పాకిస్తాన్ జనగణన: హిందువులకు ఇస్తున్న ఫారాలపై వివాదం ఏంటి? హిందువులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, షుమైలా జాఫ్రీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్‌లో ఈ ఏడాది జనగణన చేస్తున్నారు. ఆ దేశం ఏర్పడిన తరువాత ఇది ఏడవ జనగణన. ఇందుకోసం పాకిస్తాన్ స్టాటిస్టిక్స్ బ్యూరో తొలిసారిగా డిజిటల్ సాంకేతికత, సాధనాలను ఉపయోగిస్తోంది.

పాకిస్తాన్‌లో ఎప్పుడూ జనాభా లెక్కల సేకరణ సాదాసీదాగా జరగదు. దానిచుట్టూ వివాదాలు అల్లుకుంటూనే ఉంటాయి. ఈసారి కూడా అదే జరుగుతోంది. ఈ ఏడాది ఆ దేశంలోని హిందూ జనాభా కేంద్రంగా చర్చలు జరుగుతున్నాయి.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తానీ హిందువుల మధ్య విభజనపై వివాదం

పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇచ్చిన స్వీయ గణన ఫారాల్లో హిందువులకు, షెడ్యూల్డ్ కులాలకు వేర్వేరు తరగతులు ఉన్నాయి. పాకిస్తాన్ జనాభా లెక్కల్లో ఈ రెండు సమూహాలను వేర్వేరు వర్గాలుగా గుర్తిస్తారు.

అయితే, ఈసారి జనగణనలో హిందువులు అందరినీ, అంటే అన్ని కులాలవారినీ ఒకే వర్గం కింద గుర్తించాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు.

మైనారిటీ వర్గాలలో జనాభా సంఖ్య బట్టి వారికి ఇచ్చే కోటా, ప్రోత్సాహకాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో, పార్లమెంట్ సీట్లలో వాటా ఉంటుంది.

షెడ్యుల్ల్ కులాల జానాభా మిగతా వారికన్నా చాలా ఎక్కువ. కాబట్టి, షెడ్యూల్డ్ కులాలను హిందువులలో కలపడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుతుందని అగ్రకులాల హిందువులు వాదిస్తున్నారు.

అందరినీ ఒకే వర్గం కింద కలిపేస్తే బలం, స్వరం పెరుగుతుందని, హిందువుల మధ్య విభజన మేలు చేయదని అంటున్నారు.

పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ చైర్మన్ రమేష్ వాంక్వానీ బీబీసీతో మాట్లాడుతూ, తాము సమైక్యత కోరుకుంటున్నామని, హిందువుల ఐక్యతే కాకుండా మైనారిటీలంతా సమైక్యంగా ఉండాలని అన్నారు.

2017 జనాభా లెక్కల ప్రకారం, పాకిస్తాన్‌లో హిందువుల సంఖ్య సుమారు 45 లక్షలు. కానీ, వాస్తవంగా హిందువులు దాదాపు 80 లక్షలు ఉంటారని వాంక్వానీ చెబుతున్నారు.

హిందువుల్లో చాలామంది పేర్లు ఓటర్ల లిస్టులో లేకపోవడం వలన జనాభా లెక్కల్లో వారి సంఖ్య కలపడం లేదని ఆయన అన్నారు.

"హిందువులుగా, దేశ పౌరులుగా, ఓటర్లుగా తమ పేరు నమోదు చేసుకోవాలని, దేశ రాజకీయాల్లో పాత్ర వహించాలని హిందువులకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. చాలాకాలంగా ఈ దిశలో ప్రచారాలు నిర్వహిస్తున్నాం" అని వాంక్వానీ చెప్పారు.

పాకిస్తాన్ జనగణన

ఫొటో సోర్స్, Getty Images

షెడ్యూల్డ్ కులాలు ఏమంటున్నాయి?

