‘కొత్త లోకం ఎప్పుడు సృష్టిస్తావు, నీ దగ్గరకు ఎప్పుడు రమ్మంటావు?’’ – ఏమిటీ కల్ట్స్, ప్రజలు వీటిలో ఎందుకు చేరుతున్నారు?

ఫొటో సోర్స్, Youtube/TeluguFilmNagar
- రచయిత, ఫెర్నాండో డ్వర్టే
- హోదా, బీబీసీ న్యూస్
‘‘ఎప్పుడు చెబుతావు.. నాకు సమాధానం ఎప్పుడు పంపుతావు?’’
‘‘కొత్త లోకం ఎప్పుడు సృష్టిస్తావు? నీ దగ్గరకు ఎప్పుడు రమ్మంటావు?’’
ఈ ప్రశ్నలు ఎక్కడో చూసినట్లు కనిపిస్తున్నాయా? ‘అనుకోకుండా ఒకరోజు’ సినిమాలో కొందరు వీటిని చీటీల్లో రాసుకొని జేబుల్లో పెట్టుకుని తిరుగుతుంటారు. నవయుగ స్పిరిట్యువల్ సెంటర్ కోసం పనిచేస్తున్నామని వారు చెబుతారు.
‘‘మేం సూర్యస్వామిని అనుసరిస్తాం. మమ్మల్ని వేరే లోకానికి తీసుకెళ్లడానికి ఆయన జన్మించారు. మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్లాలి, ఎలా తీసుకెళ్లాలి లాంటి ప్రశ్నలను ఆయన చిట్టీల రూపంలో దేవుడిని అడిగేవారు. వీటికి సమాధానాల కోసం ఆయన సమాధి అవ్వడానికి సిద్ధమయ్యారు. అర్ధరాత్రి ఆయన సజీవ సమాధి అయ్యేముందు అందరూ ధ్యానం చేస్తుండగా సహస్ర(చార్మీ) వచ్చి మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. దీంతో శాంతి చేయడానికి ఆమెను బలి ఇవ్వాలని గురూజీ నిర్ణయించారు’’అని ఆ సినిమాలో ఒక పాత్ర చెబుతుంది.
అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామని ఆలోచిస్తున్నారా? తాజాగా ఇలాంటి ఘటనే నిజ జీవితంలో చోటుచేసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
కెన్యాలో 80 మందికిపైగా ఇలానే స్వర్గానికి వెళ్లేందుకంటూ ఆకలితో ప్రాణాలు అర్పించుకున్నారు. వీరంతా ఓ క్రిస్టియన్ కల్ట్ సభ్యులు. వీరి మృతదేహాలను సామూహిక సమాధుల నుంచి వెలికితీశారు. మూఢ నమ్మకాలతో పొంచివున్న ముప్పులకు ఇలాంటి ఘటనలు అద్దం పడుతున్నాయి.
‘‘ప్రపంచంలో ఎక్కడున్నా మీకు సమీపంలో ఇలాంటి కల్ట్ ఒకటి పనిచేస్తుంటుంది’’అని బ్రిటన్‌కు చెందిన సైకాలజిస్టు, అతివాద భావజాలం, ఇతర ప్రమాదకర సామాజిక సంబంధాలపై అధ్యయనం చేపట్టిన డాక్టర్ అలెగ్జాండ్రే స్టెయిన్ బీబీసీతో చెప్పారు.
కెన్యాలో సామూహిక ఆత్మార్పణల వెనకున్నట్లు భావిస్తున్న ‘గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చి’ లాంటి సంస్థలు ప్రపంచంలో చాలాచోట్ల ఉన్నాయి. అయితే, అన్నీసార్లు వీటిలో సభ్యులను నడిపించేది మతం అనుకోవడానికి వీల్లేదు.
ఫాలోవర్లను అసలు వీరు ఎలా ఆకర్షించ గలుగుతున్నారు? వీటిలో చేరిన వారు మళ్లీ ఎందుకు వెనక్కి వెళ్లలేకపోతున్నారు?

ఫొటో సోర్స్, Empics
కల్ట్ అంటే ఏమిటి?
‘కల్ట్’ అనే పదానికి అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఒక నిర్వచనం ఇచ్చింది. దీన్ని పూర్తిగా మతపరమైన లేదా మతంతో కొంతవరకు సంబంధమున్న సంస్థగా పేర్కొంది. బాహ్య ప్రపంచానికి దూరంగా నియంతృత్వ శైలిలో ఇవి నడుస్తుంటాయి.
