హీట్ వేవ్స్: భారత్‌లో వేలాది మంది ప్రాణాలు తీస్తున్న వడగాడ్పులను ఎదుర్కోవడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వడదెబ్బ కారణంగా ఈ వారం ప్రారంభంలో 12 మంది చనిపోయారు. చాలామందిని ఆసుపత్రిలో చేర్చారు.
మహారాష్ట్రలోని నవీ ముంబైలో బహిరంగ ప్రదేశంలో ప్రభుత్వం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న వీరు, మండే ఎండను తట్టుకోలేక ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.
ఎండ వేడి ప్రభావం అత్యధికంగా ఉండే, హాని కలిగించే దేశాల్లో భారత్ కూడా ఒకటి. అత్యంత వేడిగా ఉండే పగళ్లు, రాత్రుల సంఖ్య కూడా భారత్‌లో గణనీయంగా పెరిగింది. 2050 నాటికి ఇది రెండు నుంచి నాలుగు రెట్లు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.
ఎప్పుడో రావాల్సిన హీట్‌వేవ్‌లు వేసవి ప్రారంభంలోనే వస్తాయని, ఎక్కువ కాలం ఉంటాయని, వాటి రాక తరచుగా ఉంటుందని ఊహిస్తున్నారు.
సగటు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, హీట్‌వేవ్‌లు మే చివరివరకు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
భారత్‌లో సగటు ఉష్ణోగ్రతలు 1901 నుంచి 2018 వరకు దాదాపు 0.7 శాతం పెరిగాయి. పాక్షిక వాతావరణ మార్పుల కారణంగా ఇలా జరిగింది.

ఫొటో సోర్స్, Reuters
అధికారిక గణాంకాల ప్రకారం 1992 నుంచి 2015 వరకు హీట్‌వేవ్స్ కారణంగా 22 వేలకు పైగా ప్రజలు చనిపోయారు. ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.
అయినప్పటికీ, వేడి తీవ్రత గురించి, మనుషుల్ని వేడి ఎలా చంపగలదో అనే అంశం గురించి ఇంకా మనం అర్థం చేసుకోలేదని గుజరాత్‌కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ దిలీప్ మావలంకర్ అన్నారు.
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వారంలో, ఊహించిన దాని కంటే ఎంత ఎక్కువ మంది చనిపోతున్నారనే అంశంపై దిలీప్ మావలంకర్ దృష్టి సారించారు. 2010 మే నెలలో అహ్మదాబాద్ నగరంలో అన్ని రకాల కారణాలతో 800 మంది మరణించినట్లు ఆయన కనుగొన్నారు. వేడి వల్ల చాలా మంది చనిపోతున్నారని ఆయన అన్నారు.
ఈ పరిశోధనల ఆధారంగా ప్రొఫెసర్ దిలీప్, అహ్మదాబాద్ నగరం కోసం హీట్ యాక్షన్ ప్లాన్ రూపొందించడంలో సహాయపడ్డారు.
2013లో ఈ యాక్షన్ ప్లాన్ అమల్లోకి వచ్చింది. ఎండ సమయంలో ఇంట్లోనే ఉండటం, బయటకు వెళ్లే ముందు ఎక్కువగా నీటిని తాగడం, అనారోగ్యానికి గురైతే వెంటనే ఆసుపత్రికి వెళ్లడం వంటి సింపుల్ పరిష్కారాలను ఈ ప్లాన్‌లో చేర్చారు.
2018 నాటికి అహ్మదాబాద్‌లో అన్ని రకాల కారణాలతో సంభవించే మరణాలు మూడో వంతు తగ్గాయని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
కానీ, భారత హీట్ యాక్షన్ ప్లాన్‌లు సరిగా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. నగరం, జిల్లా, రాష్ట్ర స్థాయిలోని 37 హీట్ యాక్షన్ ప్లాన్‌లపై సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌కు చెందిన ఆదిత్య వలియాథన్ పిళ్లై, తమన్నా దలాల్ పరిశోధన చేశారు. ఈ ప్లాన్‌లలో చాలా లోటుపాట్లు ఉన్నాయని వారు కనుగొన్నారు.
మొదటిది, ఈ ప్లాన్లలో చాలావరకు స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోలేదు. అలాగే చాలా సాధారణ పరిష్కారాలను సూచించారని వారు చెప్పారు.
37 ప్లాన్లలో 10 మాత్రమే స్థానిక ఉష్ణోగ్రత పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నాయని, అయితే తేమ వంటి అంశాలను పరిగణించాయా? లేదా? అనేది అస్పష్టంగా ఉందని తెలిపారు.
గ్రామాల స్థాయిలో మరిన్ని ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్లు ఉండాలని ప్రొఫెసర్ మావలంకర్ అభిప్రాయపడ్డారు.
రెండోది, ప్రమాదపు అంచుల్లో ఉన్న సమూహాలను గుర్తించడంలో, లక్ష్యంగా చేసుకోవడంలో దాదాపు ఈ యాక్షన్ ప్లాన్లు అన్నీ పేలవంగా ఉన్నాయని పరిశోధకులు ఆదిత్య, తమన్నా కనుగొన్నారు.
పొలాల్లో, నిర్మాణ రంగంలో, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వర్కర్లు, గర్భిణిలు, చిన్న పిల్లలు, వృద్ధులు ఎండ వేడికి ఎక్కువగా ప్రభావితం అవుతారు.
భారత శ్రామికుల్లో నాలుగింట మూడొంతుల మంది వేడి తీవ్రత ఎక్కువగా ఉండే భవన నిర్మాణం, మైనింగ్ రంగాల్లో పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ ప్రాంతాల్లో ఎక్కువ మంది బహిరంగ ప్రదేశాల్లో పనిచేస్తున్నారు? ఎక్కడ ఎక్కువగా ఎండవేడికి గురవుతున్నారు? కూలర్లను కొనగొలిగే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారా? పని మానుకొని ఇంట్లో ఉండేంత స్థోమత వారికి ఉందా? అనే అంశాలపై భారత్‌కు అవగాహన అవసరం అని పిళ్లై అన్నారు.
ఒక సిటీలోని 3 శాతం ఏరియాలో 80 శాతం వల్నరబుల్ జనాభా ఉన్న పరిస్థితి మీకు కనిపించవచ్చు అని ఆయన చెప్పారు.
యాక్షన్ ప్లాన్లలో చాలావరకు నిధుల లేమి ఉన్నట్లు కనిపిస్తోంది. జవాబుదారీతనం లేకపోవడం, పారదర్శకత లేకపోవడం కనిపిస్తోందని పిళ్లై, తమన్నా అన్నారు.
హీట్‌వేవ్‌లకు చాలా సాధారణ పరిష్కారాలు ఉంటాయి. ఎండ వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చెట్లు పెంచడం, భవనాల్లో వేడిని తగ్గించడానికి వాటి నిర్మాణాల్లో కాస్త మార్పులు చేయడం వంటి వాటిని పరిష్కారాలుగా చూడొచ్చు.
ఏసీలు లేని ఆసుపత్రుల్లో రోగుల్ని మీద అంతస్థులో కంటే కింద అంతస్థులో ఉంచి చికిత్స చేయడం, ఎండ వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో శ్రామికులకు విశ్రాంతి ఇవ్వడం లేదా నెమ్మదిగా పని చేయాలంటూ చెప్పడం కూడా ఒక పరిష్కారమేనని వాతావరణ పరిశోధకులు, నార్త్ కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన ల్యూక్ పార్సన్స్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తీవ్రమైన వేడి కారణంగా భారత్‌లో మరణాలు 55 శాతం పెరిగాయని మెడికల్ జర్నల్ ‘‘ది లాన్సెట్’’లో ప్రచురించిన తాజా అధ్యయనం పేర్కొంది.
వేడి కారణంగా 2021లో భారత్‌లో 167.2 బిలియన్ గంటల పని నష్టం జరిగింది. దీని కారణంగా దేశ జీడీపీలో 5.4 శాతం ఆదాయానికి గండిపడింది.
కానీ, ఇప్పటికీ భారతీయులు ఎండ వేడిని సీరియస్‌గా తీసుకోవట్లేదనేది స్పష్టంగా తెలుస్తుంది.
నవీ ముంబైలో ప్రభుత్వం బహిరంగ కార్యక్రమం నిర్వహించిన ఆదివారం రోజున గరిష్టంగా 38 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆ కార్యక్రమానికి హాజరైన ప్రజలంతా ఎండలో అలాగే కూర్చున్నారు. కొంతమంది మాత్రమే గొడుగులు, తలపై టవాళ్లతో కనిపించారు.
‘‘నేను దిల్లీలో ఉంటాను. ఇక్కడ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు తాకుతాయి. అయినప్పటికీ చాలా కొంతమంది మాత్రమే గొడుగులతో బయటకు రావడం నేను చూస్తుంటా’’ అని పిళ్లై అన్నారు.
ఇవి కూడా చదవండి:
- స్వధార్ గృహ: కష్టాల్లో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచే ఈ పథకం ఎలా పని చేస్తుంది?
- ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం పదే పదే ఎందుకు మాట మారుస్తోంది...
- రామప్ప ఆలయం: ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఈ గుడి ప్రత్యేకతలేంటి
- సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను అనుమతిస్తుందా, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఆశ ఏంటి?
- సూడాన్‌లో ఏం జరుగుతోంది? మిలిటరీ, పారా మిలిటరీ మధ్య యుద్ధం ఎందుకు?
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














