సూడాన్: ‘బతకడానికి సిరియా నుంచి వచ్చా, ఇక్కడింకా ఘోరంగా ఉంది’

ఫొటో సోర్స్, AFP
- రచయిత, అల్మా హసూన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సిరియాలో అంతర్యుద్ధం కారణంగా ఛిన్నాభిన్నమైన బతుకుల నుంచి తప్పించుకోవడానికి కరీం సూడాన్ పారిపోయారు. రెండేళ్ల తరువాత సూడాన్‌లో మళ్లీ యుద్ధం నడిబొడ్డున చిదిగిన బతుకుల మధ్య నిలబడ్డారు.
ఇల్లు, వాకిలి కోల్పోయి పోర్ట్ సూడాన్ నగరంలో నిస్సహాయులుగా మిగిలిపోయారు. తిరిగి సిరియా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నారు.
23 ఏళ్ల కరీం (పేరు మార్చాం) సిరియా నుంచి పారిపోయి సూడాన్ రాజధాని ఖార్టూమ్ చేరుకున్నారు. అక్కడ ఒక కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఇల్లు, కారుతో పాటు నెలకు సుమారు 41 వేల రూపాయల జీతం. తన ఖర్చులు పోగా, ఇంటికి పంపించడానికి సరిపోయేదని కరీం చెప్పారు.
ఒక నెల క్రితం తన మనసుకు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేయాలని కూడా అనుకున్నారు. వాళ్లమ్మకు ఈ సంగతి చెప్పారు కూడా.
"సూడాన్‌లో నా జీవితం బాగుండేది. సౌకర్యంగా గడిచిపోయేది" అని బీబీసీతో చెప్పారు.
ఏప్రిల్ 15న ఖార్టూమ్‌లో రెండు మిలటరీ శక్తుల మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పుడు, కరీం చాలా నిరాశ చెందారు. ఈ జీవితం కూడా నాశనమైపోతోందని కలతచెందారు.
తనకు బాగా పరిచయం ఉన్న మరో సిరియన్ వ్యక్తిని కాల్చి చంపారని, దాంతో చెప్పలేని భయం పట్టుకుందని కరీం అన్నారు.
ఖార్టూమ్‌లో ఉన్న చాలామంది సిరియన్లు ప్రాణాలు చేతబట్టుకుని అక్కడి నుంచి తరలిపోవడం మొదలు పెట్టారు.
ఏప్రిల్ 24 ఉదయం కరీం కూడా వారితో పాటు బయలుదేరి పోర్ట్ సూడాన్ చేరుకున్నారు.
రెండు రోజుల ప్రయాణం ఖర్చు తడిసి మోపెడైంది. మామూలుగా బస్సు టికెట్ సుమారు మూడు వేల రూపాయలుంటే , ఈ కష్టకాలంలో అది 30 వేలు అయింది.
దురదృష్టం తనను, తనలాంటి సిరియన్లను వెంటాడుతోందని కరీం అనుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Reuters
'మేం శాపగ్రస్తులం'
"చరిత్ర పునరావృతం అవుతోంది. సిరియాలో ఎలాంటి జీవితం అనుభవించమో మళ్లీ అదే పరిస్థితి ఇక్కడ కూడా దాపురించింది. మేం శాపగ్రస్తులం. ఇప్పటివరకు నేను నా జీవితాన్ని సరిగ్గా జీవించలేదు" అని వాపోయారు కరీం.
కొంతమంది సూడాన్ నుంచి ఫ్లైట్ ఎక్కి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇక్కడ డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తోంది.
"డబ్బే చాలా విషయాలను నిర్ణయిస్తుంది. డబ్బు ఉన్నవాళ్లు ఎప్పుడూ మనుగడ సాగించగలరు" అన్నారు.
