హైదరాబాద్ బిర్యానీ, పిస్తా హౌజ్ హలీమ్‌లను వందల కిలోమీటర్ల దూరం ఎందుకు పంపుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోయా మతీన్, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
బిర్యానీ ప్రియులకు బిర్యానీపై ఉండే ఇష్టానికి హద్దులు ఉండవు.
బిర్యానీ అంటే పడి చచ్చిపోయే వారిలో దిల్లీలో నివసించే అనిరుధ్ సురేశన్ కూడా ఒకరు.
ఆ ఇష్టంతోనే ఆయన వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ నుంచి బిర్యానీని ఆర్డర్ చేశారు. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్ అనే మాట కొత్తగా చెప్పక్కర్లేదు.
బిర్యానీతో పాటు లఖ్‌నవూ నుంచి తుండే కబాబ్స్, కోల్‌కతా నుంచి బెంగాలీ స్వీట్లను కూడా ఆర్డర్ చేశారు.
అయితే, ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.
‘‘బిర్యానీ ఏమాత్రం బాలేదు. బిర్యానీకి రుచిని అందించే ఏ పదార్థం కూడా అందులో లేదు. కబాబ్స్ కూడా అంతే. కోల్‌కతా నుంచి వచ్చిన ఆ స్వీట్ల కంటే దిల్లీ స్వీట్ షాపుల్లోని స్వీట్లు ఇంకా చాలా బాగుంటాయి’’ అని అనిరుధ్ నిరాశ వ్యక్తం చేశారు.
జొమాటో ఇంటర్‌సిటీ లెజెండ్స్ ద్వారా వేల మైళ్ల దూరం నుంచి తమకు ఇష్టమైన ఆహారాన్ని తెప్పించుకుంటున్న వేలాదిమంది భారతీయుల్లో సురేశన్ కూడా ఉన్నారు.
ఈ సేవలు అందించడం కోసం జొమాటో సంస్థ 10 నగరాల్లోని 120 ప్రఖ్యాత రెస్టారెంట్లతో జతకట్టింది.
వివిధ నగరాల్లో ప్రసిద్ధి పొందిన వంటకాలను విమానాల ద్వారా 24 గంటల్లో జొమాటో డెలివరీ చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
జొమాటో ఆగస్టులో ప్రయోగాత్మకంగా ఈ సర్వీసును మొదలుపెట్టింది. తొలుత దక్షిణ దిల్లీతో పాటు గురుగ్రామ్ వాసులకు ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.
ఆ తర్వాత బెంగళూరు, ముంబయి సహా ఆరు నగరాలకు ఈ సేవలను విస్తరించింది.
డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ సర్వీసును దేశవ్యాప్తంగా అందించాలని భావిస్తోంది.
‘‘ రెండు విధాలుగా మా వినియోగదారుల అవసరాలను తీర్చడమే మా లక్ష్యం. ఒకటి, దూరంగా ఉండేవారికి తమ సొంత ఊర్లకు చెందిన ఆహారాన్ని తిరిగి అందించడం. రెండోది, దేశవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత ఆహార పదార్థాలను ప్రతీ ఒక్కరికి చేరువ చేయడం. ఈ లక్ష్యంతోనే ఈ సర్వీసును ప్రారంభించాం’’ అని జొమాటో ఇంటర్‌సిటీ లెజెండ్స్ బాధ్యతలు చూస్తున్న కమయాని సాధ్వానీ అన్నారు.
అనిరుధ్ తరహాలోనే ఈ సర్వీసును ప్రయోజనకరంగా భావించిన మరో తొమ్మిది మందితో బీబీసీ మాట్లాడింది.
కస్టమర్ల స్పందన తమ అంచనాలకు మించిపోయిందని సాధ్వాని అన్నారు.
‘‘మేం ఈ సర్వీసును మొదలుపెట్టినప్పుడు ఇది ఖర్చుతో కూడినది, విలాసవంతమైనదని అనుకున్నాం. కానీ, కాలక్రమేణా ఇది విలాసవంతమైనదేమీ కాదనే భావన మాకు వచ్చింది’’ అని గతేడాది బిజినెస్ స్టాండర్డ్‌తో జొమాటో గ్లోబల్ గ్రోత్ ఉపాధ్యక్షుడు సిద్ధార్థ్ ఝావర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జొమాటో 2008లో ఏర్పడింది. అప్పటినుంచి అనేక ప్రయోగాలు చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటూ భారత ఆహార మార్కెట్ నుంచి లాభాలను పొందుతోంది.
కానీ, వేలమైళ్ల దూరానికి బిర్యానీని రవాణా చేయడం చిన్న విషయమేమీ కాదు.
ప్రయాణంలో ఆహారాన్ని సురక్షితంగా ఉంచడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని జొమాటో చెప్పింది.
ఆహారం పాడవ్వకుండా కాపాడటానికి టాంపర్ ప్రూఫ్ బాక్సులతో పాటు, అత్యుత్తమైన మొబైల్ రిఫ్రిజిరేషన్ ప్రక్రియను వాడతామని తెలిపింది.
‘‘జొమాటో ఇంటర్‌సిటీ సర్వీస్ ఒక సంచలనం సృష్టించింది. మా ఉత్పత్తులను ఫేమస్ చేసింది. మాకు దేశంలోని నలుమూలల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి’’ అని కోల్‌కతాలో ప్రసిద్ధి చెందిన ‘‘బలరామ్ ముల్లిక్, రాధారామన్ ముల్లిక్ స్వీట్స్’’ డైరెక్టర్ సుదీప్ ముల్లిక్ అన్నారు.
జొమాటో ఇంటర్‌సిటీ సర్వీస్ ద్వారా సుదీప్ ముల్లిక్ ప్రధానంగా తమ ప్రత్యేకతలైన రసగుల్లా, సందేశ్, టెండర్ ఫడ్జ్‌లను అమ్ముతారు. వాటిని ప్రత్యేక బాక్సుల్లో పెట్టి దూర ప్రాంతాలకు రవాణా చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
కస్టమర్ల నుంచి తమకు సానుకూల స్పందనలు వస్తున్నాయని ఇతర రెస్టారెంట్లు కూడా చెప్పాయి.
‘‘ఇది చాలా బాగుంది. ఈ మధ్య మేం ఒకరోజే 800 బాక్సుల వంటకాలను డెలివరీ చేశాం’’ అని హైదరాబాద్‌లోని పిస్తా హౌస్ మేనేజింగ్ డైరెక్టర్ షోయబ్ మొహమ్మద్ తెలిపారు.
బిర్యానీ, హలీమ్‌లకు హైదరాబాద్‌లోని పిస్తా హౌస్ చాలా ఫేమస్.
వారాంతాల్లో ఒకే రోజు సగటున 100కు పైగా ఆర్డర్లను డెలివరీ చేస్తున్నట్లు, ఆ ఆర్డర్లలో ఎక్కువగా దిల్లీ, ముంబయి నుంచే వస్తున్నట్లు షోయబ్ చెప్పారు.
రవాణాలో ఇబ్బందుల దృష్ట్యా దేశవ్యాప్తంగా ఈ సేవను దీర్ఘకాలం అందించడంపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, ANKIT SRINIVAS
‘‘ఆహారంపై భారతీయులకు ఉన్న ఇష్టం ప్రకారం చూస్తే ఈ ఆలోచన చాలా గొప్పది. కానీ, సుదూర రవాణా, కోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటివి ఖర్చు పరంగా జొమాటోకు తీవ్ర భారంగా మారాయి’’ అని జర్నలిస్ట్ సోహిని మిట్టర్ అన్నారు.
అన్నింటికి మించి హోటల్‌కు వెళ్లి తిన్న అనుభవం ఇంట్లో నుంచి తింటే కలుగుతుందా?
‘‘కంటైనర్లలో చల్లటి వాతావరణంలో రవాణా చేసిన ఆహారంతో, హోటల్‌లో కూర్చొని వేడి వేడిగా తిన్నప్పుడు కలిగే మ్యాజిక్ వస్తుందని నేను అనుకోను. ఆ ఆహారం తినడానికి అనువుగానే ఉండొచ్చు కానీ, దాని రుచి, టెక్చర్ పోతుంది’’ అని మిట్టర్ అన్నారు.
ఇదే విషయంతో సురేశన్ కూడా ఏకీభవిస్తున్నారు.
‘‘హైదరాబాద్‌లో షాదాబ్ హోటల్ ఉన్న ఏరియాలో నుంచి నడుస్తున్నప్పుడు వంద అడుగుల దూరం నుంచే మసాలా వాసన, మాంసం వాసన ఆకట్టుకుంటుంది.
అక్కడే జనాల మధ్య కూర్చొని వేడి వేడిగా బిర్యానీ తింటే ప్రతీ ముద్దలో ఆ ఫ్లేవర్ నాలుకకు తగులుతుంది. అంతేకాకుండా సాలన్, రైతా అంటూ రకరకాల సైడ్ డిష్‌లు కూడా తాజాగా ఇస్తారు’’ అని అనిరుధ్ సురేశన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- స్వధార్ గృహ: కష్టాల్లో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచే ఈ పథకం ఎలా పని చేస్తుంది?
- ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం పదే పదే ఎందుకు మాట మారుస్తోంది...
- రామప్ప ఆలయం: ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఈ గుడి ప్రత్యేకతలేంటి
- సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను అనుమతిస్తుందా, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఆశ ఏంటి?
- సూడాన్‌లో ఏం జరుగుతోంది? మిలిటరీ, పారా మిలిటరీ మధ్య యుద్ధం ఎందుకు?
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















