సీ17 గ్లోబ్‌మాస్టర్: భారతీయులను రక్షించి తీసుకొస్తున్న ఈ ‘బాహుబలి’ ప్రత్యేకతలేంటి?

సీ17 విమానం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తుర్కియేలో భూకంపం అయినా సూడాన్‌లో అంతర్యుద్ధం అయినా సహాయక చర్యలు చేపట్టడంలో కీలకపాత్ర పోషిస్తోంది ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్(ఐఏఎఫ్)‌కు చెందిన ‘‘సీ17 గ్లోబ్‌మాస్టర్’’.

జనవరి 6న తుర్కియేలో భారీ భూకంపం వచ్చినప్పుడు ‘‘ఆపరేషన్ దోస్త్’’ పేరుతో సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సీ17 ద్వారా భారత ప్రభుత్వం పంపింది. డాక్టర్లు, వైద్యసిబ్బంది, సహాయక సామాగ్రి, వాహనాలు, ఆపరేషన్ థియేటర్లు వంటి వాటిని కూడా ఆ విమానాలు తరలించాయి.

సూడాన్‌లో ఇటీవల రెండు సైనిక వర్గాలు యుద్ధానికి దిగాయి. దాంతో అక్కడ చిక్కుకు పోయిన భారతీయులను భద్రంగా తీసుకొచ్చేందుకు సీ17 గ్లోబ్‌మాస్టర్‌ను ఉపయోగించారు.

2021లో అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు మళ్లీ తమ అధీనంలోకి తీసుకున్నప్పుడు కాబుల్ నుంచి భారతీయులను సీ17లోనే తరలించారు.

యుక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలోనూ, కరోనా సంక్షోభంలో ఆక్సిజన్ తరలించడానికి కూడా వీటినే వాడారు.

యుక్రెయిన్ నుంచి విద్యార్థులను తరలిస్తున్న సీ17

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, రష్యా, యుక్రెయిన్ యుద్ధం సమయంలో సీ17 ద్వారా విద్యార్థులను తీసుకొచ్చారు.

అతి పెద్ద విమానం

  • సీ17 గ్లోబ్‌మాస్టర్ ఐఏఎఫ్‌కు చెందిన అతి పెద్ద విమానం.
  • 10 విమానాలు కొనేందుకు అమెరికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.
  • ఆ ఒప్పందం విలువ సుమారు 5 బిలియన్ డాలర్లు.
  • 2013లో తొలి విమానం భారత వాయు సేనలో చేరింది.
  • ఒకేసారి 80 టన్నులను ఈ విమానం మోసుకొని పోగలదరు.
  • ఒకేసారి ప్రపంచంలో ఎక్కడికైనా 150 మంది సైనికులను తరలించగలదు.
  • పొడవు-53 మీటర్లు
  • రెక్కలతో కలిపి వెడల్పు-51 మీటర్లు
  • 28,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు.
  • ఒక్కసారి ఇంధనం నింపితే 3,862 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
  • అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ వీటిని తయారు చేసింది.
  • ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ ఆర్మీ విమానాశ్రయంలో సీ17 విమానాలు ఉంటాయి.

సీ17 గ్లోబ్‌మాస్టర్ రాకతో యుద్ధట్యాంకులు, ఫిరంగులను సరిహద్దులకు తరలించడం సులభంగా మారిందని గతంలో ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌లో వింగ్ కమాండర్‌గా పని చేసిన కేఎస్ బిస్త్ తెలిపారు.

‘‘పొడవు తక్కువగా ఉండే రన్ వేల మీద కూడా ల్యాండ్ కాగలగడం, టే కాఫ్ కావడం వాటి ప్రత్యేకత’’ అని బిస్త్ అన్నారు. ‘‘సీ17 గ్లోబ్‌మాస్టర్ రాకతో ఉత్తర, ఈశాన్య సరిహద్దుల్లో మన బలగాల శక్తి మరింత పెరుగుతుంది’’ అని 2013లో నాటి చీఫ్ ఆఫ్ ది ఎయిర్‌ స్టాఫ్ నార్మన్ అనిల్ కుమార్ బ్రౌన్ అన్నారు.

కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్‌ను తరలించారు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కరోనా సెకండ్ వేవ్‌లో సీ17 ద్వారా ఆక్సిజన్‌ ట్యాంకులను తరలించారు

సరిపోతాయా?

ప్రస్తుతం కార్గో విమానాల కోసం అమెరికా, రష్యాల మీద భారత్ ఎక్కువగా ఆధారపడుతోంది.

అమెరికాకు చెందిన బోయింగ్ సీ17 గ్లోబ్‌మాస్టర్, లాక్‌హీడ్ మార్టిన్ సీ 130జేలతోపాటు రష్యాకు చెందిన ఇల్యూషిన్ ఐఎల్-76, ఆంటోనోవ్ ఏఎన్-32 విమానాలతో సరిహద్దులకు ఆయుధాలను, సామాగ్రిని భారత్ తరలిస్తోంది.

పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో వాటి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.

‘‘ఎన్నడూ లేనంతగా చైనా సరిహద్దుల్లో సైన్యాన్ని భారత్ బలోపేతం చేస్తోంది. సైనికులకు తక్కువ సమయంలో వారికి అవసరమైన సామాగ్రిని తరలించేందుకు ఈ విమానాలు చాలా కీలకంగా ఉన్నాయి’’ అని రక్షణరంగ నిపుణులు మరూఫ్ రజా అన్నారు.

రష్యా నుంచి కొనుగోలు చేసిన విమానాలు పాతవి అయిపోతున్నాయి. వాటిని 1980లు, 90లలో కొనుగోలు చేశారు. వాటి నిర్వహణ వ్యయం పెరగడంతోపాటు సమయం కూడా ఎక్కువ తీసుకుంటోంది.

మరిన్ని కార్గో విమానాలు కావాలని 2015లో కాగ్ నివేదిక తెలిపింది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)