నేపాల్‌లో హిందూత్వ రాజకీయాలు ఎలా వేళ్లూనుకుంటున్నాయి? ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి?

నేపాల్‌లో హిందూ సంస్థల ర్యాలీ

ఫొటో సోర్స్, KIRANKARN

    • రచయిత, రజనీశ్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నేపాల్‌లోని జనక్‌పూర్‌లో ఉన్న జానకి ఆలయం వెనుకే ఒక మసీదు ఉంది. జానకి ఆలయాన్ని కూడా ముస్లింలే నిర్మించారని, ఈ ఆలయంతో పాటు తాము ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా అక్కడే ఒక మసీదును వారు నిర్మించుకున్నారని చెప్తారు.

జనక్‌పూర్‌లో 3 నుంచి 4 శాతం మంది ముస్లింలు ఉన్నారు. ఇక్కడి ఆరో వార్డులో జానకి దేవాలయం ఉంది. 1900లలో సయ్యద్ మోమిన్ ఈ వార్డు నుంచి అధ్యక్షుడిగా ఎన్నిక కాగా ఆయన తరువాత మొహమ్మద్ ఇద్రీస్ అధ్యక్షుడయ్యారు.

వివాహ పంచమి వేడుకల సందర్భంలో సయ్యద్ మోమిన్, మొహమ్మద్ ఇద్రీస్‌లు జానకి మందిరం, రామ మందిరం మధ్య ఊరేగింపు బాధ్యతలు చూసుకునేవారు.

జనక్‌పూర్‌లోని సీనియర్ జర్నలిస్ట్ రోషన్ జనకపురి మాట్లాడుతూ.. ‘వివాహ పంచమి రోజున సయ్యద్ మోమిన్, మొహమ్మద్ ఇద్రిస్‌లు ఇక్కడి జానకి ఆలయంలో వేడుకలను ఎలా నిర్వహించేవారో నా చిన్నతనంలో స్వయంగా చూశాను’ అని చెప్పారు.

జనక్‌పూర్ మసీదు

ఫొటో సోర్స్, KIRANKARN

ఫొటో క్యాప్షన్, జనక్‌పూర్ మసీదు

జానకి ఆలయంలో ముహర్రం తాజియా కూడా నిర్వహించేవారని రోషన్ జనక్‌పురి చెప్పారు.

జానకి ఆలయం తలుపులు ఏ రోజు కూడా ముస్లింల కోసం మూసివేయలేదని, ముస్లింలు కూడా అది అన్య మతానికి చెందిన ఆలయమని ఏనాడూ భావించలేదని రోషన్ చెప్పారు.

‘‘ఒకప్పుడు ముస్లింలు ఇక్కడి జానకి ఆలయంలోని భండారాలో పనిచేసేవారు, భండారా కోసం కూరగాయలు పండించేవారు.

కానీ, జానకి గుడికి, మసీదుకు మధ్య దూరం పెరిగింది. ఆలయం, మసీదు మధ్య గోడ నిర్మించారు. సయీద్ మోమిన్, మహమ్మద్ ఇద్రీస్‌ల తరం ముగిసింది.

వివాహపంచమి కోసం ఇప్పుడు అయోధ్య నుంచి కూడా ఊరేగింపులు మొదలయ్యాయి. ఈ ఊరేగింపులు స్థానికంగానే కాదు అంతర్జాతీయంగానూ రాజకీయ చర్చల్లో ఉంటున్నాయి. 2018లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఊరేగింపుగా జనక్‌పూర్ వెళ్లారు’ అన్నారు రోషన్.

‘యోగి రాక తరువాత జానకి వివాహ వేడుకలలో సయీద్ మోమిన్, ఇద్రీస్‌ల పాత్ర తగ్గిపోయింది. 2014లో నరేంద్ర మోదీ భారత ప్రధాని అయిన తరువాత నేపాల్ తీవ్రంగా ప్రభావితమైంది. 2018లో మోదీ జనక్‌పూర్ పర్యటన తరువాత అక్కడ ఎన్నో మార్పులు వచ్చాయి.

