తెలంగాణ: కోతుల మూకుమ్మడి దాడి కారణంగా వృద్ధురాలు మృతి, అసలేం జరిగింది?

కోతుల దాడి కారణంగా మృతి చెందిన నర్సవ్వ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కోతుల దాడి కారణంగా మృతి చెందిన నర్సవ్వ
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

కామారెడ్డి జిల్లా రామారెడ్డి లో కోతుల గుంపు దాడిలో నర్సవ్వ అనే 70 ఏళ్ల వృద్దురాలు మృతి చెందారు. గురువారం ఇంట్లో అన్నం తింటున్న సమయంలో కోతుల గుంపు నర్సవ్వ పై దాడి చేసింది.

ఆ గుంపు నుండి తప్పించుకునే ప్రయత్నంలో కిందపడిపోయిన నర్సవ్వ తలకు తీవ్ర గాయం అయింది. కామారెడ్డి లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన నర్సవ్వ శనివారం రోజు మరణించారు.

కోతుల బెడద

ఫొటో సోర్స్, UGC

శ్రీమంతం కార్యక్రమం కోసం వెళ్తే ఇలా అయింది-నర్సవ్వ కూతురు

నర్సవ్వ కు నలుగురు కుమార్తెలు. చిన్న కూతురు తల్లి దగ్గరే ఉంటున్నారు. నర్సవ్వ అడపదడపా కూలీ పనులకు వెళ్లేవారు.

''ఆరోజు (గురువారం), నా కూతురు శ్రీమంతం కార్యక్రమం కోసం కామారెడ్డి పోయాను. ఇంట్లో అన్నం తినే సమయంలో మా అమ్మ పై కోతులు దాడి చేసాయి. చుట్టుపక్కల వారు వచ్చి చూసే సరికే తీవ్రంగా గాయపడి ఉంది. విషయం తెలిసి పరుగున వచ్చి కామారెడ్డి లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చాను. ఎముకలు విరిగిపోయాయని, ఆపరేషన్ కు 60 వేలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. తీసుకెళ్లిన 10 వేలు అయిపోవడంతో మళ్లీ డబ్బులు తీసుకుని వస్తామని చెప్పి అమ్మ ను ఇంటికి తీసుకొచ్చిన రెండో రోజు ప్రాణం పోయింది'' అని నర్సవ్వ కూతురు సుగుణ బీబీసీతో అన్నారు.

''కోతులు ఇంత పనిచేసినాయి. ఇంకో 10 ఏళ్లైనా మా అమ్మ బతికేది. వేరొకరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు'' అని సుగుణ అన్నారు.

'' కోతులు నేరుగా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. వస్తువులు ఎత్తుకుపోతున్నాయి. మనుషులు కనిపిస్తే దాడి చేసేందుకు వస్తాయి. గ్రామంలో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు కోతుల బారిన ఎక్కువగా పడుతున్నారు'' అని రామారెడ్డి గ్రామానికి చెందిన రాజమణి అనే గృహిణి బీబీసీతో అన్నారు.

కోతుల బెడద నివారణపై గ్రామసభ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కోతుల బెడద నివారణపై గ్రామసభ

తెలంగాణలో కోతులే పెద్ద బెడద

జనావాసాల్లో కోతుల గుంపులు తెలంగాణ పల్లెలు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటిగా మారింది. గతంలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కోతుల సమస్య పరిష్కారం అనేది అభ్యర్థుల మేనిఫెస్టోలో హామీగా చేరింది.

కోతులను కట్టడి చేసిన వారికే మా ఓటు అంటూ కాలనీలు తీర్మానం చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఇన్ని రోజులు స్థానిక సమస్యగా ఉన్న కోతుల గుంపులు ఇప్పుడు దాదాపు రాష్ట్ర సమస్యగా మారినట్లు కనిపిస్తోంది.

గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను చూస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ఇది ప్రధాన సమస్యల్లో ఒకటిగా మారే అవకాశాలున్నాయి.

ఆయా పార్టీలు చేస్తున్న పాదయాత్రల సందర్భంగా వివిధ పార్టీల రాష్ట్ర నాయకత్వాలకు జనాలు చెబుతున్న సమస్యల్లో కోతుల సమస్య ఒకటిగా ఉంటోంది.

