ఆ దేశం నిండా బంగారమే... అది వరం అనుకుంటే శాపంగా మారిందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రెడేసియన్
- హోదా, బీబీసీ ముండో
తూర్పు ఆఫ్రికా దేశం సూడాన్‌లో హింస చెలరేగుతోంది. విధ్వంసకర ఘర్షణల్లో ఇక్కడ180 మందికిపైగా మరణించారు. 1800 మందికిపైగా గాయపడ్డారు.
పారా మిలిటరీ దళం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) సభ్యులు, సైన్యానికి మధ్య దేశ రాజధాని ఖార్టూమ్‌తోపాటు కొన్ని ఇతర ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్నాయి.
ఏప్రిల్ 2019లో ఒమర్ అల్ బషీర్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత మొదలైన రాజకీయ పోరాటాలు, ఉద్రిక్తతలు, సంక్షోభాలు నానాటికీ తీవ్రమై నేడు ఘర్షణలుగా మారాయి.
కౌన్సిల్ ఆఫ్ జనరల్స్ పాలనలో ఉన్న సూడాన్‌లో ఇద్దరు మిలిటరీ నాయకుల మధ్య ఎలాంటి చర్చలూ లేకపోవడమూ ఈ సంక్షోభానికి ఒక కారణం.
వీరిలో ఒకరు ప్రస్తుత సూడాన్ అధ్యక్షుడు, సైన్యాధిపతి అబ్దెల్ ఫత్తా అల్ బుర్హాన్. రెండో వ్యక్తి మొహమద్ హమ్దాన్ డగాలో. ఈయనను అందరూ హెమెడ్తీగా పిలుస్తారు. ఆర్ఎస్ఎఫ్‌కు చీఫ్‌గా హెమెడ్తీ కొనసాగుతున్నారు.
సూడాన్‌లో ఈ అంతర్యుద్ధం వెనుక అన్ని కారణాల్లోనూ ఒక అంశం ప్రధానంగా కనిపిస్తుంది. అదే ఆఫ్రికా ఖండంలోని భారీ బంగారం నిల్వలున్న ప్రాంతాల్లో ఈ దేశం కూడా ఒకటి.
ఒక్క 2022లోనే సూడాన్ ప్రభుత్వం 2.5 బిలియన్ డాలర్లు (రూ.20,511 కోట్లు) విలువైన 41.8 టన్నుల బంగారాన్ని విదేశాలకు ఎగుమతి చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్ఎస్ఎఫ్ చేతిలో
భారీగా బంగారాన్ని వెలికితీసే చాలా గనులు ప్రస్తుతం హెమెడ్తీ నేతృత్వంలోని ఆర్ఎస్ఎఫ్ నియంత్రణలో ఉన్నాయి. సూడాన్‌లో మాత్రమే కాదు పొరుగునున్న దేశాల్లోని బంగారాన్ని తవ్వి తీసి విక్రయించడంలోనూ ఆర్ఎస్ఎఫ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.
‘‘చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సూడాన్‌కు బంగారం గనులు ప్రధాన ఆదాయ వనరుగా మారాయి’’ అని సూడాన్ వ్యవహారాల నిపుణుడు షెవిట్ వోల్డెమైఖేల్.. బీబీసీతో చెప్పారు.
‘‘ఇక్కడ అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆర్‌ఎస్ఎఫ్ ఆదాయ వనరుల్లో బంగారం ప్రధాన పాత్ర పోషిస్తోంది. సైన్యానికి ఈ విషయంలో చాలా సందేహాలు, ప్రశ్నలు వెంటాడుతున్నాయి’’అని ఆయన చెప్పారు.
మరోవైపు భారీగా గనులు తవ్వడంతో పరిసర ప్రాంతాల్లో విధ్వంసకర పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇక్కడ గనుల పైకప్పులు కూలి చాలా మంది మరణిస్తున్నారు. మరోవైపు మెర్క్యురీ, ఆర్సెనిక్‌ల లోహాలతో పరిసరాలు కాలుష్యం అవుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
బంగారమే కారణమా?
బ్రిటిష్ పాలన నుంచి 1956లో సూడాన్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తర్వాత దేశంలోని ప్రాంతాల సరిహద్దుల సర్దుబాటులో చాలా వివాదాలు చెలరేగాయి.
దేశానికి అప్పట్లో ప్రధానంగా చమురు తవ్వకం నుంచే ఆదాయం వచ్చేది. అయితే, 1980ల నాటికి దక్షిణ ప్రాంతాల్లో స్వాతంత్ర్యం కోసం ఉద్యమం మొదలైంది. ఇది తీవ్రరూపం దాల్చింది. దీంతో 2011లో రిపబ్లిక్ ఆఫ్ సౌత్ సూడాన్ ఏర్పడింది.
