అమెరికా: పొరపాటున డోర్‌బెల్ కొట్టినందుకు టీనేజర్‌ తలపై రివాల్వర్‌తో కాల్పులు

వీడియో క్యాప్షన్, రాల్ఫ్ యార్ల్

పొరపాటున డోర్‌బెల్ కొట్టినందుకు టీనేజర్‌ని కాల్చిన ఘటనలో అమెరికాలోని మిస్సోరికి చెందిన ఒక వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తన తమ్ముళ్లను తీసుకొని వస్తూ ఆ యువకుడు పొరపాటున వేరే ఇంటి డోర్‌బెల్‌ను మోగించారు.

కాల్పులకు పాల్పడిన 84 ఏళ్ల ఆండ్రూ లెస్టర్‌పై ఫస్ట్ డిగ్రీ దాడి, సాయుధ క్రిమినల్ చర్య అభియోగాలు నమోదైనట్లు ప్రాసిక్యూటర్లు చెప్పారు.

తెల్లజాతీయుడైన లెస్టర్ ఏప్రిల్ 13 గురువారం రాత్రి నల్లజాతి టీనేజర్ అయిన 16 ఏళ్ల రాల్ఫ్ యార్ల్ తలపై ఒకసారి, చేతిపై ఒకసారి కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో రాల్ఫ్ ప్రాణాలతో బయటపడ్డారు.

షూటింగ్ ఘటనలో ‘‘జాతి వివక్ష’’ అంశం ఉందని ఒక ప్రాసిక్యూటర్ అన్నారు.

లెస్టర్‌పై ద్వేషపూరిత నేరానికి సంబంధించిన అభియోగాలు మోపలేదు. అలాగే, జాతి వివక్షకు సంబంధించిన ప్రస్తావన కూడా అభియోగ పత్రాల్లో లేదు.

క్లే కౌంటీ ప్రాసిక్యూటర్ జచారీ థాంప్సన్ ఏప్రిల్ 17న విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ- ‘‘మేం చట్ట ప్రకారమే నడుచుకుంటాం. అలాగే చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తాం. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మీరెలా కనిపిస్తారు? మీకు ఎంత డబ్బు ఉందనేది మాకు అనవసరం’’ అన్నారు.

అనుమానితుడు ఆండ్రూ లెస్టర్

ఫొటో సోర్స్, KANSAS CITY POLICE DEPARTMENT

ఫొటో క్యాప్షన్, అనుమానితుడు ఆండ్రూ లెస్టర్

విచారించడం కోసం పోలీసులు తొలుత లెస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆయన్ను వదిలేశారు. ఇది ఏప్రిల్ 16న నగరంలో నిరసనలకు దారి తీసింది.

నిరసనకారులు సోమవారం అనుమానితుడి ఇంటి ముందు గుమిగూడి నినాదాలు చేశారు.

‘‘నల్లజాతి ప్రజల జీవితాలు ముప్పులో ఉన్నాయి’’, ‘‘స్టాండ్ అప్, ఫైట్ బ్యాక్’’ అంటూ నిరసనకారులు నినదించడం ఆన్‌లైన్ వీడియోలలో కనిపిస్తోంది. లెస్టర్ ఇంటిని కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

యార్ల్ కుటుంబం తరఫున వాదిస్తున్న న్యాయవాది బెంజమిన్ క్రంప్ మాట్లాడుతూ- ‘‘ఎవరైనా వచ్చి తలుపు తట్టినప్పుడు సరైన కారణం లేకుండా ఎవరిపై కాల్పులు జరుపకూడదు. తలుపు కొట్టడాన్నే కారణంగా చూపకూడదు’’ అన్నారు.

