ఎనిమిదేళ్లకే రజస్వల.. ఎందుకిలా జరుగుతుంది? దీని ప్రభావం ఎలా ఉంటుంది?
- రచయిత, డాక్టర్ శిల్ప చిట్నీస్ జోషి
- హోదా, బీబీసీ కోసం
ఆ రోజు ఆపరేషన్ థియేటర్ నుంచి అప్పుడే బయటకు వచ్చాను. ఫోన్ చూసుకుంటే ఐదు మిస్డ్ కాల్స్ కనిపించాయి. వెంటనే ఆ నంబరుకు కాల్ చేశాను. ఫోన్‌లో ఆమె ఏడుస్తున్నారు.
‘‘సానూకు అప్పుడే పీరియడ్స్ మొదలయ్యాయి. తన వయసు ఇంకా ఎనిమిదేళ్లే. అసలు ఇది ఎలా జరిగింది? నాకేమీ అర్థం కావడం లేదు’’ అని ఆమె చెప్పారు.
వెంటనే కాస్త ప్రశాంతంగా ఉండాలని ఆమెకు చెప్పాను. సానూను క్లినిక్‌కు తీసుకురావాలని సూచించాను.
కొన్నిసార్లు అమ్మాయిల మర్మాంగాలకు గాయాలు అవుతాయి. మరికొన్నిసార్లు మూత్ర నాళ ఇన్ఫెక్షన్ వల్ల మూత్రంలో కాస్త రక్తం రావచ్చు. మరోవైపు అమ్మాయిపై ఎవరైనా లైంగిక దాడి చేసినా ఇలా రక్తస్రావం కావచ్చు.
అందుకే సానూను జాగ్రత్తగా పరిశీలించాను. అప్పుడే తనకు పీరియడ్స్ మొదలైనట్లు అర్థమైంది.
చిన్న పిల్లలు రజస్వల అవుతున్న ఘటనలు నేడు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన కూడా ఎక్కువ అవుతోంది.
ఏం జరుగుతోందో ఈ అమ్మాయిలకు ఆ వయసులో అవగాహన కూడా ఉండదు. శానిటరీ ప్యాడ్ ఎలా పెట్టుకోవాలి? ఎందుకు ఇది అవసరం? అంతర్గత అవయవాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి? లాంటివి కూడా వీరికి పెద్దగా తెలియదు. అందుకే వారికి తల్లులే తగిన అవగాహన కల్పించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
బాల్యంలోనే రజస్వలకు కారణమేంటి?
అమ్మాయిల రజస్వల వయసు తగ్గడానికి కారణాలపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. బరువు పెరగడం, అతిగా మాంసాహారం తీసుకోవడం, కొన్ని జన్యుపరమైన కారణాలు, ఒత్తిడి, కుటుంబంలో ఘర్షణతో ఆందోళన తదితర కారణాలు ఇక్కడ ప్రభావం చూపిస్తాయి.
పిల్లలు ఎక్కువగా సోయాబీన్స్ తీసుకోవడం కూడా దీనికి కారణం అవుతుంది. ఆహారంలోకి చేరే రసాయనాలు, పురుగు మందులు కూడా ఈ సమస్యకు దారితీస్తాయి.
ప్రధాన కారణాలు ఏమిటంటే.. వ్యాయామం లేకపోవడం, బరువు పెరగడం.
బాలికలు బరువు పెరగడం అనేది ఆందోళన చెందాల్సిన అంశం. వయసు పెరుగుతున్నప్పుడు వారిలో ఆకలి కూడా పెరుగుతుంది. దీంతో వారు కాస్త ఎక్కువగా ఆహారం తీసుకోవచ్చు. దీనికి తగినట్లుగా వారు వ్యాయామం కూడా చేయాలి.

ఫొటో సోర్స్, Getty Images
మొబైల్ వినియోగం కూడా కారణమా?
రజస్వల కావడానికి అవసరమైన హార్మోన్లు విడుదల అయ్యేందుకు మెదడులోని హైపోథాలమస్ గ్రంథుల నుంచి సంకేతాలు రావాల్సి ఉంటుంది. అమ్మాయిల వయసు పెరిగేటప్పుడు వారిలో ఆ హార్మోన్ల స్థాయులు పెరుగుతుంటాయి. ఫలితంగా వారి శరీరంలో మార్పులు నెమ్మదిగా వస్తుంటాయి. ఆ తర్వాత రజస్వల అవుతారు.