బీబీసీ, కరీంతో వాయిస్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా మాట్లాడింది. కరీం ప్రస్తుతం ఒక మసీదులో తలదాచుకుంటున్నారు. అక్కడ ఫోన్ చార్జ్ చేసుకుంటూ మేం అడిగిన ప్రశ్నలకు జవాబులు చెబుతూ ఉన్నారు.
సిరియాలో అంతర్యుద్ధం కారాణంగా చాలామంది సిరియన్లు సూడాన్‌కు పారిపోయారు. దీనిపై అధికారిక గణాంకాలు లేవు కానీ, కొన్ని అంచనాల ప్రకారం 1,50,000 మంది పారిపోయి ఉండవచ్చు.
డబ్బు ఉన్నవాళ్లు, ధనిక కుటుంబాలకు చెందినవారు, పక్కదేశాల్లో రెసిడెంట్ పర్మిట్ ఉన్నవాళ్లు సిరియా నుంచి తరలివెళ్లిపోయారని కరీం చెప్పారు.
కానీ, అలా వెళ్లే పరిస్థితి ఆయనకు లేదు.
దిగువ మధ్య తరగతికి చెందిన కుటుంబంలో కరీం అందరికన్నా చిన్నవాడు. ఇడ్లిబ్‌లో పుట్టి పెరిగారు. కొన్నేళ్ల తరువాత అలెప్పో పారిపోయారు. ఆ ప్రాంతం అంతర్యుద్ధంలో చిక్కుకుపోయింది. అక్కడే పడుతూ, లేస్తూ మనుగడ సాగించారు.
సూడాన్ వచ్చిన తరువాత సంపాదించిన డబ్బును సిరియా పంపేవారు. దాంతోనే, అలెప్పోలో ఆయన కుటుంబం జీవించేది.
బీబీసీ మొదటిసారి కరీంతో మాట్లాడినప్పుడు ఆయన చాలా నిరాశగా కనిపించారు కానీ, ఏదో ఒక దారి దొరుకుతుందన్న నమ్మకంతో ఉన్నారు.
"సౌదీ ఆరేబియాలోని జెద్దా వెళ్ళగలను. అక్కడ మరో ఉద్యోగం వెతుక్కోవచ్చు. లేదా ఇథియోపియా వెళ్లవచ్చు. కానీ, 30 వేలకు పైనే ఖర్చవుతుంది" అని చెప్పారు కరీం.
పక్కనే ఉన్న ఈజిప్ట్‌కు వెళ్లడం సాధ్యం కాదు, ఎందుకంటే అక్కడి టూరిస్ట్ వీసా చాలా ఖరీదు.
"తిండి తినడానికే డబ్బు లేదు. వీసా కోసం ఎవరిని అడుగుతాం? సూడాన్‌లో పనిచేసిన రెండేళ్లల్లో సుమారు రూ. 82 వేలు పొదుపు చేయగలిగాను. ఇప్పుడు అది మొత్తం ఖర్చయిపోయింది" అని చెప్పారు.
రాను రాను కరీంకు ఆశలు అడుగంటుతున్నాయి. సూడాన్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటున్నారు.
పోర్ట్ సూడాన్ నుంచి సౌదీ ఆరేబియాకు ఓడలో వెళ్లవచ్చన్న ఆశలూ సన్నగిల్లుతున్నాయి. తనను అక్కడికి తీసుకెళ్లేవారు ఎవరూ లేరు. చేతిలో ఉన్న డబ్బు కూడా అయిపోతోంది.

ఫొటో సోర్స్, AFP
'నల్ల జుత్తు తెల్లగా మారిపోయింది'
కరీం పాస్‌పోర్ట్ త్వరలో ఎక్స్‌పైర్ అయిపోతుంది. ఆ తరువాత ఆయన ఇథియోపియాకు గానీ, మరే దేశానికైనా వెళ్లలేరు.
ప్రస్తుతం ఆయన పూర్తిగా నిరాశ, నిస్పృహలో కూరుకుపోయారు. దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు.
