స్వలింగ సంపర్కుల పెళ్లిని చట్టబద్ధం చేస్తే వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి?

ఫొటో సోర్స్, EGOMONK
- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతున్న పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.
ఆయా మతాల ‘పర్సనల్ లా’ల జోలికి వెళ్లకుండా ‘స్పెషల్ మ్యారేజ్ యాక్ట్’ కింద స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని తొలిరోజు వాదనల సమయంలో సుప్రీంకోర్టు వివరించింది.
అయితే, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14, 19, 21ల కింద ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి వివాహ హక్కులు కల్పించాలని పిటిషనర్ల తరఫున అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ కోరుతున్నారు.
మతాంతర, కులాంతర వివాహాలను రిజిస్టర్ చేయడానికి ‘స్పెషల్ మ్యారేజ్ యాక్ట్’ను కేంద్రం తీసుకొచ్చింది. దీని కింద వివాహాలను రిజిస్టర్ చేస్తే స్వలింగ సంపర్కుల జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో కొందరు ఎల్‌జీబీటీక్యూ ఉద్యమకర్తలతో బీబీసీ మాట్లాడింది.

ఫొటో సోర్స్, ALEXANDER SANCHEZ/GETTYIMAGES
స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పనిచేస్తున్న ‘సేఫో ఫర్ ఈక్వాలిటీ’ సంస్థ కోఫౌండర్ మీనాక్షి సాన్యాల్ ఈ అంశంపై మాట్లాడుతూ- ‘‘దీన్ని ‘గే మ్యారేజ్ రైట్స్’ కాదు.. ‘మ్యారేజ్ ఈక్వాలిటీ రైట్స్’ అని చెబుతున్నారు. నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు మన సమాజంలో ఉంటే, ఇది అందరికీ ఒకేలా వర్తించాలి’’ అన్నారు.
స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద 30 రోజుల ముందే నోటీసు ఇవ్వాలనే నిబంధనపైనా ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.
‘‘ఇది కేవలం నా పార్ట్‌నర్, నా సమస్య కాదు. నేను రెండు దశాబ్దాలుగా యాక్టివిస్టుగా పనిచేస్తున్నాను. ఈ విషయంలో నాకు చాలా అనుభవముంది. ఇది ఎల్‌జీబీటీక్యూ వర్గాల సమస్య. జెండర్, సెక్సువల్ ఓరియెంటేషన్‌తో సంబంధం లేకుండా అందరికీ ఈ హక్కులు ఒకేలా వర్తించాలి’’ అని ఆమె చెప్పారు.
స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌పై సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద కూడా ఆమె మాట్లాడారు. ‘‘ఆ చట్టంలోనున్న 30 రోజుల నోటీసు పీరియడ్ నిబంధనను తొలగిస్తారా?’’ అని ఆమె ప్రశ్నించారు.
‘‘మేం ఇటీవల కొందరు ఎల్‌జీబీటీక్యూ ప్రతినిధులతో మాట్లాడాం. స్కలింగ సంపర్కులు కావడంతో వారు ఇంటి లోపలా, బయటా చాలా రకమైన వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు పెళ్లికి 30 రోజుల నోటీసు ఇస్తే, ఆ కుటుంబానికి అన్ని విషయాలు తెలుస్తాయి. దీంతో వారు మరింత హింసను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ఆమె చెప్పారు.
అయితే, ఈ 30 రోజుల నోటీస్ పీరియడ్‌ను ‘వ్యక్తిగత గోప్యతా హక్కుల (ప్రైవసీ) ఉల్లంఘన’గా, ఆ జంటల భద్రతకు ముప్పుగా ఏప్రిల్ 20న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, AQABIZ
స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఏమిటి?
ఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం, పెళ్లి చేసుకోవాలనుకునే జంటలు 30 రోజులు ముందుగానే రిజిస్ట్రార్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నోటీసును మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ బయట అతికిస్తారు.
ఈ 30 రోజులలో ఎలాంటి అభ్యంతరాలు ఎదురుకాకపోతే, ఆ పెళ్లిని అనుకున్న తేదీకి రిజిస్టర్ చేస్తారు.
అయితే, ఈ చట్టం అన్ని జెండర్‌లకు ఒకేలా వర్తించదని అడ్వొకేట్ ప్రతీక్ శ్రీవాస్తవ చెప్పారు.
‘‘ఈ చట్టంలోని సెక్షన్ 4సీ ప్రకారం, అమ్మాయి 18 ఏళ్లు, అబ్బాయి 21 ఏళ్లు నిండి ఉండాలని చెబుతోంది. సెక్షన్ 4 లోని నిబంధనలు వర్తించకపోతే ఈ పెళ్లి చెల్లదని కూడా చట్టం చెబుతోంది’’ అన్నారు.
