ప్రిన్స్ హ్యారీ, మేఘన్: ‘ఇక జీవించడం సాధ్యం కాదు అనుకున్నాను’ - ఓప్రాతో ఇంటర్వ్యూలో వెల్లడించిన మేఘన్

హ్యారీ, మేఘన్

ఫొటో సోర్స్, Getty Images

డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ సస్సెక్స్ ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌లు ఓప్రా విన్ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ ఇంటర్వ్యూలో మేఘన్‌ను తమ వివాహం, మాతృత్వం, రాచరిక జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

ఈ దంపతులు అమెరికాకు వెళ్లడం, వారి భవిష్యత్తు ప్రణాళికల గురించీ మాట్లాడారు.

బ్రిటిష్ రాజకుటుంబంలో జీవించడం కష్టమనిపించిందని.. అలాంటి సమయంలో తనకు బతకాలని కూడా అనిపించలేదని ఆమె చెప్పారు.

మేఘన్, హ్యారీ

ఫొటో సోర్స్, Getty Images

ఇంటర్వ్యూ ఎలా మొదలైందంటే..

ప్రస్తుతం మేఘన్ గర్భవతిగా ఉన్నారు. ఆమె కడుపులో ఉన్న బిడ్డ గురించి మాట్లాడుతూ ఓప్రా ఇంటర్వ్యూ ప్రారంభించారు.

"మీరు చాలా అందంగా ఉన్నారు. కడుపులో ఉన్న బిడ్డతో మరింత అందంగా ఉన్నారు" అని ఓప్రా ప్రశంసించారు.

తమకు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అనేది తమకు తెలుసని, హ్యారీ రాగానే మీకు కూడా చెప్తానని మేఘన్ అన్నారు.

మేఘన్ తన వివాహ వేడుకల గురించి వివరించారు. ఆ రోజు ఎంతో అందంగా గడిచిందని ఆమె తెలిపారు.

"ఏదో మాయా ప్రపంచంలో ఉన్నట్లు తోచింది" అంటూ ఆమె ఆనందాన్ని పంచుకున్నారు.

"రాజరిక కుటుంబంలో చేరడంపై వివాహానికి ముందు మీ అంచనాలు ఎలా ఉన్నాయి?" అని ఓప్రా అడిగారు.

హ్యారీ తనకు ఏం చెప్పారో అంతే తనకు తెలుసునని మేఘన్ అన్నారు.

రాచరికంలో రోజువారీ వ్యవహారాలు ఎలా నడుస్తాయన్న విషయంపై తనకు అవగాహన లేదని అన్నారు.

మనం కథల్లో చదువుకున్నట్లు మాత్రం ఉండదని అర్థమైంది అని మేఘన్ చెప్పారు.

మేఘన్

ఫొటో సోర్స్, Getty Images

"ఇంక జీవించడం సాధ్యం కాదు" అంటూ మేఘన్ గతంలో చేసిన వ్యాఖ్యల గురించి ఓప్రా ప్రశించారు.

"నాకింక బతకాలని అనిపించలేదు. ఈ విషయాన్ని హ్యారీతో చెప్పడానికి సిగ్గుగా అనిపించింది. అప్పటికే ఆయన తన జీవితంలో చాలా కోల్పోయారు. కానీ, ఆ ఆలోచన నన్ను వదల్లేదు" అని మేఘన్ తెలిపారు.

ఈ సమస్యను అధిగమించేందుకు ఎక్కడికైనా వెళ్లడానికి ఆవకాశం ఇమ్మని ఆమె "ఇనిస్టిట్యూషన్"ను అభ్యర్థించానని తెలిపారు. కానీ అందుకు అంగీకారం లభించలేదు.

"మీకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయా?"

"అవును. అలా చేస్తే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని భావించాను’’ అన్నారామె.

తను చేయాలనుకుంటున్న పనులపై పరిమితులు విధించడంతో ఒంటరినైపోయినట్లు అనిపించిందని మేఘన్ చెప్పారు.

"నేను నా స్నేహితులను కలవలేను. ఏం చెయ్యడానికైనా నాకు పరిమితులు విధించారు. అందరిలో ఉన్నా ఒంటరితనం అనుభవించాను" అని ఆమె అన్నారు.

అయితే, రాణి తనతో ఎప్పుడూ బాగానే ఉన్నారని, ఆమెతో మాట్లాడడం, సమయం గడపడం తనకు ఆహ్లాదంగా ఉండేదని మేఘన్ చెప్పారు.

"రాణి నన్ను సహృదయంతో కుటుంబంలోకి ఆహ్వానించారు. మిగతా కుటుంబ సభ్యులు కూడా నన్ను హుందాగా అహ్వానించారు" అని మేఘన్ తెలిపారు.

మేఘన్, హ్యారీ

ఫొటో సోర్స్, Reuters

‘ఆర్చీ పుట్టకముందు ఆమె రంగుపై చర్చ’

''బేబీ ఆర్చీకి ప్రిన్స్ టైటిల్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటని మీరనుకుంటున్నారు? బిడ్డ జాతే ఇందుకు కారణమా'' అని ఓప్రా మేఘన్‌ను అడిగారు.

''నిజాయితీగా జవాబు చెప్పాలంటే, నేను గర్భంతో ఉన్నప్పుడు బిడ్డ రంగు గురించి కుటుంబ సభ్యుల మధ్య కొన్ని సంభాషణలు జరిగాయి. బిడ్డ ఏ రంగులో పుడతాడు, ఎంత ఎక్కువ రంగు ఉంటాడు అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ చర్చలన్నీ హ్యారీతో జరిగాయి. కానీ, నా వరకూ రాకుండా ఎలా ఉంటాయి'' అని మేఘన్ అన్నారు.

''ఇప్పుడు మీరు ఈ నిజాలన్నీ మాట్లాడుతుంటే ప్యాలస్‌లో వాళ్లు ఏమనుకుంటూ ఉంటారు'' అని ఓప్రా అడిగారు.

''ఇంత జరిగాక కూడా ఇంకా నిజం మాట్లాడకుండా ఉంటామని ఎవరైనా ఎలా ఆశించగలరు?

దీనివల్ల నేనేమైనా కోల్పోతానని అనిపిస్తే.. ఇప్పటికే నేనెంతో కోల్పోయాను. నా తండ్రిని, నా బిడ్డను ముఖ్యంగా నా గుర్తింపును కోల్పోయాను'' అన్నారు మేఘన్.

పుట్టబోయేది పాప

తమకు పుట్టబోయే బిడ్డ ఆడపిల్లని అని హ్యారీ, మేఘన్ ప్రకటించారు.

ఈ విషయం తెలియగానే చాలా అద్భుతంగా అనిపించిందని హ్యారీ అన్నారు.

ఈ రాచరికపు నిబంధన నుంచీ బయటకు వచ్చి ఊపిరి పీల్చుకోవాలని తాను, మేఘన్ భావించినట్లు హ్యారీ తెలిపారు.

"చరిత్ర పునరావృతం అవుతుందేమోనని చాలా ఆందోళన చెందాను. అనుకున్నదే జరిగింది" అని హ్యారీ చెప్పారు.

తన తల్లి ఎదుర్కొన్న పరిస్థితులతో పోలిస్తే తాము మరింత తీవ్ర పరిస్థితులను ఎదుర్కొన్నామని.. జాతి, రంగు గురించి జరుగుతున్న చర్చలు మరింత ఆందోళన కలిగించాయని హ్యారీ అన్నారు.

రాణితో

ఫొటో సోర్స్, Getty Images

రాణిని తొలిసారి కలిసినప్పుడు

బ్రిటన్ రాణిని మొదటిసారి కలుసుకోవడం ఎలా అనిపించిందని ఓప్రా అడిగారు.

రాణిని తొలిసారి కలిసినప్పుడు పెద్దగా ఫార్మాలిటీస్ ఏం జరగలేదని మేఘన్ తెలిపారు.

రాణితో ఎలా కర్టసీ ఫాలో అవ్వాలనేది మాత్రం హ్యారీ ప్రాక్టీస్ చేయించారని చెప్పారు.

రాణి కూర్చుని మాములుగా మాట్లాడారని అన్నారు.

ఆర్చీతో మేఘన్, హ్యారీ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఆర్చీతో మేఘన్, హ్యారీ

‘బేబీ ఆర్చీ విషయంలో అలా చేయడం బాధ అనిపించింది’

బేబీ ఆర్చీని పుట్టినప్పుడు ప్రిన్స్‌ను చేయలేదు.

"ఈ వార్తను జీర్ణించుకోవడం తనకు చాలా కష్టమైందని" మేఘన్ చెప్పారు.

