భారత్, నేపాల్ మధ్య పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారు?

ఫొటో సోర్స్, NOC
భారత్ నుంచి నేపాల్‌కు భారీ పైప్‌లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే భారత్ నుంచి ఆ దేశానికి పెట్రోల్ ఎగుమతి కానుంది.
ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం కారణంగా నేపాల్‌లో పెట్రోల్ ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు.
పైప్‌లైన్ ద్వారా పెట్రోలు సరఫరా చేసేందుకు కొంత సమయం పట్టినా, ప్రణాళిక ప్రకారం పనులు సాగితే 2024 జనవరిలో సరఫరా ప్రారంభించే అవకాశం ఉంది.
నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ అమ్లేఖ్‌గంజ్ డిపో అధిపతి వినితామణి ఉపాధ్యాయ్ బీబీసీతో మాట్లాడుతూ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
పెట్రోల్ రేటు కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
నేపాల్‌లో డీజిల్ మాత్రమే పైప్‌లైన్ ద్వారా సరఫరా అవుతోంది.
సరఫరా ప్రారంభమైన తర్వాత, నేపాల్‌లో డీజిల్ ధర లీటరుకు రూ.2 తగ్గింది.
దక్షిణాసియాలో తొలి అంతర్జాతీయ పెట్రోలియం పైప్‌లైన్
బిహార్‌లోని మోతిహారి నుంచి నేపాల్‌లోని అమ్లేఖ్‌గంజ్‌కు ఇంధనం సరఫరా చేయడానికి పైప్‌లైన్ నిర్మించారు. దీని పనులు ఆగస్టు 2018లో ప్రారంభమయ్యాయి.
దక్షిణాసియాలోని ఈ 'మొదటి అంతర్జాతీయ పెట్రోలియం పైప్‌లైన్' పెట్రోల్‌ను కాకుండా కోల్ డీజిల్‌ను సరఫరా చేస్తోంది.
అమ్లేఖ్‌గంజ్‌లో పెట్రోల్‌ను నిల్వచేసే సామర్థ్యానికి సంబంధించిన పనులు పూర్తి కానందున పెట్రోల్ సరఫరా చేయడం లేదని నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు.
పైప్‌లైన్ నిర్మాణం రెండో దశలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో నిల్వ కేంద్రాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది.
నేపాల్, భారత్ ఉమ్మడి పెట్టుబడితో ఈ అంతర్జాతీయ పైప్‌లైన్ నిర్మించారు. దీనిని నేపాల్‌లో చిత్వాన్‌లోని లోథర్ వరకు 70 కిలోమీటర్లు విస్తరించే ప్రణాళిక ఉంది.
ప్రస్తుతం నిర్మించిన పైప్‌లైన్ మొత్తం పొడవు 69.2 కి.మీ. అందులో 36.2 కి.మీ నేపాల్‌లో ఉంది.