కల్ట్‌లలో చాలావరకు మతపరమైనవే ఉంటాయి. కానీ, కొన్నిసార్లు ఇతర అంశాలపై కూడా కల్ట్‌లు ఏర్పడుతుంటాయి. రాజకీయాలను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
‘‘కల్ట్‌లలో మతపరమైన అతివాద భావజాల సంస్థలు మాత్రమే ఉంటాయని అనుకోవడం ఒక అపోహ’’అని కల్ట్‌ల నుంచి బయటకు వచ్చిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చే రిచర్డ్ టర్నర్ చెప్పారు.
‘‘మీరు పనిచేస్తున్న ఉద్యోగ సంస్థ కూడా ఒక కల్ట్ కావచ్చు. ఉదాహరణకు నిత్యం సుదీర్ఘ గంటలు పనిచేసేలా మిమ్మల్ని వారు ప్రభావితం చేయగలిగితే దాన్ని కూడా ఒక కల్ట్‌గా భావించొచ్చు’’అని ఆయన వివరించారు. కొన్ని మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థలు కూడా కల్ట్ తరహా వ్యూహాలను అనుసరిస్తుంటాయని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Richard Turner
కల్ట్‌లలో ఎవరు చేరతారు?
కల్ట్‌లో చేరేవారు లేదా బాధితుల విషయంలో మనం పక్షపాత ధోరణితో ఆలోచించకూడదని డాక్టర్ స్టెయిన్ అంటున్నారు. ఎందుకంటే వీరిలో చాలా మందికి విద్య లేదా సామాజిక నైపుణ్యాలు పెద్దగా ఉండకపోవచ్చని ఆమె చెబుతున్నారు.
‘‘కల్ట్‌లో చేరారంటే వారు పిచ్చివారని లేదా వారి విపరీత అవసరాలే వారిని అలా నడిపించాయని చెబుతుంటారు. కానీ, అధ్యయనాల్లో దీనికి భిన్నమైన సంగతులు వెలుగుచూశాయి’’అని ఆమె వివరించారు.
‘‘కల్ట్‌లకు నేతృత్వం వహించేవారు ఎక్కువగా బాగాపనిచేసే, మేధావులను తమ గ్రూపులో చేర్చుకోవాలని చూస్తారు. ఎందుకంటే అలాంటివారే బాగా చేయగలరు కదా’’అని అన్నారు.
‘‘సంరక్షణ బాధ్యతలను తామే చూసుకోవాల్సి వచ్చే వారిని చేర్చుకోవడానికి కల్ట్‌లు పెద్దగా ఆసక్తిచూపవు’’అని ఆమె చెప్పారు.
అన్నీ తెలిసే ప్రజలు వీటిలో చేరుతారనేది ఒక అపోహేనని స్టెయిన్ అన్నారు.
‘‘రండి, మాలో చేరండి’’లాంటి ప్రకటనలో మనకు ఎక్కడా కనిపించవు. కానీ, కుటుంబంలో ఆప్తులను కోల్పోవడం లాంటి ఘటనలు జరిగేటప్పుడు వీటిని అడ్డుపెట్టుకొని సభ్యులను చేర్చుకునేందుకు కల్ట్‌లు ప్రయత్నిస్తుంటాయి.
‘‘ఒక్కోసారి చనిపోయినవారిని మళ్లీ బతికిస్తామని కూడా కల్ట్ నాయకులు చెబుతుంటారు’’అని స్టెయిన్ అన్నారు.
‘‘ఉదాహరణగా అమెరికాలో ‘‘హెవెన్స్ గేట్’’ కల్ట్‌ను తీసుకోండి. 1997లో దీనిపై అంతర్జాతీయంగా వార్తలు వచ్చాయి. దాదాపు ఒకేసారి 39 మంది ఈ కల్ట్ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏలియెన్స్ తమను మళ్లీ బతికిస్తాయని వీరు బలంగా నమ్మారు’’అని ఆమె చెప్పారు.
‘‘ఆ కల్ట నాయకుడు మార్షల్ యాపిల్‌వైట్‌కు క్యాన్సర్ వచ్చింది. మిగతావారిని కూడా తనతోపాటు తీసుకెళ్లిపోవాలని ఆయన భావించారు. ఇలాంటి కల్ట్‌లలో ఆత్మహత్యలు, హత్యలకు కారణం వీటి నాయకుడి ఆలోచనా విధానమే’’అని ఆమె వివరించారు.
లైంగిక దాడులు, తక్కువగా చూడటం, దోపిడీలు లాంటివి కూడా కల్ట్‌లలో కనిపిస్తుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
కల్ట్‌లు ఎందుకు అంత శక్తిమంతమైనవి?
కల్ట్ నాయకుల్లో ప్రజలను ఆకర్షించే గుణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయని డాక్టర్ స్టెయిన్ అన్నారు.