అయితే, రజస్వల కావడానికి అవసరమైన సంకేతాలను పంపేందుకు మెదడు ఈ సమయాన్నే ఎందుకు ఎంచుకుందనే ప్రశ్నకు మన దగ్గర కచ్చితమైన సమాధానాలు లేవు. అయితే, అమ్మాయిల చుట్టుపక్కల వాతావరణం దీనిపై ప్రభావం చూపొచ్చని కొన్ని పరిశోధనల్లో తేలింది.
ఇక్కడ అడల్ట్ కంటెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే పెద్దవారి కోసం సిద్ధంచేసిన కంటెంట్. మీకు తెలియకుండానే పిల్లలు వాటిని చూడొచ్చు. దీని వల్ల వారి మెదడు ప్రభావితం కావచ్చు. ఫలితంగా కాస్త త్వరగానే రజస్వల కావచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బాలికలకు ఇలాంటి ముప్పు కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ అమ్మాయిలు కాస్త ఆలస్యంగా రజస్వల కావడాన్ని మనం గమనించొచ్చు.
కానీ, అందరి అమ్మాయిలను ఇదే కోణంలో మనం చూడకూడదు. ఇక్కడ ఇతర అంశాలు కూడా ప్రభావితం చేస్తుంటాయి. అందుకే దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి.
టీవీలు, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లలో కనిపించే కంటెంట్ పిల్లల మెదడును ప్రభావితం చేస్తుంది. నేడు దాదాపు పిల్లలందరి దగ్గరా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, మొబైల్ ఫోన్లతోపాటు అన్‌లిమిటెడ్ డేటా అందుబాటులో ఉంటోంది. ఇంకేం కావాలి? తమ వయసులో ఉండేవారు చూడకూడనివి కూడా పిల్లలు చూస్తున్నారు. దీనిపై వారి తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహనా ఉండటం లేదు.
ఇలాంటి కంటెంట్ అమ్మాయిలతోపాటు అబ్బాయిలపై కూడా ప్రభావం చూపిస్తుంది. కానీ, ఇక్కడ అమ్మాయిల శరీరం చాలా భిన్నమైనది. కాస్త క్లిష్టమైనది కూడా. అందుకే ఫలితాలు కాస్త వేగంగా కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆందోళన చెందాలా?
ఒకసారి పీరియడ్స్ మొదలైతే అమ్మాయిలలో కొన్ని ఎదుగుదల సమస్యలు వస్తాయి.
పీరియడ్స్ మొదలయ్యాక కొన్నిసందర్భాల్లో వీరు ఎత్తు పెరగకపోవచ్చు. అందుకే త్వరగా రజస్వల కావడం అనేది ఆందోళన చెందాల్సిన అంశం.
ఉదాహరణకు మీ అమ్మాయి వయసు పదికి అటూ ఇటూ ఉంది. అయినా ఆమె ఎత్తు తల్లి కంటే చాలా తక్కువగా ఉందనుకోండి. ఆలస్యం చేయకుండా వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలి. అవసరమైతే రజస్వల కాస్త ఆలస్యం కావడానికి ఔషధాలను వైద్యులు సూచిస్తారు. అయితే, పరీక్షలన్నీ చేసిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకోవాలి.
పరీక్షల అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఆ ఇంజెక్షన్లు తీసుకుంటే రజస్వల కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కేసుల్లో రెండు నుంచి మూడేళ్ల వరకు ఈ కాలాన్ని మనం పొడిగించొచ్చు. ఈ కాలంలో అమ్మాయి ఎత్తు, ఇతర శరీర నిర్మాణం మెరుగ్గా అవుతుంది.
అందుకే త్వరగా రజస్వల అయ్యే అమ్మాయిల తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించాలి. సకాలంలో వైద్యులను కలిస్తేనే ఫలితం ఉంటుంది.
పీరియడ్స్ మొదలై కొన్ని నెలలు గడిచిపోతే ఆ చికిత్స ప్రభావం చూపే అవకాశం కూడా తగ్గిపోతుంది.

పీరియడ్స్ త్వరగా మొదలైతే, పాలిసైస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీవోడీ) ముప్పు కూడా పెరుగుతుంది. రుతుక్రమ సమయంలో తీవ్రమైన నొప్పితోపాటు ఊబకాయం, మధుమేహం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
భవిష్యత్తులో రొమ్ము, మూత్రనాళ క్యాన్సర్లు, గుండె జబ్బుల ముప్పు కూడా ఎక్కువ అవుతుంది.
రజస్వల కావడానికి ఒకటి లేదా ఒకటిన్నర సంవత్సరం ముందు నుంచే మర్మాంగాలు, చంకల్లో వెంట్రుకలు, రొమ్ములు పెరగడం లాంటి సంకేతాలు వస్తుంటాయి. ఈ లక్షణాలు తక్కువ వయసులోనే కనిపిస్తే, వెంటనే గైనకాలజిస్టును సంప్రదించాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
పీరియడ్స్ త్వరగా రావడం అనేది అమ్మాయి తప్పుకాదు. ఎప్పటిలానే ఆడుకునేందుకు, తనకు నచ్చిన పనులు చేసుకునేందుకు మీరు అనుమతించాలి.
ఆమె పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త వహించడం తల్లి బాధ్యత. శానిటరీ ప్యాడ్లు ఎలా ఉపయోగించాలో ఆమెనే నేర్పించాలి.
ఆత్మవిశ్వాసం తగ్గిపోకుండా, అన్ని కార్యకలాపాల్లో పాల్గొనేలా తల్లిదండ్రులే ఆమెకు సాయం చేయాలి.
చాలా మంది రజస్వల తర్వాత పిల్లలను ఆడుకోవడానికి పంపించరు. బయటకు కూడా ఎక్కువగా అనుమతించరు. అది చాలా తప్పు. అన్యాయం కూడా. ఎగిరే ముందే మీరు పక్షి రెక్కలను కోసేస్తున్నట్లు లెక్క.
మొదటి ఏడాదిలో పీరియడ్స్ కాస్త అస్తవ్యస్తంగా ఉంటాయి. 21 రోజుల్లోపే పీరియడ్స్ వచ్చేయడం, ఏడు రోజుల వరకు రక్త స్రావం జరగడం, మరీ ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం లాంటివి గమనిస్తే, వైద్యుల దగ్గరకు వెళ్లండి. అమ్మాయిల హిమోగ్లోబిన్ స్థాయులను ఒక కంట కనిపెట్టాలి. ఆమెకు సంతులిత ఆహారం అందించడం చాలా ముఖ్యం.
ఏం తీసుకోవాలి?
వీలైతే ఆహారంలో అన్నం, బంగాళా దుంపలు, పంచదార కాస్త తగ్గించండి. నిజానికి వీటిని తినడం అందరూ తగ్గించుకోవాలి.
రజస్వల త్వరగా అయ్యే అమ్మాయిల్లో ఒంటరితనం, వ్యక్తిత్వ సమస్యలు, త్వరగా లైంగిక చర్యల్లో పాల్గొనడం లాంటి ముప్పులు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే అమ్మాయిలకు శారీరకంగా, భావోద్వేగంగా సాయం అందేలా చూసుకోవాలి.
రజస్వల కావడం అనేది వ్యాధి కాదు. మహిళగా రూపుదిద్దుకోవడంలో ఒక దశ. ఈ విషయం అమ్మాయిలకు అమ్మే చెప్పాలి. మొదట్లో వారు ఈ మార్పులతో షాక్‌కు గురవుతారు. తర్వాత నెమ్మదిగా అర్థం చేసుకుంటారు. ఈ ప్రయాణంలో తల్లి ఆమెకు అండగా ఉండాలి.
(రచయిత వైద్యురాలు. ఈ వ్యాసం నిర్దిష్టమైన సమస్య మీద స్థూలమైన అవగాహన కోసం మాత్రమే.)
ఇవి కూడా చదవండి:
- 18మంది మహిళలపై 2 రోజులపాటు అత్యాచారం...30ఏళ్లకు పైగా సాగిన విచారణ
- ఆర్ఈఈ: చైనాలో ఈ ఖనిజం ఉత్పత్తి నిలిచిపోతే అనంతపురం, చిత్తూరు జిల్లాలే కీలకం అవుతాయా?
- 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
- దెబ్బ తగిలిన ప్రతిసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలా, అసలు ఎప్పుడు అవసరం?
- సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ ఏంటి, టికెట్ ధర ఎంత, ఎక్కడెక్కడ ఆగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















