ఈ తీరు ఎక్కువగా కనిపిస్తుంది.
యవ్వనంలో తగిలిన దెబ్బల నుంచి పాఠాలు నేర్చుకోవడమే ఇందుకు కారణమై ఉండొచ్చని రాయ్ అన్నారు.
ఈ ‘నెగిటివ్ బయాస్’ను అధిగమించేందుకు కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. క్యాన్సర్ పేషెంట్లను ట్రీట్ చేసేందుకు ఉపయోగించే ‘మినిమైజేషన్’ అనే టెక్నిక్ వంటివి ఇందుకు ఉపయోగపడతాయి.
‘‘ ‘మినిమైజేషన్’ ద్వారా క్యాన్సర్ సోకిన పేషెంట్లు తమ కంటే ఇంకా కష్టాల్లో ఉన్న వారిని ఊహించుకునేలా చేస్తారు. తద్వారా వారిలో ఆశాభావం, పాజిటివిటీ పెరుగుతుంది. వారితో పోల్చి చూసినప్పుడు తమ సమస్య చిన్నది వారు అర్థం చేసుకుంటారు ’’ అని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్‌ఏంజలీస్‌కు చెందిన షెల్లీ టేలర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- పీలే భారత్‌లో ఆడిన ఫుట్‌బాల్ మ్యాచ్ ఎందుకు వివాదంగా మారింది?
- వేణుగోపాల్ ధూత్: ఇంటింటికీ కలర్ టీవీని తీసుకెళ్లిన వీడియోకాన్ ఎలా ‘పతనమైంది’?
- హిందు వర్సెస్ ముస్లిం: సీతారామం, ద కశ్మీర్ ఫైల్స్ సినిమాలు ఏం చాటాయి?
- టూత్ బ్రష్ సరిగ్గా వాడడం ఎలాగో మీకు తెలుసా... దంతాల ఆరోగ్యానికి ఏం చేయాలి?
- కాఫ్ సిరప్: పిల్లలకు దగ్గు మందు వాడవచ్చా? లేదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