అయితే, షెడ్యూల్డ్ కులాల్లో కొందరు ఈ వాదనను వ్యతిరేకిస్తున్నారు. జనాభా లెక్కల్లో తమను హిందువులలో కలపకూడదంటున్నారు.

బ్రిటిష్ కాలంలో, హిందువులలో వెనుబడిన తరగతులకు రిజర్వేషన్లు అందించేందుకు షెడ్యూల్డ్ ఏర్పాటు చేశారు. మేఘవార్, కోల్హి, భీల్, ఔద్, బగ్రీ, బాల్మీకి వంటి పలు కులాలు షెడ్యూల్డ్ కింద ఉన్నాయి.

షెడ్యూల్డ్ కులాలకు విడిగా గుర్తింపు ఉండాలని, విడిగా కోటా, రిజర్వేషన్ ఉండాలని వారంతా కోరుతున్నారు.

పాకిస్తానీ హిందువుల్లో షెడ్యూల్డ్ కులాల సంఖ్యే ఎక్కువగా ఉన్నా, చారిత్రకంగా ఆధిపత్యం బ్రాహ్మణులు, ఠాకూర్ల చేతిలోనే ఉండేదని, తమను అంటరానివారిగా పరిగణించేవారని, ఇప్పుడొచ్చి మనమంతా హిందువులం అంటే ఒప్పుకోమని అంటున్నారు.

సింధులోయ నాగరికతకు తామే నిజమైన వారసులమని, అతి తక్కువ జనాభా ఉన్న అగ్ర కులాలు ఇప్పుడు మళ్లీ జనాభా లెక్కల చాటున తమపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.

థార్‌పార్కర్‌లో షెడ్యూల్డ్ కులాల యాక్టివిస్ట్ లజ్‌పత్ భెల్ ఈ విషయమై షెడ్యూల్డ్ కులాల్లో అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలలో షెడ్యూల్డ్ కులాల హిందువులను విడిగా పేరు నమోదుచేసుకోవాలని, అగ్ర కులాల హిందువుల జాబితాలో నమోదు చేసుకోకూడదని చెబుతూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

"ప్రభుత్వంలో అగ్ర కులాల హిందువులే ఉన్నారు. కోటా వల్ల లాభం పొందుతున్నది వాళ్లే. మా షెడ్యూల్డ్ కులాల హిందువులకు ఉద్యోగాలు లేవు, చదువు, వనరులు లేవు. ఎక్కువ జనాభా ఉన్న షెడ్యూల్డ్ కులాల వారి హక్కులను కొల్లగొట్టడానికే అగ్ర కులాల హిందువులు ఐక్యతా రాగం ఎత్తుకున్నారు. కానీ, ఇక్కడ అగ్రవర్ణాల భూస్వాములు, ఎంపీలు, మంత్రులు, సలహాదారుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది" అని లజ్‌పత్ భెల్ అన్నారు.

పాకిస్తాన్‌లో ముస్లింలు కాని మైనారిటీ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 5 శాతం కోటా ఉంటుంది. నేషనల్ అసెంబ్లీలో 10 సీట్లు, పార్లమెంటు ఎగువ సభలో 4 సీట్లు, ప్రాంతీయ అసెంబ్లీలలో 23 సీట్ల రిజర్వేషన్ ఉంది.

పాకిస్తాన్ జనగణన

ఫొటో సోర్స్, Getty Images

అయితే, షెడ్యూల్డ్ కులాల్లో లజపత్ భేల్ అభిప్రాయాలతో విభేదించేవారు కూడా ఉన్నారు.

థార్‌పార్కర్‌లోనే మరో యాక్టివిస్ట్ నంద్ లాల్ బీబీసీతో మాట్లాడుతూ, షెడ్యూల్డ్ కులాల్లో చాలామంది తమకు విడిగా గుర్తింపు ఉండాలని కోరుకోవట్లేదని చెప్పారు.