నేపాల్ లో మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఆ పర్యటన సమయంలో అక్కడున్నాం.. ఉదయం 10 గంటలైంది. జానకి ఆలయం లోపల నుంచి హరే రామ్ సీతారామ్ అనే మధురమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలో ఓ వ్యక్తి హనుమంతుడిలా మాస్క్ ధరించి తిరుగుతున్నారు. చిన్నారులు ఆ హనుమాన్ వేషధారితో సెల్ఫీలు దిగుతున్నారు.

మా చేతిలో కెమేరా చూసి 40 ఏళ్ల వయసుండే ఓ వ్యక్తి ‘ఎక్కడి నుంచి వచ్చారు’ అని అడిగారు. దిల్లీ నుంచి అన్నాను. ప్రధాని కూడా వచ్చారంటూ మేం అడక్కుండానే మాతో చెప్పారు. దాంతో నేను ఎవరు? ప్రచండ వచ్చారా అని అడిగాను. కాదు బ్రదర్.. మోదీ వచ్చారు అన్నారాయన.

మీ ప్రధాని ప్రచండ కదా అన్నాను. అవునవును.. ఆయన కూడా వచ్చారు అని చెప్పారు.

నాతో పాటు అక్కడి ప్రాంతానికే చెందిన ఇద్దరు జర్నలిస్టులున్నారు. వారిలో ఒకరు జనక్‌పూర్‌కే చెందిన ముస్లిం జర్నలిస్ట్. ఆయన సమాధానం విని ఇద్దరూ నవ్వారు. మోదీ రాక తరువాత నేపాల్ ఎలా ప్రభావితమైందో చెప్పారు.

ఆలయంలోని మహంత్‌తో మాట్లాడుతారా అని నాతో ఉన్న ముస్లిం జర్నలిస్ట్‌ను అడిగాను... మహంత్ అయోధ్య వెళ్లారని, ప్రధాన పూజారితో మాట్లాడుదామంటూ తీసుకెళ్లారు.

నసీం అక్తర్

ఫొటో సోర్స్, HADIS KHUDDAR

ఫొటో క్యాప్షన్, నసీం అక్తర్

గేటు బయట తన బూట్లు విప్పి ప్రధాన పూజారి దగ్గరకు తీసుకెళ్లారాయన. జానకి ఆలయ ప్రధాన పూజారి ముస్లిం జర్నలిస్టును ఎంతో ఆదరంగా మాట్లాడి ఆయన బాగోగులు అడిగి తెలుసుకున్నాక నాతోనూ మాట్లాడారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ 2018లో జనక్‌పూర్‌కు వచ్చారు. ప్రధాని మోదీ జనక్‌పూర్‌కు రాకముందు, తర్వాత నగరంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.

మోదీ రాక సందర్భంగా జనక్‌పూర్ సబ్‌సిటీ తాత్కాలిక మేయర్ లాల్ కిశోర్ షా నగర వీధుల్లోని గోడలకు కాషాయ రంగు వేశారు. జనక్‌పూర్ సబ్ సిటీ పేరు కూడా జనక్‌పూర్ ధామ్ సబ్ మెట్రోపాలిటన్ సిటీగా మార్చారు.

మున్సిపల్ ఉద్యోగుల యూనిఫాం కూడా కాషాయ రంగుకి మార్చారు. ఉద్యోగులంతా కార్యాలయానికి చేరగానే జై జనకపూర్ ధామ్ అనే ప్రార్థనాగీతం వినిపించింది. అప్పుడు నసీం అక్తర్ అనే ముస్లిం ఉద్యోగి ఆ గీతాన్ని అంగీకరించడానికి నిరాకరించారు.

లాల్ కిశోర్ షా
ఫొటో క్యాప్షన్, లాల్ కిశోర్ షా

ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ తాత్కాలిక మేయర్ లాల్ కిశోర్‌ను అడిగారు. ‘మేం జనక్‌పూర్‌ను కుంకుమపువ్వు రంగులోకి మార్చాలనుకుంటున్నాం. సీతాదేవికి ఆ రంగంటే ఇష్టం కాబట్టి ప్రభుత్వ ఖర్చుతో గోడలకు అదే రంగు వేయించాం’ అని లాల్ కిశోర్ చెప్పారు.

