కెరియర్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ఎక్కడ చదవొచ్చు? భవిష్యత్తు ఎలా ఉంటుంది?

కెరీర్

ఫొటో సోర్స్, Getty Images

ఇంటర్మీడియట్ (12వ తరగతి) పరీక్షలు ముగిశాయి. దీంతో ఉన్నత విద్య కోసం ఏ కోర్సుల్లో చేరాలనే దానిపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు.

దేశంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్‌, ఇంజనీర్‌ కావాలని కోరుకుంటున్నారు.

ఇటీవలికాలంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో విద్యార్థులు ఇంజనీరింగ్‌లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇష్టపడుతున్నారు.

ముఖ్యంగా ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి రంగాల పట్ల ఆసక్తి చూపుతున్నారు.

అయితే చాలామందికి ఈ కోర్సులు చదవాలని ఉన్నా.. ఎక్కడ చదవాలి? అర్హతలేంటి? తదితర విషయాలపై సందేహాలు ఉంటున్నాయి.

మరి మీరు ఈ కోర్సులను ఎక్కడ చదవొచ్చు? చదివిన తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? అనే విషయాలను నిపుణుల సూచనలు తెలుసుకుందాం.

కెరీర్

ఫొటో సోర్స్, Getty Images

ఏఐ చదవడానికి ఉండాల్సిన అర్హతలేంటి?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది గతంలో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ లాంటిది.

ఏఐ విద్య అభ్యసించాలంటే అది ఏదైనా ఇంజినీరింగ్ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ (బీఈ, బీటెక్) లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ) కోర్సుల్లో ఆ విభాగం ఉండాలి.

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా ప్లస్ 2 (ఇంటర్మీడియట్) పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ఇన్‌స్టిట్యూట్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన బీటెక్ కోర్సుల్లో చేరేందుకు 'ప్రవేశ పరీక్ష' రాసి ఉత్తీర్ణులు కావాలి.

మీరు మీ పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని ఎంచుకోవాలనుకుంటే, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి వాటిలో బ్యాచిలర్ డిగ్రీ (బీఈ, బీటెక్) పూర్తి చేసి ఉండాలి.

కొన్ని కళాశాలల్లో ఈఈఈ, ఈసీఈ వంటి ఇతర బ్రాంచీలకు చెందిన విద్యార్థులు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేందుకు అనుమతిస్తారు.

అయితే ఎంపిక చేసుకున్న కళాశాల వెబ్‌సైట్‌లో ఇచ్చిన అర్హతను చూసి దీన్ని నిర్ణయించాలి.

కెరీర్

ఫొటో సోర్స్, Getty Images

ఈ కోర్సులు ఎక్కడెక్కడ చదువుకోవచ్చు?

హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూతో పాటు పలు విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో బీఈ, బీటెక్ చదవాలనుకునే విద్యార్థులకు ఈ కోర్సును అందిస్తున్నాయి.

భారత్‌లోని ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి కళాశాలలు ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి.

అనేక స్వయంప్రతిపత్తిగల కళాశాలలు, ప్రైవేట్ వర్చువల్ విశ్వవిద్యాలయాలు కూడా ఏఐకి సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి.

తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ, దాని అనుబంధ కళాశాలల్లో కొన్ని మాత్రమే బీఈ, బీటెక్ కోర్సులలో ఏఐ సంబంధిత సబ్జెక్టులను అందిస్తున్నాయి.

అయితే అన్నా యూనివర్శిటీతో సహా అనేక కళాశాలలు పోస్ట్ గ్రాడ్యుయేట్‌లో ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ సంబంధిత కోర్సులు కలిగి ఉన్నాయి.

అన్నా యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ వేల్‌రాజ్ బీబీసీతో మాట్లాడుతూ.. అన్నా యూనివర్శిటీతో సహా 450కి పైగా అనుబంధ కళాశాలల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లోని అన్ని విభాగాల్లో ఏఐ, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా ఆధారంగా 3 కోర్సులు ఉన్నాయని చెరప్పారు.

“కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో మాత్రమే కాకుండా, మెకానికల్, సివిల్ వంటి అనేక రంగాలలో కూడా ఏఐ సాంకేతికత అభివృద్ధి పెరుగుతోంది.

దీనిని పరిగణనలోకి తీసుకుంటే, విద్యార్థులందరికీ ప్రాథమిక అంశాలను బోధించడానికి 2021 నుంచి ఏఐ, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా ఆధారంగా 3 సబ్జెక్టులను ప్రవేశపెట్టారు” అని ఆయన చెప్పారు.

ఏఐ వంటి రంగాల్లో వృద్ధిని సాధించే విధంగా కోర్సులను ప్లాన్ చేసుకోవాలన్నారు.

కెరీర్

ఫొటో సోర్స్, Getty Images

ఏఐ కోర్సు ఎంపికపై నిపుణులు ఏమంటున్నారు?

''ఈ ఆధునిక ప్రపంచంలోని మార్పులను పరిశీలిస్తే ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి కోర్సులను ఎంచుకునే విద్యార్థులకు రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని తమిళనాడు ఉన్నత విద్యా శాఖ సలహాదారు మాణికం అన్నారు.