సౌత్ సూడాన్ ఏర్పాటుతో చమురు తవ్వకాల నుంచి వచ్చే ఆదాయం మూడింట రెండొంతులను సూడాన్ కోల్పోయింది.
ఆదాయం తగ్గిపోవడంతో సూడాన్‌లోని భిన్న జాతులు, మిలీషియాలు, సాయుధ సంస్థల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మొదలయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
2012లో వెలుగులోకి...
ఉత్తర సూడాన్‌లోని జేబెల్ అమీర్‌గా పిలిచే ప్రాంతంలో దేశ ఆర్థిక ఇబ్బందులను గట్టెక్కించే బంగారం నిల్వలున్నట్లు 2012లో బయటపడింది.
‘‘ఆ బంగారాన్ని సూడాన్‌కు దేవుడిచ్చిన వరంలా చూసేవారు. ఎందుకంటే దక్షిణ సూడాన్ ఏర్పాటుతో వీరు చాలా ఆదాయం కోల్పోయారు’’అని బీబీసీతో టఫ్ట్స్ యూనివర్సిటీలోని సూడాన్ వ్యవహారాల నిపుణుడు అలెక్స్ డీ వాల్ చెప్పారు.
‘‘కానీ, ఆ వరమే కొంత కాలానికి శాపంలా మారింది. ఎందుకంటే దీనిపై నియంత్రణ కోసం భిన్న సంస్థలు, మిలీషియాలు ఘర్షణలకు దిగడం మొదలుపెట్టాయి’’అని డీ వాల్ చెప్పారు.
ఆ గనుల్లో బంగారముందని తెలిసిన తర్వాత, లక్షల మంది యువత ఆ ప్రాంతానికి తరలివెళ్లినట్లు స్థానిక రికార్డులు చెబుతున్నాయని డీ వాల్ తెలిపారు.
‘‘అలా వెళ్లిన వీరిలో కొందరు బంగారంతో ధనవంతులు అయ్యారు. మరికొందరు గనుల పైకప్పులు కూలి మరణించారు. మరికొందరు మెర్క్యురీ, ఆర్సెనిక్‌ల కాలుష్యంతో మరణించారు’’అని ఆయన చెప్పారు.
2021లో వెస్ట్ కోర్డోఫాన్ ప్రావిన్స్‌లో ఒక బంగారం గని పైకప్పు కుప్పకూలి 31 మంది మరణించారు. ఈ ఏడాది మార్చి 31న కూడా మరో గని పైకప్పు కుప్పకూలి 14 మంది చనిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
2020లో బంగారం గనుల పరిసరాల్లోని నీటి నమూనాలకు సూడాన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరీక్షలు నిర్వహించింది. దీంతో ఇక్కడ మెర్క్యురీ 2004 పీపీఎం, ఆర్సెనిక్ 14.23 పీపీఎం ఉన్నట్లుగా తేలింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం, మెర్క్యురీ 1 పీపీఎం, ఆర్సెనిక్ 10 పీపీఎంలకు మించకూడదు.
‘‘నీటిలో ఈ లోహాలు కలిసిపోవడంతో ఈ సమస్య ఒక ఆరోగ్య విపత్తులా మారింది’’అని ఖార్టూమ్‌లోని బాహ్రీ యూనివర్సిటీలో ఎన్విరాన్‌మెంట్ లా ప్రొఫెసర్ ఎల్ జైలి హమౌదా సాలేహ్ చెప్పారు.
‘‘సూడాన్‌లో 40,000కుపైగా బంగారం గనులున్నాయి. ఇక్కడ దాదాపు 60 బంగారాన్ని శుద్ధిచేసే సంస్థలు పనిచేస్తున్నాయి. దక్షిణ కోర్డోఫాన్‌లోనూ 15 సంస్థలు పనిచేస్తున్నాయి. ఇక్కడ ఎవరూ పర్యావరణ నిబంధనలు పాటించడం లేదు’’అని ఆయన అన్నారు.
మరోవైపు ఇక్కడ జాత్యహంకార ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. అల్ బషీర్‌కు నమ్మినబంటుగా చెప్పుకునే గిరిజన నాయకుడు మూసా హలీల్ నేతృత్వంలో ఇక్కడ చెలరేగిన ఆ ఘర్షణల్లో 800 మందికిపైగా మరణించారు.