అయితే, లాల్ కిశోర్ నిర్ణయాన్ని ప్రధాని మోదీ మెచ్చుకున్నారా?

లాల్ కిశోర్ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీకి విమానాశ్రయంలో స్వాగతం పలికినవారిలో నేను కూడా ఉన్నాను. మోదీని అక్కడి నుంచి జానకి ఆలయానికి తెచ్చాం. రంగభూమి మైదానంలో మోదీని ఘనంగా సత్కరించాం’ అని చెప్పారు.

‘మోదీకి వీడ్కోలు పలికినప్పుడు కూడా నేను ఉన్నాను. అప్పుడు మోదీ... మేయర్ గారూ.. మీరు జనక్‌పూర్ గోడలకు వేయించిన రంగు చాలా బాగుంది అని అన్నారు. నేనే వేయించానని మోదీతో చెప్పాను’ అన్నారు లాల్ కిశోర్.

విజయకాంత్ కర్ణ
ఫొటో క్యాప్షన్, విజయకాంత్ కర్ణ

కఠ్మాండూలోని ‘సెంటర్ ఫర్ సోషల్ ఇన్‌క్లూజన్ అండ్ ఫెడరలిజం’(సీఈఐఎస్ఎఫ్) నిర్వాహకుడు, డెన్మార్క్‌లో నేపాల్ రాయబారి అయిన విజయకాంత్ కర్ణ మాట్లాడుతూ జనక్‌పూర్‌లో నరేంద్ర మోదీని చూసేందుకు వేలాది మంది ప్రజలు వచ్చారని చెప్పారు.

భారత్ కాకుండా ఇతర దేశాల్లో మోదీని చూసేందుకు ఇంత పెద్దసంఖ్యలో జనం రావడం నేపాల్‌లోనే.. ఇంకెక్కడా ఇంత జనం రాలేదు అన్నారాయన. మోదీ ప్రసంగిస్తున్నప్పుడు కూడా ఆయన విదేశీ నేలపై మాట్లాడుతున్నట్లుగా ఏమాత్రం లేదు అన్నారు విజయకాంత్ కర్ణ.

‘నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరవాత నేపాల్‌లో హిందూత్వ రాజకీయాలు బలపడ్డాయి. మతాన్ని రాజకీయంగా వాడుకోవడం మొదలైతే పరిస్థితి మరింతగా దిగజారుతుంది’ అన్నరాయన.

’నేపాల్‌లోని 18 లక్షల మంది ముస్లిం జనాభాలో 98 శాతం మంది మధేస్ ప్రాంతంలో ఉన్నారు. ఈ ప్రాంతం భారత్‌తో ముడిపడి ఉంది. రెండు దేశాలకూ భద్రతాపరంగా ఇది కీలక ప్రాంతం’ అన్నారు విజయకాంత్.

‘నేపాల్‌తో సరిహద్దును ఎల్‌ఓసీలా, బంగ్లాదేశ్ సరిహద్దులా మార్చే తెలివి తక్కువ పని భారత్ చేయదు. ఎల్‌ఓసీపై, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రత కోసం భారత్ వందల కోట్లు ఖర్చు చేస్తుంది. కానీ, నేపాల్ సరిహద్దుల్లో ఇంతవరకు అలాంటి పరిస్థితి లేదు’ అని చెప్పారు విజయకాంత్.

జానకి ఆలయం

ఫొటో సోర్స్, KIRANKARN

ఫొటో క్యాప్షన్, జానకి ఆలయం

నేపాల్‌లో ఆర్ఎస్ఎస్

ఆర్ఎస్ఎస్ నేపాల్‌లో హిందూ స్వయం సేవక్ సంఘ్(హెచ్ఎస్ఎస్) పేరుతో పనిచేస్తుంది. జనక్‌పూర్ డివిజన్ హిందూ స్వయంసేవక్ సంఘ్‌కు బీర్‌గంజ్‌కు చెందిన రంజిత్ షా నాయకత్వం వహిస్తున్నారు.

బీర్‌గంజ్ ప్రాంతం బిహార్‌లోని రక్సోల్‌ని ఆనుకుని ఉంటుంది. మేం రంజిత్ షాను కలిసేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లాం. ఆయన కూర్చున్న గదికి వెనుక ఉన్న గోడపై ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ చిత్రంతో పాటు ఆర్ఎస్ఎస్ రెండో సర్ సంఘ్‌చాలక్ గోల్వాల్కర్ ఫొటో కూడా ఉంది.

‘మీరు హెడ్గేవార్, గోల్వాల్కర్ నుంచి స్ఫూర్తి పొందారా’ అని రంజిత్ షాను అడిగాను. దానికి ఆయన నవ్వుతూ... నేను సంఘ్ వలంటీర్‌ను.. ఇంకెవరి నుంచి స్ఫూర్తి పొందుతాను? అని తిరిగి ప్రశ్నించారు.

నేపాల్‌లోని మధేసీలు, పహాడీల పోరాటం.. భారత్, నేపాల్ మధ్య సరిహద్దు వివాదాలు సహా రెండు దేశాల మధ్య సమస్యలకు ముస్లింలనే బాధ్యులు చేస్తూ మాట్లాడారు రంజిత్ షా.

‘నేపాల్‌లో మధేసీల ఉద్యమం ఇస్లామిక్ కుట్ర. పహాడీలు, మధేసీలు ఉద్దేశపూర్వకంగా పోరాడేలా చేశారు. ముస్లిం సమాజం దాంతో లాభపడింది’ అన్నారు రంజిత్ షా.

గత పదేళ్లలో నేపాల్‌లోని టెరాయ్ ప్రాంతంలో ముస్లింల జనాభా 400 శాతం పెరిగిందని షా చెప్పారు... దానికి ఆధారమేంటని ప్రశ్నిస్తే సంఘ్ సర్వే చేసిందని ఆయన చెప్పారు.

నేపాల్‌ను మళ్లీ హిందూ దేశంగా మార్చాలని సంఘ్ కోరుకుంటుందా ? అన్న ప్రశ్నకు రంజిత్ సమాధానం చెప్తూ ‘ప్రతి హిందువు అదే కోరుకుంటున్నాడు. భవిష్యత్తులో అది జరిగి తీరుతుంది’ అన్నరు.

నేపాల్ హిందూ దేశంగా మారడం వల్ల ఏం సాధిస్తుంది అనే ప్రశ్నకు బదులిస్తూ ఆయన.. ‘నేపాల్ హిందూ దేశంగా ఉన్నంత కాలం దేశంలో మతపరమైన విభేదాలు లేవు. మైనారిటీలు అత్యంత సురక్షితంగా ఉన్నారు. కానీ, సెక్యులర్ దేశంగా మారినప్పటి నుంచే అభద్రతాభావం పెరిగింది. ఏ ప్రాంతంలోనైనా మైనారిటీ సమాజం మెజారిటీగా మారితే అది స్థానిక జనాభాలో విధ్వంసం కలిగిస్తోంది. బీర్‌గంజ్‌లో హిందువులు మెజారిటీ కానీ అక్కడే వారికి ఒకే ఒక స్మశానవాటిక ఉంది. కానీ, కొద్దిసంఖ్యలోనే ఉన్న ముస్లింలు గత అయిదేళ్లలో 10 స్మశానవాటికలు, ఈద్గాలు నిర్మించారు’ అని చెప్పారు.

బీర్‌గంజ్‌లోని స్థానిక హిందువులతో మాట్లాడినప్పడు రంజిత్ షా చెప్పినట్లు ఒకటే స్మశానవాటిక ఉందన్న మాట అసత్యమని తెలిసింది. హిందువులు చనిపోతే దహనం చేయడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయని వారు చెప్పారు.

కాగా భారత్‌లో ఆర్ఎస్ఎస్‌కు బీజేపీకి మంచి సంబంధాలున్నట్లు నేపాల్‌లో హెచ్ఎస్ఎస్‌తో ఏ పార్టీకి సంబంధాలున్నాయని రంజిత్ షాను అడగ్గా... నేపాల్‌లోని అన్ని పార్టీలవారితో తమకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు.