ఈ చట్టంతో ఎదురయ్యే ఇబ్బందులపై ‘హమ్‌సఫర్ ట్రస్టు’ ఫౌండర్ అశోక్ కాక్ కూడా మాట్లాడారు.
‘‘ఇద్దరు భారత వయోజన పౌరుల మధ్య పెళ్లి కోసమే ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. మానసిక నిపుణుల నుంచి కూడా తాము ఆరోగ్యంగా ఉన్నామని వారు ఒక సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.
ఈ చట్టంలో వివాహం అంటే బయోలాజికల్ మేన్, బయోలాజికల్ వుమన్ మధ్య సంబంధంగా చెప్పారు. దీనిపై కూడా కోర్టులో విచారణ జరిగింది. అయితే, ‘‘జెండర్ అనేది చాలా సంక్లిష్టమైనది. ఇక్కడ బయోలాజికల్ మేన్, బయోలాజికల్ వుమన్ అనే నిర్వచనాన్ని వారి మర్మాంగాలకు పరిమితం చేయకూడదు’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి హక్కులు ఉంటాయి?
స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేస్తే వారికి ఎలాంటి హక్కులు వస్తాయనే అంశంపై కొందరు నిపుణులు బీబీసీతో మాట్లాడారు.
‘‘ఏదైనా వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఉంటుంది. ఇక్కడ జీవిత భాగస్వామి (స్పౌస్) లేదా పార్ట్‌నర్‌ను కలిపి కుటుంబంగా చెబుతారు. ఈ కుటుంబంలోని అందరికీ సాధారణ కుటుంబంలో ఉండే హక్కులు వర్తిస్తాయి’’ అని ముంబయికి చెందిన మహిళా హక్కుల ఉద్యమకర్త వీణ గౌడ అన్నారు.
పింఛను, బీమా, గ్రాట్యుటీ, మెడికల్ క్లైమ్స్ లాంటి హక్కులను ఈ సందర్భంగా ఆమె ఉదహరించారు.
బీమా, గ్రాట్యుటీలలో ఇప్పటికే నామినీగా స్పౌస్ లేదా లీగల్ హెయిర్‌ను ఎంచుకునే అవకాశం ఉందని ప్రతీక్ కూడా అన్నారు.
ఒకసారి స్వలింగ సంపర్కుల వివాహానికి ఆమోదం లభిస్తే, పింఛనులో స్పౌస్ స్థానంలో స్వలింగ సంపర్కులకు హక్కులు వచ్చే అవకాశముందని ఆమె వివరించారు.
ఆర్థిక అంశాల్లోనూ వీరికి కొంత సాయం వచ్చే అవకాశముందని, అయితే, ఇక్కడ చట్టాలతో సంబంధంలేని విషయాలు చాలా ఉన్నాయని అశోక్ అన్నారు.
‘‘ఉదాహరణకు తమ జీవిత భాగస్వామి హాస్పిటల్‌లో అనారోగ్యంతో ఉన్నారు అనుకోండి. ఆయనను చూడటానికి ఆయన పార్ట్‌నర్‌ను కుటుంబం అనుమతించదు. అలానే, స్వలింగ సంపర్కులు ఇల్లు అద్దెకు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’’ అని అశోక్ చెప్పారు.

ఫొటో సోర్స్, SOMNATH MAHATA / EYEEM
ఎంత మంది ఉంటారు?
భారత్‌లో ఎల్‌జీబీటీక్యూ వర్గాల ప్రజలు కోట్లలో ఉంటారు. 2012లో వీరి జనాభా 25 లక్షల వరకూ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.
ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం, చాలా దేశాల్లో ఎల్‌జీబీటీక్యూ ప్రజలను సమాజంలో కలుపునే అంశంలో పురోగతి కనిపిస్తోంది. 2014లో దేశంలోని దాదాపు 15 శాతం మంది స్వలింగ సంపర్కులను తమతో కలుపుకుంటామని చెప్పారు. నేడు అది 37 శాతానికి పెరిగింది.
ఒకవేళ స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేస్తే చాలా చట్టాలను సవరించాల్సి రావచ్చని న్యాయవాది సోనాలీ కడవాసరా అన్నారు.
‘‘కుటుంబంలో ఎవరు ఏమిటో (అంటే ఎవరు భర్తో, ఎవరు భార్యో) కూడా పెళ్లి రిజిస్ట్రేషన్ సమయంలోనే వెల్లడించాల్సి కూడా రావచ్చు’’ అని ఆమె చెప్పారు.
ఎలాంటి సవాళ్లు రావచ్చు?
గృహ హింస
‘‘గృహ హింస కేసుల్లో కుటుంబంపై ఫిర్యాదుచేసే హక్కు మహిళలకు ఉంటుంది. ఇక్కడ స్వలింగ సంపర్కుల్లో ఇద్దరూ మహిళలే ఉన్న జంటను తీసుకుంటే, గృహహింస కింద ఎవరు ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవాలనే ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఇద్దరు పురుషులు అయితే, ఇద్దరూ ఫిర్యాదు చేయొచ్చా లేదా ఇద్దరూ చేయకూడదా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది’’ అని సోనాలీ అన్నారు.
