నేపాల్ మళ్లీ హిందూ దేశంగా మారుతుందా? హిందూ యూనివర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు దేనికి?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, బీబీసీ నేపాలీ సర్వీస్
- హోదా, ...
హిందూయిజంపై పరిశోధనలు, సాంస్కృతిక దౌత్య సంబంధాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘‘శ్రీ పశుపతి హిందూ యూనివర్సిటీ’’ను స్థాపించాల్సిన ఆవశ్యకతపై నేపాల్‌లోని పుష్ప కమల్ దాహాల్ ప్రచండ ప్రభుత్వం అధ్యయనం మొదలుపెట్టింది.
అయితే, పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకుండా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం తొందరపాటు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ అంశంపై ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర పర్యటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సుదన్ కిరాతీ చెప్పారు.
యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై ఈ కమిటీ ప్రస్తుతం అధ్యయనం చేపడుతోంది. అయితే, ప్రస్తుతమున్న నేపాల్ సంస్కృత్ విశ్వవిద్యాలయంలోనే హిందూ మతం, వైదిక సంస్కృతిపై పరిశోధనలు కొనసాగించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, RSS
80 శాతం హిందువులు..
నేపాల్ జనాభాలో 80 శాతం హిందువులు ఉంటారు. అయితే, మావోయిస్టు ఉద్యమం తర్వాత హిందూ రాచరికం నుంచి ప్రజాస్వామ్య గణతంత్ర సమాఖ్యగా దేశం మారింది. దీంతో కొన్ని యూనివర్సిటీలు, కాలేజీల పేర్లు కూడా మార్చారు.
ఇక్కడ మావోయిస్టు పార్టీ అధ్యక్షుడు ప్రచండ మూడోసారి దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. నేడు పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి.
ప్రస్తుతం పశుపతి హిందూ యూనివర్సిటీ ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకతను అధ్యయనం చేసే బాధ్యతలను ప్రొఫెసర్ డా. జగమన్ గురుంగ్‌కు అప్పగించారు.
దీనిపై పర్యటక శాఖ అధికార ప్రతినిధి రాజేంద్ర కుమార్ కేసీ మాట్లాడుతూ.. ‘‘పశుపతి హిందూ యూనివర్సిటీ కాన్సెప్ట్ ఏమిటి? దీనిపై ఎలా ముందుకు వెళ్లాలి? ఏ సబ్జెక్టులు ఇక్కడ బోధించాలి? లాంటి అంశాలపై ఆ కమిటీ నివేదిక సమర్పించబోతోంది’’అని చెప్పారు.
ఆ నివేదిక వచ్చిన తర్వాత, దాన్ని అధ్యయనం చేసి ‘‘తగిన’’ చర్యలు తీసుకుంటామని కేసీ వివరించారు.

ఫొటో సోర్స్, RSS
‘‘సాంస్కృతిక దౌత్యం బలోపేతం’’
కొన్ని రోజుల క్రితం ఈ యూనివర్సిటీ గురించి ఒక కార్యక్రమంలో కిరాతీ మాట్లాడారు. విద్య, పర్యటకం లాంటి రంగాల్లో పరిశోధనలను పశుపతి హిందూ యూనివర్సిటీ ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు.
‘‘సెక్యులర్ దేశంలో అన్ని మతాలనూ గౌరవిస్తారు. కానీ, ఇప్పటివరకు మనం అన్నింటికీ విదేశాలపైనే ఆధారపడుతున్నాం. దేశీయంగా ఎలాంటి సంస్థలనూ నెలకొల్పలేదు. మన విశ్వాసాలు, విలువలు, నమ్మకాలపై పరిశోధనలను మనం ప్రోత్సహించడం లేదు’’అని ఆయన వివరించారు.
‘‘మా లక్ష్యం ఏమిటంటే, ఇక్కడి నుంచి కూడా ప్రపంచ దేశాలకు మేధావులు, విద్యావేత్తలు వెళ్లాలి. దీంతో సాంస్కృతిక దౌత్య సంబంధాలు కూడా బలోపేతం అవుతాయి’’అని ఆయన తెలిపారు.
మరోవైపు కమిటీ కన్వీనర్ గురుంగ్ మాట్లాడుతూ.. ‘‘ఆధ్యాత్మిక కేంద్రాల్లో నేపాల్ తొలి స్థానంలో ఉంటుంది. ఇక్కడి దేశీయ విలువలు, విధానాలకు ప్రాధాన్యమిస్తూ కొత్త యూనివర్సిటీ కోర్సులను ప్రవేశపెట్టబోతోంది’’అని చెప్పారు.
