స్వర్గానికి వెళ్లడానికి ఆకలితో చావాలని చెబితే దాదాపు 100 మంది ప్రాణాలు తీసుకున్నారు... ఆ అడవిలోని రహస్య ప్రదేశంలో ఏం జరుగుతోంది?

కెన్యా

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, సమాధులు ఉన్న ప్రాంతాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు
    • రచయిత, డామియన్ జేన్
    • హోదా, బీబీసీ న్యూస్

కెన్యా తీరానికి దగ్గర్లోని ఒక అడవి మధ్యలో శిలువ పెట్టి ఉన్న తాజా మట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు ఆ మట్టిదిబ్బలపై దృష్టి సారిస్తున్నారు.

ఇప్పటివరకు 14 సామూహిక సమాధుల నుంచి శవాలను వెలికితీశారు. గత నాలుగు రోజులుగా ఆ సమాధుల్లో నుంచి డజన్ల కొద్ది శవాలను వెలికి తీయడాన్ని హుస్సేన్ ఖాలిద్ చూస్తున్నారు.

‘‘ ఆ వాసనను భరించలేం’’ అని బీబీసీతో ఆయన చెప్పారు.

చనిపోయిన వారందరూ ‘‘గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చ్’’ అనే సంఘం సభ్యులుగా భావిస్తున్నారు. చనిపోయిన వారి సంఖ్య 80కి పైగా ఉంది.

ప్రపంచం అంతం కాబోతుందని, స్వర్గానికి వెళ్లాలంటే ఆకలితో చావాలని వారిని ఒప్పించినట్లు అక్కడివారు నమ్ముతున్నారు.

‘‘హకి ఆఫ్రికా’’ అనే మానవ హక్కుల సంస్థను ఖాలిద్ నిర్వహిస్తున్నారు. స్థానికుల నుంచి సమాచారం అందడంతో ఈ సంస్థ నిర్వాహకులు, అధికారులను అడవిలోని సమాధుల వద్దకు తీసుకెళ్లారు.

షాకహోలా అడవిలో చాలా రహస్యమైన ప్రాంతంలో ఈ సమాధులు ఉన్నాయని ఖాలిద్ చెప్పారు. దారి వెంట పొదలను నరుక్కుంటూ తమ బృందం ఆ ప్రాంతానికి చేరుకుందని ఖాలిద్ తెలిపారు.

కెన్యా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మంగళవారం నాటికి 89 మృతదేహాలు లభ్యం అయ్యాయి

భారీగా మృతదేహాలు

మంగళవారం నాటికి 89 మృతదేహాలను వెలికి తీశారు. ఈ మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

రెడ్ క్రాస్ చెప్పినదాని ప్రకారం, 112 మంది కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో తుది మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చని పోలీసులు అంటున్నారు.

ఆ ప్రదేశంలో దాదాపు 60 వరకు సామూహిక సమాధులు ఉండొచ్చని ఖాలిద్ అంచనా వేస్తున్నారు. నాలుగింట ఒక వంతు సమాధులు మాత్రమే ఇప్పటివరకు వెలికితీశారని ఆయన చెప్పారు.

ఇప్పటివరకు 29 మందిని ప్రాణాలతో కాపాడినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే, వారంతా ప్రపంచం అంతం అవుతుందని నమ్ముతున్నందున, ప్రాణాలతో బయటపడటానికి సుముఖత చూపుతున్నట్లు కనిపించట్లేదని పోలీసులు అంటున్నారు.

20 ఏళ్ల పడిలో ఉన్న ఒక మహిళను ఆదివారం ఖాలిద్ చూశారు. ఆమె చాలా నీరసంగా, బలహీనంగా కనిపించారు. కానీ, ఆమెలో బతకాలనే ఆశ కనిపించట్లేదని, ఆమె ఎలాంటి సహాయాన్ని కోరుకోవట్లేదని ఖాలిద్ చెప్పారు.

‘‘ఆమెకు స్పూన్‌తో గ్లూకోజ్ నీరు ఇవ్వడానికి మేం ప్రయత్నించాం. కానీ, ఆమె వద్దన్నారు. తన నోటిని పూర్తిగా మూసుకున్నారు. తనకు ఎలాంటి సహాయం అక్కర్లేదని సూచించారు’’ అని ఖాలిద్ తెలిపారు.

మెరుగైన చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు.

40 ఏళ్ల వయస్సులో ఉన్న మరో వ్యక్తిని కూడా ఖాలిద్ కలిశారు. ఆయన మాట్లాడే స్థితిలోనే ఉన్నారని అన్నారు.

‘‘తనను కాపాడొద్దని ఆయన మాతో అన్నారు. తను స్పృహలోనే ఉన్నానని, ఏం చేస్తున్నానో తనకు బాగా తెలుసు అని చెప్పారు. తనను ఒంటరిగా వదిలేయాలని అన్నారు. తాను స్వర్గానికి వెళ్లకుండా అడ్డుకునే శత్రువులు మీరు అంటూ మమ్మల్ని అతను దూషించారు’’ అని ఖాలిద్ వివరించారు.