‘‘ఆటోమేటిక్ కార్లు, పర్సనల్ రోబోట్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ లాంటి టెక్నాలజీల అభివృద్ధి ఉన్నత స్థాయికి చేరుకుంది. దీనికి 5G, 6G ఇంటర్నెట్ స్పీడ్ తోడైతే, మానవజాతి కొత్తగా అభివృద్ధి చెందుతుంది. దీనికి ఓ రూపం ఇవ్వడానికి క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి విద్యార్థులు ఈ విభాగాన్ని ఎంచుకుని చదవడం మంచి నిర్ణయం’’ అని వివరించారు.

అయితే, ఏఐ సాంకేతికత అభివృద్ధి ఇంకా ప్రారంభ దశలోనే ఉందని.. ఈ రంగం వృద్ధికి మరింత సమయం పడుతుందని జర్మనీలోని టెస్లాలో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న దినేష్‌కార్తీక్ అన్నారు.

‘‘చాలా కంపెనీలు ఇప్పటికీ తమ సంస్థల్లో ఏఐ-ఆధారిత సాంకేతికతను వాడటం లేదు. ప్రస్తుతం ఏఐ సెక్టార్‌లో కొన్ని ఉద్యోగాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రంగం వృద్ధి సాధిస్తున్న కొద్దీ ఉద్యోగాలు పెరుగుతాయి" అని ఆయన చెప్పారు.

కెరీర్

ఫొటో సోర్స్, Getty Images

ఏఐ కోర్సులను ఎక్కడ చదవాలి?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్‌మెంట్ భారత్‌లో ఇంకా పూర్తి సామర్థ్యాన్ని చేరుకోలేదని మాణికం చెప్పారు.

"విదేశాలతో పోలిస్తే మన దేశంలోని 90 శాతం కళాశాలల్లో విద్యార్థులకు ఏఐ సంబంధిత కోర్సులను అందించడానికి తగిన మౌలిక సదుపాయాలు లేవు. అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు లేరు.

ఐఐటీలు, కొన్ని ప్రైవేట్ కళాశాల్లో మాత్రమే ప్రపంచ స్థాయి సౌకర్యాలున్నాయి.

కాబట్టి దేశంలోని ఏదైనా కళాశాలలో బీఈ (సీఎస్ఈ, ఐటీ) చదివిన తర్వాత అమెరికా, యూరప్ వంటి ప్రాంతాలకు వెళ్లి మీ మాస్టర్స్ చేయవచ్చు" అని ప్రొఫెసర్ మాణికం సూచించారు.

ఏఐ టెక్నాలజీ ఆధారిత ఇంజనీరింగ్ కోర్సులు భారత్‌లో కంటే కెనడా, అమెరికా, స్వీడన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో మెరుగ్గా ఉన్నాయని చెన్నైకి చెందిన విదేశీ విద్యా సలహాదారు సతీష్ కుమార్ బీబీసీతో చెప్పారు.

"చాలా యూరోపియన్ దేశాలలో ప్రజలు రోజువారీ జీవితంలో ఏఐ ఆధారిత ప్రోడక్టులను వాడుతున్నారు. ఆ దేశాల్లోని యూనివర్సిటీల్లో చదివితే పరిశోధనలకు, ట్రైనింగ్‌కు అవకాశాలు ఎక్కువుంటాయి. అక్కడే ఎక్కువ ఉద్యోగాలు ఉన్నందున భారత్ నుంచి చాలా మంది ఏఐ సంబంధిత అధ్యయనాల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు” అని సతీష్ కుమార్ చెబుతున్నారు.

కెరీర్

ఫొటో సోర్స్, Getty Images

'నా కొడుక్కి ఉద్యోగం వస్తుందనుకుంటున్నా..'

చెన్నైకి చెందిన మురుగేషన్ రెండేళ్ల క్రితం తన కొడుకును బీటెక్ - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో చేర్పించారు.

‘‘3వ సంవత్సరం చదువుతున్న నా కొడుకు గత సెమిస్టర్ వెకేషన్‌లో శిక్షణ కోసం పుణెలోని ఓ కంపెనీకి వెళ్లాడు.

వచ్చే ఏడాది తన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన తర్వాత, క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాను” అని మురుగేషన్ చెబుతున్నారు.

నేటి తరం విద్యార్థులు ఉన్నత విద్యలో ఏం చదవాలి, ఏ కోర్సులో మంచి ఉద్యోగం సాధించాలి అనే విషయాలపై పాఠశాలలో చదువుకుంటూనే చర్చించుకుంటున్నారు.

ఇంటర్నెట్ సాయంతో సులభంగా చాలా విషయాలు నేర్చుకుంటున్నారని చెన్నైలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ధనలక్ష్మి చెప్పారు.

‘‘12వ తరగతి పరీక్షా ఫలితాలు రాకముందే మా పాఠశాలలో చదువుతున్న కొందరు విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

కొంతమంది విద్యార్థులకు ఆర్థిక సహాయం కూడా అందింది. చిన్న వయస్సులో ఈ విద్యార్థులు తమకు ఏం కావాలో స్పష్టంగా ఉంటారు.

కాబట్టి తల్లిదండ్రులు తమ ఇష్టానుసారం కళాశాలలను ఎంచుకోవడానికి విద్యార్థులను అనుమతించాలి” అని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)