ప్రిన్స్ హ్యారీ: మా కుటుంబంలో మిగతావారి కంటే నేను ఎప్పుడూ భిన్నమే

- రచయిత, సీన్ కఫ్లాన్
- హోదా, రాయల్ కరస్పాండెంట్
తన కుటుంబంలోని మిగతా అందరి కంటే తాను భిన్నంగా ఉంటానని ఎప్పుడూ అనుకుండేవాడినని చెప్పారు. ఆయన తల్లి డయానా కూడా అలాగే భావించేవారు.
వేదన గురించి ఆన్‌లైన్‌లో మాట్లాడిన హ్యారీ.. తాను చికిత్స తీసుకుంటున్న సమయంలో తన తల్లి డయానాకు సంబంధించిన జ్ఞాపకాలను కోల్పోతానేమోనని భయపడినట్లు చెప్పారు.
తన బాల్యంలోని బాధలు, ప్రతికూల అనుభవాలు ఏవీ తన పిల్లలకు అందించకుండా వారిని ఆప్యాయంగా చూపుకుంటున్నట్లు చెప్పారు.
బాధ, వ్యసనంపై రచయిత డాక్టర్ గబర్ మాటెతో హ్యారీ సంభాషించారు.
కాలిఫోర్నియాలో జరిగిన ఈ సంభాషణ ఆయన పుస్తకం 'స్పేర్' నుంచి 'నష్టంతో జీవించడం' అనే థీమ్‌ను అనుసరించి సాగింది.
తన పుస్తకంపై ప్రజల స్పందన ప్రతిబింబిస్తున్నట్లుగా తానేమీ బాధితుడిని కానని.. అలాగే సానుభూతిని కోరుకోవడం లేదని హ్యారీ చెప్పారు.
వివాదస్పదమైన తన పుస్తకంపై ఆయన తన స్పందనను తెలిపారు. ఇది 'వెలకట్టలేని స్వేచ్ఛ' అని వ్యాఖ్యానించారు.
'నా భుజాలపై నుంచి ఏదో పెద్ద భారం దిగిపోయినట్లు ఉంది' అని హ్యారీ డాక్టర్ మాటెతో చెప్పారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపై మాట్లాడడం తప్పేమో అనే భావన నుంచి ప్రజలు బయటపడాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకం రాశానని ఆయన చెప్పారు. ఈ పుస్తక రచనను హ్యారీ సేవాకార్యక్రమంగా అభివర్ణించారు.
శనివారం జరిగిన ఈ చర్చ హ్యారీ ఉద్వేగాలు, చికిత్స, మానసిక ఆరోగ్యంపై ఆయన ఆలోచనలపైనే ఎక్కువగా సాగింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవల రాచకుటుంబం ఫ్రాగ్‌మోర్ కాటేజ్‌ను ఖాళీ చేయాలని హ్యారీ, ఆయన భార్య మేగన్‌లకు సూచించడం వంటి విషయాలు ఈ చర్చలో ప్రస్తావనకు రాలేదు. తన తండ్రి చార్ల్స్ పట్టాభిషేకానికి హ్యారీ హాజరవుతారా లేదా అనేదీ ఈ చర్చలో లేదు.
సోదరుడు విలియమ్స్ సహా రాజకుటుంబం మొత్తం హ్యారీ సర్వం బయటపెట్టేసిన ఈ పుస్తకం గురించి ఎలా స్పందించారనేది ఈ చర్చలో ప్రస్తావనకు రాలేదు.
హ్యారీ తన బాల్యం, కుటుంబంలోని మిగతా వారి కంటే తాను భిన్నంగా ఉన్న వైనం వంటివి మాట్లాడారు. మిగతా కుటుంబంతో దూరంగా జీవించాలనే భావనలో ఉండడం.. చికిత్స సహాయంతో దాన్నుంచి బయటపడడం వంటివి వివరించారు.
హత్తుకోవడాలు, ఆప్యాయత చూపించడాలు లేని పరిస్థితులలో ఉద్వేగాలు లేని బాల్యం అనుభవాలు గురించి చెప్పమని హ్యారీని అడిగారు.