ఆ టైటిల్ దక్కనందుకు కాదుగానీ తన బిడ్డకు భద్రత కరవవుతుందని భావించినట్లు మేఘన్ తెలిపారు.

"అమ్మ అనిపించుకోవడం కన్న గొప్ప టైటిల్ ఇంకేమీ ఉండదు. కానీ మా బిడ్డకు భద్రత లభించదన్న ఆలోచన.. ఈ కుటుంబంలో తొలిసారిగా శ్వేతేతర వర్ణంలో జన్మించిన బిడ్డకు ఈ టైటిల్ దక్కకపోవడం మనస్తాపాన్ని కలిగించింది" అని మేఘన్ తెలిపారు.

తను గర్భం దాల్చినప్పుడు ప్రిన్స్, ప్రిన్సెస్ టైటిళ్లు ఇచ్చే పద్ధతిని మార్చేశారని ఆమె అన్నారు.

"అది సరైన పద్ధతి కాదు. నేను గర్భంతో ఉన్నప్పుడు, ఆర్చీ కోసం కన్వెన్షన్ మారుస్తామని చెప్పారు. ఎందుకు మార్చాలి?" అని మేఘన్ అన్నారు.

‘రాచరికం నుంచే బయటకు వచ్చాం.. కుటుంబం నుంచి కాదు’

మరోవైపు తన భవిష్యత్తు గురించి చర్చించేందుకు తన కుటుంబానికి ఎన్నోమార్లు ఫోన్ చేశానని, అయితే తన తండ్రి ప్రిన్స్ చార్లెస్ తన ఫోన్లు ఎత్తడం మానేశారని హ్యారీ తెలిపారు.

"రాచరిక కుటుంబం నుంచీ బయటకు వచ్చేయాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు? ఎందుకు?" అని ఓప్రా అడిగారు.

"నిస్సహాయతే కారణం. ఆ నిర్ణయానికి వచ్చే ముందు నేను అన్నిచోట్లకు వెళ్లి సహాయం అర్థించాను. కానీ నాకు ఎవ్వరి నుంచీ ఏ రకమైన సహాయం అందలేదు. ఈ నిరంతర నిబంధనల నుంచీ విముక్తి పొందాలనుకున్నాం" అని హ్యారీ తెలిపారు.

"కానీ మేం కుటుంబానికి దూరమైపోలేదు. రాచరికం నుంచి మాత్రమే బయటకి వచ్చాం" అని మేఘన్ చెప్పారు.

హ్యారీ, మేఘన్‌ల కథ విన్నాక అనేకమంది అమెరికన్ సెలబ్రిటీలు, యాక్టివిస్టులు వారికి తమ సంఘీభావం తెలిపారు. ఈ ఇంటర్వ్యూ చేసిన ఓప్రా విన్‌ఫ్రేను సోషల్ మీడియాలో పలువురు ప్రశంసించారు.

ప్రిన్స్ హ్యారీ

ఫొటో సోర్స్, Reuters

ప్రిన్స్ హ్యారీ ఎవరు?

36 ఏళ్ల హ్యారీ బ్రిటిష్ రాణి మనుమడు. సింహాసనాన్ని అధిష్టించే వారి క్రమంలో ఆరవ స్థానంలో ఉన్నవారు.

ఆయన తండ్రి ప్రిన్స్ ఛార్లెస్, సోదరుడు ప్రిన్స్ విలియం.

హ్యారీకి 12 ఏళ్లు ఉన్నప్పుడు ఆయన తల్లి ప్రిన్సెస్ డయానా పారిస్‌లో ఒక కారు ప్రమాదంలో మరణించారు.

మేఘన్

ఫొటో సోర్స్, Reuters

మేఘన్ మార్కల్ ఎవరు?

39 ఏళ్ల మేఘన్ మార్కల్ 2018లో హ్యారీని వివాహమాడక ముందు నటిగా, హక్కుల ప్రచార కార్యకర్తగా, బ్లాగర్‌గా పేరు గడించారు. హ్యారీని వివాహం చేసుకున్న తరువాత డచెస్ ఆఫ్ సస్సెక్స్‌గా మారారు.

వివాహం తరువాత ఆమె తన కెరీర్‌ని విడిచిపెట్టి రాణి కుటుంబంలో మమేకమయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)