ప్రపంచంలోని 70 శాతం పులులు భారత్‌లోనే.. పులులకు అటవీ ప్రాంతం సరిపోకపోతే ఏం జరుగుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విష్ణు ప్రకాశ్ నల్లతంబి
- హోదా, బీబీసీ ప్రతినిధి
తాజాగా విడుదల చేసిన టైగర్ సెన్సస్ ప్రకారం భారత్‌లో ప్రస్తుతం 3,167 పులులు ఉన్నాయి. గత నాలుగేళ్లలో పులుల సంఖ్య 200కి పైగా పెరిగింది.
2018తో పోలిస్తే 2022 నాటికి పులుల సంఖ్యలో 6.7 శాతం వృద్ధి నమోదైంది. 2018 లెక్కల ప్రకారం భారత్‌లో 2,967 పులులు ఉండగా, గతేడాది వాటి సంఖ్య 3,167కి చేరింది.
ప్రాజెక్ట్ టైగర్ క్యాంపెయిన్‌కి 50 ఏళ్లు నిండిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఓ నివేదిక విడుదల చేశారు. దాని ప్రకారం ప్రపంచంలోని పులుల్లో 70 శాతం భారత్‌లో ఉన్నట్టు అంచనా.
''కేవలం పులులను రక్షించడం మాత్రమే కాదు. అవి వృద్ధి చెందేందుకు గొప్ప పర్యావరణ వ్యవస్థను కూడా అందించాం'' అని మోదీ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాజెక్ట్ టైగర్
1875 నుంచి 1925 సంవత్సరాల మధ్య కాలంలో దాదాపు 80 వేల పులులను చంపేసినట్టు ఒక అంచనా. అప్పట్లో రాజులు, ఉన్నతాధికారులు వేటకు వెళ్లడం, పులులను చంపి తెచ్చిన వారికి బహుమతులు ఇవ్వడం వంటివి ఉండేవి. 1960ల వరకూ ఈ పరిస్థితి కొనసాగింది. దీంతో పులుల సంఖ్య వేగంగా తగ్గిపోయింది.
జాతీయ జంతువయిన పులి అంతరించిపోతుండటంతో భారత ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టింది.
1972లో అప్పటి ప్రభుత్వం ఫారెస్ట్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. పులులను రక్షించేందుకు వేటపై నిషేధం విధించడంతో పాటు, గ్రామాల్లో అవగాహన శిబిరాలు నిర్వహించారు. జంతు పరిరక్షణకు చట్టాలను తీసుకొచ్చారు.
అటవీ జంతువులను బంధించడం, చంపడం నిషిద్ధమని, అవి ఎదురుపడినా అలాంటి పనులు చేయకూడదని కఠిన నిబంధనలు తీసుకొచ్చారు.
దానికి కొనసాగింపుగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 1973లో ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించారు. అందులో భాగంగా మొదట దేశంలోని 9 ప్రాంతాలను టైగర్ రిజర్వ్(పులుల సంరక్షణ ప్రాంతాలు)గా ప్రకటించారు.
కర్ణాటకలోని బండీపూర్ టైగర్ శాంక్చువరీ, ఉత్తరాఖండ్‌లోని కార్బెట్ నేషనల్ పార్క్, 18 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 9 టైగర్ రిజర్వ్ ప్రాంతాలు ఏర్పాటయ్యాయి.
ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించి యాభై ఏళ్లు గడిచే నాటికి దేశవ్యాప్తంగా 54 టైగర్ రిజర్వ్ ప్రాంతాలున్నాయి. పులులు విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం 18 వేల చదరపు కిలోమీటర్ల నుంచి 75 వేల కిలోమీటర్లకు పెరిగింది. అది దేశంలోని 2.4 శాతం భూభాగంగా ప్రధాని మోదీ విడుదల చేసిన నివేదికలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పెరుగుతున్న పులుల సంఖ్య
2006 నుంచి పులుల సంఖ్య ఆరోగ్యకర రీతిలో పెరుగుతూ వస్తోంది.
2022 లెక్కల ప్రకారం ఉత్తర, మధ్య భారతంలోని శివాలిక్( నేపాల్ పశ్చిమాన హిమాలయాల నుంచి ఉత్తరాఖండ్ వరకూ వ్యాపించి ఉన్న పర్వత శ్రేణులు, వరద ప్రాంతాలు), గాంజెటిక్ (సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదుల పరీవాహక ప్రాంతాలు) ప్రాంతాల్లో పులుల సంఖ్య భారీగా పెరిగింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొత్త ప్రాంతాల్లోనూ పులుల సంచారం పెరిగింది.
ది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ కమిషన్ లెక్కల ప్రకారం 2006లో భారత్‌లో 1,411 పులులు ఉన్నట్టు నివేదించింది. భారత్‌లో పులులు అంతరించిపోయే దశలో ఉన్నాయని అప్పట్లో వన్యప్రాణుల ఔత్సాహికులు చెబుతుండేవారు.
పులుల సంఖ్య పెరగడంతో రిజర్వ్ ఫారెస్ట్స్‌ను కూడా టైగర్ రిజర్వ్స్‌గా ప్రభుత్వం ప్రకటించింది.
2006లో 1,411 పులులు భారత్‌లో ఉండగా, 2010 నాటికి 1,706; 2014 నాటికి 2,226; 2018 నాటికి 2,967; 2022 నాటికి 3,167కి పెరిగింది.
పులుల సంఖ్య పెరగడం మంచిదే. కానీ, పులులను లెక్కించే పద్ధతిని పూర్తిగా విశ్వసించలేమని జంతు సంరక్షణ కార్యకర్త అరుణ్ ప్రసన్న అన్నారు. పులులను లెక్కించే ప్రక్రియ పూర్తిగా సాంకేతికంగా సాగుతుంది. అలాంటి సర్వేల్లో మనుషుల ప్రమేయం అస్సలు ఉండదని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పులులను ఎలా లెక్కిస్తారు?
టైగర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ప్రారంభమైన రోజుల్లో పులుల సంఖ్యను అంచనా వేసేందుకు ఉపయోగించిన పద్ధతులు అశాస్త్రీయమైనవిగా తేలాయి. ఒక పులిని పలుమార్లు లెక్కించడం వల్ల పులుల సంఖ్యలో తప్పులు వచ్చాయి.
''పులుల పాదముద్రల ఆధారంగా అప్పట్లో పులులను లెక్కించేవారు. వాటితో పులుల సంఖ్యను కచ్చితంగా అంచనా వేయడం సాధ్యం కాదు'' అని కాళిదాస్ బీబీసీతో చెప్పారు.
''మధ్యప్రదేశ్‌లోని పన్న టైగర్ రిజర్వ్, రాజస్థాన్‌లోని సరిక్స టైగర్ రిజర్వ్‌లో పేర్కొన్న పులుల సంఖ్య తప్పు. ఆ అడవుల్లో అసలు పులులే లేవు'' అని కాళిదాస్ చెప్పారు.
పులులను వేటాడటాన్ని దేశవ్యాప్తంగా ఉన్న జంతు సంరక్షణ కార్యకర్తలు 2005లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత పులుల సంరక్షణ కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ కమిషన్ ఏర్పాటైంది.
కమిషన్ ఏర్పాటైన తర్వాత కెమెరాలతో పులులను లెక్కించే అత్యాధునిక పద్ధతి 'కెమెరా డ్రాప్' అందుబాటులోకి వచ్చింది.
పులుల సంచారం ఉన్న ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిలో రికార్డైన పులుల ఫొటోల ఆధారంగా వాటి సంఖ్యను లెక్కిస్తూ వస్తున్నారు.
ఆ ఫొటోల్లో కనిపిస్తున్న పులులపై చర్మంపై ఉన్న చారలను గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు.
''మనిషి వేలిముద్రల లాగే పులి చర్మంపై ఉండే చారలు కూడా ఒకదాని నుంచి మరొకటి వేర్వేరుగా ఉంటాయి. ఏ రెండు పులులకు ఒకే విధంగా చారలు ఉండవు. ఇది ఒక పులిని రెండోసారి లెక్కించకుండా ఉపయోగపడుతుంది'' అని కాళిదాస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పులి - మనిషి వైరం
పులుల సంఖ్య 3 వేలకు పైగా పెరిగినప్పటికీ, జనసాంద్రత, చాలా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పులుల ఆవాసాలు మాత్రం తగ్గిపోతున్నాయి. దాదాపు 30 శాతం పులులు వాటి ఆవాసాలకు దూరంగా ఉంటున్నాయని భారత అటవీ శాఖకు చెందిన మాజీ అధికారి ఒకరు వెల్లడించారు.
''నగరాల్లో పచ్చదనం పెంపు కోసం మొక్కలు పెంచిన ప్రాంతాలను కూడా అటవీ ప్రాంతాల అభివృద్ధిలో కలిపేస్తున్నారు. అటవీ ప్రాంతాలు పెరిగాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కానీ వాస్తవానికి పులులకు అటవీ ప్రాంతం సరిపోవడం లేదు'' అని ఫారెస్ట్ బయాలజిస్ట్ ఒసాయ్ కాళిదాస్ తెలిపారు.
భారత్‌లో పులుల సంఖ్య పెరుగుతుండటంతో, రిజర్వ్ ప్రాంతాలను రక్షిత అటవీ ప్రాంతాలుగా ప్రకటించడంలో ఆలస్యమవుతోంది.
ఫలితంగా, పులులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో పులి - మనిషి వైరం తలెత్తుతోంది.
