అక్షయ తృతీయ: ఈ రోజు బంగారం కొంటే నిజంగా కలిసొస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
‘అక్షయ తృతీయకు మేం ఇస్తున్నాం అద్భుతమైన ఆఫర్లు.. రండి ఈ రోజున బంగారం కొనుగోలు చేసి ఐశ్వర్యవంతులు కండి..’
టీవీలు, పత్రికల్లో ఊదరగొట్టే ఇలాంటి ప్రకటనలు చూసిన తర్వాతే ‘అరే.. అక్షయ తృతీయ వచ్చేసిందే’ అని అప్పో సొప్పో చేసి అర గ్రాము బంగారమైనా కొనాలని చాలా మంది సిద్ధమైపోతుంటారు.
మరికొందరికైతే అసలు ఆ రోజు బంగారం ఎందుకు కొనాలో తెలీకపోయినా, పక్కింటి వాళ్లు కొంటున్నారనో, ఎదురింటి వాళ్లు వెళ్తున్నారనో.. వాళ్లతో కలిసి జ్యూయెలరీ షాపుకు వెళ్లి బంగారం కొనేస్తారు.
చాలా ఏళ్ల నుంచీ ప్రకటనల జోరు పెరుగుతుండగా, నుంచి అక్షయ తృతీయ సెంటిమెంట్, ఆ రోజున బంగారం కొనేవాళ్ల సంఖ్య కూడా అంతే పెరుగుతూ వస్తోంది.
ఆ మాట కొస్తే జ్యూయెలరీ షాపులు, సంస్థలు ఇలాంటి ప్రకటనలు వచ్చే వరకూ, అసలు చాలా మందికి అక్షయ తృతీయ అనేది ఒకటుందనే విషయమే తెలీదనేది నిజం.
ఇక అదే రోజున అక్షయ తృతీయకూ, బంగారానికి ఏంటి లింకు అని, ఆ రోజున బంగారం కొనాలా, వద్దా అని చర్చలు కూడా బాగానే సాగుతాయి.
అసలు అక్షయ తృతీయ రోజున ఈ సెంటిమెంట్ ఎందుకు ఉంటుంది.
జ్యూయెలరీ షాపుల వాళ్లకు కాసులు కురిపించే అక్షయ తృతీయ, నిజంగానే బంగారం కొన్నవారికి ఐశ్వర్యం తీసుకొస్తుందా.?
అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయాలని ఏ శాస్త్రాల్లోనూ లేదని కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం ఇదంతా కార్పోరేట్ మాయంటున్నారు. మరోవైపు ఈ సెంటిమెంట్ ట్రాష్ అంటారు హేతువాదులు.

ఫొటో సోర్స్, Getty Images
బంగారం కొనాలా..
అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా, వద్దా అనే విషయానికి వస్తే, చేతిలో డబ్బులు ఉంటే బంగారం కొనడానికి దాన్ని ఒక శుభ దినంగా చూస్తున్నారు మహిళలు.
పూర్వీకుల నుంచి వస్తోంది కదా అని కొందరు అంటుంటే, ట్రెండ్‌తో పాటూ మేమూ వెళ్తున్నాం అని మరికొందరు చెబుతున్నారు.
అక్షయ తృతీయ ఏడాదికి ఒకసారి వస్తుంది కాబట్టి, ఆ రోజున బంగారం కొంటే లక్ష్మీ కటాక్షం ఉంటుందని తాను భావిస్తున్నట్లు తిరుపతికి చెందిన మౌనిక చెప్పారు.
‘ఇది, ‘మన పూర్వీకుల నుంచి వస్తోంది. కానీ ప్రజల్లో ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. సింపుల్‌గా చెప్పాలంటే ఒక గ్రామ్ గోల్డ్ కొంటే, దానికి పది రెట్లు ఎక్కువ వస్తుంది అనే విధంగా ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడిపోయింది’’ అన్నారామె.
‘‘అక్షయ అంటే తరగనిది అని అర్థం. ఆ అర్థం వచ్చే రోజున బంగారం కొన్నామంటే, అది అలా వస్తూనే ఉంటుందని నమ్ముతాం కాబట్టే కొంటున్నాం’’ అని మౌనిక చెప్పారు.

