భారత్ vs పాకిస్తాన్: ముస్లిం జనాభా గురించి నిర్మలా సీతారామన్ అన్న మాటలు ఎంతవరకు నిజం? - రియాల్టీ చెక్

ఫొటో సోర్స్, AFP
- రచయిత, శృతి మీనన్, షదాబ్ నాజ్మీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారతదేశంలో ముస్లింల పరిస్థితిపై పలు కామెంట్లు చేశారు.
అమెరికా పర్యటన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బీజేపీ హయాంలో దేశంలో ముస్లింల పరిస్థితి దిగజారిపోయిందన్న వాదనలను తోసిపుచ్చారు.
సీతారామన్ చేసిన కొన్ని వ్యాఖ్యలను మేం నిశితంగా పరిశీలించాం. అవి ఎంతవరకు నిజమో తెలుసుకునేందుకు ఫ్యాక్ట్ చెక్ చేశాం.
'అత్యధిక ముస్లిం జనాభా కలిగిన రెండవ దేశం'
ఈ వాదన ఎంత నిజమో కచ్చితంగా తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే, తాజా జనాభా లెక్కలు అందుబాటులో లేవు. దేశంలో చివరి జనాభా లెక్కల సేకరణ 2011లో జరిగింది.
అమెరికాకు చెందిన ప్యూ రిసెర్చ్ సెంటర్ 2020లో వేసిన అంచనాల ప్రకారం, ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన రెండవ దేశం భారతదేశమే. మొదటిది ఇండోనేషియా కాగా, మూడవ స్థానంలో పాకిస్తాన్ ఉంది.
కానీ, ప్యూ లెక్కలు భారత్, పాకిస్తాన్‌లలో గత జన గణన నివేదికలపై ఆధారపడి వేసిన అంచనాలు. అంటే 2011 (భారత్), 2017 (పాకిస్తాన్) నాటి జనాభా లెక్కల ఆధారంగా చేసిన అంచనాలు.
పాకిస్తాన్ జనాభా లెక్కల విశ్వసనీయతను గతంలో నిపుణులు ప్రశ్నించారు.
పాకిస్తాన్‌లో 2017 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా కరాచీ, సింధ్, బలూచిస్తాన్ వంటి ప్రాంతలలో జనాభాను సరిగ్గా లెక్కించలేదని, వాస్తవం కన్నా లెక్కల్లో జనాభాను తక్కువగా చూపించారన్న ఆరోపణలు ముందుకొచ్చాయి.
"పాకిస్తాన్ లెక్కల్లో కొంత అస్పష్టత ఉంది. ఇప్పుడు భారత్ కంటే పాకిస్తాన్‌లో ముస్లింల సంఖ్య కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది" అని ప్యూ రీసెర్చ్‌లో అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రెలిజియన్ కాన్రాడ్ హాకెట్ అన్నారు.

'సంఖ్యలలో మాత్రమే వృద్ధి'
సీతారామన్ చెప్పింది నిజమే. ముస్లిం జనాభా సంఖ్య పెరుగుతోంది. కానీ, అన్ని మతాల్లోనూ జనాభా పెరుగుతోంది. దేశ జనాభాయే పెరుగుతోంది.
అయితే, జనాభా వృద్ధి రేటు తీసుకుంటే, అంటే జనాభా సంఖ్యలో మార్పు శాతం చూస్తే, 1991 నుంచి ముస్లిం జనాభా వృద్ధి రేటు తగ్గుతూ వస్తోంది. మొత్తంగా దేశ జనాభా వృద్ధి రేటు కూడా తగ్గుతూ వస్తోంది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019 గణాంకాల ప్రకారం, మిగతా మతాలతో పోల్చుకుంటే ముస్లింలలో సంతానోత్పత్తి రేటు అధికంగా ఉంది.
అయితే గత రెండు దశాబ్దాల్లో ఇది గణనీయంగా తగ్గుముఖం పట్టిందని డాటా చెబుతోంది.
వాస్తవానికి, హిందువుల కన్నా ముస్లింలలో సంతానోత్పత్తి రేటు ఎక్కువ తగ్గుతోంది. 1992లో 4.4 నుంచి 2019లో 2.4 కి తగ్గింది.
సంతానోత్పత్తి రేటులో మార్పులు సామాజిక, ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉంటాయి కానీ, మతపరమైనవి కావని 'పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా'లో రిసెర్చర్ సంఘమిత్ర సింగ్ అన్నారు.
"మెరుగైన విద్య, ఉపాధి, ఆరోగ్య సౌకర్యాల ఫలితంగా సంతానోత్పత్తి రేటులో తరుగుదల కనిపిస్తోంది" అని ఆమె వివరించారు.

అయినప్పటికీ, కొన్ని హిందూ గ్రూపులు, భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకులు ముస్లిం జనాభా పెరుగుదల గురించి తప్పుదోవ పట్టించే వాదనలు చేస్తూనే ఉన్నారు. హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనాలని కూడా కొందరు సూచించారు.
దేశంలో క్రమంగా సంఖ్యలో ముస్లింలు, హిందువులను మించిపోతారన్న వాదనలను నిపుణులు ఖండించారు. ప్రస్తుతం దేశ జనాభాలో 80 శాతం హిందువులే ఉన్నారు.
కుటుంబ సంక్షేమ కార్యక్రమాన్ని సమీక్షించేందుకు ఏర్పాటుచేసిన జాతీయ కమిటీ మాజీ చైర్‌పర్సన్ దేవేంద్ర కొఠారి హిందుత్వ వాదుల వాదనలకు భిన్నంగా భవిష్యత్తును అంచనా వేశారు.
సంతానోత్పత్తి రేటులో కనిపిస్తున్న తరుగుదలను పరిశీలిస్తే, వచ్చే జనాభా లెక్కల్లో హిందువుల నిష్పత్తి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు.