అంతేకాదు.. అయోధ్యలో నెలకొల్పే రాముడి విగ్రహం తయారీ కోసం గండకి నేపాల్‌లోని ప్రాంతంలోని కాళీగండకి నది నుంచి రాతిని తీసుకెళ్తున్నారని ఆయన చెప్పారు.

ఈ రాతిని తీసుకెళ్తున్నప్పడు నిర్వహిస్తున్న దేవశిల యాత్రకు అనుమతి ఇచ్చింది గండకి ప్రదేశ్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం అని ఆయన చెప్పారు.

మోదీతో రంజిత్ షా
ఫొటో క్యాప్షన్, మోదీతో రంజిత్ షా

పాంచజన్య పేరుతో భారత్‌లో ఆర్ఎస్ఎస్ మాస పత్రిక వస్తున్నట్లు నేపాల్‌లో హెచ్ఎస్ఎస్ ‘హిమాల్ దృష్టి’ అనే మాసపత్రికి నడుపుతోంది.

భారత్‌లో ఆర్ఎస్ఎస్ సరస్వతి శిశుమందిర్‌లు నడుపుతుంగా నేపాల్‌లో హెచ్ఎస్ఎస్ పశుపతి శిక్షామందిర్ పేరుతో స్కూళ్లను నడుపుతోంది. భారత్ తరహాలోనే హెచ్ఎస్ఎస్‌కు నేపాల్‌లోనే అనేక అనుబంధ సంస్థలున్నాయి.

నేపాల్‌లో ఆర్ఎస్ఎస్‌కు చెందిన 12 సంస్థలు పనిచేస్తున్నాయని రంజిత్ షా చెప్పారు.

2015 సెప్టెంబర్‌లో నేపాల్ తన కొత్త రాజ్యాంగాన్ని అమలు చేసింది. ఆ రాజ్యాంగంలో నేపాల్ ఇక హిందూ దేశం కాదని ప్రకటించారు. దాంతో నేపాల్ రాజ్యంగబద్ధంగా లౌకిక రాజ్యంగా మారింది.

అప్పటికి భారత్‌లో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమే ఉంది. 2006లో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్ అప్పట్లోనే ‘మావోయిస్టలు ఒత్తిడికి తలొగ్గి నేపాల్ తన హిందూ గుర్తింపును వదులుకోరాదు’ అన్నారు.

మరి.. నేపాల్ లౌకిక దేశంగా మారిన తరువాత అక్కడి ముస్లింలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు బీర్‌గంజ్‌కు చెందిన 35 ఏళ్ల షేర్ మహ్మద్ అన్సారీతో మాట్లాడాం. ‘‘మేం హిందూ దేశంలోనే సురక్షితంగా ఉండేవాళ్లం. అప్పట్లో ఎవరూ మతం గురించి మాట్లాడేవారు కాదు. అప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ, హిందూరాష్ట్రం నుంచి లౌకిక రాజ్యంగా మారిన తరువాత మతం గురించి మాట్లాడడం ఎక్కువైంది. కొన్ని హక్కులు కొత్తగా వచ్చాయి. హిందూ దేశంగా ఉన్నప్పుడు ఈద్, బక్రీద్ సందర్భంగా సెలవు ఉండేది కాదు, కానీ, ఇప్పుడు సెలవు ఉంటోంది. అయితే.. భారత రాజకీయాల ప్రభావం ఇప్పుడు ఇక్కడ పడుతోంది. 2014కి ముందు నేపాల్‌లోని ముస్లింలలో ఒవైసీ పట్ల ఆదరణ ఉండేది కాదు. కానీ, ఇప్పుడు నేపాల్ ముస్లిం యువత ఒవైసీ ప్రసంగాలు చూస్తున్నారు. లౌకిక దేశంగా మారిన తరువాత నేపాల్ ముస్లింలు కూడా వివిధ సమస్యలపై ఏకమవుతున్నారు’ అన్నారు అన్సారీ.