ఏప్రిల్ 13వ తేదీ రాత్రి 10 గంటలకు ఒక స్నేహితుని ఇంటి నుంచి తన కవల తమ్ముళ్లను తీసుకొస్తూ యార్ల్ పొరపాటున లెస్టర్ ఇంటి తలుపును కొట్టినట్లు యార్ల్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

యార్ల్ పొరపాటున 115 టెర్రస్‌కు వెళ్లడానికి బదులుగా 115 స్ట్రీట్‌కు వెళ్లి రెండుసార్లు బెల్‌ను మోగించినట్లు వారు తెలిపారు. కాల్పులు జరిపిన తర్వాత యార్ల్ అలాగే సమీపంలోని మరో మూడు ఇళ్లకు వెళ్లారని, ఆ తర్వాత అతనికి ఎవరో సహాయం చేసినట్లు చెప్పారు.

32 రివాల్వర్‌తో కాల్పులు జరపడానికి ముందు లెస్టర్‌, యార్ల్ మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదని ప్రాసిక్యూటర్లు తెలిపారు.

యార్ల్ కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో అటార్నీ లీ మెరిట్ ఎన్‌బీసీ న్యూస్‌తో మాట్లాడుతూ, ‘‘ ఆ ఇంట్లో నుంచి శబ్ధాలను అతను విన్నాడు. తర్వాత ఆ ఇంటి తలుపు తెరుచుకుంది. ఇక్కడికి మళ్లీ ఇంకోసారి రావొద్దు అని చెప్పిన ఒక వ్యక్తి వెంటనే తన ఆయుధంతో కాల్పులు జరిపాడు’’ అని చెప్పారు.

వీడియో క్యాప్షన్, జాతివివక్ష: డబ్బుతో బాధితుల నోళ్లు మూయిస్తున్న ఇంగ్లండ్ చర్చి

ఎవరో తన ఇంట్లోకి చొరబడుతున్నారని భావించి తలుపు లోపల నుంచే రెండుసార్లు కాల్చానని పోలీసులకు లెస్టర్ చెప్పినట్లు స్థానిక వార్తాపత్రికలు తెలిపాయి.

తనను కాల్చేశారని యార్ల్ అరవడం విన్నట్లు సాక్షి ఒకరు స్థానిక మీడియాతో చెప్పారు.

ప్రమాదంలో ఉన్నట్లు భావిస్తే తమ బలాన్ని ప్రయోగించే హక్కు మిస్సోరి ప్రజలకు ఉంటుందని సోమవారం ప్రాసిక్యూటర్లు అన్నారు.

రాల్ఫ్ యార్ల్ ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం అతను ఇంట్లో కోలుకుంటున్నాడని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.

లెస్టర్‌పై అభియోగాలను నమోదు చేయడం తమకు ఉపశమనాన్ని కలిగించిందని రాల్ఫ్ యార్ల్ తండ్రి పాల్ యార్ల్ అన్నారు.

‘‘నాకు సంతోషంగా ఉంది. దీని గురించే మేం ఎదురుచూస్తున్నాం’’ అని పాల్ యార్ల్ చెప్పారు.

రూ.17 కోట్ల విరాళాల సేకరణ

యార్ల్ కుటుంబ సభ్యులతో అధ్యక్షుడు జో బైడెన్ 20 నిమిషాల పాటు మాట్లాడారని యార్ల్ తరపు న్యాయవాదులు చెప్పారు.

యార్ల్ త్వరగా కోలుకోవాలని బైడెన్ ప్రార్థన చేశారని, అతను కోలుకున్నాక వైట్‌హౌజ్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారని తెలిపారు.

వియోలా డేవిస్, జస్టిన్ టింబర్‌లేక్, హాలె బెర్రీ, కెర్రీ వాషింగ్టన్ వంటి పలువురు సెలబ్రిటీలు కాల్పుల ఘటనను ఖండించారు.

రాల్ఫ్‌కు వైద్యం కోసం ‘‘గోఫండ్‌మీ’’ ద్వారా చేపట్టిన నగదు సేకరణ కార్యక్రమంలో 2.1 మిలియన్ డాలర్లు (రూ. 17,23,50,150) పోగయ్యాయి.

వీడియో క్యాప్షన్, జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో పోలీసు అధికారిని దోషిగా తేల్చిన కోర్టు

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)