భారత్‌లో స్వలింగ సంపర్కాన్ని బ్రిటిష్ పాలకులు ఎందుకు నిషేధించారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వికాస్ పాండే
- హోదా, బీబీసీ న్యూస్
స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయాలంటూ దాఖలైన కొన్ని పిటిషన్లపై సుప్రీం కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ విచారణను ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారాలు ఇచ్చారు.
సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని స్వలింగ సంపర్కులు, ఎల్‌జీబీటీక్యూ మద్దతుదారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
అయితే, ప్రభుత్వంతోపాటు మత పెద్దలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2018 సెప్టెంబరులో స్వలింగ సంపర్కం నేరంకాదని చరిత్రాత్మక తీర్పులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీన్ని నేరంగా పరిగణంచే బ్రిటిష్ కాలంనాటి సెక్షన్‌ను కోర్టు కొట్టివేసింది. దీనిపై అప్పట్లో విస్తృతంగా చర్చ జరిగింది. ఆ ఏడాది చివర్లో ఒక ఇయర్-ఎండ్ పార్టీకి నేను కూడా హాజరయ్యాను.
బ్రిటిష్ కాలంనాటి ఆ చట్టాన్ని సుప్రీం కోర్టు కొట్టివేయడంతో పశ్చిమ దేశాల ఉదారవాద సిద్ధాంతాలకు (వెస్టర్న్ లిబరలిజం) దిశగా భారత్ పయనిస్తోందనే వాదనతో పార్టీలో అందరూ ఏకీభవించారు.
‘‘మనం బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాలతో నేడు సమానం అయ్యాం. అక్కడ స్వలింగ సంపర్కం నేరం కాదు’’అని నా స్నేహితుల్లో ఒకరు గట్టిగా అరిచి చెప్పారు.
‘‘ఎల్‌జీబీటీ వ్యక్తుల విషయంలో పశ్చిమ దేశాల తరహాలో మన భావనలు మారుతున్నాయి’’అని ఆయన అన్నారు.
మళ్లీ సోషల్ మీడియాలో అలాంటి చర్చలు నేడు కనిపిస్తున్నాయి. చాలా మంది ఈ భావనతో ఏకీభవిస్తున్నారు. కానీ, ఈ వాదన ఎంతవరకు నిజం?
ఈ ప్రశ్నకు భారత చరిత్రకారులు, పౌరాణిక చరిత్ర నిపుణులు భిన్నమైన సమాధానాలు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు స్వలింగ సంపర్కాన్ని బ్రిటిష్ పాలకులు ఎందుకు నేరంగా ప్రకటించారో అర్థం చేసుకోవాలంటే మొదట భారత చరిత్రను మనం తెలుసుకోవాలని ప్రముఖ చరిత్రకారుడు హర్‌వంశ్ ముఖియా అన్నారు.
‘‘భారత్‌లో బ్రిటిష్ వారు తమ మార్కు చట్టాలను చాలా తీసుకొచ్చారు. వీటిలో సెక్షన్ 377 ఒకటి. దీని ద్వారా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించారు. అయితే, ఈ చట్టాన్ని వారు మనపై రుద్దారు. భారత్‌లో అప్పటికి స్వలింగ సంపర్కంపై ఉన్న వైఖరులు వేరు. కేవలం క్రైస్తవానికి, స్వలింగ సంపర్కానికి పడదని బ్రిటిష్‌వారు ఆ నిబంధన తీసుకొచ్చారు’’అని ఆయన చెప్పారు.
2018 నాటి కోర్టు తీర్పుతో మళ్లీ భారత్ వైఖరి బ్రిటిష్ కాలం మునుపటికి వెళ్లిందని ఆయన చెప్పారు.
స్వలింగ సంపర్కం విషయంలో భారత్ వైఖరి చాలా విశాల దృక్పథంతో ఉండేదని మరికొందరు నిపుణులు కూడా చెబుతున్నారు. మధ్యయుగం నాటి చరిత్ర, రచనల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుందని వివరిస్తున్నారు.
‘‘భారత్‌లో అన్ని రకాల ప్రేమలకూ స్థానముంది’’అని చరిత్రకారులు రానా సఫ్వీ చెప్పారు.
‘‘చారిత్రక లేదా మధ్యయుగం.. ఏ చరిత్రనైనా తీసుకోండి. మీకు అన్నిచోట్ల స్కలింగ సంపర్క చిహ్నాలు, గుర్తులు కనిపిస్తాయి. ఖజురహో దేవాలయాలు, మొఘల్ కట్టడాలు, రచనల్లోనూ ఇది కనిపిస్తుంది’’అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఖజురహో చూడండి’’
మధ్య ప్రదేశ్‌లోని ఖజురహో పట్టణంలోని దేవాలయాల్లో నేటికీ మనకు స్వలింగ సంపర్కాన్ని ప్రతిబింబించే విగ్రహాలు కనిపిస్తాయి.
చందేలా రాజుల హయాంలో క్రీ.శ. 950 నుంచి 1050 మధ్య ఈ దేవాలయ ప్రాంగణాన్ని నిర్మించారు. ఇలాంటి శిల్పాలు తూర్పు రాష్ట్రం ఒడిశాలోని కోణార్క్ దేవాలయం, మహారాష్ట్ర అజంతా, ఎల్లోరాల్లోని బౌద్ధ గుహల్లోనూ కనిపిస్తాయి.
హిందూమతంలో స్వలింగ సంపర్కానికి మొదట్నుంచీ ఆమోదం ఉండేదని పౌరాణిక చరిత్ర నిపుణుడు దేవదత్ పట్నాయక్ అన్నారు.
