ఆంధ్రప్రదేశ్‌లో మామిడి దిగుబడి ఎందుకు తగ్గుతోంది? ఉపాధిపై ఎలా దెబ్బ పడుతోంది?

మామిడి
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

మామిడిపండ్ల సాగు, దిగుబడిలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండేది. అప్పుడు కూడా తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే దాదాపుగా రెట్టింపు మామిడి సాగు చేసేవారు.

తెలంగాణలో వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ వంటి కొన్ని ప్రాంతాల్లోనే మామిడి పంట ఉంది. కానీ ఏపీలో మాత్రం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ మెజార్టీ జిల్లాల్లో మామిడి సాగవుతోంది.

2014 జూన్‌లో రాష్ట్ర విభజన తర్వాత మామిడి పంటలో ఏపీని వెనక్కి నెట్టి ఉత్తర్ ప్రదేశ్ ముందంజలో ఉందని అగ్రికల్చర్ అండ్ ప్రోసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ డెవలప్ మెంట్ అథారిటీ (ఎపెడా) గణాంకాలు చెబుతున్నాయి.

సాగు విస్తీర్ణం, దిగుబడి రెండింటిలోనూ యూపీదే మొదటి స్థానం. ఆంధ్ర ప్రదేశ్ రెండో స్థానంలో ఉంటే, కర్ణాటక, తెలంగాణ, బిహార్, గుజరాత్ వంటివి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మామిడిపళ్ల ఉత్పత్తిలో మొదట ఉండే ఏపీ వెనుకబాటుకి విభజనతో పాటుగా ఇతర అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఏటేటా మారుతున్న పరిస్థితులకు తోడుగా వాతావరణ అననుకూలత కారణంగా దిగుబడి తగ్గుతోంది.

అదే సమయంలో సాగు విస్తీర్ణం కూడా కుచించుకుపోతోంది. ఇతర పంటల వైపు మొగ్గు చూపేవారి సంఖ్య పెరుగుతోంది. దీనికితోడు రియల్ ఎస్టేట్ వంటి కారణాలతో మామిడి తోటలు తొలగించి వెంచర్లు వేసే పరిస్థితి వస్తోంది.

పడిపోతున్న మామిడి దిగుబడుల కారణంగా ఎగుమతుల మీద ఆధారపడిన మార్కెట్లు గతంతో పోలిస్తే కళతప్పుతున్నాయి. మార్కెట్ల మీద ఆధారపడిన కార్మికులు కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తోంది.

మామిడి

లెక్కలేం చెబుతున్నాయి?

ప్రపంచంలోనే మామిడిపళ్ల ఉత్పత్తిలో భారత్‌ది మొదటిస్థానం. కేంద్ర ప్రభుత్వ హార్టీకల్చర్ బోర్డు లెక్కల ప్రకారం 2022లో దేశంలో ఉత్పత్తయిన మామిడిలో 16.07 శాతం ఏపీ నుంచి ఉత్పత్తి అవుతోంది. తెలంగాణ నుంచి 8.54 శాతం మామిడి వస్తోంది. ఉత్తరప్రదేశ్ 23.06 శాతం ఉత్పత్తి చేస్తోంది.

ఏపీ ప్రభుత్వ ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం 2021-22లో రాష్ట్రంలో 4.03 లక్షల హెక్టార్లలో మామిడి పంట ఉంది. దాని నుంచి 59.06 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి జరిగింది. అరటి తర్వాత అత్యధిక దిగుబడులు సాధించిన పంట ఇదే.

అరటితోపాటు మామిడి దిగుబడుల్లో కూడా ఏపీ మొదటి స్థానంలో ఉందని ఏపీ అధికారులు చెబుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ లెక్కలు దానికి భిన్నంగా ఉన్నాయి.

రాష్ట్ర విభజన నాటితో పోలిస్తే ఏపీ ప్రభుత్వ అధికారిక లెక్కల్లో కూడా దిగుబడి తగ్గింది. అనేక చోట్ల రైతాంగం మామిడి తోటల స్థానంలో ఇతర పంటల వైపు మొగ్గుచూపుతున్నారు.

కొన్ని భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తున్నారు. వ్యవసాయదారులు ముఖ్యంగా వయసు మళ్లిన మామిడి తోటలను తొలగించి, వాటి స్థానంలో జీడి, సపోటా వంటి పంటలను ఆశ్రయిస్తున్నట్టు రైతులు అంటున్నారు. రియల్ ఎస్టేట్ అవసరాల కోసం కూడా భూమిని మళ్లిస్తున్న అనుభవాలు ఎక్కువగా ఉన్నాయి.