ఫొటో సోర్స్, RSS
జనవరి నుంచి పెట్రోల్ సరఫరా
అమ్లేఖ్‌గంజ్‌లో రెండో దశ పైప్‌లైన్ కింద నిల్వ కేంద్రం, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం వేగంగా జరుగుతోందని వినితామణి ఉపాధ్యాయ్ చెప్పారు.
''ప్రస్తుతం ఎన్ఓసీ, ఐఓసీ ఉమ్మడి పెట్టుబడితో వివిధ మౌలిక సదుపాయాల నిర్మాణం జరుగుతోంది.
ప్రస్తుత వేగంతో పనులు సాగితే 2024 జనవరి నాటికి పైప్‌లైన్ ద్వారా పెట్రోల్ సరఫరా చేసే పనులు ప్రారంభమవుతాయి'' అని ఉపాధ్యాయ్ తెలిపారు.
దీని కోసం స్టోరేజీ ట్యాంక్, పంప్‌హౌస్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్ పనులు కూడా జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
ప్రస్తుతం రోజుకు దాదాపు 4,000 లీటర్ల డీజిల్ పైప్‌లైన్ ద్వారా సరఫరా అవుతోందని నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.
ప్రస్తుతం మొత్తం డీజిల్ భైరహవా వరకు పైపులైన్ ద్వారానే వస్తోంది.
అక్కడి నుంచి ట్యాంకర్లలో చమురు నింపి దేశంలోని మారుమూల ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిల్వ సామర్థ్యం ఎంత?
అమ్లేఖ్‌గంజ్ డిపోలో 19,000 లీటర్ల వరకు డీజిల్ నిల్వ సామర్థ్యం ఉందని ఉపాధ్యాయ్ చెబుతున్నారు.
నేపాల్‌లో మొత్తం పెట్రోలియం వినియోగంలో డీజిల్‌దే అత్యధిక వాటా అని ఆయన అన్నారు.
దేశంలోని మొత్తం వినియోగంలో డీజిల్ వాటా 65 నుంచి 70 శాతం వరకు ఉంది.
కానీ అమ్లేఖ్‌గంజ్‌లో పెట్రోల్ నిల్వ సామర్థ్యం చాలా పరిమితం. ఇక్కడ 3,500 లీటర్ల పెట్రోల్ మాత్రమే నిల్వ ఉంటుంది.
''ఐఓసీ పెట్టుబడితో అమ్లేఖ్‌గంజ్‌లో 4,000 లీటర్ల రెండు పెట్రోల్ నిల్వ ట్యాంకులు నిర్మిస్తున్నారు.
అదే విధంగా నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ పెట్టుబడితో మరో రెండు ట్యాంకులు నిర్మిస్తున్నారు'' అని ఉపాధ్యాయ్ చెప్పారు.
నిల్వ కేంద్రాలు నిర్మించిన తర్వాత ప్రస్తుతం బరౌనీ నుంచి ట్యాంకర్లలో నింపుతున్నపెట్రోల్‌ను కూడా పైప్‌లైన్ ద్వారా నేపాల్‌కు తీసుకురానున్నారు.
ఈ పథకం రెండో దశలో నేపాల్, భారత్ కలిసి రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నాయి.

ఫొటో సోర్స్, NOC
పైప్‌లైన్ ప్రయోజనాలు ఏంటి?
పైప్‌లైన్ పనులు ముందుగా పూర్తి చేయాల్సి ఉందని, అయితే కోవిడ్ కారణంగా కొంత జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
ఉపాధ్యాయ్ మాట్లాడుతూ- పైప్‌లైన్ ఇంధనం రవాణాకు ఆధునిక సాధనమన్నారు.
"ఇది రవాణాను సులభతరం చేయడమే కాకుండా వేగవంతం చేస్తుంది. మరింత నమ్మదగినదిగా చేస్తుంది. దొంగతనం, కల్తీ కూడా తక్కువగా ఉంటాయి'' అని తెలిపారు.
ప్రస్తుతం ఖాట్మండుకు పెట్రోల్‌ను డెలివరీ చేయడానికి లీటరుకు 6.72 నేపాల్ రూపాయలు ఖర్చవుతోందని ఉపాధ్యాయ్ చెప్పారు. పైప్‌లైన్ ద్వారా సరఫరా చేస్తే ఈ ఖర్చు దాదాపు నాలుగున్నర రూపాయలకు తగ్గుతుందన్నారు.
ఇవి కూడా చదవండి:
- సూడాన్‌లో ఏం జరుగుతోంది? మిలిటరీ, పారా మిలిటరీ మధ్య యుద్ధం ఎందుకు?
- అతీక్ అహ్మద్, అష్రఫ్ హత్య: వారిని కాల్చి చంపిన నిందితుల నేర చరిత్ర ఏమిటి?
- లూసిడ్ డ్రీమింగ్ : మనం కోరుకున్న కలలు కనొచ్చా? ఎలా?
- సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను అనుమతిస్తుందా, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఆశ ఏంటి?
- 'సైన్స్ ఆఫ్ మనీ': డబ్బును అర్థం చేసుకుంటే సగం కష్టాలు తగ్గినట్టే... ఎలాగంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