దీనికి సమాధానంగా హ్యారీ.. 'నా పిల్లలను నేను ప్రేమ, ఆప్యాయతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాను' అని చెప్పారు.
'నాకు చిన్నప్పుడు ఎదురైన మనోగాయాలు, ప్రతికూల అనుభవాలు నా పిల్లలకు కలగకుండా చూసుకోవడం తండ్రిగా నా బాధ్యత అని భావిస్తున్నాను' అన్నారు హ్యారీ.
మానసిక సమస్యల నుంచి బయటపడడానికి చికిత్స అవసరంపై హ్యారీ ఎక్కువగా మాట్లాడారు.
హ్యారీ 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 1997లో జరిగిన కారు ప్రమాదంలో ఆయన తల్లి డయానా మరణించారు. ఈ చికిత్స వల్ల తన తల్లి జ్ఞాపకాలను, ఆమె తనతో ఉన్నట్లుగా అనిపించే భావనలను కోల్పోతానేమోనని తాను అనవసరంగా భయపడ్డానని హ్యారీ చెప్పారు.
అయితే, ఆయన తన తల్లి జ్ఞాపకాలను కానీ, తన తల్లికి సంబంధించిన భావనలను కానీ కోల్పోలేదు. 'నేను సంతోషంగా ఉండాలని ఆమె కోరుకున్నారు' అని డాక్టర్ మాటెతో హ్యారీ చెప్పారు.

ఫొటో సోర్స్, PETER NICHOLLS
తన భార్య మేగన్ అసాధారణమైన వ్యక్తి అని.. ఆమెకు శాశ్వతంగా కృతజ్ఞుడై ఉంటానని హ్యారీ చెప్పారు.
కానీ మేగన్‌ను కలుసుకోవడం తనకు జాత్యాహంకార అనుభవాలపై పాఠం నేర్పిందని.. అది చాలా దిగ్భ్రాంతికర అనుభవమని చెప్పారు.
సైకోడెలిక్ ఔషధాల వాడకాన్నీ హ్యారీ సమర్థించుకున్నారు. అవి తనకు గతంలో కలిగిన బాధలు, కష్టాలను ఎదుర్కోవడానికి ఉపయోగపడిందని చెప్పారు.
కొకైన్ తీసుకోలేదని.. కానీ, గంజాయి తీసుకోవడం ఎంతో ఉపయోగపడిందని హ్యరీ చెప్పారు.
తన ఈ చర్చలో ఆయన అఫ్గానిస్తాన్ గురించీ మాట్లాడారు. అక్కడ రెండు సార్లు పర్యటించిన ఆయన బ్రిటిష్ సైనికుల్లో అందరూ అక్కడ యుద్ధాన్ని సమర్థించలేదని హ్యారీ చెప్పారు.
హ్యారీ ఇచ్చిన ఈ ఆన్‌లైన్ ఇంటర్వ్యూ చూడాలంటే ఆయన రాసిన పుస్తకం స్పేర్ కొనుగోలు చేయాల్సి ఉంది. రాజకుటుంబీకుల మధ్య ఉద్రిక్తతలు, సోదరుడితో తనకున్న గొడవలు, తాన్ డ్రగ్స్ తీసుకోవడం, తొలి లైంగిక అనుభవం వంటివన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- వృద్ధ జంట ప్రేమ కథ.. 75 ఏళ్ల బాబూరావు, 70 ఏళ్ల అనసూయ
- తెలంగాణ- కోతుల మూకుమ్మడి దాడి కారణంగా వృద్ధురాలు మృతి, అసలేం జరిగింది-
- ఏజ్ ఆఫ్ కన్సెంట్- సెక్స్-కు సమ్మతి తెలపాలంటే కనీస వయసు ఎంత ఉండాలి-
- అదానీ గ్రూప్ నుంచి భారీ ధరలకు ‘విద్యుత్ కొనుగోలు’ ఒప్పందం... ఇరకాటంలో బంగ్లాదేశ్
- తుర్కియే-సిరియా- భూకంప బాధితులు ఎందుకు సరిహద్దులకు వస్తున్నారు-– బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