‘‘నేపాల్ విలువలు, ఫిలాసఫీపై అధ్యయనం చేసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారు. నేపాల్‌కు సంబంధించిన సబ్జెక్టులపై పరిశోధనలు కూడా చేపడతారు’’అని ఆయన వివరించారు.
‘‘ప్రస్తుతం కనుమరుగు అవుతున్న వజ్రాయన బౌద్ధం, ముందుమ్ కిరాత్ మతాల గురించి కూడా ఇక్కడ కోర్సులు ఉంటాయి. మరోవైపు ఇక్కడి గిరిజనుల్లో కనిపించే బాన్ పరంపర గురించి కూడా కోర్సులు ఉంటాయి. నేపాల్ సంస్కృతితోపాటు చెపాంగ్, రావుతే లాంటి తెగల జీవన విధానాలనూ మేం ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తాం’’ అని ఆయన తెలిపారు.
ఈ యూనివర్సిటీకి నిధుల కొరత లాంటి సమస్యలేవీ ఉండబోవని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
నిధుల కొరత ఉందా?
ప్రస్తుతం నేపాల్‌లో డజనుకుపైగా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రావిన్సుల్లోని ప్రభుత్వాలు కూడా కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
నేపాల్ సంస్కృత్ విశ్వవిద్యాలయంలో మతం, సంస్కృతిపై ప్రధానంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. మరోవైపు లుంబినీ బౌద్ధ యూనివర్సిటీ, రాజర్షి జనక్ యూనివర్సిటీలలోనూ పరిశోధనలు కొనసాగుతున్నాయి.
అయితే, కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేసి, నడిపించడం అంత తేలికదాదని కాఠ్‌మాండూ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సెలర్ డా. సురేశ్‌రాజ్ శర్మ వ్యాఖ్యానించారు.
‘‘ఇప్పటికే నేపాల్‌లో సంస్కృత్ యూనివర్సిటీ ఉంది. ప్రభుత్వం నిధులు సమకూర్చకపోతే, ఆ యూనివర్సిటీ మూతపడే అవకాశముంది. మరోవైపు త్రిభువన్ యూనివర్సిటీ పరిస్థితి కూడా అంతే..’’ అని ఆయన చెప్పారు.
ప్రభుత్వ నిధులు లేదా ఇతర ఆదాయ మార్గాల ద్వారా సాయం అందితేనే, మతానికి సంబంధించిన కోర్సులను అందించే యూనివర్సిటీ నడపడం తేలిక అవుతుందని ఆయన అన్నారు.
‘‘నిజానికి మొదట ఒక కాలేజీని తెరవాలి. నెమ్మదిగా దాన్నే యూనివర్సిటీగా మార్చుకోవాలి. అంతేకానీ, ఒకేసారి యూనివర్సిటీ మొదలుపెట్టకూడదు. అలాచేస్తే బరువు, బాధ్యతలు చాలా పెరిగిపోతాయి. అది అంత తేలిక కాదు’’అని ఆయన వివరించారు.
‘‘చాలా దేశాల్లో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే నిధులు, భూమి, మౌలిక సదుపాయాలకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవన్నీ సమకూర్చుకుంటేనే అనుమతి ఇస్తారు. అలాంటి నిబంధనలను ఇక్కడ కూడా తీసుకురావాలి. అన్నీ చూసుకున్నాకే యూనివర్సిటీని ఏర్పాటుచేయాలి’’అని ఆయన సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలెందుకు?
అయితే, అసలు పశుపతి హిందూ యూనివర్సిటీని ఇప్పుడు కొత్తగా ప్రారంభించాల్సిన అవసరం ఏముందని నేపాల్ సంస్కృత్ విశ్వవిద్యాలయ మాజీ వైస్-చాన్సెలర్ కుల్ ప్రసాద్ కోయిరాలా ప్రశ్నించారు.
‘‘ఈ యూనివర్సిటీకి సంబంధించి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నేపాల్ సంస్కృత్ విశ్వవిద్యాలయంలో 12 ప్రధాన సబ్జెక్టులపై కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దీనికి మరో 12 కొత్త సబ్జెక్టులను జోడిస్తామని అంటున్నారు. కొత్త సబ్జెక్టును తీసుకురావడమంటే.. ఇక్కడ ఇప్పటికే ఉన్న సబ్జెక్టులను ఒక దానితో మరొకటి కలపడమో లేదా ఒకదాన్ని విడదీయడమో జరగాలి’’అని ఆయన అన్నారు.