మహిళలను గృహహింస నుంచి కాపాడేందుకు ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ యాక్ట్-2005ను కేంద్రం తీసుకొచ్చింది.
ఇక్కడ ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. పెళ్లి తర్వాత, విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే, భరణం ఎవరికి ఇస్తారు? అనే ప్రశ్న మరొకటి.
భరణం ఎవరికి ఇస్తారు?
విడాకుల తర్వాత భర్త నుంచి భార్యకు భరణం ఇచ్చే హక్కును సీఆర్‌పీసీలోని సెక్షన్ 125 కల్పిస్తోంది.
అదే సెక్షన్ కింద తల్లిదండ్రులు కూడా కొడుకు నుంచి మెయింటెనెన్స్‌ను పొందొచ్చు.
అయితే, ఇప్పుడు స్వలింగ సంపర్కుల విషయానికి వస్తే, ఇద్దరూ భరణం కోసం కేసులు వేయొచ్చా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.
పిల్లల దత్తత
అడ్వొకేట్లు వీణ, సోనాలీ ప్రకారం, ఒంటరి మహిళ లేదా ఒంటరి పురుషుడు పిల్లలను దత్తత తీసుకోవచ్చు. ఇక్కడ దత్తత తీసుకునే బిడ్డ, తల్లిదండ్రుల మధ్య 21 సంవత్సరాల తేడా ఉండాలి.
ఈ విషయంలో ఎదురయ్యే సవాళ్లపై వీణ, సోనాలీ మాట్లాడుతూ- ‘‘ఇక్కడ ఇద్దరు స్వలింగ సంపర్క మహిళలకు కేవలం అమ్మాయిలనే దత్తత తీసుకునే అవకాశం కల్పిస్తారా? స్వలింగ సంపర్క పురుషులకు కేవలం అబ్బాయినే దత్తత తీసుకొనేందుకు అనుమతిస్తారా? అనేది చూడాల్సి ఉంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ కుటుంబంలో తండ్రి ఎవరు? తల్లి ఎవరు? అనేది మరో ప్రశ్న’’ అని వారు చెప్పారు.
అయితే, స్వలింగ సంపర్కులకు పిల్లలను దత్తత తీసుకునే సదుపాయం ఇవ్వకూడదని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సీపీసీఆర్) చెబుతోంది.
పిల్లల అభివృద్ధి, సంరక్షణకు అవసరమైన వాతావరణం ఆ కుటుంబాల్లో ఉండక పోవచ్చని కమిషన్ అభిప్రాయపడుతోంది.
పిల్లలను ఎవరికి అప్పగించాలి?
చట్ట ప్రకారం విడాకుల సమయంలో ఐదేళ్ల కంటే తక్కువ వయసుండే పిల్లలను తల్లికి అప్పగిస్తారు. అదే స్వలింగ సంపర్కుల విషయంలో ఎవరికి బిడ్డను అప్పగిస్తారే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది.
ఆస్తి హక్కులు
చట్టాల్లో కుటుంబానికి స్పష్టమైన నిర్వచనాలు ఉన్నాయి. ఇక్కడ తండ్రి లేదా తరతరాల ఆస్తి వారి సంతానానికి వస్తుంది.
ఒకవేళ ఆస్తిని సంరక్షించే వారు ఈ హక్కును ఇచ్చేందుకు నిరాకరిస్తే, కోర్టుకు కూడా వెళ్లొచ్చు.
ఎలాంటి వీలునామా లేకపోతే ఇండియన్ ఇన్‌హెరిటెన్స్ లేదా ఇండియన్ సక్సెషన్ యాక్టును అనుసరించాల్సి ఉంటుంది.
సక్సెషన్ చట్టం ప్రకారం.. ఆస్తిని వారసులు సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్వలింగ సంపర్కుల కుటుంబాలకు వీటిలోని నిబంధనలు ఎలా వర్తిస్తాయి అనేది మరో చిక్కు ప్రశ్న.
ఇవి కూడా చదవండి:
- ఆవు, గేదె పాలే తాగాలా? గాడిద, గుర్రం, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? బీపీ, డయాబెటిస్, ఆటిజం తగ్గించే పాలు ఉంటాయా
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
- భారత్, నేపాల్ మధ్య పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారు?
- అమెరికా: పొరపాటున డోర్‌బెల్ కొట్టినందుకు టీనేజర్ తలపై రివాల్వర్‌తో కాల్పులు
- హీట్ వేవ్స్: భారత్‌లో వేలాది మంది ప్రాణాలు తీస్తున్న వడగాడ్పులను ఎదుర్కోవడం ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