కోతులు ఫ్రిజ్‌లు కూడా ఓపెన్ చేసి పదార్ధాలు ఎత్తుకుపోతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కోతులు ఫ్రిజ్‌లు కూడా ఓపెన్ చేసి పదార్ధాలు ఎత్తుకుపోతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.

రామారెడ్డి గ్రామంలో కోతుల బెడద ఎలా ఉందంటే...

కామారెడ్డి జిల్లా కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామారెడ్డి మండల కేంద్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామ జనాభా 8249. ప్రస్తుత జనాభా 14 వేలుగా అంచనా.

రామారెడ్డి మండలకేంద్రంలో కోతులు, కుక్కలు, పందుల సమస్య ఉంది. ప్రధాన కూడళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్టాండ్, స్కూళ్ల వద్ద కోతుల బెడద తీవ్రంగా ఉందని కొంతమంది గ్రామస్తులు బీబీసీ తో అన్నారు.

గ్రామంలో నెలకొన్న కోతుల సమస్య పై రామారెడ్డి గ్రామ సర్పంచ్ దండబోయిన సంజీవ్ బీబీసీ తో మాట్లాడారు.

''నర్సవ్వ ను కోతులు కరవడానికి రాగా, కిందపడి తీవ్రగాయంతో చికిత్స పొందుతూ మరణించింది. గ్రామంలో ప్రశాంతంగా ఉండే వాతావరణం లేదు. వెయ్యి వరకు కోతులు ఉన్నాయి. వీటి సంఖ్య రానురాను పెరుగుతోంది. పీహెచ్‌సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) సిబ్బందిని, పేషంట్‌లను కూడా ఇబ్బంది పెడుతున్నాయి. పొలం పనులకు వెళ్లే రైతులను చుట్టుముడుతున్నాయి. ఈ దాడులు చాలా వరకు జనం దృష్టికి రావు. కోతులు కరిస్తే వాక్సినేషన్ అందుబాటులో లేక చాలామంది నిజామాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది'' అని సర్పంచ్ వివరించారు.

గ్రామంలోని చింతచెట్లను కోతులు ఆవాసంగా చేసుకున్నాయి. కోతుల గుంపుల నివారణకు ఆలోచన చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని గ్రామస్తులు కోరుతున్నారు.

గతంలో అడవిపందులను బెడదను నివారించేందుకు వాటిని చంపేందుకు అనుమతించినట్టు కోతుల నివారణకు కూడా ప్రత్యామ్నాయాలు సూచించాలని కోరుతున్నారు.

''ఈ మధ్య నిర్వహించిన గ్రామసభలో కోతుల నివారణ కు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అటవీ శాఖ సిబ్బందిని అడిగాం. గ్రామస్తులు ఎదుర్కుంటున్న ఇబ్బందులను రాతపూర్వకంగా ఇవ్వాలని ఫారెస్ట్ వారు అడిగారు. గతంలో కుక్కలను పట్టుకుంటే జంతుప్రేమికులతో ఇబ్బందులు ఎదురయ్యాయి. కోతుల ప్రవర్తనతో విద్యుత్ శాఖ సిబ్బందికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. వైర్లు తెంపేస్తుండటంతో కరెంట్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. కోతుల బెడదకు మా గ్రామంలో డీటీహెచ్ (డైరెక్ట్ టు హోమ్) సర్వీసులు అన్నీ మూలన పడ్డాయి'' అని రామారెడ్డి సర్పంచ్ దండబోయిన సంజీవ్ వెల్లడించారు.

ఇక్కడి ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రసారం చేసే టీ-శాట్ ఆన్‌లైన్ పాఠాలకు కూడా కోతుల వల్ల ఇబ్బంది ఏర్పడింది అని దండబోయిన సంజీవ్ అన్నారు.

కోతుల బెడద

ఫొటో సోర్స్, UGC

కోతుల బెడదను తగ్గించాలని నాయకుల పాదయాత్రల్లో డిమాండ్లు

ఇటీవల కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని మన్నెపల్లి, మల్లాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా స్థానిక మహిళలు ఆయనతో మాట్లాడారు.

