అమర్త్యసేన్, శాంతినికేతన్ మధ్య భూ వివాదం.. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య వివాదంగా మారిందా?

ఫొటో సోర్స్, SANJAY DAS
- రచయిత, ప్రభాకర్ మణి తివారీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లా శాంతినికేతన్‌లో ఉన్న విశ్వభారతి విశ్వవిద్యాలయం భూమిలో ఒక చిన్న భాగం గురించి కొన్ని నెలలుగా వివాదం నెలకొంది. ఆ భూమిపై ఎవరికి యాజమాన్య హక్కులు ఉన్నాయన్న దానిపై తగాదా నడుస్తోంది.
నోబెల్ గ్రహీత, కవి రవీంద్రనాథ్ ఠాగూర్ 1921లో ఎర్రమట్టి నేలగా పేరొందిన బీర్‌భూమ్ జిల్లాలోని శాంతినికేతన్‌లో ఈ యూనివర్సిటీని స్థాపించారు.
వందేళ్ల తరువాత ఈ భూమి చుట్టూ వివాదం నెలకొంటుందని, మరో నోబెల్ గ్రహీత దీనికి కేంద్రబిందువు అవుతారని అప్పట్లో ఠాగూర్ ఊహించి ఉండరు.
ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ఈ వివాదంలో ఒక పక్షాన ఉన్నారు.
ఏమిటీ వివాదం?
అమర్త్యసేన్‌కు విశ్వభారతి యూనివర్సిటీ క్యాంపస్‌లో 1.38 ఎకరాల స్థలం ఉంది. దాన్లో ఆయన ఇల్లు కూడా కట్టుకున్నారు. దాని పేరు ప్రతీచి.
అయితే, సేన్‌కు 1.25 ఎకరాల భూమిపై మాత్రమే యాజమాన్య హక్కులు ఉన్నాయని యూనివర్సిటీ అంటోంది. మిగిలిన భూమిని ఆయన కబ్జా చేశారని, అలా చేయడం అక్రమమని, అందుకే ఆ భూమిని తిరిగి ఇచ్చేయాలని వాదిస్తోంది.
కానీ, ఆ భూమిని తన తండ్రి మార్కెట్ నుంచి కొనుగోలు చేశారని, అందుకే ఇప్పుడు దాన్ని తన పేరు మీదకు బదిలీచేయాలని సేన్ అంటున్నారు.

ఫొటో సోర్స్, SANJAY DAS
విశ్వవిద్యాలయం నుంచి సేన్‌కు లేఖ
విశ్వభారతి యూనివర్సిటీ జనవరిలో భూమి అనధికార ఆక్రమణపై అమర్త్యసేన్‌కు లేఖ రాసింది.
అక్రమంగా కబ్జా చేస్తున్న భూమిని యూనివర్సిటీకి అప్పగించాలని కోరింది.
నిజానికి, ఈ వివాదం చాలా ఏళ్లుగా ఉంది. ఈ ఏడాది జనవరిలో అది ముదిరింది.
యూనివర్సిటీ జనవరిలో సేన్‌కు పలు నోటీసులు పంపించింది. ఈ నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జనవరి చివరలో శాంతినికేతన్‌ను సందర్శించారు. అమర్త్యసేన్‌తో మాట్లాడారు.
"వారు మిమ్మల్ని అవమానిస్తున్నారు. అందుకే ఇక్కడికి వచ్చాను. ఈ భూమి మీకే చెందుతుందని ప్రభుత్వ పత్రాల్లో స్పష్టంగా ఉంది. యూనివర్సిటీ యాజమాన్యం అబద్ధాలు చెబుతోంది" అని అన్నారు.
దీనితో పాటు, సేన్‌కు దస్తావేజులు అందజేసి, ఆయనకు జెడ్-కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
యూనివర్సిటీ యాజమాన్యం సేన్‌ను అవమానించిందని, అవసరమైతే ప్రభుత్వం ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని మమతా బెనర్జీ చెప్పారు.
కానీ, విశ్వభారతి వైస్ ఛాన్సలర్ (వీసీ) బిద్యుత్ చక్రవర్తి మాత్రం సేన్‌కు ముఖ్యమంత్రి ఇచ్చిన పత్రాలు పొంతన లేనివని ఆరోపించారు.

ఫొటో సోర్స్, SANJAY DAS
వీసీ ఏమన్నారు?
"సేన్ 2006 సంవత్సరంలో బిగాకు రూ. 5,000 చొప్పున 1.25 ఎకరాల భూమిని మ్యుటేషన్ చేశారు. ఆయన 1.38 ఎకరాలకు చెల్లించలేదు కాబట్టి దాన్ని ఇప్పుడు దానిని ఎలా తీసుకుంటారు?" అని బిద్యుత్ చక్రవర్తి వాదిస్తున్నారు.
మమతా బెనర్జీ యూనివర్సిటీకి వచ్చి వెళ్లిన కొన్ని రోజుల తరువాత యూనివర్సిటీ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మహువా గంగూలీ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ అంశాన్ని ముఖ్యమంత్రి 'చెవులతో వింటున్నారు' అని ఆరోపిస్తూ, యూనివర్సిటీకి ముఖ్యమంత్రి ఆశీస్సులు అవసరం లేదని, ఇది ప్రధానమంత్రి చూపిన బాటలో నడుస్తోందని అందులో పేర్కొన్నారు.
కాగా, యూనివర్సిటీ విడుదల చేసిన ప్రకటనలో ఉపయోగించిన భాషపై పలువురు విద్యావేత్తలు విమర్శలు గుప్పించారు.
"ఇది విశ్వవిద్యాలయ భాష కాదు, మమత భూమి పత్రాలను అందజేయడానికి మాత్రమే సేన్ ఇంటికి వెళ్లారు" అని విద్యావేత్త పవిత్ర సర్కార్ అన్నారు.
ఈ వివాదం కొనసాగుతుండగా, అమర్త్యసేన్ ఫిబ్రవరి 23న అమెరికా వెళ్లారు.
పబ్లిక్ ప్రాంగణాల చట్టం (అనధికారిక ఆక్రమణల తొలగింపు) చట్టం, 1971 ప్రకారం ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని యూనివర్సిటీ యాజమాన్యం గత నెల 17న సేన్‌కు పంపిన లేఖలో కోరింది.
దీనికి మార్చి 24లోగా సమాధానం ఇవ్వాలని, సంబంధిత పత్రాలతో మార్చి 29న విచారణకు రావాలని కోరింది.
ఆ తరువాత సేన్, తన న్యాయవాది గోరాచంద్ చక్రవర్తి ద్వారా మూడు నెలల సమయం కావాలని లేఖ పంపారు.
అయితే, యూనివర్సిటీ యాజమాన్యం పది రోజుల సమయం మాత్రమే ఇచ్చింది. ఏప్రిల్ 13న ఈ అంశంపై విచారణ జరుపుతామని చెప్పింది.

ఫొటో సోర్స్, SANJAY DAS
భూకబ్జా ఆరోపణలు
ఆ భూమిని రవీంద్రనాథ్ ఠాగూర్ అమర్త్యసేన్‌కు బహుమతిగా ఇచ్చారని యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది. అయితే దానిపై తనకు చట్టబద్ధమైన హక్కు ఉందని సేన్ అంటున్నారు.
విశ్వభారతి యాజమాన్యం 2020 డిసెంబర్‌లో తొలిసారిగా ఈ ఆరోపణలుచేసింది. శాంతినికేతన్ క్యాంపస్‌లోని భూమిని సేన్ అక్రమంగా ఆక్రమించుకున్నారని పేర్కొంది.
ఈ ఏడాది జనవరి 24, 27 తేదీల్లో సేన్‌కి పంపిన లేఖలలో, గ్రీన్ జోన్‌లోని 0.13 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించారని యూనివర్సిటీ యాజమాన్యం ఆరోపించింది. ఆ భూమిని తిరిగి ఇవ్వాలని కోరింది.
వివాదం ముదరడంతో మమతా బెనర్జీ జోక్యం చేసుకుని, సేన్‌పై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని చెబుతూ ఈ ఏడాది జనవరి 30న ఆయనకు భూమి పత్రాలను అందజేశారు.
ఠాగూర్ కాలంలో చాలా మంది ప్రముఖులకు యూనివర్సిటీ క్యాంపస్‌లో 99 ఏళ్ల లీజుకు స్థలాలు ఇచ్చారు.
అమర్త్యసేన్ తండ్రి అశుతోష్ సేన్‌కు 1.38 ఎకరాలు కాకుండా, 1.25 ఎకరాల భూమిని మాత్రమే లీజుకు ఇచ్చారని యూనివర్సిటీ చెబుతోంది.
అమర్త్యసేన్ తాత, సంస్కృత పండితుడు క్షితిమోహన్ సేన్, రవీంద్రనాథ్ ఠాగూర్‌తో కలిసి విశ్వభారతి విశ్వవిద్యాలయం స్థాపనలో ముఖ్య పాత్ర పోషించారు.
ఠాగూర్ ఆహ్వానం మేరకు ఆయన 1908లో శాంతినికేతన్ చేరుకున్నారు. క్షితిమోహన్ ఈ విశ్వవిద్యాలయానికి రెండవ వైస్-ఛాన్సలర్‌గా వ్యవహరించగా, అమర్త్యసేన్ తండ్రి అశుతోష్ సేన్ ఇక్కడ ప్రొఫెసర్‌గా పనిచేశారు.