‘‘వలస పాలన కాలంలోనే ‘అసహజ శృంగారంపై నిషేధం’, సెక్షన్ 377 లాంటి పదాలు అన్ని దేశాలపై రుద్దారు. ‘సెక్స్ అనేది పాపం’అనే ఆ ధోరణి క్రైస్తవ బైబిల్ నుంచి వచ్చింది’’అని తన వెబ్‌సైట్‌లో ఆయన రాసుకొచ్చారు.
‘‘అది పూర్తిగా వారి నమ్మకాలు గొప్పవని చెప్పుకోవడం, యూరోపియన్ సంప్రదాయాలను ఇతరులపై రుద్దడానికి చేసే ప్రయత్నమే. ఇతరుల సంస్కృతుల్లో ఆ చర్యలకు ఎలాంటి స్థానం ఉండేదని వారు పట్టించుకోలేదు’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడమనేది పూర్తిగా విదేశీ విధానామని దేవదత్ చెప్పారు.
‘‘ఏదైనా గుడిలోని గోడలపై బొమ్మలు, చారిత్రక కథలను చూడండి. పురాతన కాలం నుంచి ఇక్కడ స్వలింగ సంపర్కముందని చరిత్ర చెబుతోంది. బహుశా ప్రధాన స్రవంతిలో అది భాగంకాకపోవచ్చు. కానీ, వారికీ గుర్తింపు ఉండేది’’అని ఆయన రాసుకొచ్చారు.
మధ్య యుగ కాలంలోనూ స్వలింగ సంపర్కాన్ని చిన్నచూపు చూసేవారుకాదని పుస్తకాలు, కళాకృతులు చెబుతున్నాయని ముఖియా వివరించారు.
‘‘కొంతమంది దీన్ని ఆమోదించకపోవచ్చు. కానీ, ఎల్‌జీబీటీలపై అణచివేత మాత్రం లేదు. వారి విషయంలో మన సమాజం సహనంతోనే ఉండేది. స్వలింగ సంపర్కులైనంత మాత్రన ఎవరినీ వేధింపులకు గురిచేయలేదు’’అని ఆయన చెప్పారు.
‘‘అల్లావుద్దీన్ ఖల్జీ కుమారుడు ముబారక్‌కు రాజ దర్బారులోని ఓ ఆస్థాన పండితుడితో సంబంధం ఉండేది. ఈ విషయం అక్కడ అందరికీ తెలుసు’’అని ఆయన చెప్పారు. 1296 నుంచి 1316 మధ్య ఖల్జీ పాలన కొనసాగింది.
మొఘల్ సామ్రాజ్యానికి పునాదులు వేసిన బాబర్ కూడా పురుషులపై తన ప్రేమ గురించి రచనల్లో రాసుకొచ్చారు.
‘‘ఎలాంటి బిడియం లేకుండా ఆయన రాసుకొచ్చారు. బాబురీగా పిలిచే ఓ యువకుడితో ఆయన ప్రేమలో పడ్డారు. ఆయన కాలంలోను, ఆ తర్వాత కూడా ఈ విషయంలో ఎలాంటి వ్యతిరేకత ఎదురుకాలేదు’’అని ముఖియా రాసుకొచ్చారు.
బ్రిటిష్ పాలనా కాలంతోపాటు వచ్చిన ‘‘స్వలింగ సంపర్కంపై నిషేధం’’ భావన, స్వాతంత్ర్యం తర్వాత మరింత బలపడిందని చరిత్రకారులు భావిస్తున్నారు.
‘‘స్వాతంత్ర్యం తర్వాత కూడా సెక్షన్ 377 అమలులో ఉందంటే అది కేవలం చరిత్ర తెలియకపోవడం, లేదా రాజకీయ నాయకులు పట్టించుకోకపోవడమే కారణం’’అని ముఖియా అన్నారు.
ఎల్‌జీబీటీ చరిత్ర విషయంలో యువతకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని ప్రముఖ ఎల్‌జీబీటీ ఉద్యమకారుల్లో ఒకరైన కేశవ్ సూరి అభిప్రాయపడ్డారు.
‘‘ఖజురహో దేవాలయాల్లో స్వలింగ సంపర్కుల విగ్రహాలు, చరిత్ర ఉందని మాకు స్కూలులో ఎవరూ చెప్పలేదు. ముఖ్యంగా ఈ విషయంలో మార్పులు రావాలి. ట్రాన్స్‌జెండర్లను అప్పట్లో దేవుళ్లుగా కొలిచేవారు. మధ్యయుగ కాలంలో స్వలింగ సంపర్కులైన గొప్ప రచయితలు, కళాకారులు ఉన్నారు’’అని ఆయన అన్నారు.
గతంలో స్వలింగ సంపర్కంపై విశాల దృక్పథంతో ప్రజలు ఉండేవారని యువత తెలుసుకోవాలని ముఖియా కూడా చెప్పారు.
‘‘వలస వాదంలో మనం పోగొట్టుకున్నది 2018నాటి సుప్రీం కోర్టుతో మనకు మళ్లీ దొరికింది. అదే ఎల్‌జీబీటీ వర్గాలపై మరింత విశాల దృక్పథంతో నడుచుకోవడం’’అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- స్వధార్ గృహ: కష్టాల్లో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచే ఈ పథకం ఎలా పని చేస్తుంది?
- ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం పదే పదే ఎందుకు మాట మారుస్తోంది...
- రామప్ప ఆలయం: ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఈ గుడి ప్రత్యేకతలేంటి
- సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను అనుమతిస్తుందా, ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ ఆశ ఏంటి?
- సూడాన్‌లో ఏం జరుగుతోంది? మిలిటరీ, పారా మిలిటరీ మధ్య యుద్ధం ఎందుకు?
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















