సూడాన్ అంతర్యుద్ధం: రాజధానిలో రోడ్లపై శవాలను పీక్కుతింటున్న కుక్కలు

గ్రాఫిక్స్
    • రచయిత, ఈథర్ షలబీ
    • హోదా, బీబీసీ న్యూస్

హెచ్చరిక: ఈ కథనంలో కలవరపరిచే దృశ్యాలు, అంశాలు ఉన్నాయి.

(గోప్యత దృష్ట్యా కథనంలోని వారి పేర్లను మార్చాం. )

శవాలను ఇంట్లోని నేల కింద, గుమ్మానికి కొన్ని మీటర్ల దూరంలోనే పాతిపెట్టాల్సిన పరిస్థితులు సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లో ఏర్పడినట్లు ఒమర్ చెప్పారు.

అక్కడ జరుగుతున్న తీవ్ర యుద్ధమే ఇలా చేయడానికి కారణమని ఆయన తెలిపారు. మరణించిన 20 మందిని వారి ఇళ్లలోని నేలలో, గుమ్మానికి దగ్గరలో తానే స్వయంగా పాతిపెట్టినట్టు వెల్లడించారు.

ఇంటి తలుపు తెరవగానే రోడ్డుపై ఉన్న మృతదేహాన్ని వీధి కుక్కలు పీక్కు తినడం లాంటి దృశ్యాలు కనిపించడం ఇక్కడ అసాధారణం కాదని ఆయన చెబుతున్నారు.

‘‘నేను ముగ్గురిని వారి సొంత ఇళ్లలోనే పాతిపెట్టాను. మిగిలిన వారిని నేను నివసించే ప్రదేశానికి సమీపంలోని రహదారి ప్రవేశమార్గం వద్ద పూడ్చేశాను.

మా పొరుగున ఉండే ఒక వ్యక్తిని అతని ఇంట్లోనే చంపేశారు. ఆయన ఇంట్లోని సిరామిక్ టైల్స్‌ను తొలగించి, గొయ్యి తవ్వి అతనిని పాతిపెట్టడం తప్ప నేనేం చేయలేకపోయాను’’ అని ఒమర్ వివరించారు.

సైనికుని మృతదేహం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఏప్రిల్ 15న హింసాత్మక ఘటనలు ఉధృతం అవుతున్నప్పుడు ఒక సైనికుడి మృతదేహం వీధిలో పడి ఉండగా, మరో సైనికుడు రక్షణ కోసం ఒక భవనం వెనుక నిల్చున్నారు

‘రాజధానిలోని కొన్ని ప్రాంతాలు శ్మశానాలుగా మారుతున్నాయి’

ఆర్మీ, పారామిలిటరీ మధ్య తీవ్ర పోరాటాలు జరుగుతున్న సమయంలోనూ, కాల్పుల విరమణ సమయంలోనూ స్నైపర్స్ అంతా ఇంటి పైకప్పులపైనే ఉంటారు.

ఈ హింస కారణంగానే ఒమర్‌తో పాటు ఇతరులు కూడా శవాలను శ్మశానాలకు తరలించలేకపోతున్నారు.

‘‘వేడిలో శవాలను అలాగే రోడ్లపై వదిలేశారు. వాటి గురించి నేనేం చెప్పగలను? ఖార్టూమ్‌లోని కొన్ని ప్రాంతాలు శ్మశానాలుగా మారుతున్నాయి’’ అని ఆయన చెప్పారు.

ఖార్టూమ్‌లోని అల్ ఇంతిదాద్ జిల్లాలో ఒమర్ ఉంటారు.

మూడు వారాల క్రితం తన ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో ఉండే ఒక రోడ్డు కింద గొయ్యి తవ్వి ఒమర్ నలుగురిని పాతిపెట్టారు. తన చుట్టుపక్కల ప్రాంతాల్లో శవాలను ఇలాగే పాతిపెట్టిన ఇతర వ్యక్తుల గురించి కూడా తనకు తెలుసని అని ఆయన చెప్పారు.

‘‘చనిపోయిన వారిలో చాలా మందిని ఖార్టూమ్ యూనివర్సిటీ సమీపంలో పాతిపెట్టారు. ఈ యూనివర్సిటీ సెడాన్ ఫ్యూయల్ స్టేషన్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇతర శవాలను మొహమెద్ నగుబ్ రోడ్డుకు సమీపంలో ఉండే పరిసర ప్రాంతాల్లో పూడ్చారు’’ అని ఒమర్ తెలిపారు.

ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో పాతిపెట్టిన వారికి సంబంధించిన అధికారిక లెక్కలు లేవని ఆయన అంటున్నారు. పదుల సంఖ్యలో ఇవి ఉండొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.

గ్రాఫికల్ రిప్రంజేటేషన్
ఫొటో క్యాప్షన్, ప్రజలు నివసించే ఇళ్లకు దగ్గరగా లేదా ఇళ్లలోనే సమాధులు తవ్వి శవాలను పాతిపెడుతున్నారు

'వారి శవాలను పూడ్చిపెట్టాక నాకు నిద్ర పట్టలేదు'

హమీద్ కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నారు. ఒక మిలిటరీ జెట్ కూలిపోవడంతో మరణించిన ముగ్గురు సైనికులను తాను ఖార్టూమ్‌కు 12 కి.మీ దూరంలో ఉన్న షాంబాట్ నగరంలోని ఒక మతపరమైన ప్రాంతంలో సమాధి చేసినట్లు ఆయన బీబీసీతో చెప్పారు.

‘‘నేను ఆ ప్రాంతంలోనే ఉన్నా. జెట్ శిథిలాల నుంచి మరో అయిదుగురితో కలిసి నేను శవాలను బయటకు తీశాను. వారిని నివాస భవనాలు ఉండే ఒక ప్రాంతంలో పాతిపెట్టాం’’ అని హమీద్ తెలిపారు.

20 ఏళ్లుగా అదే ప్రాంతంలో నివసిస్తున్న హమీద్ వృత్తిరీత్యా ప్రాపర్టీ ఏజెంట్. మరణించినవారిని వీలైనంత త్వరగా పాతిపెట్టడం అనేది ‘‘దయతో చేసే పని’’గా ఆయన భావిస్తారు.

‘‘చనిపోయినవారిని ఎక్కడ పాతిపెడతామన్నది ముఖ్యం కాదు. వారిని వదిలేయకుండా పాతిపెట్టడం ముఖ్యం. ఇది ధార్మికమైన పని. వారిని శ్మశానాల వరకు తీసుకెళ్లడానికి రోజుల సమయం పట్టొచ్చు. పైగా స్నైపర్లు ప్రతీ చోటా ఉంటారు.

సమాజం ఆరోగ్య విపత్తు బారిన పడకుండా సహాయం చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. మృతదేహాలను అలాగే వదిలేస్తే వేడి కారణంగా అవి చాలా త్వరగా కుళ్లిపోతాయి. వీధి జంతువులు వాటిని తింటాయి. ఇది ఒక మతపరమైన, నైతిక బాధ్యత.

తీవ్రంగా కాలిపోయిన ముగ్గురి మృతదేహాలను నేను పూడ్చిపెట్టాను. ఆ దృశ్యాలను మర్చిపోలేకపోతున్నా. అది నాపై చాలా ప్రభావం చూపింది. తినలేకపోయాను. నిద్రపోలేకపోయాను’’ అని హమీద్ తన అనుభవాన్ని వివరించారు.

డాక్టర్ అటియా అబ్దుల్లా

ఫొటో సోర్స్, Preliminary Committe of Sudan Doctor's Trade Union

ఫొటో క్యాప్షన్, అనధికారికంగా శవాలను పాతిపెట్టడాన్ని సూడాన్ డాక్టర్స్ ట్రేడ్ యూనియన్ సెక్రటరీ జనరల్ డాక్టర్ అటియా అబ్దుల్లా అటియా ప్రశ్నిస్తున్నారు

‘నిజాన్ని సమాధి చేస్తున్నారు’

యుద్ధ నేరాల ప్రాసిక్యూషన్‌లో అనుభవం ఉన్న డాక్టర్ల సంఘం అధ్యక్షుడు ఒకరు శవాలను ఇలా బహిరంగ ప్రదేశాల్లో, ఇళ్లలో పాతిపెట్టడాన్ని తప్పుబట్టారు.

ఇలా చేయడం వల్ల నిజాలు సమాధి అవ్వొచ్చని సూడాన్ డాక్టర్స్ ట్రేడ్ యూనియన్ ప్రిలిమినరీ కమిటీ సెక్రటరీ జనరల్ డాక్టర్ అబ్దుల్లా అటియా హెచ్చరించారు.

క్లెయిమ్ చేయని మృతదేహాలను పూడ్చి పెట్టడం వల్ల వారు ఎలా మరణించారో తెలుసుకునేందుకు పనికొచ్చే సాక్ష్యాలు, ఆధారాలు మట్టిలో కలిసిపోతాయని ఆయన అన్నారు.

‘‘యుద్ధం ముగిసిన తర్వాత, మరణాలకు కారణాలు ఏంటి? మరణించిన వ్యక్తుల గుర్తింపు ఏంటి? దోపిడీ ఘటనల్లో ఎవరెవరు చనిపోయారు? సమస్యల కారణంగా ఎవరు చనిపోయారు? అనే ప్రశ్నలు పుట్టుకొస్తాయి. ఈ ప్రశ్నలన్నీ అంతర్యుద్ధానికి కారణం ఏంటో మనకు తెలియజేస్తాయి. మృతదేహాలను ఇలా పాతిపెట్టడం వల్ల సమాధానాలు కూడా వాటితోనే సమాధి అవుతాయి’’ అని ఆయన వివరించారు.

మృతదేహాలు ఎవరివో గుర్తించి, సకాలంలో గౌరవప్రదంగా సమాధి చేయాలని డాక్టర్ అటియా అన్నారు.

ప్రజలు శవాలను పాతిపెట్టే ప్రక్రియను ఆరోగ్య అధికారులకు, రెడ్‌క్రాస్ సంస్థకు, సూడాన్ రెడ్ క్రెసెంట్ వారికి వదిలేయాలని ఆయన సూచించారు.

‘‘ఈ విధంగా ఖననం చేయడం సరికాదు. ఖననం చేసేటప్పుడు ప్రాసిక్యూషన్, ఫోరెన్సిక్ నిపుణులు, రెడ్‌క్రాస్, ప్రభుత్వ అధికారులు ఉంటారు. మృతదేహాల డీఎన్‌ఏ శాంపుల్స్‌ను సేకరించడం చాలా కీలకం’’ అని ఆయన వివరించారు.

సూడాన్ అంతర్యుద్ధం

ఫొటో సోర్స్, Reuters

అంతర్జాతీయ ఒత్తిడి తేవాలంటున్న వైద్యులు

శాంతి భద్రతలు కుప్పకూలిన దేశంలో ఖననం సమయంలో ఇలాంటి పద్ధతులు పాటించడం వీలవుతుందని మీరెలా అనుకుంటున్నారని డాక్టర్ అటియాను బీబీసీ ప్రశ్నించింది.

ఇందులో విదేశాలు జోక్యం చేసుకోవాలని ఆయన బదులిచ్చారు.

‘‘యుద్ధాన్ని ఆపేలా ఇరు వర్గాలపై అంతర్జాతీయ ఒత్తిడి ఉండాలి. ఇది చాలా ముఖ్యం. రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ వంటి సంస్థలనే మనం నిందించకూడదు’’ అని ఆయన చెప్పారు.

భవిష్యత్తులో మృతదేహాలను గుర్తించడంలో సహాయకంగా ఉండేందుకు, ఖననం చేసే ముందు మృతదేహాల ముఖాలను, శరీరాలను ఫోటో తీస్తున్నట్లు ఒమర్, హమీద్ చెప్పారు.

కానీ, ఇలా మృతదేహాలను పాతిపెట్టేవారు భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవచ్చని డాక్టర్ అటియా అన్నారు.

‘‘ఖననం చేసేందుకు వారికి ఎవరూ అనుమతి ఇవ్వలేదు. అధికారిక మరణ ధ్రువీకరణ పత్రాలు కూడా జారీ కాలేదు. ఇక్కడ చట్టపరమైన ప్రశ్నలు ఎదురవుతాయి’’ అని ఆయన హెచ్చరించారు.

సురక్షితం కాని పద్ధతుల్లో శవాలను పాతిపెట్టడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సూడాన్ ప్రజలకు సరిగ్గా గొయ్యి తీసి నేలలో ఒక మీటరు లోతులో శవాలను ఖననం చేసే ప్రక్రియ గురించి బాగా తెలుసునని హమీద్ చెప్పారు.

డాక్టర్ మగ్దాలిన్ యూసఫ్ ఘలీ

ఫొటో సోర్స్, Khartoum State Ministry of Health / Facebook

ఫొటో క్యాప్షన్, డాక్టర్ మగ్దాలిన్ యూసఫ్ ఘలీ

పరిష్కారం అదేనా?

డాక్టర్ అటియా విమర్శిస్తున్నప్పటికీ, ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోవడంతో శవాల ఖననం విషయంలో తమ ముందు మరో దారి లేదని వారు భావిస్తున్నారు.

సూడాన్‌కు చెందిన ఇద్దరు మహిళా డాక్టర్లు మగ్దోలిన్, మగ్దా యూసెఫ్ ఘలీలను వారి గార్డెన్‌లోనే ఖననం చేయడానికి సంబంధించిన వీడియోలు మే 11న సోషల్ మీడియాలో వ్యాప్తి చెందాయి.

తన ఇద్దరు సోదరీమణులను ఇంట్లో పాతిపెట్టడమే ఏకైక పరిష్కారంగా తోచిందని వారి సోదరుడు ఫోన్‌లో బీబీసీతో చెప్పారు.

‘‘మరణించిన తర్వాత 12 రోజుల పాటు వారిని అలాగే వదిలేశారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు పొరుగువారు గుర్తించారు. వారే స్వచ్ఛందంగా గార్డెన్‌లో తీసిన ఒకే సమాధిలో ఇద్దరినీ ఖననం చేశారు’’ అని ఆయన కన్నీటితో చెప్పారు. గోప్యత కోసం ఆయన పేరును బీబీసీ వెల్లడించడం లేదు.

రోజూ అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న భయానక పరిస్థితుల గురించి ఆయన చెప్పారు.

‘‘నా తోడబుట్టినవారు ఇద్దరూ గార్డెన్‌లో ఒకే సమాధిలో ఖననం అయ్యారు. ఇలా వారు జీవితాలను ముగిస్తారని నేనెప్పుడూ ఊహించలేదు’’ అంటూ ఆయన కన్నీరుమున్నీరయ్యారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)