తమకు సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదని , కోతుల గుంపులను నివారించాలని కొందరు మహిళలు ఆయనను కోరారు. ఇది గ్రామాల్లో నెలకొన్న సమస్యకు అద్దంపడుతోంది.

''మా గ్రామ జనాభా 2500. దాదాపు 800 మంది కోతుల దాడికి గురైనవారు ఉన్నారు. ప్రభుత్వ స్కూల్‌లో విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదు. అందుకే అక్కడి చెట్లను కొట్టివేసాం. ఇప్పటి వరకు 400 కోతులను పట్టిచ్చాం. అయినా సమస్య తీరలేదు. గ్రామం పక్కనే గ్రానైట్ త్వవకాలు, కంకర క్రషర్ నిర్వహణ వల్ల గుట్టల్లో ఉండే కోతులన్నీ మా గ్రామం పై పడుతున్నాయి. మా ఊర్లోకి పండ్లు అమ్మేందుకు వచ్చే వ్యాపారులను ఆగం చేస్తున్నాయి. పొయ్యి మీద ఉన్న వేడి వంట పాత్రలను కూడా వదలడం లేదు. కిరాణా దుకాణాల్లో వ్యాపారం చేయడం కష్టమై దుకాణం చుట్టూ జాలీలు కట్టుకున్నారు. కోతులకు తోడు కుక్కల బెడద కూడా విపరీతంగా ఉంది. గతంలో మాదిరి వాటిని చంపేస్తామంటే కేసులు అవుతాయని ఆఫీసర్లు ఒప్పుకోవడం లేదు'' అని మానకొండూరు నియోజకవర్గం పరిధిలోని మన్నెంపల్లి గ్రామ సర్పంచ్ మేడి అంజయ్య బీబీసీ తో వాపోయారు.

ఇప్పుడు చాలామంది సర్పంచ్ లకు కోతుల సమస్యే ఆయా గ్రామాల్లో ప్రధాన సమస్యగా మారిన పరిస్థితులున్నాయి.

''ఇప్పుడు కోతులు లేని ఊరంటూ లేదు. కూరగాయల సాగు బంద్ చేసి వరి పెట్టుకుంటున్నారు. వరి పంట గొలుసు వేసే దశలో పొలంలో కాపలా లేకపోతే పంటకు నష్టం కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని కుక్కలు, కోతులను జంతు ప్రేమికుల ఇళ్ల వద్ద అప్పజెప్పాలన్నంత కోపం వస్తుంటుంది. కోతులు, కుక్కుల సమస్య గురించి ఆలోచించే నాయకులే లేరు'' అని సర్పంచ్ మేడి అంజయ్య అన్నారు.

ఇటు గ్రామ ప్రజలకు చెప్పుకోలేక, అటు ప్రభుత్వానికి విన్నవించినా సత్ఫలితాన్నిచ్చే చర్యలు లేక సతమతమవుతున్న పరిస్థితి సర్పంచులదని మేడి అంజయ్య వాపోయారు.

తెలంగాణ అటవీ పర్యావరణ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తెలంగాణ అటవీ పర్యావరణ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

కోతుల సమస్య వాస్తవమే- అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

కోతుల సమస్య నివారణ ప్రభుత్వాలకు సవాల్‌గా మారిందని, కోతుల సమస్య తీవ్రంగా ఉన్న మాట నిజమేనని తెలంగాణ అటవీ పర్యావరణ శాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీబీసీతో అన్నారు.

''రాష్ట్రంలో కోతుల సమస్య రానురాను పెరుగుతోంది. ఫ్రిజ్‌లు తెరిచి మరీ ఆహార పదార్థాలు ఎత్తుకుపోతున్నాయి.స్టెరిలైజైషన్ ద్వారా కోతుల సంఖ్యను నియంత్రించేందుకు నిర్మల్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. అయితే తెలంగాణలో నాలుగు దిక్కులా ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. గతంలో అడవి పందుల బెడద నివారణకు వాటిని చంపేందుకు అధికారం ఇచ్చాం. అయితే కోతుల పట్ల జనాల్లో ఒక సెంటిమెంట్ ఉంది'' అని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

కోతుల నివారణ కు అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి అన్నారు. ఇప్పటికే ఒక సబ్ కమిటీ వేసినట్లు ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)