ఇతరుల శరీరం నుంచే వచ్చే వాసన మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

చెమట

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మిషెల్ రాబర్ట్స్
    • హోదా, డిజిటల్ హెల్త్ ఎడిటర్

ఇతరుల శరీరం నుంచి వచ్చే వాసన సోషల్ యాంక్సైటీని తగ్గించడంలో సహాయం చేయొచ్చని స్వీడన్ పరిశోధకులు చెబుతున్నారు.

దీనిపై వారు ఒక అధ్యయనం నిర్వహించారు. దీని కోసం కొందరి చంకల్లోని చెమట నమూనాలను వారు సేకరించారు.

భావోద్వేగాలతో ముడిపడిన మెదడులోని భాగాలపై ఈ చెమట నుంచి వచ్చే వాసన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో పరిశోధకులు పరిశీలించారు.

ఈ అధ్యయన ఫలితాలను ఇటీవల పారిస్‌లో నిర్వహించిన ఒక మెడికల్ కాన్ఫెరెన్స్‌ ముందుంచారు.

చెమట

ఫొటో సోర్స్, Getty Images

ఇది ఎలా పనిచేస్తుంది?

అప్పుడే పుట్టే శిశువుల్లోనూ వాసన పసిగట్టే సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. తల్లితోపాటు తల్లిపాలను వాసనతోనే వీరు గుర్తుపడతారు.

ఏదైనా ముప్పులను గుర్తించడంలో వాసన చూసే సామర్థ్యం తోడ్పడుతుంది.

పర్యావరణంతోపాటు ఇతరులతోనూ మెరుగ్గా కలిసిపోవడంలోనూ వాసన తోడ్పడుతుంది.

మన ఆహారం మరింత రుచికరంగా మార్చడానికి, మధురానుభూతులు నెమరు వేసుకోవడానికి వాసన తోడ్పడుతుంది.

మన ముక్కులోని పైభాగాల్లో ఉండే రిసెప్టర్లు సువాసనలను గుర్తుపట్టగలవు. ఇక్కడి నుంచి వచ్చే సంకేతాలను మెదడులోని ‘‘లింబిక్ సిస్టమ్’’గా పిలిచే ప్రాంతం విశ్లేషిస్తుంది. ఇదే భాగానికి జ్ఞాపకాలు, భావోద్వేగాలతోనూ గట్టి సంబంధం ఉంటుంది.

అయితే, మనుషుల శరీరం నుంచి వచ్చే సువాసనతో మెదడులోని ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేయొచ్చని స్వీడన్ పరిశోధకులు చెబుతున్నారు.

చెమట

ఫొటో సోర్స్, Getty Images

ఈ అధ్యయనం కోసం కొందరు వాలంటీర్ల చంకల్లోని చెమటను పరిశోధకులు సేకరించారు. ముఖ్యంగా ఏదైనా భయాన్ని పుట్టించే సినిమా చూసినప్పుడు లేదా సంతోషాన్ని పంచే సినిమా చూసినప్పుడు ఆ చెమటను తీసుకున్నారు.

సోషల్ యాంక్సైటీతో బాధపడే 48 మంది మహిళలకు ఆ నమూనాల వాసనను చూపించారు. వీరికి మైండ్‌ఫుల్‌నెస్ లాంటి చికిత్సలు కూడా వీటితోపాటు అందించారు. నెగెటివ్ ఆలోచనల కంటే ప్రస్తుతంపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని వీరికి సూచించారు.

మరికొంత మంది మహిళలకు స్వచ్ఛమైన గాలి వాసన చూడమని చెప్పారు.

దీంతో చెమటను వాసన చూసినవారు మైండ్‌ఫుల్‌నెస్ థెరపీకి మెరుగ్గా స్పందిస్తున్నారని అధ్యయనంలో రుజువైంది.

వీడియో క్యాప్షన్, లీటర్ 80 కోట్ల రూపాయలు

‘‘ఇక్కడ సంతోషంగా ఉన్నప్పుడు లేదా భయపడుతున్నప్పుడు ఏ సమయంలో చెమట అయినా ఒకేలాంటి ప్రభావం చూపుతోంది’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఎలీసా విజ్నా చెప్పారు.

‘‘ఇతరుల చెమట వాసనను పీల్చడంతో మనలో కలిగే కొన్ని మార్పులు ఆ చికిత్సను ప్రభావితం చేస్తున్నట్లు మేం పరిశోధనలో గుర్తించాం’’ అని ఆమె వివరించారు.

‘‘కేవలం చెమట వాసన చూడటంతోనే ఇక్కడ మార్పు కనిపిస్తోంది. అయితే, ఈ ఫలితాలను ధ్రువీకరించేందుకు లోతైన అధ్యయనం అవసరం. దీని కోసమే మేం మరో అధ్యయనం కూడా చేపడుతున్నాం. అందులో ఎలాంటి భావోద్వేగాలు లేని సినిమాలను చూసినప్పుడు వచ్చే చెమట నమూనాలు కూడా పరీక్షిస్తున్నాం’’అని ఆమె చెప్పారు.

వీడియో క్యాప్షన్, పొగ తాగని వారికీ ఊపిరితిత్తుల క్యానర్స్ వస్తోంది ఎందుకు?

చెమటే ఎందుకు?

మన శరీరంపై చర్మం నుంచి వచ్చే చెమట చాలా వరకు ఎలాంటి వాసనా రాదు. కానీ, చంకలు లేదా గజ్జల్లోని కొన్ని శ్వేద గ్రంథుల నుంచి వచ్చే చెమట కాస్త భిన్నంగా ఉంటుంది.

ఇక్కడి చర్మంపై ఉండే బ్యాక్టీరియా, దగ్గర్లోని కేశాల రంధ్రాలు కొన్ని సమ్మేళనాలను విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో ఇక్కడి నుంచి ఒకరమైన వాసన వస్తుంటుంది.

వాసన, టేస్ట్ డిజార్డర్‌లపై పనిచేస్తున్న ఫిప్త్ సెన్స్ చారిటీకి చెందిన డంకన్ బోక్ మాట్లాడుతూ.. ‘‘వాసన చూసే సామర్థ్యం, మన మానసిక ఆరోగ్యాల మధ్య గట్టి సంబంధముంటుందని ఇదివరకే అధ్యయనాలు నిరూపించాయి’’అని చెప్పారు.

‘‘జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా ఇతరుల నుంచి వచ్చే వాసన చూసే సామర్థ్యం కోల్పోతే డిప్రెషన్ లేదా ఒంటరులై పోవడం లాంటి భావన కలుగుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది’’ అని ఆయన వివరించారు.

‘‘ప్రస్తుతానికి ఇది చాలా ప్రాథమిక అధ్యయనమే. దీన్ని ధ్రువీకరించేందుకు లోతైన పరిశోధనలు అవసరం. మన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో వాసన ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దిశగా అధ్యయనాలు జరగడం చాలా ముఖ్యం’’ అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)