మహిళల ఈ నమ్మకమే ఆ రోజున బంగారం అమ్మకాలు జోరందుకునేలా చేస్తోంది.
ఏడాదంతా జరిగే వ్యాపారం ఒక ఎత్తని ఒక ప్రముఖ గోల్డ్ షోరూమ్ చైన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న సురేశ్‌లాంటి వారు చెబుతున్నారు.
మార్కెట్లో జ్యూయెలరీ సెక్టార్లో ఎక్కువ బిజినెస్ వచ్చేది కూడా ఈ సమయంలోనే అంటున్నారు.
‘‘చాలా మంది బంగారమే ఎక్కువగా కొంటారు. మనకు ఇది సెంటిమెంట్. ఈ సంవత్సరం మాకు శని, ఆదివారం రెండు రోజులు రావడం ఇంకా కలిసొచ్చింది.
ఆ రోజున ఏం కొన్నా పది రెట్లు పెరుగుతుందని నమ్మకం ఉంది కాబట్టి, ఆ సెంటిమెంట్‌కు తగ్గట్టు జ్యూయెలరీలో బంగారం అయినా, ఏ రంగంలో అయినా ఎక్కువ బిజినెస్ జరగడం అనేది ఆ రోజే ఉంటోంది’’ అన్నారు.

అక్షయ తృతీయ అంటే?
వైశాఖ మాసం, శుక్ల పక్షం తదియను అంటే ఆ మాసంలో మూడో రోజు అక్షయ తృతీయ అని పురాణాల్లో చెప్పారని, ఆ రోజున ఏం చేసినా శుభం జరుగుతుందని ఉంది కాబట్టే అక్షయ తృతీయను ఒక పండుగలా చెప్పుకుంటారని పండితులు చక్రవర్తి రాఘవన్ బీబీసీతో చెప్పారు.
‘‘మహావిష్ణువు భూమిపై పరుశురాముడిగా అవతరించిన రోజు అక్షయ తృతీయ. అదే రోజున సూర్య భగవానుడు వనవాసం చేస్తున్న పాండవులకు అక్షయపాత్రను అందించాడని మహా భారతంలో ఉంది.
భగీరథుడు శివుడిని ప్రసన్నం చేసుకుని పవిత్ర గంగానదిని భూమిని తాకిన రోజు కూడా ఇదే, అక్షయ తృతీయ రోజునే వ్యాసుడు చెబుతున్న మహాభారతాన్ని వినాయకుడు రాయడం ప్రారంభించాడని చెబుతారు.
శివుడు మహాలక్ష్మీ వ్రతాన్ని విశేషంగా చెప్తూ ప్రార్థించిన దినం కూడా ఇదే. అందుకే, ఆ రోజున బంగారం కొంటే శుభం జరుగుతుంది అని చాలా మంది బంగారం కొంటుంటారు.
భారతీయ సంప్రదాయంలో బంగారానికి చాలా వైభవం ఉంది. బంగారం శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అందుకనే ఆరోగ్య రీత్యా కూడా బంగారం ధరిస్తుంటారు’’అని రాఘవన్ చెప్పారు.

‘కొనాలని ఏ శాస్త్రాల్లోనూ లేదు’
అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని ఏ శాస్త్రాల్లోనూ లేదని కూడా కొందరు పండితులు చెబుతున్నారు.
కార్తె, మూఢాలు లాంటి సమయాల్లో వ్యాపారం సరిగా జరగదని, అందుకే బంగారం వ్యాపారం పెంచుకోడానికి కార్పొరేట్ శక్తులు ఇలా అక్షయ తృతీయను ప్రచారంలోకి తీసుకొచ్చారని పండితులు, వాస్తు జోతిష్యులు వార నరసింహా శర్మ చెప్పారు.
‘‘ఆ రోజున కొన్నది ఏదైనా ఇవ్వమన్నారు. దానం చేయడం కోసం కొనమన్నారు. అక్షయం కోసం దానం చేయమంటే వీళ్ళు దాని రివర్స్ చేసుకుని కొంటే అక్షయం వస్తుందని చెబుతున్నారు.
అక్షయ తృతీయ రోజు కొనాలి అనేది అపోహ. మూఢాచారం. గత 15, 20 సంవత్సరాలుగా ఇది ఎక్కువైంది. ఎప్పుడైతే ఈ గోల్డ్ బిజినెస్ పెద్దదయిందో, వాళ్లు దీన్ని ఉపయోగించుకున్నారు.
కొన్ని సంస్థలు ఏకంగా నెల ముందు నుంచే ఆఫర్లు పెడుతున్నాయి. గతంలో దానాలు చేసే వాళ్లు కానీ ఇప్పుడు కార్పొరేట్ బిజినెస్ కోసం ఇలా చేస్తున్నారు’’అన్నారు శర్మ.
అక్షయ తృతీయ రోజున అసలు బంగారం కొనాలా వద్దా అనే దానిపై స్పష్టత ఇవ్వడంలో పండితుల్లోనే ఏకాభిప్రాయం లేదని నరసింహా శర్మ చెప్పారు.
‘‘అక్షయ తృతీయ రోజు ఎవరైతే బంగారం కొనగలుగుతారో వాళ్లు కొనవచ్చు. అన్నం, వస్త్రం అది ఏ దానం అయినా పుణ్యం వస్తుంది.
అక్షయ తృతీయ రోజున దానం చేస్తే. బంగారం కొంటే పది రెట్లు పెరుగుతాయన్న భావనకు శాస్త్రీయ ఆధారం లేదు. అక్షయ తృతీయకు బంగారం కొనకపోతే వారికి ఐశ్వర్యం ఉండదు అని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. ఎవరైనా అలా చెప్పడం తప్పే అవుతుంది’’ అంటారు పండితులు చక్రవర్తి రాఘవన్.