అన్సారీ ఈ విషయాలన్నీ బీర్‌గంజ్ మసీదు పక్కనే నిల్చుని చెప్తున్నారు. ఆయన పక్కనే ఉన్న జైమునీద్దీన్ అన్సారీ మాట్లాడుతూ... ‘భారత్‌లో ముస్లింలు ఎక్కువ హింసను ఎదుర్కొంటున్నారు. నేపాల్‌లో అలాంటి పరిస్థితి లేదు’ అన్నారు.

నేపాల్ హిందూ దేశంగా ఉన్నప్పుడే ముస్లింలు క్షేమంగా ఉన్నారా అనే ప్రశ్నకు ప్రముఖ పాత్రికేయుడు, రచయిత సీకే లాల్ బదులిస్తూ.. ‘రాజు తన పాలనలోని మైనారిటీలకు రక్షణ కల్పించడం ద్వారా చట్టబద్ధంగా ఉంటాడు.. కానీ, ప్రజాస్వామ్యంలో ఓట్లు ఎక్కువ ఉన్నవారికే ప్రాధాన్యం దక్కుతుంది. ఈ కారణంగానే నేపాల్‌లోని కొందరు ముస్లింలు తమకు రాచరికమే బాగుందని చెప్తున్నారు’ అన్నారు.

2014 తరువాత మాదేస్‌లో ఆర్ఎస్ఎస్, హిందూత్వ రాజకీయాలు మరింత బలపడ్డాయని సీకే లాల్ చెప్పారు. బీర్‌గంజ్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ చంద్రకిశోర్ ఝా మాట్లాడుతూ.. మోదీ భారత ప్రధాని అయిన తరువాత నేపాల్ రాజకీయాలు, నేపాలీ సమాజంపై మోదీ ప్రభావం ఎక్కువైందని చెప్పారు.

నేపాల్ యోగి పోస్టర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నేపాల్ యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లు

‘నేపాల్‌లో భారత్‌కు చెందిన హిందీ వార్తా చానళ్లు మాత్రమే కనిపిస్తాయి. ఇవి ముస్లింలను చూపించే విధానం మారింది. ఆ ప్రభావంతో నేపాల్‌లో హిందువులు, ముస్లింల మధ్య సంబంధాల సమీకరణలు మారుతున్నాయి’ అన్నారు ఝా.

‘మాధేస్ ప్రదేశ్ ముఖ్యమంత్రి లాల్ బాబు రౌత్ తండ్రి పేరు దశరథ్ రౌత్, తల్లి పేరు రాథా రౌత్. వీరందరి పేర్లు చూస్తుంటే హిందువులు అనుకుంటారు. కానీ వీరిది ముస్లిం కుటుంబం. వారి ఇంట్లో ఛఠ్ పూజ, దీపావళి కూడా చేస్తారు. అయితే, ఇప్పుడు ముస్లిం గుర్తింపు ఉపకరిస్తుందని భావించి దానిని ఆశ్రయిస్తున్నారు. ఇక్కడి చాలామంది ముస్లింలు తమను తాము పునర్నిర్వచించుకుంటున్నారు. గతంలో ఇక్కడి ముస్లింలు భోజ్‌పురి, హిందీ, మైథిలీ, నేపాలీ భాషల్లో మాట్లాడేవారు. కానీ, ఇప్పుడు వారు తమది ఉర్దూ భాష అని చెప్తున్నారు. నేపాల్ ముస్లింలు తమ పండుగలను గతం కంటే ఘనంగా చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో చూస్తే ముస్లిం యువత ఒవైసీ, జకీర్ నాయక్ పట్ల ఆకర్షితులవుతున్నారు’ అన్నారు చంద్రకిశోర్ ఝా.

నేపాల్‌లో రాజరికాన్ని సమర్థించేవారు, హిందూత్వ రాజకీయాలను సమర్థించేవారు ఒకటేనని ఆ దేశ మాజీ విదేశీ వ్యవహారాల మంత్రి ప్రదీప్ గ్యావాలి అన్నారు. నేపాల్‌లో హిందూత్వ రాజకీయాలు బలపడితే అది దేశ సార్వభౌమత్వానికి ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)