మామిడి

బంగినపల్లికే డిమాండ్

మామిడి పంట ఎక్కువగా ఎగుమతుల మీద ఆధారపడి సాగు చేస్తారు. ఎగుమతులకు డిమాండ్ ఉన్న పంటలకే ధర పలుకుతుంది. అందులో ఏపీలో పండించే ముఖ్యంగా బంగినపల్లి, సువర్ణరేఖ, తోతాపురి వంటి రకాలకు మార్కెట్ ఉంటుంది.

చిన్న రసాలు, పెద్ద రసాలు, నీలం వంటి రకాల్లో పెద్దగా ఎగుమతికి అవకాశం ఉండదని నున్న మార్కెట్‌లో ఎగుమతిదారు త్రిమూర్తులు బీబీసీకి తెలిపారు.

"ఈ ఏడాది పంట దిగుబడి తగ్గింది. వడగళ్ల వానలు, రకరకాల వైరస్‌లు అందుకు కారణం. చెట్టు మీద ఉండగానే మామిడి కాయ పురుగుపడుతోంది. దాంతో పండు కాకముందే అవి పనికిరాకుండా పోతున్నాయి. దాంతో దిగుబడి బాగా తగ్గింది. అందులోనూ ఎగుమతికి ఎక్కువ అవకాశం ఉన్న బంగినపల్లికి మాత్రమే మంచి ధర ఉంది. ప్రస్తుతం టన్నుకి రూ. 32వేల వరకూ ఉంది. ఈ ధర రైతుకి గిట్టుబాటు అవుతుంది. కానీ మార్కెట్ నిలబడాలి. ఇతర రకాలకు కూడా ధర రావాలి" అంటూ ఆయన వివరించారు.

మామిడి

మామిడి కన్నా అవే మేలు

మామిడి ఏటా వేసవి సీజన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మూడు నెలల పాటు పంట ఉంటుంది. సరిగ్గా ఆ సమయానికి వాతావరణం అనుకూలించకపోతే పంట నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో వచ్చే ఈదురుగాలులు, వర్షాల భయం మామిడి రైతులను వెంటాడుతూ ఉంటుంది. దానికి ముందు మంచు ఎక్కువగా కురవడం, వర్షాలు సకాలంలో కురవకపోవడం వంటి అననుకూల పరిస్థితులు మామిడి రైతులను వేధిస్తూఉంటాయి.

"మామిడి పండించినా పెద్దగా లాభాలుండడం లేదు. పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఇటీవల అనేక వైరస్‌ల కారణంగా పంట దెబ్బతింటోంది. దాంతో నష్టాలు చూడలేక ఇతర పంటలకు మళ్లుతున్నారు. అనేక అవస్థలు పడుతూ పండించినా, తీరా చేతికొచ్చేవేళ వడగళ్లు పడడం, ఈదురుగాలులు వెంటాడుతాయి. అంతా టెన్షన్‌గా ఉంటుంది. జీడి తోటలు వేస్తే కొంత ధీమాగా ఉంటుంది. సపోటా అయితే ఏడాదిలో ఏడెనిమిది నెలలు దిగుబడి ఉంటుంది. అందుకే మేము పంట మార్చేశాము" అని అంటున్నారు కృష్ణా జిల్లా ఆగిరపల్లికి చెందిన రైతు జీతం శ్రీనివాస్.

తమ ప్రాంతంలో మామిడి స్థానంలో పామాయిల్ సాగు పెరిగిందని ఆయన బీబీసీకి తెలిపారు.

మామిడి

రియల్ ఎస్టేట్ ఒత్తిడి

విజయవాడ సమీపంలోని నున్న మార్కెట్ మామిడిపళ్లకు ప్రసిద్ధి. సీజన్‌లో మార్చి నెలాఖరు నుంచి మూడు నెలల పాటు కళకళలాడుతూ ఉండేది. పెద్ద సంఖ్యలో దుకాణాలు, ఎగుమతి కోసం వచ్చిన భారీ లారీలు, కూలీలతో మార్కెట్ సందడిగా ఉండేది.

ఈసీజన్ లో అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. గడిచిన రెండు సీజన్ల నుంచి కూడా అంతంతమాత్రంగానే కనిపిస్తోంది.

నున్న సమీపంలో ఉన్న మామిడితోటను తొలగించడం అందుకు ఓ కారణం.