"ఇప్పుడు చాలావరకు అవకాశాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. చదువు, అవగాహనతో ప్రధాన స్రవంతిలోకి రావచ్చు. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ వల్ల పెద్ద ప్రయోజనం లేదు. పైగా కొంతమంది ఈ క్యాటగిరీలో ఉండడం అవమానకరంగా భావిస్తున్నారు. వాళ్లంతా హిందువులుగా గుర్తింపు పొందేందుకే మొగ్గుచూపుతున్నారు."

ప్రభుత్వం విషయానికొస్తే, వాళ్లు ఏ వర్గం కింద ఉండాలో వాళ్లే నిర్ణయించుకోవచ్చని స్పష్టంచేసింది. హిందువులను, షెడ్యూల్డ్ కులాలను విడిగా గుర్తించడం దేశ విభజనకు ముందు నుంచీ పాటిస్తున్న పద్ధతి. ఇప్పటికీ దాన్నే కొనసాగిస్తూ, జనభా లెక్కల్లో వేర్వేరు తరగతులను కేటాయిస్తున్నారు. కానీ, దేన్ని ఎంచుకోవాలో నిర్ణయించుకునే హక్కు హిందువులు అందరికీ ఉంది.

గత జనాభా లెక్కల (2017) ప్రకారం, పాకిస్తాన్ జనాభాలో ముస్లింలు 96.2 శాతం ఉన్నారు. వీరి తరువాత, ఎక్కువ జనాభా ఉన్న మైనారిటీలు హిందువులే. వీళ్లు 1.6 శాతం ఉన్నారు. ఇప్పుడు షెడ్యూల్డ్ కులాలను కూడా కలిపితే పాకిస్తాన్ జనాభాలో 2 కంటే ఎక్కువ శాతం ఉంటారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్: లచ్చీ హిందువులకు కొత్త ఇమేజ్ తెస్తున్న వీకే డ్యాన్స్ గ్రూప్‌

జనాభా లెక్కల సేకరణ ప్రక్రియపై విమర్శలు

పాకిస్తాన్‌లో మహానగరమైన కరాచీ, సింధ్ ప్రాంతంలోని రాజకీయ నాయకులు జన గణన పద్ధతులపై అభ్యతరాలు వ్యక్తం చేశారు.

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ జన గణన ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

"జనం తమ గురించి తామే స్వయంగా పత్రాలలో నింపాలి. తమను తామే లెక్కబెట్టుకోవాలి. అది ఎలా చేయాలో తెలియకపోతే, గ్రామీణ ప్రాంతాలలో స్వీయ గణన పద్ధతి గురించి అవగాహన లేకపోతే వాళ్లు ఆ పని ఎలా చేస్తారు?" అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.

ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పార్టీ కూడా అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రత్యేకంగా ఒక విషయాన్ని తప్పుబట్టలేదుగానీ, కరాచీ జనాభాను సరిగ్గా లెక్కించలేకపోవచ్చని, వాస్తవం కన్నా తక్కువ జనాభాను లెక్కల్లో చూపిస్తే నగరానికి వచ్చే వనరులు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తంచేసింది.

గ్రామీణ ప్రాంతాల్లో జనాభా లెక్కలను తారుమారు చేసే అవకాశం ఉందని సింధి నేషనలిస్ట్ పార్టీలు అనుమానం వ్యక్తంచేశాయి.

కరాచీలో బెంగాలీ, అఫ్గాన్ శరణార్థులు మొదలైన కమ్యూనిటీలను జనాభా లెక్కల్లో చేర్చుకోరు. ఎందుకంటే, వారికి జాతీయ గుర్తింపు కార్డులు, పౌరసత్వం ఉండవు. కానీ, ఈసారి జాతీయ గుర్తింపు పత్రం లేకపోయినా, వారిని పాకిస్తానేతరుల కింద జన గణనలో చేరుస్తున్నారు. ఇది, కరాచీలో తక్కువ లెక్క చూపించవచ్చనే ఫిర్యాదును కొంతమేర సరిదిద్దగలదని కొందరు భావిస్తున్నారు.

అంతా సవ్యంగా జరిగితే జనాభా లెక్కల ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి: