భారత్‌పై సౌదీ అరేబియాకు ఒక్కసారిగా అంత ప్రేమ ఎందుకు?

సౌదీ అరేబియా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రజనీశ్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గత ఏడాది అక్టోబరులో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ పై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాఖ మంత్రి ఒమర్ సుల్తాన్ ఓలామా ప్రశంసలు కురిపించారు.

యుక్రెయిన్ సంక్షోభ సమయంలో భారత్ అనుసరించిన విదేశాంగ విధానాలు తనకు చాలా నచ్చాయని ఆయన చెప్పారు.

‘‘చరిత్రను పరిశీలిస్తే, ప్రపంచ దేశాలు యూనీపోలార్, బైపోలార్ లేదా ట్రైపోలార్ పేరుతో వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తుంది. మీరు ఏ వర్గానికి చెందుతారు? అని ప్రశ్న అడిగినప్పుడు భారత విదేశాంగ మంత్రి చెప్పిన సమాధానం నాకు చాలా నచ్చింది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చేప్పాలి. భారత్, యూఏఈ ఏ కూటమిలోనూ చేరాలని అనుకోవడం లేదు”అని ఆయన అన్నారు.

ఈ ఏడాది మార్చిలో భారత స్వతంత్ర విదేశాంగ విధానాలపై సౌదీ అరేబియా రీసెర్చర్, పొలిటికల్ అనలిస్ట్ సల్మాన్ అల్-అన్సారీ కూడా ప్రశంసలు కురిపించారు.

పశ్చిమ దేశాలు ఎంత ఒత్తిడి చేసినప్పటికీ భారత్ తన ప్రయోజనాల విషయంలో రాజీపడటం లేదని ఆయన చెప్పారు.

‘‘భారత్ విదేశాంగ విధానం నాకు నచ్చుతుంది. భారత్ అటు పశ్చిమ దేశాలు లేదా ఇటు తూర్పు దేశాలు.. ఎవరి ఒత్తిడికీ తలొగ్గడం లేదు. సౌదీ కూడా ఇలాంటి విధానాలకే ప్రాధాన్యం ఇస్తుంది. సార్వభౌమ దేశాలన్నీ ఇలాంటి విధానాలే అనుసరించాలి’’అని సల్మాన్ అల్-అన్సారీ అన్నారు.

యుక్రెయిన్-రష్యా యుద్ధంపై భారత్ వైఖరి గురించి మాట్లాడుతూ సల్మాన్ అల్-అన్సారీ ఆ వ్యాఖ్యలు చేశారు. ‘‘యుక్రెయిన్-రష్యా యుద్ధంలో అటు భారత్, ఇటు సౌదీ.. రెండు దేశాలూ ఎవరి వైపూ వెళ్లలేదు. మేం ఎవరివైపూ నిలబడాలని అనుకోవడం లేదు. ఎందుకంటే అలా చేస్తే ఉద్రిక్త పరిస్థితులు మరింత ఎక్కువ అవుతాయి’’అని ఆయన చెప్పారు.

సౌదీ అరేబియా, భారత్

ఫొటో సోర్స్, Getty Images

పాత విదేశాంగ విధానాన్ని సౌదీ ఎందుకు పక్కన పెట్టేస్తోంది?

ఈ విషయంపై సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి, ప్రిన్స్ ఫైజల్ బిన్-ఫర్హాన్ గత ఏడాది ‘‘వరల్డ్ పాలసీ కాన్ఫరెన్స్’’లో మాట్లాడారు. ‘‘సౌదీ విదేశాంగ విధానాలు చాలా స్పష్టంగా ఉంటాయి. మా ప్రజలకు మేలు చేయడమే మా అంతిమ లక్ష్యం’’అని ఆయన చెప్పారు.

