సూడాన్: మూలికలు అమ్ముకోవడానికి వెళ్లి ఘర్షణల్లో చిక్కుకుపోయిన హక్కి-పిక్కి గిరిజనులు

ఫొటో సోర్స్, PRABHU S
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
సూడాన్‌లో ఆర్మీకి, పారామిలటరీ ఫోర్స్‌కు మధ్య జరుగుతున్న హింసాత్మక ఘర్షణల్లో సుమారు 3,000 మంది భారతీయులు చిక్కుకుపోయినట్టు అంచనా.
వారిలో హక్కి-పిక్కి తెగకు చెందిన వారు సుమారు 100 మంది ఉన్నారు. హక్కి-పిక్కి కర్ణాటకకు చెందిన ఒక సంచార తెగ. మూలికా ఔషధాలు, వాటి ఉత్పత్తులను అమ్ముకోవడానికి వారు సూడాన్ వెళ్లారు.
వారి దుస్థితి భారత్‌లో రాజకీయ దుమారాన్ని లేపింది. సూడాన్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా భారత్ రప్పించే ఏర్పాట్లు చేయాలని ఒక కాంగ్రెస్ నేత ట్వీట్ చేయగా, దీన్ని "రాజకీయం చేస్తున్నారని" విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆరోపించారు.
మేలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం వార్తల్లో నిలిచింది.
సూడాన్‌లో చిక్కుకున్న హక్కి-పిక్కి గిరిజనుల్లోని కొందరితో బీబీసీ మాట్లాడింది.
తాము భయంతో బతుకుతున్నామని, తిండి, నీరు కూడా దొరకట్లేదని వారు చెప్పారు.
చాలా మంది రాజధాని ఖార్టూమ్‌లో ఉన్నారు. అక్కడ ఘర్షణలు భీకరంగా జరుగుతున్నాయి. మిగిలినవారు రాజధానికి 1,000 కి.మీ దూరంలో ఉన్న అల్-ఫషీర్‌లో ఉన్నారు.
సైనిక నాయకత్వంలో ఆధిపత్య పోరాటం ఫలితంగా గత వారం సూడాన్ రాజధాని ఖార్టూమ్, ఇతర ప్రాంతాల్లో హింస చెలరేగింది. పారామిలిటరీ ఫోర్స్ అయిన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్(ఆర్ఎస్ఎఫ్)కు, సూడాన్ ఆర్మీకి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
ఈ ఘర్షణల్లో చనిపోయిన వారి సంఖ్యఎంతనేది కచ్చితంగా తెలీదు. కానీ, 174 మంది కంటే ఎక్కువ మంది పౌరులు మరణించారని సూడానీస్ డాక్టర్ల సెంట్రల్ కమిటీ (సీసీఎస్‌డీ) మంగళవారం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
"చాలా భయంగా ఉంది. చుట్టుపక్కలే కాల్పులు జరుగుతున్నాయి. పొద్దున, సాయంత్రం, రాత్రి కూడా కాల్పులు కొనసాగుతున్నాయి" అని అల్-ఫషీర్‌లో ఉన్న హక్కి-పిక్కి సభ్యుడు ఎస్ ప్రభు చెప్పారు.
"ఇప్పుడు మేం ఒక హోటల్‌లో తలదాచుకుంటున్నాం. అయిదు రోజుల క్రితం ఘర్షణలు మొదలైన వెంటనే ఈ హోటల్ సిబ్బంది వెళ్లిపోయారు. ఇక్కడ మిగిలి ఉన్న బ్రెడ్ తింటూ, వాష్ రూమ్‌లో నీళ్లు తాగుతూ కాలం గడుపుతున్నాం. మేం పది మంది ఒకే రూమ్‌లో ఉంటున్నాం" అని ఖార్టూమ్ నుంచి సంజు పితాజి చెప్పారు.
2011 జనాభా లెక్కల ప్రకారం, కర్ణాటకలో సుమారు 12,000 మంది హక్కి-పిక్కి తెగ వాళ్లు ఉన్నారు.