పక్కా ప్రణాళిక, అధ్యయనం లేకుండా నేపాల్‌లో ఒక కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేయడమంటే కొత్త సమస్యలను కొని తెచ్చుకోవడమే అవుతుందని ఆయన హెచ్చరించారు.
‘‘ఇక్కడ కొత్త బౌద్ధ విశ్వవిద్యాలయం మనకు అవసరం లేదు. కావాలంటే నేపాల్ సంస్కృత్ విశ్వవిద్యాలయంలోనే ఒక కొత్త విభాగం ఏర్పాటు చేయొచ్చు. యోగా కూడా అంతే. హిందూయిజం కూడా అంతే. సంస్కృత్ విశ్వవిద్యాలయంలో ఒక విభాగం ఏర్పాటు చేసి పరిశోధనలను ప్రోత్సహిస్తే సరిపోతుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, NARENDRA MODI/TWITTER
హిందూ దేశం డిమాండ్..
మరోవైపు కాఠ్‌మాండూలోని వాల్మీకి విద్యాపీఠ్ ప్రొఫెసర్ ప్రియంవద ఆచార్య కాఫ్లే కూడా అసలు కొత్త యూనివర్సిటీ ఆలోచన ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావడంలేదని అన్నారు.
‘‘త్రిభువన్ యూనివర్సిటీలో సంస్కృతితోపాటు ఇతర సబ్జెక్టులపై కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ హిందువుల జనాభా భారీగా ఉందని, అన్నింటినీ హిందూమయం చేయకూడదు. దీనికి బదులుగా మౌలిక సదుపాయాల కల్పనకు ఆ నిధులు కేటాయించాలి’’ అని ఆమె సూచించారు.
ఇక్కడకు వచ్చే యాత్రికుల కోసం ధర్మశాల, ప్రత్యేక వంట గదులు లాంటివి నిర్మించాల్సిన అవసరం చాలా ఉందని ఆమె తెలిపారు.
అయితే, కొత్త యూనివర్సిటీ ఏర్పాటుకు కావాల్సిన నిధులు, ఇతర అంశాలపై ప్రభుత్వ అధికారులు లోతుగా అధ్యయనం చేపడుతున్నారు.
మరోవైపు నేపాల్‌ను మళ్లీ హిందూ దేశంగా మార్చాలని రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ లాంటి రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడే ఇక్కడ డిమాండ్లు చేస్తుంటాయి.
నేపాల్-భారత్ దౌత్యం..
నేపాల్‌కు పొరుగునున్న భారత్‌తో ఇటీవల కాలంలో హిందూ సంబంధాలు మరింత వేళ్లూనుకుంటున్నాయి. ఇటీవల రెండు దేశాలు కలిసి మతపరమైన పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు రామాయణ సర్క్యూట్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
ఇక్కడి పశుపతినాథ్ ఆలయానికి భారత్‌లోని హిందువులు కూడా ఎక్కువగా వస్తుంటారు.
పశుపతినాథ్‌తోపాటు ముక్తినాథ్, జనక్‌పుర్‌ధామ్‌లను కూడా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇక్కడకు వచ్చినప్పుడు సందర్శించారు.
మరోవైపు నేపాల్ పర్యటకులు కూడా భారత్‌లోని వారణాసికి ఎక్కువగా వెళ్తుంటారు.
నేపాల్‌లో హిందూ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే, రెండు దేశాల మధ్య మతపరమైన పర్యటకం, హిందూ పరిశోధనలు మరింత పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- 18మంది మహిళలపై 2 రోజులపాటు అత్యాచారం...30ఏళ్లకు పైగా సాగిన విచారణ
- ఆర్ఈఈ: చైనాలో ఈ ఖనిజం ఉత్పత్తి నిలిచిపోతే అనంతపురం, చిత్తూరు జిల్లాలే కీలకం అవుతాయా?
- 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
- దెబ్బ తగిలిన ప్రతిసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలా, అసలు ఎప్పుడు అవసరం?
- సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ ఏంటి, టికెట్ ధర ఎంత, ఎక్కడెక్కడ ఆగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















