ఆకలి చావుతో స్వర్గం: 21 మృతదేహాలను గుర్తించిన కెన్యా పోలీసులు, పాస్టర్ అరెస్ట్

ఫొటో సోర్స్, Reuters
కెన్యాలోని మాలింది పట్టణానికి దగ్గర్లో 21 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. 'ఆకలితో చనిపోతే' త్వరగా 'స్వర్గానికి' చేరుకోవచ్చని ఒక మత బోధకుడు చెప్పిన మాటలను నమ్మి వీరంతా ఇలా సామూహికంగా మరణించారు. ఈ సంఘటనపై కెన్యా పోలీసులు విచారణ చేస్తున్నారు.
పోలీసులు వెలికి తీసిన మృతదేహాల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మరిన్ని మృతదేహాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
ఈ సామూహిక సమాధులన్ని షాకహోలా అటవీ ప్రాంతంలో ఉన్నాయి. ఇదే అడవి నుంచి గత వారం గుడ్ న్యూస్ చర్చికి చెందిన 15 మందిని పోలీసులు రక్షించారు.
మత బోధకుడు పాల్ మాకెంజీ ఎన్తెన్గేని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది.
త్వరగా స్వర్గానికి చేరుకోవాలంటే ఆకలితో అలమటించి చనిపోవాలని పాస్టర్ మాకెంజీ ఎన్తెన్గే మాలింది తీర ప్రాంతంలోని తన అనుచరులకు చెప్పేవారని ఆరోపణలు ఉన్నాయి.
గత నెలలోనే పాస్టర్ మాకెంజీపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
ఆయన్ను ‘కల్ట్ లీడర్’ అని ఆ దేశ టీవీ చానెల్ కేబీసీ అభివర్ణించింది. ఇప్పటి వరకు ఇలాంటి 58 సమాధులను గుర్తించినట్లు తెలిపింది.
ఆ సమాధుల్లో ఒక దానిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలున్నాయి. ఆ మృతదేహాలు ముగ్గురు పిల్లలవి, వారి తల్లిదండ్రులవి.
అయితే, తాను ఏ తప్పు చేయలేదని మాకెంజీ వాదిస్తున్నారు. 2019 నుంచి తాను చర్చిని మూసి ఉంచినట్లు చెబుతున్నారు. ఆయనకు కోర్టు బెయిల్ కూడా నిరాకరించింది.
ప్రస్తుతం వెలికి తీసిన మృతదేహాల డీఎన్ఏ శాంపుల్స్‌ను పాథాలజిస్ట్‌లు సేకరిస్తున్నారు. వీరంతా ఆకలితోనే చనిపోయారా, లేదా అన్నది పరీక్షల్లో నిర్ధారించనున్నారు.
తమకి తాము ఆకలితో అలమటించి చనిపోయిన నలుగురు వ్యక్తుల మృతదేహాలను కనుగొన్న తర్వాత ఏప్రిల్ 15న మాకెంజీని పోలీసులు అరెస్ట్ చేశారు.
‘‘మేం ఈ అడవిలోకి వచ్చినప్పుడు, ఇక్కడ పెద్ద పెద్దగా శిలువ గుర్తులున్న సమాధులను చూశాం. అంటే ఇక్కడ ఐదుగురు కంటే ఎక్కువ మందిని సమాధి చేసినట్లు మాకు అర్థమైంది’’ అని మాలింది సోషల్ జస్టిస్ సెంటర్ విక్టర్ కౌదో సిటిజన్ టీవీకి చెప్పారు.
ఈ ప్రాంతంలోని మూడు గ్రామాలకు నజారెత్, బేత్లేహెం, జూడియా అనే పేర్లు పెట్టారని, ఇక్కడున్న అనేకమందికి బాప్తిజం ఇచ్చారని చెబుతున్నారు. ఆ తర్వాత వీరందరినీ ఉపవాసం ఉండాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఫొటో సోర్స్, BARAJAH FAMILY
కెన్యా ఒక మతపరమైన దేశం. ప్రమాదకరమైన, క్రమబద్ధీకరించని చర్చిలు, ఆరాధనలు చాలానే ఉన్నాయక్కడ. వాటిలో చేరడానికి నిర్వాహకులు ప్రజలను ఆకర్షిస్తుంటారు.
ఇలాంటి ఘటనే తూర్పు ఆఫ్రికాలోని మొజాంబిక్‌లో కూడా చోటుచేసుకుంది.
గత ఫిబ్రవరిలో మొజాంబిక్‌లోని ఎవాంజెలిస్ట్ చర్చి పాస్టర్ ఫ్రాన్సిస్కో బరాజా ఇలాగే ఉపవాసం ఉండి మరణించారు.
'ఏసుక్రీస్తులా ఉపవాసాన్ని అనుసరించాలని ఏం తినకుండా, తాగకుండా 40 రోజుల పాటు అడవిలో ఉంటే, నిత్యజీవానికి మార్గం సుగమం చేయడానికి ఆ ఉపవాసం ఒక మార్గం' అని బరాజా నమ్మారు.
అనుకున్నట్లుగానే అక్కడి అడవిలో ఉపవాస దీక్ష ప్రారంభించారు పాస్టర్ బరాజా. అయితే 25 రోజులకే ఆయన పరిస్థితి విషమంగా మారింది.
దీంతో ఆయనను మొజాంబిక్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే 25 రోజుల పాటు ఏం తినకుండా, తాగకుండా ఉండటతో బరాజాస్ చాలా బరువు తగ్గారు. శక్తిని కోల్పాయారు.
దీంతో ఆసుపత్రిలోనే మరణించారు బరాజా.
ఇవి కూడా చదవండి:
- ఆవు, గేదె పాలే తాగాలా? గాడిద, గుర్రం, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? బీపీ, డయాబెటిస్, ఆటిజం తగ్గించే పాలు ఉంటాయా
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
- భారత్, నేపాల్ మధ్య పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నారు?
- అమెరికా: పొరపాటున డోర్‌బెల్ కొట్టినందుకు టీనేజర్ తలపై రివాల్వర్‌తో కాల్పులు
- హీట్ వేవ్స్: భారత్‌లో వేలాది మంది ప్రాణాలు తీస్తున్న వడగాడ్పులను ఎదుర్కోవడం ఎలా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