ఫొటో సోర్స్, Getty Images
‘వ్యాపారుల జిమ్మిక్కు’
అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం లేదా అమ్మడం అనే నమ్మకాలకు సామాజిక కారణాలు ఏమీ లేవని ఇది వ్యాపారులు చేస్తున్న జిమ్మిక్కని హేతువాదులు కొట్టిపారేస్తున్నారు.
అనవసరంగా అప్పులు చేసి, ఆరాటపడి బంగారం కొనాలనుకోవడం చాలా తప్పని, హేతువాద సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
‘‘విద్యావంతులందరూ వివేకవంతులు కాదు అనే విషయం వ్యాపారులకు తెలుసు. అందుకే, వారి ఆ బలహనీతను క్యాష్ చేసుకుంటున్నారు.
రంగురాళ్లు దరిస్తే మీ జాతకాలు, మీ భవిష్యత్తు మారిపోతుందని ఎలా చెబుతారో అలాగే అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే కలిసివస్తుందని చెప్పి జనాల్ని మోసం చేస్తూన్నారు’’ అని ఏఆర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
‘‘ఆ వ్యాపారపు మాయలోపడిన వాళ్ళకి కలిసి వచ్చేదేమీ ఉండడం లేదు. కొనాలనుకుంటే, మీ దగ్గర డబ్బు ఉంటే మిగిలిన వస్తువులు ఎలా కొంటారో అలాగే ఏ రోజైనా కొనుక్కోవచ్చు తప్పులేదు’’ అన్నారాయన .
‘‘ఆ రోజు మాత్రమే కలిసి వచ్చే రోజు అయితే, టన్నులు టన్నులు బంగారం రావాలి కదా, వ్యాపారులకు మనకు ఎందుకు అమ్ముతారు. ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుని ఈ మోసం నుంచి బయట పడాలి’’అన్నారు ఏఆర్ రెడ్డి.
మీడియాలో అక్షయ తృతీయ గురించి విపరీతంగా జరుగుతున్న ప్రచారం వల్లే, ప్రజల్లో ఇలాంటి అపోహలు పెరిగిపోతున్నాయని ఏఆర్ రెడ్డి అంటున్నారు.
‘‘ఇప్పుడు మీడియా ద్యారా వ్యాపారం ప్రజలకు చేరువ అవుతోంది. బిజినెస్ విచ్చలవిడిగా సాగుతోంది. గత కొన్నేళ్ల నుంచీ ఇదే జరుగుతోంది. ఇది అమాయకులైన ప్రజలను మోసం చేయడమే’’ అంటారు డాక్టర్ రెడ్డి.
ఇవి కూడా చదవండి:
- ఇరాక్ వార్@20: సద్దాం పాలనే నయమని సర్వేలో తేల్చిన ప్రజలు
- ‘‘హిందూ మహాసముద్రంలో ఇదొక సముద్రపు శ్మశానవాటిక... కానీ శవాల లెక్క ఉండదు’’
- తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల ఫారాలు ఎందుకు మూతపడుతున్నాయి?
- 72 మంది ముస్లింలను చంపిన కేసులో ఒక్కరినీ పట్టుకోలేకపోయారా, బాధితులు ఏమన్నారు?
- సీక్రెట్ : మనం చెప్పిన అబద్ధాలే మన రహస్యాలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