'భారతదేశంలో ముస్లింల పరిస్థితి'
దేశంలో ముస్లింల పరిస్థితి దిగజారిపోతోందన్న వాదనలకు సీతారామన్ బదులిస్తూ, అదే నిజమైతే దేశంలో ముస్లిం జనాభా ఇంత పెరిగి ఉండదు అన్నారు.
భారతదేశంలో ముస్లింలు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వారి పిల్లలకు విద్య అందుతోంది. ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందుతోందని ఆమె అన్నారు.
కానీ, దేశంలో ముస్లింలు సహా మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు, హత్యలు పెరుగుతున్నాయని మానవ హక్కుల సంఘాలు నివేదికలు అందిస్తున్నాయి.
హ్యూమన్ రైట్స్ వాచ్ 2023లో అందించిన రిపోర్టులో, బీజేపీ ప్రభుత్వం "మతపరమైన, ఇతర మైనారిటీలపై ముఖ్యంగా ముస్లింలపై క్రమబద్ధమైన వివక్ష, నిందలను మోపుతూనే ఉందని" పేర్కొంది.
మతపరమైన మైనారిటీలపై జరుగుతున్న హింస, దాడులకు సంబంధించిన అధికారిక సమాచారం అందులో లేదు. కానీ, స్వతంత్ర సంస్థలు సేకరించిన సమాచారం ఆధారంగా ద్వేషపూరిత నేరాల సంఖ్య పెరుగుతోందని చెబుతున్నాయి.

'పాకిస్తాన్‌లో మైనారిటీల సంఖ్య క్షీణిస్తోంది'
ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్తాన్‌లో మైనారిటీలపై హింస పెరుగుతోందని, ఫలితంగా ముస్లిమేతరుల సంఖ్య తగ్గిపోతోందని నిర్మలా సీతారామన్ అన్నారు.
పాకిస్తాన్ ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం. 2017 జనాభా లెక్కల ప్రకారం, అక్కడ మైనారిటీలుగా హిందువులు (2.14 శాతం), క్రైస్తవులు (1.27 శాతం), అహ్మదీయులు (0.09 శాతం) ఉన్నారు.
అయితే, పాకిస్తాన్‌లో మైనారిటీలు వేధింపులకు, హింసకు గురి అవుతున్నారనేది వాస్తవమే.
2020లో హెచ్‌ఆర్‌డబ్ల్యూ అందించిన ఒక నివేదిక ప్రకారం, పాకిస్తాన్‌లో అహ్మదీ ముస్లిం కమ్యూనిటీపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే, అక్కడి కఠినమైన దైవదూషణ చట్టాలు, ప్రత్యేక అహ్మదీ వ్యతిరేక చట్టాలకు ఆ కమ్యూనిటీ బలైపోతోంది.
క్రైస్తవులు, హిందువులపై కూడా దాడులు జరుగుతున్నాయి, దైవదూషణ నిందలు ఎదుర్కొంటున్నారు.
పాకిస్తాన్‌లో మానవ హక్కుల సంస్థ 'సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్' ప్రకారం, 1987, 2021 ఫిబ్రవరి మధ్య కనీసం 1,855 మందిపై దైవదూషణ చట్టాల కింద అభియోగాలు మోపారు.
అయితే, సీతారామన్ ఆరోపిస్తున్నట్టు ఆ దేశంలో మైనారిటీల సంఖ్య తగ్గిపోతోందా, నశించిపోతోందా అని చెప్పడానికి ఇటీవలి డాటా అందుబాటులో లేదు.
1947 తరువాత పాకిస్తాన్‌లో ముస్లిమేతరుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్న బీజేపీ వాదనలను మేం పరిశీలించాం.
వాళ్లు చేస్తున్న వాదన తప్పుదోవ పట్టించేదిగా ఉందని, వారు చూపిస్తున్న గణాంకాలలో తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)లో మైనారిటీలను కూడా కలుపుకున్నారని మా పరిశోధనలో తేలింది.


ఇవి కూడా చదవండి:
- అమర్త్యసేన్, శాంతినికేతన్ మధ్య భూ వివాదం.. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య వివాదంగా మారిందా-
- కెరియర్- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ఎక్కడ చదవొచ్చు- భవిష్యత్తు ఎలా ఉంటుంది-
- అతీక్ మర్డర్- గుడ్డు ముస్లిం ఎవరు- చనిపోవడానికి కొన్ని సెకన్ల ముందు అష్రప్ మాట్లాడింది ఇతని గురించేనా-
- పాకిస్తాన్ జనగణన- హిందువులకు ఇస్తున్న ఫారాలపై వివాదం ఏంటి- హిందువులు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు-
- ఊర్వశి- భర్త ఆచూకీ కోసం 84 రోజులు పోరాడిన మహిళ, చివరకు ఏం తేలిందంటే..-
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