‘‘ఫాలోవర్లను ఎలా ఆకర్షించాలి, వారిని తమవైపు ఎలా తిప్పుకోవాలి లాంటివి అంశాలపై వారు ఎక్కువ శ్రద్ధ పెడతారు. కొన్నిసార్లు వీరు ట్రిక్స్ కూడా నేర్చుకుంటారు. తాము అన్ని విధాలా సిద్ధమని అనుకున్నప్పుడు ప్రజల్లోకి వెళ్తారు’’అని ఆమె చెప్పారు.
‘‘కల్ట్ నాయకులేమీ పిచ్చివారు కాదు. నిజానికి వారు మేధావులు. ఎందుకంటే ఒక కల్ట్‌ను నడిపించడమంటే అంత తేలిక కాదు’’అని ఆమె అన్నారు.
సాధారణంగా కల్ట్ నాయకుల్లో ఎక్కువ మంది పురుషులే ఉంటారు. అయితే, బ్రెజిల్‌లోని ‘‘సుపీరియర్ యూనివర్సల్ లీనియేజ్’’ లాంటి సంస్థలకు వెలెన్షియా డీ అండ్రేడ్ లాంటి మహిళలు కూడా నేతృత్వం వహించారు.

ఫొటో సోర్స్, Handout
ప్రజలు ఎందుకు బయటకు రాలేరు?
ప్రజలను కల్ట్‌లోకి ఆకర్షించడం చాలా తేలికని టర్నర్ అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కల్ట్ నాయకులు ‘‘లవ్ బాంబింగ్’’ అంటే విపరీతమైన ప్రేమ, శ్రద్ధను చూపిస్తారని చెప్పారు.
దీన్ని మనం అనుభవిస్తేనే తెలుస్తుంది. 2013లో ఆయన ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పుడు ఇలానే ‘‘హిప్‌స్టెర్ క్రిస్టియన్ కల్ట్’’ ఆయనను ఆకర్షించేందుకు ప్రయత్నించింది.
‘‘మీరు ఎంత ధనవంతులైనా, జీవితంలో ఎంత ఉన్నత స్థాయిలోనున్నా దీనికి సంబంధం లేదు. జీవితంలో ఏదో ఒక సమయంలో మనం వీటికి ఆకర్షితులం అవుతాం. ఉద్యోగాన్ని కోల్పోవడం లేదా ఆప్తులు చనిపోవడం లాంటి ఏదో ఒక ఘటన మనల్ని వాటివైపు నడిపిస్తుంది’’అని టర్నర్ వివరించారు.
‘‘మొదట వారు మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేస్తారు. వారిపైనే ఆధారపడేలా చేస్తారు. కొందరు ఏదైనా డ్రగ్స్ లాంటివి కూడా ఇవ్వొచ్చు. కల్ట్ అనేది బాహ్య ప్రపంచంతో మనల్ని విడదీసేందుకు ప్రయత్నిస్తుంది. అప్పుడే మనల్ని నియంత్రణలోకి తీసుకోవడం చాలా తేలిక’’అని ఆయనే చెప్పారు.
ఆ సమయంలో తన జీతం కూడా కల్ట్‌కే ఇచ్చేయాలని అనిపించేదని, తనపై ఆ సంస్థ ఎంత ప్రభావం చూపేదో దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.
‘‘నా మానసిక ఆరోగ్యం పూర్తిగా తలకిందులయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఫాలోవర్లను కల్ట్‌లు ప్రోత్సహించవు’’అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కల్ట్‌లను ఎలా గుర్తించాలి?
ఒక సంస్థ కల్టో కాదో గుర్తించడం అంత తేలికకాదని టర్నర్ చెబుతున్నారు. కానీ, ఇంటర్నెట్‌లో దీని గురించి వెతికితే కొంత సమాచారం మనకు దొరకొచ్చు.
‘‘ఆ సంస్థ గురించి ఆన్‌లైన్‌లో ప్రజలు ఏం చెబుతున్నారో తెలుసుకోండి. తాము కల్ట్ ఎందుకు కాదో కొంతమంది రాస్తుంటారు. నిజానికి అలాంటి సంస్థలే కల్ట్ అయ్యే అవకాశం ఎక్కువ’’అని ఆయన అన్నారు.
‘‘సంస్థలు మీ కోసం, మీ స్నేహితుల కోసం నెగిటివ్ అంశాలు చెబుతుంటే అప్రమత్తం కావండి. మీరు మరింత పనిచేయాలని, మీ డబ్బులు కూడా ఇవ్వాలని అడిగితే ఒకసారి ఆలోచించండి’’అని ఆయన సూచించారు.
ఇక్కడ అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటంటే.. మనసు మాట వినాలని కౌన్సెలర్లు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