‘‘సౌదీ అరేబియా ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడానికి మేం తొలి ప్రాధాన్యం ఇస్తాం. మా ప్రయోజనాలను కాపాడుకోవడం, భాగస్వామ్యాలను పెంచుకోవడం, ప్రాంతీయ శాంతి, భద్రతల కోసం మేం కృషి చేస్తాం. మేం అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి పనిచేస్తాం. ఎందుకంటే వారి స్వరం పెద్దగా ఎక్కడా వినిపించడం లేదు’’అని ఆయన చెప్పారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై పశ్చిమ దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మీద భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా ఇలాంటి సమాధానమే ఇచ్చారు.

‘‘రష్యా నుంచి యూరప్ తమ ఇంధన దిగుమతులను తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తగ్గించుకుంటోంది. యూరప్ తలసరి ఆదాయం 60,000 యూరోలు. అయినప్పటికీ వారు ప్రజలపై ధరల పెరుగుదల ప్రభావం పడుతోందని ఆందోళన చెందుతున్నారు. భారత్ తలసరి ఆదాయం 2,000 డాలర్లు మాత్రమే. మాకు ఇంధనం అవసరం చాలా ఉంది. భారీగా ధర చెల్లించి చమురు కొనే పరిస్థితిలో మేం లేము. నిజంగా రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడంపై వారు అంత పట్టింపుతో ఉంటే, 2022 ఫిబ్రవరి 25న దాడి మొదలైన మరుసటి రోజే చమురు దిగుమతులను యూరప్ నిలిపివేసుండాల్సింది’’అని ఆయన అన్నారు.

ఫిబ్రవరి 2022 తర్వాత రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న చమురు కంటే యూరప్ దిగుమతి చేసుకున్నది ఆరు రెట్లు ఎక్కువని జైశంకర్ చెప్పారు.

జైశంకర్ వ్యాఖ్యలు భారత విదేశాంగ విధానంలో స్పష్టతకు అద్దం పడుతున్నాయి. వాస్తవానికి స్వాతంత్రం అనంతరం భారత్ ఇదే వైఖరిని అనుసరిస్తోంది. అలీనోద్యామానికి (నాన్-అలైన్‌మెంట్ మూవ్‌మెంట్) పునాదులు వేసినవారిలో భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కూడా ఒకరు.

చైనా, సౌదీ అరేబియా

ఫొటో సోర్స్, Getty Images

అందుకే భారత్ ఏ వర్గంలోనూ చేరలేదు. అయితే, ఆ నాన్-అలైన్‌మెంట్‌ను నేడు మల్టీ-అలైన్‌మెంట్ అని భారత్ విదేశాంగ మంత్రి చెబుతున్నారు. అంటే ఒకేసారి భిన్న దేశాలతో కలిసి పనిచేయడం. అంటే జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్లడం.

యుక్రెయిన్‌పై రష్యా దాడి అనంతరం భారత్ విదేశాంగ విధానానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.

దీంతో నెహ్రూ అలీనోద్యమ రూపంలో పరిష్కారం లభించింది. అందుకే జైశంకర్ వ్యాఖ్యలు పెద్దగా ఎవరినీ ఆశ్చర్యపరచలేదు.

కానీ, ఇదే సంక్షోభ సమయంలో సౌదీ అరేబియా కూడా తమ పాత విదేశాంగ విధానాన్ని పక్కన పెట్టి, అలీనోద్యామాన్ని ఎంచుకుంది.

సౌదీ, తుర్కియే

ఫొటో సోర్స్, Getty Images

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో భారత్ ఇటు సోవియట్ యూనియన్ శిబిరం అటు అమెరికా శిబిరం రెండు వర్గాల్లోనూ చేరలేదు.

కానీ, సౌదీ అరేబియా మాత్రం అమెరికా వైపు నిలిచింది. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా నేతృత్వంలోని ప్రాంతీయ భద్రతా నెట్‌వర్క్‌లో కూడా సౌదీ భాగస్వామి.

అయితే, నేడు యుక్రెయిన్ సంక్షోభంలో అమెరికాతో కలిసి నడిస్తే, తమ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని సౌదీ భావిస్తోంది. అందుకే భారత్‌తోపాటు అలీనోద్యమ విధాన మార్గాన్ని ఎంచుకుంది.

అమెరికా, సౌదీల మధ్య ‘‘చమురుకు బదులుగా భద్రత’’అనే మార్పిడి కొనసాగేది. అయితే, ఈ విధానం నేడు కనిపించడం లేదు.

చైనా నేతృత్వంలోని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో)లోనూ సౌదీ అరేబియా చేరింది. ఈ కూటమిలో రష్యా డైలాగ్ పార్ట్‌నర్. మరోవైపు బ్రిక్స్ కూటమిలోనూ సౌదీ చేరే అవకాశముంది. ఈ రెండు కూటముల్లోనూ భారత్ భాగస్వామి.

ఎస్‌సీవోలో చేరడాన్ని అమెరికా ప్రచ్ఛన్న కాల కూటమి నుంచి సౌదీ బయటకు రావడంగా అప్పట్లో చాలా విశ్లేషణలు వచ్చాయి.

ఈ విషయంపై దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ వెస్ట్ ఆసియా స్టడీస్‌కు చెందిన ప్రొఫెసర్ అశ్వినీ మొహపాత్ర మాట్లాడుతూ.. ‘‘మొత్తం ఒకే కూటమిపై ఆధార పడకూడదని సౌదీ భావిస్తోంది. అందుకే అలీనోద్యమ విధానాన్ని సౌదీ ఎంచుకుంది. నేడు అమెరికా విశ్వసనీయత బాగా దెబ్బతింది. అందుకే సౌదీ కూడా తమ దారి తాము చూసుకుంటుంది’’అని ఆయన అన్నారు.

యూఏఈ, చైనా

ఫొటో సోర్స్, Getty Images

మిడిల్ పవర్ దేశాలు..

భారత్, తుర్కియే, యూఏఈ, సౌదీ అరేబియాలను ‘‘మిడిల్ పవర్’’ దేశాలుగా పిలుస్తారు. యుక్రెయిన్‌పై దాడి చేయడం ద్వారా అమెరికాకు రష్యా సవాల్ విసిరింది. నేడు రష్యాకు పరోక్షంగా చైనా సాయం చేస్తుంది.

ఈ సమయంలో ఏదో ఒక వైపు చేరకుండా తమ జాతీయ ప్రయోజనాలకు మిడిల్ పవర్ దేశాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

యుక్రెయిన్ సంక్షోభం నడుమ రష్యా నుంచి చవక ధరలకు చమురును భారత్ కొనుగోలు చేస్తోంది. మరోవైపు అమెరికా పదేపదే చెబుతున్నప్పటికీ చమురు ఉత్పత్తిని సౌదీ పెంచలేదు. ఇంకా చాలా వరకు తగ్గించింది కూడా.

రష్యాపై ఆంక్షల విషయంలో భారత్, సౌదీ అరేబియా, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తమ వైపు నిలబడాలని అమెరికా భావించింది. అయితే, నాలుగు దేశాలూ దీనికి నిరాకరించాయి.

మరోవైపు అమెరికాకు కోపం తెప్పించేలా చమురు ఉత్పత్తిని సౌదీ తగ్గించింది. దీనిపై వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది. ‘‘చమురు ఉత్పత్తిని తగ్గించడం ద్వారా తమ జాతీయ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తామని సౌదీ స్పష్టమైన సంకేతం ఇచ్చింది. సౌదీ ఫస్ట్ విధానాన్ని సౌదీ ఇంధన మంత్రి అబ్దుల్‌అజీజ్ అనుసరిస్తున్నారు’’అని ఆ కథనంలో రాశారు.

‘‘పశ్చిమ ఆసియాలో సూపర్ పవర్ ఆధిపత్య పోరు కొనసాగుతున్న సమయంలో.. అమెరికా వైపు నుంచి సౌదీ పక్కకు వెళ్లినట్లు కనిపిస్తోంది. అమెరికాను సంతోష పెట్టడమే లక్ష్యంగా మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరంలేదని ప్రిన్స్ మొహ్మమ్మద్ అధికారులకు స్పష్టంచేశారు. మనం అమెరికాకు ఏం చేసినా దానికి ప్రతిఫలం ఆశించాలని అని ఆయన చెప్పారు’’అని ఆ కథనంలో పేర్కొన్నారు.