ఫొటో సోర్స్, SANJAY DAS
వివాదం చుట్టూ రాజకీయాలు
ఈ అంశంపై అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయాలు జోరందుకున్నాయి.
తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ జనవరి 28న మాట్లాడుతూ, "విశ్వభారతి వైస్ ఛాన్సలర్ ఆరోపణలు, తరువాత ఇచ్చిన ప్రకటన దురదృష్టకరం. అమర్త్యసేన్ మమతను మెచ్చుకుని, కేంద్ర ఆర్థిక విధానాలను విమర్శించారు. దీన్ని బీజేపీ నేతలు సహించలేకపోతున్నారు. అందుకే సేన్‌ని టార్గెట్ చేస్తున్నారు" అని అన్నారు.
"అమర్త్యసేన్ బెంగాలీలకు, ప్రపంచానికి గర్వకారణం. ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను పదే పదే అవమానిస్తున్నారు. విశ్వభారతి విశ్వవిద్యాలయం రవీంద్రనాథ్ అడుగుజాడల్లో కాకుండా, ప్రధాని ఆశయాలను అనుసరిస్తోందని చెప్పేవారు కచ్చితంగా బీజేపీ బాటలో నడుస్తున్నవారే" అంటూ తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ విమర్శించారు.
యూనివర్సిటీకి కాషాయి రంగు పూస్తున్నారని మమతా బెనర్జీ కూడా ఆరోపించారు.
అయితే, ఈ భూవివాదంలో అమర్త్యసేన్ పేరు చెప్పకుండా వైస్ ఛాన్సలర్ బిద్యుత్ చక్రవర్తి ఆయనను టార్గెట్ చేశారు.
ఈ వివాదంలో ముఖ్యమంత్రి జోక్యంతో వ్యవహారం మరింత జఠిలమైందని వీసీ అన్నారు.
సేన్ తరపు న్యాయవాది గోరాచంద్ చక్రవర్తి మాట్లాడుతూ, "వీసీ నేరుగా సేన్ పేరు ప్రస్తావించలేదు కాబట్టి, ఆయన మాటలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని" అన్నారు.
"యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ చాలా తక్కువ సమయం ఇచ్చింది. పేపర్‌లతో సేన్ ఇక్కడికి రావడం చాలా కష్టం" అన్నారు.
విశ్వవిద్యాలయ ప్రతినిధి ఒకరు బీబీసీతో మాట్లాడుతూ, "మేం మా వైఖరిని స్పష్టం చేశాం. ఈ అంశంపై తదుపరి తేదీ తరువాత మాత్రమే యాజమాన్యం తిరిగి వ్యాఖ్యానిస్తుంది" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 'హెల్త్ యాంగ్జైటీ' లక్షణాలు ఏమిటి? దీనికి చికిత్స ఎలా?
- ఆంధ్రప్రదేశ్‌లో మామిడి దిగుబడి ఎందుకు తగ్గుతోంది? ఉపాధిపై ఎందుకు దెబ్బ పడుతోంది?
- పోలీసుల ఘోర తప్పిదంతో టీనేజర్‌కు మరణశిక్ష, 28 ఏళ్లు జైల్లోనే..చివరికెలా బయటపడ్డారంటే?
- ఏడీఆర్ రిపోర్ట్: అప్పుడూ, ఇప్పుడూ తెలుగు నేతలే కుబేరులు
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 104 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది














