పచ్చ కామెర్లు: తొలి దశలోనే ఈ జబ్బును గుర్తించడం ఎలా?

పచ్చకామెర్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ ప్రతిభాలక్ష్మి
    • హోదా, బీబీసీ కోసం

కళ్లు పచ్చగా కనిపించడం, మూత్రం పచ్చగా రావడం అనేది పచ్చ కామెర్ల లక్షణం. రక్త హీనతతో కళ్లు తెల్లగా పాలి పోయినట్టు అయితే దాన్ని తెల్ల పసరికలు అంటారు.

పచ్చ కామెర్లు కాలేయ సంబంధిత సమస్య. దీనితోపాటు కాలేయానికి కలిగే అన్నిఆరోగ్య సమస్యల గురించి, వాటి కారణాల గురించి, నివారణ, చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పచ్చకామెర్లు

ఫొటో సోర్స్, Getty Images

మన శరీరంలోని ప్రధాన అవయవాల్లో కాలేయం ఒకటి. దీని విధులు ఏమిటి అంటే..

  • ఆహారంలోని విష పదార్థాల నుంచి మన శరీరాన్ని కాపాడడం
  • శరీరంలోని విష పదార్థాలను తీసివేయడం
  • శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగడానికి ఎంతో ముఖ్య మైన ప్రోటీన్లను తయారు చేయడం
  • శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడం
  • లవణాలను, విటమిన్లను నిలువ చేయడం

ఇలాంటి ఎన్నో పనులు మన కాలేయం చేస్తుంది.

పచ్చకామెర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నిరకాలు...

పచ్చ కామెర్లు ముఖ్యంగా మూడు రకాలుగా రావచ్చు.

  • రక్త కణాలు సరిగ్గా లేక, లేదంటే మలేరియా వంటి ఇన్ఫెక్షన్ల వల్ల, రక్త కణాలు అధికంగా విచ్ఛిన్నం అవ్వడం వల్ల (Hemolytic jaundice)
  • హెపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్ల వల్ల, లేక మద్యం అధికంగా తాగడం వల్ల, లేక ఇతర అనారోగ్యాలకు వాడే మందుల వల్ల (ముఖ్యంగా క్షయ వ్యాధికి వాడే మందులు) లేక కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలతో కాలేయానికి నష్టం జరగడం వల్ల (hepatotoxic jaundice)
  • పిత్తాశయంలో తయారయ్యే రాళ్ల వల్ల లేదా ఏదైనా క్యాన్సర్ లేక వాపుల వల్ల (obstructive jaundice)

కాబట్టి, పచ్చ కామెర్లకు ముందు కారణం ఏంటో తెలిస్తే దానికి తగ్గట్టు చికిత్స ఉంటుంది. అన్నిటికీ ఒకే మందు అనుకొని అశాస్త్రీయ వైద్య విధానాలను వెళ్ళి నిర్లక్షం చేస్తే సమస్య పెద్దగా అయ్యే ప్రమాదం ఉంది.

పచ్చకామెర్లు

ఫొటో సోర్స్, Getty Images

కాలేయం విఫలం కావడానికి ముఖ్యమైన కారణాలు

  • మద్య పానం,
  • హెపటైటిస్ బీ ఇన్ఫెక్షన్,
  • అధిక మోతాదులో తీసుకునే కొన్ని రకాల మందులు (ముఖ్యంగా పసరు మందులు)
  • కొన్ని సందర్భాలలో వ్యాధి నిరోధక రుగ్మతలు
  • అధిక బరువు
  • గర్భం వల్ల కొందరు మహిళలకు తీవ్రమైన కాలేయ సమస్య తలెత్తి, ప్రాణాపాయ పరిస్థితి కలిగే అవకాశం ఉంది. (Acute liver failure of pregnancy)
  • ఇతర సమస్యల వల్ల దీర్ఘం కాలం కాలేయానికి రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల (ischemic hepatitis)

సిర్రోసిస్ ఎప్పుడు వస్తుంది?

