ఐపీఎల్: DRS అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్'.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

క్రికెట్​

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

    • రచయిత, మీర్జా ఏబీ బేగ్​
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈడెన్ గార్డెన్స్‌ క్రికెట్​ స్డేడియంలో (ఏప్రిల్​ 23 ఆదివారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కె) జట్టు 20 ఓవర్లలోనే 236 పరుగులు సాధించింది.

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు.

236 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్​ ప్రారంభించిన కోల్‌కతా జట్టు 186 పరుగులకే ఆలౌటైంది. 49 పరుగుల తేడాతో ఓడిపోయింది.

దీంతో ధోనీ జట్టు ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లింది. భారీ హిట్టింగ్​ చేసిన అజింక్య రహానే పేరు ఈ విజయం తర్వాత మారుమోగింది. ఇదే మ్యాచ్​ గురించి చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై సోషల్​ మీడియాలో చర్చ జరిగింది. ముఖ్యంగా డీఆర్​ఎస్​ పద్దతి చర్చనీయాంశమైంది.

డీఆర్‌ఎస్ అంటే 'ధోనీ రివ్యూ సిస్టం' అంటూ ఫ్యాన్స్​ హంగామా చేశారు.

ఇంతకూ ధోనీ తాజాగా తీసుకున్న రివ్యూలు ఏంటి? జట్టు విజయాలకు అవి ఎలా ఉపయోగపడ్డాయి?

ధోనీ

ఫొటో సోర్స్, ANI

ఈడెన్ గార్డెన్స్‌లో రెండుసార్లు సమీక్ష

ఏప్రిల్ 23న కేకేఆర్​ తో జరిగిన మ్యాచ్​ లో ధోనీ రెండుసార్లు డీఆర్ఎస్(డెసిషన్ రివ్యూ సిస్టమ్) ఉపయోగించుకొని సరైన ఫలితాన్ని పొందారు.

చివరి రెండు బంతులు ఆడేందుకు మైదానానికి వచ్చిన ధోనీకి తొలి బంతికే ఫుల్ టాస్ వేశారు బౌలర్​. అంపైర్ దాన్ని లీగల్​ డెలివరీగా ప్రకటించారు.

అంపైర్ నిర్ణయంతో ధోనీ సంతృప్తి చెందలేదు, వెంటనే రివ్యూ కోరారు

రీప్లేలో బంతి ధోనీ నడుము మీదుగా వెళ్లినట్లు గుర్తించి, థర్డ్​ అంపైర్​ దానిని 'నో బాల్'గా ప్రకటించారు. దీంతో మైదానంలోని అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత కోల్‌కతా బ్యాటింగ్ కొనసాగించింది. డేవిడ్ వెస్ క్రీజులోకి వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దేశ్‌పాండే బౌలింగ్‌ చేస్తున్నారు.

దేశ్​ పాండే సంధించిన బంతి.. డేవిడ్ వీస్ ప్యాడ్లకు తగిలింది. దేశ్‌పాండేతో పాటు ధోనీ కూడా ఎల్‌బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశారు. అయితే అంపైర్ నాటౌట్​ గా ప్రకటించారు.

వెంటనే ధోనీ రివ్యూ తీసుకున్నారు. ఆ సందర్భంలో క్రికెట్ వ్యాఖ్యాతలు ధోనీ తీసుకున్న రివ్యూల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు.

విషయం మళ్లీ టీవీ అంపైర్‌కు వెళ్లగా, డేవిడ్ వీస్ కాలికి బంతి తగులుతూ స్టంప్స్‌ వైపు దూసుకెళ్లింది. దీంతో టీవీ అంపైర్ ఔట్‌గా ప్రకటించారు.

ధోనీ నిస్సంకోచంగా రివ్యూ కోరినప్పుడు, ఆయన నిర్ణయం 95 శాతం వరకు సరైనదే అయ్యుంటుందని క్రికెట్ నిపుణులు అంటారు.

ఏప్రిల్ 23న ధోనీ రెండు రివ్యూల తర్వాత అందుబాటులో ఉన్న గణాంకాలను చూస్తే- ఆయన 85 శాతం కంటే ఎక్కువ సందర్భాల్లో డీఆర్‌ఎస్‌ను విజయవంతంగా ఉపయోగించుకొన్నారని తెలుస్తోంది. ఆయా సందర్భాల్లో ధోనీ రివ్యూల వల్ల ఫీల్డ్ అంపైర్లు నిర్ణయాలు మార్చుకోవాల్సి వచ్చింది.

ధోనీ

ఫొటో సోర్స్, ANI

సోషల్ మీడియాలో చర్చ

భారత క్రికెట్ జట్టుకు సారథ్యం వహించినప్పటి నుంచే 'కెప్టెన్ కూల్‌'గా పేరు తెచ్చుకున్నారు ధోనీ. ఆయన నిర్ణయాలను టీంలో ప్రతిఒక్కరు గౌరవిస్తారు.

యష్ అనే ఒక సోషల్ మీడియా యూజర్- ''రివ్యూల విషయానికి వస్తే, వాటితో గందరగోళానికి గురికాకండి. వికెట్ల వెనుక ఉన్నది తెలివైన మనిషి'' అని కోల్‌కతా మ్యాచ్ తర్వాత ధోనీకి కితాబిస్తూ రాశారు.

స్వాతి అనే యూజర్- మహి 'నో బాల్' అని చెబితే అది 'నో బాల్' అవుతుందని రాశారు. ప్రతిసారీ తన 'ధోనీ రివ్యూ సిస్టమ్' ద్వారా అంపైర్ తప్పు అని నిరూపిస్తున్నారని చెప్పారు.

ధోనీ ఒక లెజెండ్ అని శైలేంద్ర త్రిపాఠి పోస్టు చేశారు.

"అందులో సందేహం లేదు. డీఆర్​ఎ‌స్‌ను ధోనీ రివ్యూ సిస్టమ్ అని ఎందుకు పిలుస్తారో ధోనీ మరోసారి నిరూపించారు" అని ఆ పోస్టులో రాశారు.

ఈ పోస్టులో రెండు ఫోటోలు పెట్టారు శైలేంద్ర. ఒక ఫోటో ధోనీ సమీక్ష కోరుతున్నట్టు చెబుతోంది. రెండో ఫోటో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొంటున్నట్టు సూచిస్తోంది.

ధోనీ

ఫొటో సోర్స్, BCCI

టీమిండియా కెప్టెన్‌గా అరుదైన విజయాలు

ప్రస్తుతం ధోనీకి 42 ఏళ్లు. ఆయన కెప్టెన్సీలో భారత జట్టు కొత్త శిఖరాలను తాకింది. ధోనీ ఇప్పటికే జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. కానీ, ఐపీఎల్​ ఆడుతున్నారు.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ఆయనకు చివరిదిగా క్రికెట్​ నిపుణులు, అభిమానులు భావిస్తున్నారు.

ఏప్రిల్ 23న ధోనీ కోల్‌కతా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, 'బహుశా వారికి వీడ్కోలు చెప్పడానికే వచ్చా' అన్నారు.

ధోనీ కెప్టెన్సీలో భారత్ 2007 ఐసీసీ వరల్డ్ టీ20, 2011 వన్డే క్రికెట్ ప్రపంచకప్‌ గెలుచుకుంది. ఇది కాకుండా 2013లో ధోనీ కెప్టెన్సీలో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.

ధోనీ 2010, 2016లో ఆసియా కప్‌లో భారత్‌ను విజేతగా నిలిపారు.

ఆయన కెప్టెన్సీలో టీమిండియా 2010, 2011లలో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)