స్వధార్ గృహ: గృహహింస, వరకట్నం, వేశ్యాగృహాల బాధిత మహిళలకు మూడేళ్ల వరకు ఉచిత భోజనం, వసతి.. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం పొందడం ఎలా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎ.కిశోర్‌బాబు
- హోదా, బీబీసీ కోసం
ఆధునిక సమాజం సాంకేతికంగా, అభ్యుదయపరంగా ఎంత ముందుకెళుతున్నా ఇప్పటికీ సగటు భారతీయ మహిళలు వేధింపులకు గురవుతున్న దారుణ పరిస్థితులు మాత్రం పూర్తీగా సమసిపోలేదు.
మన సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా, వరకట్న పిశాచీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో తన వికృత రూపం చూపుతూనే ఉంది.
వరకట్నం, అత్తింటి ఆరళ్లు వేగలేక మహిళలు చిత్రహింసలకు గురవుతూనే ఉన్నారు.
ఒక్క వరకట్నమే కాదు, వేధింపులు, అక్రమంగా వేశ్యా గృహాలకు తరలింపు, మానసిక శారీరక వేధింపులు, ఇలా పలు కారణాలు, పరిస్థితుల ప్రభావంతో తీవ్ర ఒత్తిడి, నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయి జీవితాన్ని అంతమొందించుకుంటున్న మహిళలెందరో.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుని సతమతమవుతున్న మహిళలకు కాస్తంత ఊరట కల్పించి, వారు తమంతట తాము ధైర్యంగా నిలదొక్కుకోవడానికి ఆసరా కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం 'స్వధార్ గృహ' అనే ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది.
ఈ స్వధార్ గృహ పథకం అంటే ఏమిటి? దీనివల్ల కష్టాల్లో ఉన్న మహిళలకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? స్వధార్ గృహంలో ఆసరా పొందడానికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి? ఎవర్ని సంప్రదించాలి? తదితర వివరాలు తెలుసుకుందాం.
ఏమిటీ స్వధార్ గృహ పథకం?
సమాజంలో నిరాదరణకు గురైన స్త్రీలకు, వివిధ రకాలు వేధింపులకు గురై నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలకు ఆసరాగా కల్పించడంతో పాటు, వారి జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం 1969వ సంవత్సరంలో ఒక పథకాన్ని తీసుకొచ్చింది.
ఇలాంటి మహిళలకు తాత్కాలిక వసతి సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకంలో భాగంగా తాత్కాలిక పునరావాస కేంద్రాలను (షార్ట్ స్టే హోమ్స్) ఏర్పాటు చేసింది.
ఈ పథకాన్ని 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసి స్వధార్ గృహ పథకంగా మార్చింది. కేంద్ర ప్రభుత్వ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ శాఖ ఆధ్వర్యంలో ఇవి నడుస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరు ఈ గృహాల్లో ఉండటానికి అర్హులు?
అనాథ మహిళలు, ప్రత్యేక పరిస్థితులు అంటే నేరం చేసి జైలుకెళ్లి తిరిగి వచ్చిన వారు, గృహహింసకు, వరకట్న వేధింపులకు, హింసకు గురై, అకృత్యాలకు బలై, వేశ్యా వాటికలకు తరలింపబడి, మానసిక ఒత్తిడి గురై ఇంటి దూరంగా ఒంటరిగా అనాథగా జీవనం సాగిస్తున్న మహిళలు, వారి పిల్లలు ఈ స్వధార్ గృహాంలో తాత్కాలికంగా పునరావాసం పొందడానికి అర్హులు.
ఎలాంటి పునరావాసం కల్పిస్తారు?
ఈ గృహాల్లో ఇలాంటి మహిళలకు వారి పరిస్థితిని బట్టి సంవత్సరం నుంచీ మూడు సంవత్సరాల వరకు ఉచితంగా భోజనం, వసతి, కల్పించడంతో పాటు ఉచితంగా దుస్తులు కూడా ఇస్తారు. ఉచిత వైద్య సేవలు కల్పిస్తారు.
ఈ పథకం ద్వారా సమాజంలో ఎవరైతే అవమానాలకు గురవుతారో, దోషిగా నిందలు మోస్తారో వారు మళ్లీ సమాజంలో గౌరవంగా తలెత్తుకు బతికేలా కావాల్సిన మానసిక స్థైర్యాన్ని, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తోడ్పాటును, పునరావాసాన్ని కల్పిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
కష్టాల్లో ఉన్నవారికి న్యాయ సహాయం అందిస్తారా?
న్యాయ సహాయం కోరే మహిళలకు కూడా ఈ గృహాల ద్వారా తగిన చట్టపరమైన సహాయం అందిస్తారు.
స్వయం ఉపాధి శిక్షణ ఇస్తారా?
ఈ స్వధార్ గృహాల్లో పునరావాసం పొందే సమయంలో మహిళలకు అక్కడ వారి నైపుణ్యాలను బట్టి వారంతట వారు సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా ధైర్యంగా నిలబడటానికి వీలుగా పలు రకాల చేతి వృత్తుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు.
ప్రతి స్వధార్ గృహంలో 30 మంది మహిళలకు ఆశ్రయం కల్పిస్తారు.
స్వధార్ గృహాలు ఎవరు నిర్వహిస్తారు?
మహిళా, శిశు సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖలు స్వయంగా ఇలాంటి గృహాలు నిర్వహిస్తాయి. లేదా ఇలాంటి గృహాలు నిర్మించి అద్దకు ఇచ్చి కూడా నడిపిస్తుంటారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ గృహాలను నిర్వహిస్తాయి.
ఈ గృహాలను నిర్వహించడానికి స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం కొన్ని ప్రత్యేక నిబంధనలు విధిస్తుంది.
ఆ స్వచ్ఛంద సంస్థ ఇండియా సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం రిజిస్టరు చేసుకుని ఉండాలి.
3 సంవత్సరాలు అనుభవం ఉండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆమోదం పొంది ఉండాలి
రెండు సంవత్సరాల అనుభవంతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందుతూ నడుపుతున్న సంస్థలై ఉండాలి.
ఒక్కో స్వధార్ గృహానికి ఎంత ఆర్థిక సహాయం అందజేస్తారు?
దాని నిర్మాణం, ప్రాజెక్టు నివేదికను బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచీ మొత్తం రూ.50 లక్షలకు పైగానే నిధులు వస్తాయి.
ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు భరిస్తే, రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 40 శాతం భరిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఒక్క స్వధార్ గృహంలో ఒక మహిళ ఎంతకాలం పునరావాసం పొందవచ్చు?
గృహ హింసకు గురైన మహిళకు ఒక సంవత్సరం పాటు పునరావాసం కల్పిస్తారు. మిగిలిన వర్గాల మహిళలకు మూడు సంవత్సరాల వరకు పునరావాసం కల్పిస్తారు.
55 సంవత్సరాలు పైబడిన మహిళలకు 5 సంవత్సరాల వరకు పునరావాసం కల్పిస్తారు. ఆ తరువాత వీరిని వృద్ధాశ్రమంలో చేర్పిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
బాధిత మహిళల పిల్లలకు కూడా పునరావాసం కల్పిస్తారా?
బాధిత మహిళలకు చిన్నపిల్లలున్నట్లయితే ఈ గృహాల్లో వారికి కూడా ఉచితంగా పునరావాసం కల్పిస్తారు.
బాలికలకు 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పునరావాసం ఉంటుంది.
బాలురకు 8 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు పునరావాసం కల్పిస్తారు.
ఏపీ తెలంగాణాలో ఎన్ని స్వధార్ గృహాలున్నాయి
2022 మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 537 స్వధార్ గృహాలుంటే వాటిలో 8163 మంది మహిళలకు పునరావాసం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 21 స్వధార్ గృహాలున్నాయి. వీటిలో 630 మంది మహిళలకు పునరావాసం కల్పించే సామర్థ్యముంది. ప్రస్తుతం వీటిలో 438 మంది మహిళలు పునరావాసం పొందుతున్నారు.
తెలంగాణాలో మొత్తం 21 స్వధార్ గృహాలున్నాయి. వీటిలో 630 మంది మహిళలకు పునరావాసం కల్పించే సామర్థ్యముంది. ప్రస్తుతం వీటిలో 389మంది మహిళలు పునరావాసం పొందుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బాధిత మహిళలు ఎవర్ని సంప్రదించాలి?
మీకు దగ్గర్లోని స్వధార్ గృహాలను నేరుగా సంప్రదించవచ్చు.
ఇలాంటి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నంబరు నిర్వహిస్తోంది.
ఆ నెంబరు 181. ఇది ఎల్లవేళలా పనిచేస్తుంది.
ఈ నెంబరుకు బాధిత మహిళలు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు.
ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లోనే కాలర్లు సంభాషిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడెక్కడ గుర్తింపు పొందిన స్వధార్ గృహాలున్నాయి
ఈ వెబ్‌సైటులో ఆంధ్రప్రదేశ్‌లోని స్వధార్ గృహాల వివరాలు పూర్తిగా ఉంటాయి.
https://wdcw.ap.gov.in/SwadharGrehsUjjawalasAddresses.html
ఇవి కూడా చదవండి:
- రేప్‌కు సంబంధించి మహిళల హక్కుల్లో వచ్చిన మార్పులు ఏంటి?
- ఇరాన్: 'నోరు మూసుకుని ఉండకపోతే మమ్మల్ని రేప్ చేస్తామన్నారు'
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- అబార్షన్ చేయించుకోవాలని కోవిడ్ సోకిన గర్భిణీలకు ఎందుకు చెబుతున్నారు..
- యాంటీబయాటిక్స్ ఇష్టారాజ్యంగా వాడేస్తున్నామా? వీటితో ప్రాణాలు పోయే పరిస్థితి ఎందుకు వస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















