కేశవానంద భారతి: ఈ ఆధ్యాత్మిక గురువును ‘రాజ్యాంగ రక్షకుడు’ అని ఎందుకన్నారంటే

ఫొటో సోర్స్, TWITTER/CHOUHANSHIVRAJ
రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు రావడానికి దారితీసిన పిటిషన్ వేసిన వ్యక్తి ఆధ్యాత్మిక గురువు కేశవానంద స్వామి. కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో ఎడనీర్ మఠాధిపతి ఆయన.
కేశవానంద భారతి పేరు భారత చరిత్రలో ఒక కీలక ఘటనతో ముడిపడి ఉంది. ఐదు దశాబ్దాల కిందట మఠం ఆస్తుల విషయంలో ఆయన వేసిన కేసు రాజ్యాంగ మౌలిక స్వరూపం, దాని సంరక్షణ బాధ్యతలపై స్పష్టత రావడానికి కారణమైంది.
ఏప్రిల్ 24, 2023 నాటికి ఆ కేసు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ తీర్పుకు సంబంధించిన రాత ప్రతులతో ఒక ప్రత్యేక వెబ్‌పేజ్‌ను రూపొందించింది.
ఇప్పటికే ఆ కేసును అనేక ఇతర కేసుల పరిష్కారంలో ప్రాతిపదికగా తీసుకుంటుంటాయి కోర్టులు.
"కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" గా ప్రసిద్ధి గాంచిన ఈ కేసులో రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను, మౌలిక స్వరూపాన్ని మార్చలేమని, దేశ అత్యున్నత న్యాయస్థానం వాటి రక్షణ బాధ్యతను నిర్వర్తిస్తుందని సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది.

ఫొటో సోర్స్, OFFICIAL TWITTER HANDLE OF KERALA GOVERNOR
సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ఏమిటి?
కేరళ ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణల చట్టాలను సవాలు చేస్తూ ఎడనీర్ మఠాధిపతి కేశవానంద భారతి సుప్రీంకోర్టుకు వెళ్లారు.
ఆయన ఆశ్రమానికి చెందిన 400 ఎకరాలలో 300 ఎకరాల భూమిని జప్తు చేసి రైతులకు కౌలుకు ఇచ్చారు.
ఈ సందర్భంలో భూసంస్కరణలకు సంబంధించి రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చిన 29వ సవరణను సవాలు చేస్తూ కేశవానంద భారతి పిటిషన్ వేశారు.
"భూసంస్కరణల పేరుతో రాజ్యాంగంలోని 25వ ఆర్టికల్‌ను అనుసరించి మత ధార్మిక సంస్థలకు ఇచ్చిన హక్కులను లాక్కున్నారు" అని లాయర్ భట్ ఈ అంశంపై తన అభిప్రాయాన్ని తెలిపారు.
కేరళ శంకరాచార్యులుగా పిలిచే కేశవానంద భారతి రాజ్యాంగం హక్కులను చట్టపరంగా సవాలు చేశారు.
ఆయనతో పాటు మరికొందరు కూడా ఇదే అంశంపై పిటిషన్ వేశారు.
ఈ కేసు మూలంగా రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలను, మౌలిక సిద్ధాంతాలను మార్చే హక్కు పార్లమెంట్‌కు ఉందా లేదా అనే ప్రశ్న ముందుకు వచ్చింది.
మఠానికి కాదు గానీ ప్రజలకు లాభం చేకూరింది
ఈ కేసులో కేశవానంద భారతికి విజయం లభించలేదు గానీ రాజ్యాంగం విషయంలో పార్లమెంటుకున్న అధికారాల పట్ల ఒక ముఖ్యమైన నిర్ణయం వెలువడింది.
68 రోజులపాటూ కొనసాగిన ఈ కేసు విచారణ అనంతరం ఎస్.ఎం.సిక్రీ అధ్యక్షతన 13 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఒక చరిత్రాత్మక తీర్పుని వెలువరించింది.
ఆ తీర్పు ఏమిటంటే... రాజ్యంగ సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందిగానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం మాత్రం లేదు. రాజ్యాంగం ఆత్మను మార్చే వీలు లేదు.
ఈ తీర్పు ద్వారా భారతదేశానికి రాజ్యాంగం ఎంత అవసరమో, ఎంత ముఖ్యమో సుప్రీం కోర్టు తెలియజెప్పింది.
న్యాయ సమీక్ష, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, స్వేచ్చాయుత ఎన్నికలు...మూల స్తంభాలుగా రాజ్యాంగం రూపొంచించారు. ఈ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంట్‌కు లేదని స్పష్టం చేశారు.
"ఈ కేసు మూలంగా కేశవానంద భారతి పేరు దేశవ్యాప్తంగా పరిచయమైంది. ఆయనకు లాభం కలుగలేదుగానీ ప్రజలకు మేలు జరిగింది" అని లాయర్ భట్ అన్నారు.
విదేశీ చట్టాలకూ ప్రేరణ
'కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' కేసులో నిర్ణయం విదేశాల్లో కూడా చట్టపరమైన తీర్పులకు స్ఫూర్తినిచ్చింది.
‘లైవ్ లా’ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం భారతదేశంలో ఈ తీర్పు వెలువరించిన 16 ఏళ్ల తరువాత...బంగ్లాదేశ్‌లో 'అన్వర్ హుస్సేన్ చౌదరీ వర్సెస్ బంగ్లాదేశ్' కేసులో రాజ్యాంగం మౌలిక సిద్ధాంతాలకు పెద్ద పీట వేశారు.
బెలీజ్ దేశంలో అటార్నీ జనరల్ బెర్రీ ఎం బోవెన్ కేసు తీర్పు విషయంలో కూడా 'కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' తీర్పు ఆధారంగా ప్రాథమిక సూత్రాలకు గౌరవాన్ని ఇస్తూ అక్కడి కోర్టు తీర్పునిచ్చింది.
ఆఫ్రికా దేశాలైన కెన్యా, యుగాండా, సీషెల్స్ లాంటి దేశాలు కూడా 'కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' తీర్పు నుంచి స్ఫూర్తి పొందాయి.
కేశవానంద భారతి 2020 సెప్టెంబర్ 6న మరణించారు.
ఇవి కూడా చదవండి:
- లాక్డౌన్ ఎఫెక్ట్: ఏపీలో ప్రజలకు కరెంటు బిల్లుల షాక్... అదనపు భారం వేయలేదంటున్న ప్రభుత్వం
- కరెంట్ లేనప్పుడు సెల్‌ఫోన్ చార్జ్ చేయడమెలా?
- చైనా యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది... తరువాత ఏంటి?
- చైనా యాప్స్ బ్యాన్‌తో అయోమయంలో పడిన టిక్‌టాక్ స్టార్ భవితవ్యం
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం - ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