ఆ ఘర్షణల తర్వాత హలీల్ కొన్ని ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకొని అక్కడ బంగారాన్ని తవ్వితీయడం మొదలుపెట్టారు. ఈ బంగారాన్ని ఖార్టూమ్‌లోని ప్రభుత్వంతోపాటు భిన్న సంస్థలకు కూడా ఆయన విక్రయించేవారు.
2017లో హలీల్‌పై ప్రజల ఊచకోత ఆరోపణలు వచ్చాయి. ఆయనను సూడాన్ ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలకు అప్పగించింది. అప్పట్లో హలీల్‌కు మద్దతుగా నిలిచిన హెమెడ్తీ.. ఆ బంగారు గనులను తన నియంత్రణలోకి తీసుకున్నారు.
అప్పట్లో కేవలం బంగారం నుంచి వచ్చే ఆదాయం దేశం మొత్తం ఎగుమతుల్లో 40 శాతం వరకూ ఉండేది.
‘‘ఆ బంగారమే దేశంలోని ప్రధాన నాయకుల్లో ఒకరిగా హమెడ్తీ నిలిచేలా చేసింది. మరోవైపు చాద్, లిబియా సరిహద్దులపైనా ఆయన నియంత్రణ సాధించారు’’అని డీవాల్ చెప్పారు.
ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఎప్పుడు?
అయితే, 2019లో ఒమర్ అల్ బషీర్ ప్రభుత్వం సైన్యం తిరుగుబాటుతో కుప్పకూలింది. అప్పుడు రెండు సాయుధ బలగాల నియంత్రిస్తున్న హమెడ్తీ, అల్ బుర్హాన్‌ల చేతుల్లోకి దేశం వెళ్లింది.
‘‘బంగారం గనులపై నియంత్రణ, 70,000 మంది జవాన్లు, 10,000 ట్రక్కులతో ఆర్‌ఎస్ఎఫ్ దేశాన్ని నడిపించే స్థాయికి వెళ్లింది. ఖార్టూమ్‌తోపాటు ఇతర నగరాలను నియంత్రించే శక్తి కేవలం ఆర్‌ఎస్ఎఫ్‌కే ఉండేది’’అని డీ వాల్ చెప్పారు.
అయితే, 2021లో అంతర్యుద్ధానికి ముగింపు పలికి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటుచేస్తామని ఇద్దరు నాయకులూ ప్రకటించారు.
‘‘ఆ కూటమి ఒప్పందంలో భాగంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి బంగారు గనుల నియంత్రణను అప్పగించాలని ఇద్దరు నాయకులూ నిర్ణయించారు. కానీ, హమెడ్తీ అధికారం నానాటికీ పెరుగుతుండటంతో ఆర్‌ఎస్ఎఫ్‌పై అల్ బుర్హాన్ వర్గాల్లో అనుమానం పెరిగింది’’అని వోల్డెమైఖెల్ చెప్పారు.
అయితే, ఉత్తర సూడాన్‌లో బంగారం గనులను తమ నియంత్రణలోకి తీసుకునేందుకు వీరిద్దరితోపాటు చాలా మంది ప్రయత్నిస్తున్నారు.
‘‘దీంతో శాంతి, భద్రతల నియంత్రణకు ఆర్ఎస్ఎఫ్ బాధ్యతలను కూడా తమకు అప్పగించాలని అల్ బుర్హాన్ నేతృత్వంలోని సైన్యం కోరుతోంది. కానీ, దీనికి హమెడ్తీ అంగీకరించడం లేదు’’అని వోల్డెమైఖెల్ వివరించారు. అయితే, తాజా హింసాత్మక ఘర్షణల వెనుక మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
‘‘ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారో తెలియదు. రెండు వైపులా మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో దేశవిదేశాల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. దీంతో రెండు వర్గాలు చర్చలకు వచ్చే అవకాశముంది’’అని ఆయన అంచనా వేశారు.
ఇవి కూడా చదవండి:
- స్వధార్ గృహ: కష్టాల్లో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచే ఈ పథకం ఎలా పని చేస్తుంది?
- ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం పదే పదే ఎందుకు మాట మారుస్తోంది...
- రామప్ప ఆలయం: ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఈ గుడి ప్రత్యేకతలేంటి
- సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను అనుమతిస్తుందా, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఆశ ఏంటి?
- సూడాన్‌లో ఏం జరుగుతోంది? మిలిటరీ, పారా మిలిటరీ మధ్య యుద్ధం ఎందుకు?
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