ఆ వ్యక్తిని కూడా ఆసుపత్రికి తరలించారు.

కెన్యా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మరిన్ని మృతదేహాలు లభ్యం అవుతాయని అంచనా వేస్తున్నారు

పిల్లలు కూడా...

మలిండి కమ్యూనిటీ హ్యుమన్ రైట్స్ సెంటర్‌కు చెందిన విక్టర్ కౌడో, మృతదేహాల వెలికితీతలో సహాయపడుతున్నారు.

అక్కడ దాదాపు 150 మృతదేహాలు ఉంటాయని ఆయన నమ్ముతున్నారు.

తన ముగ్గురు పిల్లలను రక్షించాలంటూ ఒక ఇన్‌ఫార్మర్ తమ సంస్థను సంప్రదించారని విక్టర్ తెలిపారు.

‘‘ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మేం ఒకరిని మాత్రమే కాపాడగలిగాం’’ అని బీబీసీతో ఆయన చెప్పారు.

‘‘ఆ బాలుడికి ఆరేళ్లు ఉండొచ్చు. అప్పటికే ఆ బాలుడి సోదరుడు, సోదరి చనిపోయారు. మేం అక్కడికి చేరుకోవడానికి ఒకరోజు ముందే వారిని ఖననం చేశారు’’ అని ఆయన తెలిపారు.

అంత మంది ప్రజలు ఉద్దేశపూర్వకంగా, ఇష్టంగా ఆకలి చావులకు గురవ్వడంతో దేశం మొత్తం నివ్వెరపోయింది.

వీడియో క్యాప్షన్, శిలువ వేయడం ఎప్పుడు మొదలైంది? ఈ శిక్షఎంత క్రూరంగా ఉండేది?

కెన్యా ఒక మతపరమైన దేశం. ఇక్కడి జనాభాలో 85 శాతం క్రైస్తవులే.

కెన్యా అధ్యక్షుడు విలియం రూటో కూడా ఒక మత నిష్ట గల వ్యక్తి. గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చ్ నాయకుడు, పాస్టర్ మకెంజీ ఎన్‌థెంగె ‘‘ఏ మతానికి చెందని వ్యక్తి’’ అంటూ రూటో విమర్శించారు.

ఈ ఘటనను ఒక ఊచకోతగా అభివర్ణించారు కెన్యా హోం మంత్రి కిథురె కిండికి.

ఇద్దరు పిల్లల మరణాల కేసులో గత నెలలో మకెంజీపై అభియోగాలు నమోదయ్యాయి. ఆ పిల్లల తల్లిదండ్రులు ఇటీవలే ఆ చర్చిలో చేరారు.

ఆ తర్వాత ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. మళ్లీ ఇప్పుడు పోలీసు కస్టడీలో ఉన్నారు.

‘‘ఇంత దుర్మార్గమైన, ఇంత తీవ్ర స్థాయిలో జరిగిన ఘోరాన్ని ఎవరూ ఎందుకు గుర్తించలేకపోయారు? ’’ అని సెనెట్ ప్రెసిడెంట్ అమాసన్ కింగి ప్రశ్నించారు.

ఆకలితో చనిపోవడానికి ఎందుకు సిద్ధపడుతున్నారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి.

సరైన నియంత్రణ లేని చిన్న చిన్న చర్చ్‌లు కెన్యాలో విస్తరిస్తున్నాయని, ఇవే సమస్యగా మారాయని సైకాలజిస్ట్ డాక్టర్ జేమ్స్ కిప్సంగ్ అన్నారు.

ఈ చర్చ్‌ల నాయకులు ప్రజల మెదళ్లను నాశనం చేయగలరని చెప్పారు.

325 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండే ఆ అడవిలో, ప్రజలు రహస్యంగా ప్రార్థన చేసే ఒక స్థలం ఉన్నట్లు తనకు సమాచారం అందిందని ఖాలిద్ చెప్పారు.

ఆ ప్రదేశాన్ని అధికారులు వీలైనంత త్వరగా గుర్తించి, సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆయన కోరారు.

కనిపించకుండా పోయిన తమ బంధువుల గురించి అధికారులకు తెలియజేయడం కోసం సమాధులు తవ్వుతున్న చోటుకు స్థానికులు రావడం మొదలుపెట్టారు.

వరుసగా 14, 17, 21 ఏళ్లు ఉన్న ముగ్గురు పిల్లలను చర్చ్‌లో చేర్చడం కోసం తన సోదరుడు తీసుకెళ్లాడంటూ ఒక వ్యక్తి తనతో చెప్పినట్లు ఖాలిద్ గుర్తు చేసుకున్నారు.

ఆ పిల్లలు కూడా చనిపోయి ఉంటారని ఆ వ్యక్తి ఇప్పుడు భయపడుతున్నారు.

వీడియో క్యాప్షన్, మత మార్పిళ్లకు కారణాలు ఏమిటి? కర్ణాటక బిల్లుపై వివాదం ఎందుకు?

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)