"దేవుడి మీద ఒట్టు..నాకింక దేనికీ స్పందించే శక్తి లేదు. ఇంకేం మిగల్లేదు. నా నల్ల జుత్తు కొంచం కొంచంగా తెల్లగా మారిపోతోంది. ఇప్పుడు సిరియా వెళ్లడానికి కూడా ఏ భయమూ లేదు. కోల్పోవడానికి నాకింకేం మిగల్లేదు" అన్నారాయన.
కానీ, కరీం మళ్లీ సిరియా వెళతానని ఎప్పుడూ అనుకోలేదు. అక్కడికి వెళితే నిర్బంధంగా మిలటరీలో పనిచేయాల్సి వస్తుంది. అందుకే విదేశాల్లో ఉండి, మెరుగైన జీవితం పొందాలనుకున్నారు.
ఇప్పుడు స్వదేశానికి వెళ్లడం కూడా ఖరీదుగా మారిన పరిస్థితి ఎదురైంది.
పోర్ట్ సూడాన్‌లో తరలింపు ప్రక్రియలో సహాయపడుతున్న ఒక వలంటీర్ బీబీసీతో మాట్లాడుతూ, మే 15 వరకు సూడాన్ నుంచి సిరియాకు రోజూ విమానాలు వెళతాయని, అందులో వాణిజ్య ప్రయోజనాలకు, తరలింపు కోసం రెండు విభాగాలు ఉంటాయని చెప్పారు.
కమర్షియల్‌గా డబ్బు ఇచ్చి కొనుక్కుని సిరియా వెళ్లవచ్చు. తరలింపు విభాగంలో ఉచితంగా ప్రయాణించవచ్చు. కానీ, దానికోసం పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి, గర్భవతులకు, కుటుంబాలకు మొదట ప్రాధాన్యం ఇస్తున్నారు.
కమర్షియల్ టికెట్ ఖరీసు సుమారు రూ. 37,000.
కరీం కుటుంబం ఆయన కోసం ఒక టికెట్ కొనేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, విమానాలు అన్నీ బుక్ అయిపోయాయని చెబుతున్నారు.
"ఒక రెండున్నర లక్షలు చేతిలో ఉంటే అన్ని సమస్యలూ తీరిపోతాయి. 25 వేలు ఇచ్చి నా పాస్‌పోర్ట్ రెన్యువల్ చేసుకోవచ్చు. తరువాత విజిటర్ వీసా తీసుకుని ఈజిప్ట్, అక్కడి నుంచి తుర్కియే వెళ్లగలను. తుర్కియేలో మా అక్క ఉంది. అక్కడి నుంచి యూరప్ వెళ్లడానికి ప్రయతించవచ్చు. కానీ, నాకెవరు అంత డబ్బు అప్పిస్తారు?" అన్నారు కరీం.
అదనపు రిపోర్టింగ్ - మేస్ బాకి
ఇవి కూడా చదవండి:
- క్రైస్తవంలోకి మారితే గిరిజనులకు రిజర్వేషన్లు ఉండవా? చత్తీస్‌గఢ్‌లో వివాదం ఏంటి?
- గంగమ్మకు మళ్లీ సొంతమైన జీడితోట...బీబీసీ కథనంతో స్పందించిన పోలీసులు అధికారులు
- థైరాయిడ్ ఉంటే గర్భం దాల్చడం కష్టమవుతుందా? పిల్లలను కనొచ్చా?
- మనుషులు చేరుకోలేని ఉత్తర ధ్రువాన్ని ఎలా కనిపెట్టారు? చావు అంచుల వరకు వెళ్లి ఎలా బయటపడ్డారు?
- ‘నానమ్మ చనిపోయి రోజులు గడుస్తున్నా మృతదేహాన్ని తెప్పించలేకపోతున్నా’ - ఓ మనవరాలి వేదన
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