సౌదీ

ఫొటో సోర్స్, Getty Images

రష్యా నుంచి ప్రయోజనాలు..

రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మార్చినాటికి రోజుకు 10.64 లక్షల బ్యారెళ్లకు ఇవి పెరిగాయని బ్లూమ్‌బర్గ్ తాజాగా ఒక కథనం ప్రచురించింది.

ఇదివరకు రష్యా నుంచి భారత్ ఈ స్థాయిలో చమురును దిగుమతి చేసుకునేది కాదు. గత ఆరు నెలలగా భారత్‌కు చమురును ఎగుమతి చేస్తున్న దేశాల్లో రష్యా మొదటి స్థానంలో నిలుస్తోంది.

గత ఏడాది మార్చిలో కేవలం రోజుకు 68,600 బారెళ్ల చమురును మాత్రమే రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకునేది. ఇప్పుడిది 24 రెట్లు పెరిగింది. మార్చిలోని మొత్తం భారత్ చమురు దిగుమతుల్లో 34 శాతం రష్యా నుంచే వచ్చాయి. ఇరాక్ నుంచి వస్తున్న చమురుకు ఇది రెండు రెట్లు ఎక్కువ.

చమురును దిగుమతి చేసుకుంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు భారత్ సాయం చేస్తోందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. చైనా, భారత్‌లు భారీగా చమురు కొనుగోలు చేయడం వల్లే తాము రష్యాపై విధిస్తున్న ఆంక్షలు ప్రభావం చూపించడంలేదని భావిస్తున్నాయి.

మరోవైపు యూఏఈ, ఇరాక్, కువైట్‌లతో కలిసి రోజుకు మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని తగ్గిస్తామని సౌదీ చేసిన ప్రకటనతో మార్కెట్‌లో చమురు బ్యారెల్‌ ధర 79 డాలర్ల నుంచి 85 డాలర్లకు పెరిగింది.

చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయంతో నేరుగా రష్యాకే మేలు జరిగిందని ఆక్స్‌ఫర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ స్టడీస్‌కు చెందిన అదీ ఇమ్సిరోవిక్ చెప్పారు.

‘‘ఇది పుతిన్‌కు మెగా గిఫ్ట్‌ లాంటిది. ఆర్థికంగా, సైనికంగా రష్యా కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో ఒక బ్యారెల్‌కు పది డాలర్లు చొప్పున అదనంగా మీరు డబ్బులు ఇస్తున్నారు’’అని ఆయన అన్నారు.

గత ఏడాది మార్చిలో సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌లతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చర్చలకు పిలిచారని, అయితే, వారిద్దరూ దీనికి తిరస్కరించారని వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ఓ కథనం కూడా ప్రచురించారు.

వీడియో క్యాప్షన్, కామసూత్ర: అరబ్ సెక్స్ సాహిత్యంలో ఏముంది?

యూరప్‌లోనూ సందేహాలు..

అమెరికా నాయకత్వంపై పశ్చిమాసియాతోపాటు యూరప్‌లోనూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్ ఏప్రిల్ 5 నుంచి 7 మధ్య చైనాలో పర్యటించారు.

ఆ పర్యటన తర్వాత యూరోపియన్ పత్రిక పొలిటికోకు మెక్రాన్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘అమెరికా అడుగు జాడల్లో యూరప్ వెళ్లడం మానుకోవాలి’’అని ఆయన అన్నారు. అమెరికా-చైనా యుద్ధంలో తాము జోక్యం చేసుకోవాలని అనుకోవట్లేదని, తైవాన్ సమస్యతో యూరప్‌కు సంబంధంలేదని కూడా ఆయన అన్నారు. యుక్రెయిన్ సంక్షోభానికే పరిష్కారం చూపడంలో యురప్ విఫలమైతే, తైవాన్ సమస్యకు ఏం పరిష్కారం చూపిస్తుందని ఆయన ప్రశ్నించారు. అయితే, మెక్రాన్ వ్యాఖ్యలపై యూరప్ నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)