నైలు నది రిజర్వాయర్‌ నిర్మాణంపై ఇథియోపియా, ఈజిప్టు, సుడాన్ దేశాల మధ్య వివాదం

వీడియో క్యాప్షన్, నైలు నది రిజర్వాయర్‌ నిర్మాణంపై ఇథియోపియా, ఈజిప్టు దేశాల మధ్య వివాదం

ప్రపంచంలోనే అత్యంత పొడవైన, చరిత్రాత్మక నైలు నదిపై 500 కోట్ల డాలర్ల ఖర్చుతో భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది ఇథియోపియా. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో భాగమైన రిజర్వాయర్‌ను నీటితో నింపుతున్నట్లుగా శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈజిప్ట్, సుడాన్‌, ఇథియోపియాల మధ్య ఈ డ్యామ్‌పై వివాదం ఎప్పటి నుంచో నడుస్తోంది. నైలు నది దిగువన ఉన్న దేశాల అభ్యంతరాలపై ఎలాంటి ఒప్పందం కుదరకుండానే మూడు దేశాల మధ్య చర్చలు ముగిశాయి. ఇప్పుడు ఇథియోపియా చర్యలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

నిర్మాణం పూర్తయితే ఇథియోపియాలోని ఆరున్నర కోట్ల మంది ప్రజలకు ఈ డ్యామ్ విద్యుత్‌ అందిస్తుంది. ప్రస్తుతం వారికి నిరంతరాయ విద్యుత్ అందుబాటులో లేదు. కానీ మంచి నీటి అవసరాల కోసం ఈజిప్ట్ నైలు నదిపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఇథియోపియా చేపట్టిన ఈ ప్రాజెక్టు తమ దేశ ప్రయోజనాలను పెద్దఎత్తున దెబ్బతీస్తుందని ఈజిప్ట్ ఆందోళన చెందుతోంది. సుడాన్‌కు కూడా ఇలాంటి భయమే ఉంది.

వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధులు శాల్లీ నబిల్, కల్కిదన్ యెబెల్టల్‌లు ఈజిప్ట్, ఇథియోపియాల్లో కొందరు ప్రజలతో మాట్లాడారు.

గత పదేళ్ల నుంచి దేశం సాధిస్తున్న ఆర్థికాభివృద్ధికి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా ఒక నిదర్శనం. ఆఫ్రికా ఖండంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇదీ ఒకటి. ఇలాంటి అభివృద్ధి జరుగుతున్నప్పుడు దానికి విద్యుత్ కూడా చాలా ఎక్కువగా అవసరమవుతుంది.

కానీ, నగరం బయట పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పటికీ లక్షలాది మంది ఇథియోపియన్లకు విద్యుత్ అందుబాటులో లేదు.

ఈ సమస్యకు ఇథియోపియో చూపిన పరిష్కారం గ్రాండ్ రినాయిజెన్స్ డ్యామ్. సుమారు పదేళ్లుగా నిర్మిస్తున్న ఈ డ్యామ్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. గ్రామాలకు, కొత్త పరిశ్రమలకు ఈ డ్యామ్ విద్యుత్ అందిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు.

అలాంటి గ్రామాల్లో అకాకో ఒకటి.

''మేము కట్టెల పొయ్యితోనే వండుకుంటున్నాం. అడవికి వెళ్లి ఎండుకర్రలు తెచ్చుకుంటాం. ఇది చాలా కష్టంగా ఉంటుంది. మాకు కరెంట్ వస్తే స్టవ్‌లతో వంట చేసుకోవచ్చు. దానివల్ల మాపై బూడిద పడే బాధ తప్పుతుంది. ఇప్పుడు పొగతో ఆరోగ్యం చెడిపోతోంది. ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం'' అని గ్రామస్తురాలు జిఫారి గిర్మ చెప్పారు.

ఈ డ్యామ్‌పై తనకు చాలా నమ్మకం ఉందని జిఫారి భర్త లామ్మా షమీ చెప్పారు. డ్యామ్ నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి తాను ప్రభుత్వ బాండ్లు చాలా కొన్నానని అన్నారు. తాను చేసిన ఈ చిన్నసాయం వల్ల ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విద్యుత్‌ తమ గ్రామానికి వస్తుందని షమీ ఆశిస్తున్నారు.

నైలు నది దిగువన ఉన్న ఈజిప్టు, సుడాన్‌లాంటి దేశాలకు ఈ డ్యామ్ వల్ల ఎలాంటి నష్టం జరగదని వాదిస్తోంది ఇథియోపియా. ఎన్నో ఏళ్లుగా ఇదే విషయాన్ని చెబుతూ వస్తోంది. తమ దేశ ప్రజలకు విద్యుత్‌ అందకుండా ఈజిప్ట్ అడ్డుకుంటోందని ఆరోపిస్తోంది. వలస పాలన కాలం నాటి ఒప్పందాలను అమలు చేసేందుకు కైరో ప్రయత్నిస్తోందని ఇథియోపియా అంటోంది.

అయితే, ఈ డ్యామ్ వల్ల తమకొచ్చే వాటా నీరు తగ్గదని ఇథియోపియా తమకు గ్యారంటీ ఇవ్వాలని ఈజిప్ట్ కోరుతోంది. ఈజిప్టు ప్రజలకు ఇది జీవన్మరణ సమస్య. గత కొన్ని సంవత్సరాలుగా నీటి కొరతతో చాలామంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి మరింత దిగజారితే చాలా పంట పొలాలు కనుమరుగుకావొచ్చు.

అత్యంత వేడి వాతావరణంలో పంటలు పండించడం సవాలుతో కూడుకున్న విషయం. ఇథియోపియా డ్యామ్ గురించి ఇక్కడి రైతులందరికీ తెలియదు. కానీ నీటి వనరులు అంతంత మాత్రంగానే ఉండే ఈ దేశంలో నైలునది నీటిని కోల్పోవడాన్ని ఇక్కడి రైతులు ఊహించుకోలేరు. ఎందుకంటే నైలు నది ఈజిప్టుకు జీవనాడిలాంటిది.

''మాకు నీళ్లు సరిపోవడం లేదు. ముఖ్యంగా వేసవిలో. పగటి పూట నీటి పంపులు దాదాపు పనిచేయవు. ఎందుకంటే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. నీళ్లు ఇంకా తగ్గిపోతే ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు'' హనీ అనే ఒక ఈజిప్టు రైతు తెలిపారు.

ఇథియోపియా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఈజిప్ట్ ఆరోపిస్తోంది. నది దిగువన ఉన్న దేశాల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెబుతోంది.

''నీళ్లు లేకపోతే ఈజిప్టు లేదు. నీళ్లు లేకపోతే మాకు భవిష్యత్తే లేదు. మాకు రావాల్సిన నీటి వాటా తగ్గితే అది మమ్మల్ని మెల్లిమెల్లిగా చంపుతుంది'' అని ఈజిప్టు రైతు సంఘం నాయకుడు హుస్సేన్ అబ్దుల్ రెహ్మాన్ అన్నారు.

ఈజిప్టులో ఇప్పటికే 10కోట్ల జనాభా ఉంది. జనాభా వేగంగా పెరుగుతోంది. కానీ సమయం మించిపోతోంది. ఎన్నో సంవత్సరాలుగా చర్చలు జరుపుతున్నప్పటికీ సాంకేతిక, చట్టపరమైన ఎన్నో విబేధాలు ఇంకా పరిష్కారం కాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)