  • కాలేయం కుంచించుకు పోయి, పని చేయకుండా పోయినప్పుడు (సిర్రోసిస్) కనిపించే లక్షణాలు -
  • పచ్చ కామెర్లు (jaundice)
  • పొట్టలో నీరు చేరడం (Ascitis)
  • కడుపులో రక్తనాళాలు వాపు రావడం (varices), వాంతిలో రక్తం పడడం లేక, మలం నల్లగా రావడం
  • రక్త హీనత
  • శరీరంలో అల్బుమిన్ తగ్గడం వల్ల కాళ్ల వాపులు, తరవాత శరీరం అంత నీరు నిలవడం
  • రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన ప్రోటీన్ల (coagulation factors) ఉత్పత్తి లేక, శరీరం మీద కమిలినట్టు కావడం, లేక రక్తస్రావం అధికంగా అవ్వడం
  • తరవాత దశలో ప్లీహం(spleen) వాపు రావడం
  • శరీరంలో నిలిచిపోయిన విష పదార్ధాలు మెదడుకు చేరి, అధికంగా నిద్ర, లేక స్పృహలో లేకుండా అయ్యే ప్రమాదం ఉంది (hepatic encephalopathy)
  • ఆ తరవాత రక్తపోటు తగ్గిపోవడం, ఇతర అవయవాలు కూడా కాలేయ సమస్య వల్ల ఇబ్బంది పడడం
  • సిర్రోసిస్ తర్వాత కాలేయ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం.
పచ్చకామెర్లు

ఫొటో సోర్స్, Getty Images

గుర్తించడం ఎలా ?

ఏదైన అనారోగ్యంగా అనిపించినప్పుడు, కళ్ళు పచ్చగా మారడం, లేక కడుపులో నొప్పి, వాపు, మలం నల్లగా రావడం, లేక తెల్లగా రావడం, కొద్దిగా తినగానే పొట్ట ఉబ్బరంగా అనిపించడం వంటివి కనిపిస్తే, ‘‘లివర్ ఫంక్షన్ టెస్ట్’’ అనే ఒక రక్త పరీక్ష, కడుపుకి ఒక స్కానింగ్ (USG ABDOMEN) చేయిస్తే మనం సమస్యను గుర్తించగలం.

తరవాత అవసరాన్ని బట్టి, కారణాల కోసం హీమోగ్రాం, ప్రోత్రాంబిన్ టైం, హేపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్ల పరీక్షలు చేయవలసి ఉంటుంది.

పొట్టలో నీరు ఉన్నట్టు తెలిస్తే ఆ నీరు తీసి పరీక్ష చేస్తే చాలా వరకు సమస్యకు కారణం తెలిసే అవకాశం ఉంది. ఎండోస్కోపీ చేయడం ద్వారా కడుపులో రక్త నాళాల పరిస్థితి తెలుసుకొని, అవసరం అయితే బాండింగ్ చేసే అవకాశం ఉంటుంది.

సాధారణంగా కడుపు స్కానింగ్‌లో, ఫ్యాటీ లివర్ (fatty liver) అనేది కనిపిస్తుంది. దానితో కంగారు పడుతూ చాలా మంది మా వద్దకు వస్తారు.

అయితే ఫ్యాటీ లివర్ అనేది మన సమాజంలో చాలా సహజం. ముఖ్యంగా అన్నం లాంటి పిండి పదార్ధాలు అధికంగా తినే అలవాటు ఉన్న వారికి, శారీరక వ్యాయామం చేయని వారికి, లేక అధికంగా మద్యపానం చేసే వారికి ఇది కనిపిస్తుంది.

దీనికి, ఆహారంలో నూనె, పిండి పదార్ధాలు తగ్గించి, రోజు వ్యాయామం చేస్తూ, మద్యపానం తగ్గిస్తే సరిపోతుంది.

నూనె పదార్థాలు తగ్గించడం కూడా ముఖ్యమే. అయినప్పటికీ, మన ఆహారపు అలవాట్ల దృష్ట్యా, పిండి పదార్థాల మీద ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం దీర్ఘ కాలికంగా కాలేయం వైఫల్యానికి దారి తీసే అవకాశం ఉంది.

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని కూడా గమనిస్తూ ఉండాలి. ఆ రక్త పరీక్ష పరగడుపున చేయాలి. చెడు కొవ్వు (బ్యాడ్ కొలెస్టరాల్) ముఖ్యంగా ఎల్‌డీఎల్ కచ్చితంగా 100 లోపు ఉండేలా చూసుకోవాలి.

