ఒంటరితనం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు 500 రోజులు గుహలో గడిపిన మహిళ

ఫొటో సోర్స్, EPA
- రచయిత, జార్జ్ రైట్
- హోదా, బీబీసీ న్యూస్
మనుషులతో ఎలాంటి కాంటాక్ట్ లేకుండా 500 రోజుల పాటు ఒంటరిగా గుహలోనే గడిపిన తర్వాత ఒక స్పానిష్ అథ్లెట్ సురక్షితంగా బయటికి వచ్చారు.
యుక్రెయిన్‌పై రష్యా ఇంకా యుద్ధం ప్రారంభించకముందు, కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని వీడకముందు బీట్రిజ్ ఫ్లామిని అనే మహిళ స్పెయిన్‌లోని గ్రానాడాలో ఒక గుహలోకి వెళ్లారు.
సమాజంలోని మనుషులతో సంబంధం లేకుండా ఒంటరితనం ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఆమె ఈ ప్రయోగం చేపట్టారు. శాస్త్రవేత్తలు సునిశితంగా ఈ ప్రయోగాన్ని పరీక్షించారు.
‘‘నేనింకా 2021 నవంబర్ 21 వద్దనే ఆగిపోయాను. ప్రపంచం గురించి నాకేమీ తెలియదు’’ అని గుహ నుంచి బయటకి వచ్చిన తర్వాత ఫ్లామిని అన్నారు.
ఫ్లామిని వయసు 50 ఏళ్లు. గుహలోకి వెళ్లినప్పుడు 48 ఏళ్లు. 70 మీటర్ల (230 అడుగుల) లోతు గుహలో ఆమె ఒంటరిగా గడిపారు.
ఆమె గుహలో ఉన్న సమయంలో డ్రాయింగ్స్ వేయడం, నూలు దారాలతో హ్యాట్‌లను తయారు చేయడంలాంటి పనులు చేశారు.
గుహలో ఉన్నంత కాలం సైకాలజిస్ట్‌లు, రీసెర్చర్లు, స్పెలియోజిస్ట్‌ల(గుహలను అధ్యయనం చేసే నిపుణుల) బృందం ఆమెను పరిశీలించింది. కానీ, ఏ నిపుణులు కూడా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు.
గుహ నుంచి బయటికి వచ్చి తన టీమ్‌ను హగ్ చేసుకున్న వీడియోను స్పానిష్ టీవీ ఒకటి విడుదల చేసింది.
ఆ తర్వాత మాట్లాడిన ఆమె, గుహలో తాను గడిపిన సమయం ఒక అద్భుతమైన అనుభవమని అభివర్ణించారు.
‘‘ఏడాదిన్నర పాటు గుహలో నేను ఒంటరిగా బతికాను. నాతో నేను తప్ప ఎవరూ మాట్లాడలేదు’’ అని ఆమె చెప్పారు.

ఆమె నుంచి మరిన్ని వివరాలు సేకరించాలని రిపోర్టర్లు ప్రయత్నించినప్పటికీ వీలు పడలేదు.
‘‘నాకు ఓపిక లేదు. ఏడాదిన్నర కాలంగా కనీసం నేను నీళ్లను తాకలేదు. కాస్త ఫ్రెషప్ అయి కొద్దిసేపటి తర్వాత మాట్లాడతా. మీకు అది ఓకేనా?’’ అంటూ రిపోర్టర్లను ఆమె అడిగారు.
గుహలోకి వెళ్లిన రెండు నెలల తర్వాత తాను టైమ్ ను మిస్సయ్యానని రిపోర్టర్లకు తెలిపారు.
‘‘నేను రోజులు లెక్కపెట్టుకోవడాన్ని ఆపేసే క్షణం వచ్చింది. 160 నుంచి 170 రోజులు గుహలో ఉన్నానేమో అనుకున్నాను’’ అని ఆమె తెలిపారు.
యుక్రెయిన్‌పై రష్యా దాడులు చేయడం ప్రారంభించినప్పుడు ఈ గుహపై కూడా వీటి ప్రభావం ఉంది. ఆ క్షణాలు తనకు అత్యంత క్లిష్టమైనవిగా గడిచాయని ఆమె చెప్పారు. ఆ క్షణంలో తనకెలాంటి భద్రత లేదన్నారు.
‘‘మీరు చాలా సైలెంట్‌గా ఉండొచ్చు. కానీ, మీ మెదడు ఎప్పుడూ చురుకుగానే ఉంటుంది’’ అన్నారు.
సోషల్ ఐసోలేషన్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేసేందుకు ఆమె ప్రయత్నాన్ని పరిశీలించామని శాస్త్రవేత్తలు తెలిపారు.
గుహలో అత్యధిక ఎక్కువ కాలం గడిపిన వ్యక్తిగా ఆమె ప్రపంచ రికార్డును అధిగమించినట్లు ఫ్లామినికి సహాయం అందించిన బృందం తెలిపింది. కానీ, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ మాత్రం ఇంకా దీన్ని ధ్రువీకరించలేదు.
2010లో చిలీలో కాపర్ గోల్డ్ మైన్ కూలినపోయినప్పుడు 33 మంది చిలీ, బొలీవియన్ మైనర్లు 688 మీటర్ల అండర్ గ్రౌండ్‌లోనే 69 రోజుల పాటు గడిపారు.
అండర్‌గ్రౌండ్‌లో అత్యంత ఎక్కువ కాలం గడిపి బతికి బయటపడ్డ వారిగా వీరికి పేరుంది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: సింగరేణి ప్రైవేటు పరం అవుతుందా, బీఆర్ఎస్ పార్టీ నిరసనలు దేనికి?
- మారుమూల దీవిలో ఆ వింత రాళ్లు ఎలా ఏర్పడ్డాయి? అక్కడేం జరుగుతోంది?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 104 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది
- విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తెలంగాణ ప్రభుత్వం కొనగలదా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- పుష్ప: అంధులు, వికలాంగుల కోసం ఉచితంగా వెయ్యి పరీక్షలు రాసిన మహిళ కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