గిరిజనులు, స్థానికులకు సమస్యలు వస్తుండటంతో చాలా ప్రాంతాల్లో రిజర్వ్ ఫారెస్ట్స్‌ను టైగర్ శాంక్చుయరీలుగా మార్చేశారు. అయితే, వాటిని ప్రభుత్వం ఓ పద్ధతి ప్రకారం చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.
మనుషులను చంపుతోందని తమిళనాడులోని మసినగుడి రీజియన్‌లో టీ23 పులిని చంపేయాలని 2021లో మంత్రి ఆదేశించారు. ఆ తర్వాత కోర్టు జోక్యంతో పులికి మత్తుమందు ఇచ్చి అదుపులోకి తీసుకుని జూలో పెట్టారు.
''టీ23 పులి విషయంలో అక్కడి ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. దాన్ని చంపేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. కానీ అది అలా ఎందుకు దాడి చేస్తుందో ఎవరికీ తెలియదు. అది మనుషులను చంపి తినే పులి అని తెలియదు'' అని అరుణ్ ప్రసన్న చెప్పారు.
మనుషులకు, వన్యప్రాణులకు మధ్య కలిగే ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. పకడ్బందీ చర్యలు తీసుకుంటే పులులు వాటి ఆవాసాలను వదిలి బయటకు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.
పులుల వేట
భారత్‌లో 2021లో 127 పులులు, 2022లో 121 పులులు వేర్వేరు కారణాలతో మరణించాయి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ కమిషన్ లెక్కల ప్రకారం వాటిలో వేటాడటం వల్ల చనిపోయిన పులుల సంఖ్యే ఎక్కువ.
2023లో ఏప్రిల్ మొదటి వారం వరకూ దాదాపు 52 పులులు చనిపోయాయి.
వేటాడటం వల్లే పులులు చనిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు గార్డులకు అవసరమైన సామగ్రి, సాంకేతిక సాయాన్ని అందించాలని ఒసాయ్ కాళిదాస్ చెప్పారు.
''పులులు, ఏనుగులు వంటి వన్యప్రాణులను వేట నుంచి రక్షించేందుకు శాటిలైట్ ఆధారంగా వాటిని గుర్తించి, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి'' అని అరుణ్ ప్రసన్న తెలిపారు.
''పులుల వేటను నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం'' అని భారత అటవీ శాఖ అడిషనల్ డైరెక్టర్ ఎస్‌బీ యాదవ్ పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు.
పశ్చిమ తీరంలో తగ్గుతున్న పులుల సంఖ్య
భారత పశ్చిమ తీరాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ కనుమల్లో మాత్రం పులుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది.
కొన్ని రిజర్వ్ ప్రాంతాల్లోనూ పులుల సంఖ్య అంతరించిపోయిందని, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో పులుల పరిరక్షణకు కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది.
పెద్దఎత్తున జరుగుతున్న ఆర్థికాభివృద్ధి ప్రణాళికలు, వన్యప్రాణుల పరిరక్షణ మధ్య సమతుల్యత, వన్యప్రాణులకు మనుషులతో వచ్చే ఇబ్బందులు, వాతావరణ మార్పుల కారణంగా పులుల ఆవాసాలపై పడే ప్రభావం, వన్యప్రాణుల అక్రమ వ్యాపారం వంటి సవాళ్లను కూడా నివేదిక ఎత్తిచూపింది.
''పులుల సంఖ్య పెరగడం మంచి సంకేతమే. కానీ, అంతటితోనే మనం సంతృప్తి చెందకూడదు. మన అటవీ పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. పులుల మనుగడకు అవసరమైన అన్ని ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరముంది'' అని నివేదిక సూచించింది.
ప్రధాన మంత్రి కొత్త ప్రోగ్రాం
టైగర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఐబీసీఏ (ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయెన్స్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్యాట్ వర్గానికి చెందిన పులి, సింహం, లెపర్డ్, చీతా వంటి ఏడు జంతువులను రక్షించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఐబీసీఏ పనిచేస్తుంది.
ఈ ప్రోగ్రామ్ ద్వారా వన్య ప్రాణులను సంరక్షించేందుకు అవసరమైన సాంకేతిక సాయం, అనుభవాన్ని సభ్యదేశాలు పంచుకుంటాయి.
ఇవి కూడా చదవండి:
- 18మంది మహిళలపై 2 రోజులపాటు అత్యాచారం...30ఏళ్లకు పైగా సాగిన విచారణ
- ఆర్ఈఈ: చైనాలో ఈ ఖనిజం ఉత్పత్తి నిలిచిపోతే అనంతపురం, చిత్తూరు జిల్లాలే కీలకం అవుతాయా?
- 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
- దెబ్బ తగిలిన ప్రతిసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలా, అసలు ఎప్పుడు అవసరం?
- సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ ఏంటి, టికెట్ ధర ఎంత, ఎక్కడెక్కడ ఆగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