కన్నడలో హక్కి-పక్కి అంటే పక్షి వేటగాళ్లు. భారత్‌లో 1970లలో పక్షుల వేటను నిషేధించిన తరువాత ఈ తెగ వాళ్లు మూలికా ఔషధాలను తయారుచేసి అమ్మే వృత్తిలోకి దిగారు.
సూడాన్, సింగపూర్, మలేషియా లాంటి దేశాలు తిరుగుతూ ఔషధాలు అమ్ముకుంటారని, చాలాసార్లు కుటుంబాలను కూడా వెంట తీసుకువెళుతుంటారని మైసూర్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇన్‌క్లూజివ్ పాలసీలో ఆంత్రోపాలజిస్ట్, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ డీసీ నంజుండ చెప్పారు.
"ఈ కమ్యూనిటి వాళ్లందరికీ పాస్‌పోర్టులు ఉన్నట్టు మా పరిశోధనలో తేలింది. వాళ్లు 'వాగరి ' అనే భాష మాట్లాడతారు. వీటిలో కొన్ని పదాలకు గుజరాతీ మూలం కనిపిస్తుంది" అని డాక్టర్ నంజుండ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మూలికలు, ఆయుర్వేద నూనెలు వివిధ రకాల వ్యాధులను నయం చేస్తాయని వాళ్లు చెబుతుంటారు.
"అక్కడ ఒక అయిదారు నెలలు ఉంటారు. రోజుకు రూ. 2,000 నుంచి రూ. 3,000 వరకు సంపాదిస్తారు. తరువాత, వెనక్కి తిరిగి వచ్చేస్తారు" అని 33 ఏళ్ల రఘువీర్ చెప్పారు.
ఆయన కర్ణాటకలో హక్కి-పిక్కి తెగకు చెందిన స్కూల్ టీచర్.
రఘువీర్ చెల్లి, బావ, మరొక అయిదుగురు బంధువులు కలిసి అయిదు నెలల క్రితం సూడాన్ వెళ్లారు. ఈ ప్రయాణం కోసం వాళ్లు రూ. 5,00,000 అప్పు తీసుకున్నారు.
"ఒక 10 రోజుల క్రితం మా చెల్లితో మాట్లాడాను. ఆ తరువాత మాట్లాడడం కుదరలేదు" అని ఆయన చెప్పారు.
ఖార్టూమ్‌లో ఉన్న హక్కి-పక్కి కమ్యూనిటీ వారిని ఇళ్ల నుంచి బయటకు రావద్దని భారత అధికారులు హెచ్చరించినట్టు వారు చెప్పారు.
సంజు, ఆయన భార్య ఏప్రిల్ 18న భారత్ తిరిగిరావాల్సి ఉంది. కానీ, విమానాశ్రయం మూసివేయడంతో రాలేకపోయారు.
"భారత రాయబార కార్యాలయ అధికారులు మమ్మల్ని కాంటాక్ట్ చేశారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్పారు. కానీ, ఎన్నాళ్లు ఇలా ఇంట్లోనే ఉంటాం?" అని సంజు ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం వారికి ఇంట్లో విద్యుత్ కూడా లేదు.
ఇవి కూడా చదవండి:
- ఆవు, గేదె పాలే తాగాలా? గాడిద, గుర్రం, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? బీపీ, డయాబెటిస్, ఆటిజం తగ్గించే పాలు ఉంటాయా
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
- భారత్, నేపాల్ మధ్య పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారు?
- అమెరికా: పొరపాటున డోర్‌బెల్ కొట్టినందుకు టీనేజర్ తలపై రివాల్వర్‌తో కాల్పులు
- హీట్ వేవ్స్: భారత్‌లో వేలాది మంది ప్రాణాలు తీస్తున్న వడగాడ్పులను ఎదుర్కోవడం ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