బీపీ, మధుమేహం, గుండె జబ్బు, మూత్ర పిండాల సమస్యలు వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారికి 70 లోపు ఉంటే ఇంకా మంచిది. కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల గుండె పోటు, పక్ష వాతం వంటి సమస్యలు క్షణాల్లో కలుగవచ్చు. వాటి ప్రభావం జీవితాంతం ఉంటుంది.

ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ధూమపానం చేసే వారిలో, చిన్న వయసులో ఈ సమస్యలు కనిపిస్తున్నాయి. మందుల వల్ల కూడా కొలెస్ట్రాల్ తగ్గించగలం. కానీ, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం వల్ల తగ్గించగలిగితే ఎక్కువ మంచిది.

పచ్చకామెర్లు

ఫొటో సోర్స్, Getty Images

చికిత్స ఏమిటి?

చికిత్స అనేది సమస్యకు కారణం బట్టి, దాని తీవ్రతను బట్టి ఉంటుంది. దీర్ఘ కాలిక కాలేయ సమస్య కలిగిన వారు, ఒక సారి తీవ్రమైన స్థాయికి వెళితే, ఆ పైన వారు ఆయుష్షు చాలా వరకు నాలుగు సంవత్సరాల లోపుకే పరిమితం అవుతుంది.

ఏదైనా మందుల వల్ల, లేక గర్భం వల్ల అది కలిగి ఉంటే, వెంటనే దాన్ని ఆపివేయాలి.

హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తిస్తే దానికి చికిత్స తీసుకోవాలి.

మలవిసర్జన రోజూ జరిగేలా చూడాలి. లేకపోతే, విషపదార్థాలు మెదడును చేరే ప్రమాదం ఉంది.

పొట్టలో నీరు అధికంగా ఉంటే, అది తగ్గించడానికి అనేక మందులు ఉంటాయి. మూత్రం ద్వారా నీటిని తొలిగించేవి కూడా ఉంటాయి. వాటితో సరిపడా ప్రభావం లేకపోతే, అధికంగా నీరు చేరి ఆయాస పెడుతుంటే, ఆ నీటిని తీసి వేయడం జరుగుతుంది.

అవసరాన్ని బట్టి, రక్తం, లేక రక్త కణాలు, లేక అల్బుమిన్, లేక ప్లాస్మా (FFP) ఎక్కించే అవసరం ఉంటుంది.

కాలేయం పూర్తిగా పనిచేయకుండా అయితే, కాలేయ మార్పిడి కూడా చేయగలరు.

ప్లీహం వాపు వల్ల రక్త కణాలు చనిపోతుంటే, ప్లీహం తొలగించవచ్చు.

పచ్చకామెర్లు

ఫొటో సోర్స్, Getty Images

కాలేయాన్ని రక్షించుకోవడం ఎలా?

  • ఇది ఎక్కువగా మద్యపానం వల్ల కలిగే సమస్య. కాబట్టి మద్యం సేవించడం ఎంత తొందరగా మానేస్తే అంత మంచిది.
  • అసురక్షిత లైంగిక సంబంధాలకు దూరంగా ఉండడం వల్ల హెపటైటిస్ సోకకుండా కాపాడుకోగలం.
  • కొవ్వు పదార్థాలే కాదు, పిండి పదార్థాలను రోజూ ఆహారంలో నియంత్రించుకోవడం చాలా అవసరం.
  • ప్రతి రోజూ వ్యాయామంతో, శరీర బరువును నియంత్రించుకోవడం అవసరం.
  • దీర్ఘ కాలిక జబ్బులతో బాధ పడుతున్న వారు, వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేసుకుంటూ చికిత్స తీసుకోవాలి.
  • కాలేయానికి సంబంధించిన లక్షణాలు ఏమైనా కనిపిస్తే (అశాస్త్రీయ పద్దతులతో నష్టం పెంచుకోకుండా) వెంటనే సరైన వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

(రచయిత వైద్యురాలు. ఈ వ్యాసం నిర్దిష్టమైన సమస్య మీద స్థూలమైన అవగాహన కోసం మాత్రమే.)

వీడియో క్యాప్షన్, సెక్స్ సామర్థ్యం సున్తీ చేసుకుంటే పెరుగుతుందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)