సూడాన్‌: అక్కడ ఏం జరుగుతోంది? ప్రపంచ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి?

ఆర్‌ఎస్‌ఎఫ్ బలగాలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఆర్‌ఎస్‌ఎఫ్ బలగాలు

సూడాన్... ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ జనాభా ఉండే ఈ దేశం గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది.

భారతదేశం కూడా కంగారుగా ఆ దేశం వైపు చూస్తోంది. అక్కడ ఉండే భారతీయులను తీసుకురావడానికి విమానాలు, ఓడలను సిద్ధం చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి?

అసలు సూడాన్ దేశం ఎక్కడ ఉంది? అక్కడ ఏం జరుగుతోంది?

సూడాన్ అంటే?

సూడాన్ అనేది ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం. ఈజిప్టుకు దక్షిణాన ఉండే ఈ దేశం జనాభా సుమారు 4.79 కోట్లు.

విస్తీర్ణం: 18,86,068 చదరపు కిలోమీటర్లు.

భాషలు: అరబిక్, ఇంగ్లిష్

ప్రపంచంలోని అతి పేద దేశాల్లో సూడాన్ కూడా ఒకటి. సూడాన్‌లో మెజారిటీ ప్రజలు ముస్లింలే. ఆ దేశంలోని 4.60 కోట్ల మంది ఏడాదికి సగటున రూ.61,000 మాత్రమే సంపాదిస్తారు. అంటే సగటు రోజూ వారీ సంపాదన రూ.167.

మ్యాపు

ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోంది?

కొద్ది రోజులుగా సూడాన్‌లో తుపాకుల మోత మోగుతోంది. రెండు వర్గాలుగా విడిపోయిన సైనిక కమాండర్లు అధికారం కోసం ఒకరి మీద మరొకరు దాడులు చేసుకుంటున్నారు. ఏప్రిల్ 15న తాజా ఘర్షణలు మొదలయ్యాయి.

ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 413 మంది చనిపోయారని ప్రపంచఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది.

సూడాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సూడాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్

ఎవరు ఎవరితో పోరాడుతున్నారు?

సూడాన్ సాధారణ మిలిటరీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్‌ఎస్‌ఎఫ్) అని పిలిచే పారామిలిటరీ బలగాల మధ్య ఆధిపత్యం కోసం పోరాటం నడుస్తోంది.

సూడాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదా?

2021లో సూడాన్ సైన్యం తిరుగుబాటు చేసింది. నాటి నుంచి అక్కడ సైనిక ప్రభుత్వమే పాలన సాగిస్తోంది. సైనిక జనరల్స్ సభ్యులుగా ఉండే కౌన్సిల్ అధికారం చెలాయిస్తోంది.

జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దాగలూ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దాగలూ

ఈ అంతర్యుద్ధంలో కేంద్రంగా ఉన్న వ్యక్తులు ఎవరు?

సూడాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్ కనుసన్నలలో మిలిటరీ కౌన్సిల్ నడుస్తోంది. సూడాన్‌కు ఒకరకంగా ఆయనే దేశాధినేత.

ఇప్పుడు సైన్యంలోని మరొక టాప్ కమాండర్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దాగలూ తిరుగుబాటు చేశారు. ఆయనను అందరూ హమేటీ అని పిలుస్తుంటారు. దేశంలో అత్యంత బలమైనదిగా చెప్పే ఆర్‌ఎస్‌ఎఫ్‌ బలగాలకు ఆయన నాయకత్వం వహిస్తున్నారు.

ఇప్పుడు జనరల్ అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్, హమేటీల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది.

విభేదాలు ఎందుకు వచ్చాయి?

సూడాన్‌ భవిష్యత్తు మీద జనరల్ అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్‌ నిర్ణయాలు హమేటీకి నచ్చలేదు.

ఆర్‌ఎస్‌ఎఫ్‌ బలగాను సాధారణ సైన్యంలో విలీనం చేసే విషయం మీద హమేటీ, జనరల్ అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్ మధ్య విభేదాలు వచ్చాయి.

సుమారు లక్ష మంది ఉండే ఆర్‌ఎస్‌ఎఫ్‌ను సైన్యంలో విలీనం చేసిన తరువాత ఏర్పడే శక్తివంతమైన సైన్యానికి ఎవరు నాయకత్వం వహించాలి అనేది వివాదంగా మారింది.

దీంతో ఎన్నికలు జరిపి ప్రజాస్వామ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మిలిటరీ కౌన్సిల్ చేసుకోవాల్సిన ఒప్పందాలు కూడా వాయిదా పడ్డాయి.