అధికారిక లెక్కల ప్రకారం నున్నలో 2010 నాటికి 1240 హెక్టార్లలో మామిడి సాగు ఉండేది. కానీ ప్రస్తుతం అది 940 హెక్టార్లకే పరిమితమయ్యింది. అందులో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ విస్తరించిందని స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మారిన రైతు వెంకటేశ్వర రావు అన్నారు.

"మాతోట తీసేశాం. వెంచర్ వేశాం. చుట్టు పక్కల చాలా అపార్లమెంట్లు వచ్చేశాయి. మా భూమికి డిమాండ్ వచ్చింది. మామిడితోటలో వచ్చే ఆదాయంతో పోలిస్తే ఇదే ఎక్కువ కావడంతో అందరూ వెంచర్లు వేస్తున్నారు. ఇంకా విస్తరిస్తాయి. తోటలు తగ్గిపోవడంతో పాటుగా నున్న మార్కెట్‌కి పోటీగా చిన్న చిన్న మార్కెట్లు కూడా పెరిగాయి. అందుకే నున్న మామిడి మార్కెట్‌కు గతంతో పోలిస్తే సరకు తక్కువగా వస్తోంది" అంటూ ఆయన బీబీసీకి వివరించారు.

నున్న మార్కెట్ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు మామిడి ఎగుమతి చేస్తారు. ముఖ్యంగా బిహార్, జార్ఖండ్, దిల్లీ వంటి ఉత్తరాది ప్రాంతాలకు మామిడి తరలిస్తారు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో జోరు కనిపించడం లేదు.

మామిడి చాలావరకు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. 2021-22 లెక్కల ప్రకారం భారత్ నుంచి 27,872.78 మెట్రిక్ టన్నుల మామిడి ఎగుమతి అయ్యింది. ప్రధానంగా యూఏఈ, యూకే, ఖతార్, ఒమన్ వంటి దేశాలకు సుమారుగా రూ 327.45 కోట్ల విలువైన మామిడి ఎగుమతి అయ్యింది.

నున్న మార్కెట్ నుంచి కరోనాకి ముందు సగటున 200 లారీలు ఎగుమతి జరిగేది. ఈ సీజన్‌లో 30 లారీలు మాత్రమే వెళుతున్నాయని మార్కెట్‌లో వ్యాపారులు చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, మామిడి నోరూరిస్తోందా... ఆరోగ్యం జాగ్రత్త

సేద్య పద్ధతులపై అవగాహన పెరగాలి

ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పటికీ అకాల వర్షాలు కొంత నష్టాలకు కారణంగా మారినట్టు ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. రైతుల్లో మామిడి సేద్య పద్ధతుల పట్ల అవగాహన పెరగాలని హార్టీకల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ వాసిరెడ్డి ప్రభాకర్ రావు అన్నారు.

"సగటున ఎకరాకు 7 టన్నుల వరకూ దిగుబడి వస్తుంది. ఈ ఏడాది మధ్యస్తంగా ఉంది. సేద్య పద్ధతుల మీద అవగాహన లేకపోవడం వల్ల సశ్యరక్షణ పేరుతో ఎక్కువగా రసాయనాలు వాడుతున్నారు. దానివల్ల మామిడి పూత, పిందె దశలో రాలిపోతున్నాయి. అలాంటి వాటి మీద అవగాహన పెంచుకోవడం, ఏటా మామిడి తోటలకు నీటి సదుపాయం కల్పించడం వంటి చర్యల ద్వారా దిగుబడులు పెంచుకునే అవకాశం ఉంది. మామిడి దిగుబడులు తగ్గుతున్న దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి రైతులకు అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోందని" ఆయన వివరించారు.

ఏటా వేసవి కాలంలో మామిడి తోటలు, ఎగుమతులతో పాటు మామిడి ఉప ఉత్పత్తులు తాండ్ర సహా వివిధ పరిశ్రమల్లో వేలాదిగా ఉపాధి పొందుతున్నారు.

ఏపీలో మామిడి ఎగుమతులు క్రమంగా తగ్గుతున్న దృష్ట్యా వారందరికీ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఇప్పటికే నున్న సహా వివిధ మామిడి మార్కెట్లో ఉపాధి కోల్పోయిన వందల మంది భవన నిర్మాణ కార్మికులుగానూ, ఇతర పనుల్లోకి మళ్లినట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, అవకాడో: ఇవి పండ్లు కాదు.. పచ్చ బంగారం..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)