2021లో జరిగిన సైనిక తిరుగుబాటు తప్పు అని హమేటీ చెబుతున్నారు. తాను, ఆర్‌ఎస్‌ఎఫ్ ప్రజల వైపున ఉన్నామని చూపించుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారు.

మరోవైపు ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రభుత్వానికి మాత్రమే పూర్తి అధికారులు బదలాయిస్తామని జనరల్ బుర్హాన్ చెబుతున్నారు. అలా జరిగితే తమ ఆస్తులు, అధికారాలు ఏమవుతాయోననే ఆందోళన కొందరు సైనిక అధికారుల్లో మొదలైంది.

ఘర్షణ ఎలా మొదలైంది?

ఇద్దరు సైనిక నేతల మధ్య విభేదాల నేపథ్యంలో పోయిన వారం ఆర్ఎస్‌ఎఫ్ బలగాలు దేశవ్యాప్తంగా మోహరించాయి. దీన్ని ప్రమాదంగా సూడాన్ సైన్యం భావించింది.

చర్చల వల్ల వివాదం సద్దుమణుగుతుందని చాలా మంది భావించారు. కానీ అలా జరగలేదు.

చివరకు ఏప్రిల్ 15 తెల్లవారు జామున సూడాన్ సైన్యం, ఆర్‌ఎస్ఎఫ్ బలగాల మధ్య పోరు మొదలైంది. దేశ రాజధాని ఖార్తుమ్‌తో పాటు అనేక ప్రాంతాల్లో ఘర్షణలు ప్రారంభమయ్యాయి.

తుపాకులు పట్టకున్న వ్యక్తులు

ఫొటో సోర్స్, Getty Images

ఆర్‌ఎస్‌ఎఫ్ బలగాల చరిత్ర ఏంటి?

2013లో ఆర్‌ఎస్ఎఫ్ మొదలైంది. సూడాన్‌ అంతర్యుద్ధంలో భాగంగా డార్‌ఫూర్‌లో ప్రభుత్వ బలగాల తరపున జంజావీడ్ అనే మిలీషియా పోరాడింది. ఈ మిలీషియా నుంచి పుట్టుకొచ్చిందే ఆర్‌ఎస్‌ఎఫ్.

ఆ ప్రాంతంలో మానవహక్కులను హరించడంతోపాటు కొన్ని జాతులను లేకుండా చేసేందుకు ఆర్‌ఎస్ఎఫ్ ప్రయత్నించిందనే ఆరోపణలు ఉన్నాయి.

హమేటీ నాయకత్వంలోని ఆర్‌ఎస్‌ఎఫ్ బలగాలు యెమెన్, లిబియా అంతర్యుద్ధాలలోనూ జోక్యం చేస్తుకున్నాయి. సూడాన్‌లోని చాలా వరకు బంగారం గనుల మీద కూడా హమేటీ ఆధిపత్యం సాధించారు.

ఐఎన్‌ఎస్ సుమేధ

ఫొటో సోర్స్, Indian Navy/Facebook

ఫొటో క్యాప్షన్, ఐఎన్‌ఎస్ సుమేధ

చిక్కుకు పోయిన భారతీయులు

సూడాన్‌లోని పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా సైనిక ఘర్షణలు జరుగుతున్నాయి. సుమారు 60 లక్షల జనాభా ఉండే దేశ రాజధాని ఖార్తుమ్‌ మీద సూడాన్ ఎయిర్‌ ఫోర్స్ వైమానిక దాడులు చేస్తోంది.

దీంతో అనేక మంది ప్రజలు ఘర్షణల్లో చిక్కుకుపోయారు. ఖార్తూమ్‌లో అనేక దేశాల దౌత్యకార్యాలయాలు ఉన్నాయి. అక్కడ భారతీయులతో పాటు అనేక దేశాల పౌరులు పని చేస్తున్నారు.

భారత ఎంబసీ ప్రకారం, సూడాన్‌లో సుమారు 1500 మంది భారత సంతతి ప్రజలు స్థిరపడ్డారు. అలాగే ప్రస్తుతం ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో సుమారు 3,000 మంది భారతీయులు చిక్కుకు పోయారు.

వారిని సురక్షితంగా బయటకు తరలించడానికి అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్టు వంటి దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత్ తెలిపింది. అలాగే సౌదీ అరేబియాలోని జెడ్డా విమానాశ్రయంలో రెండు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు ఉంచగా సూడాన్ పోర్టుకు ఐఎన్‌ఎస్ సుమేధాను పంపినట్లు వెల్లడించింది.

అమెరికా, బ్రిటన్ దేశాలు ఇప్పటికే తమ దౌత్యసిబ్బందిని బయటకు తరలించాయి. ఇతర దేశాలు కూడా ప్రయత్నాలు ప్రారంభించాయి.

ఇవి కూడా చూడండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)