కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్ష కాబోతున్నాయా?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు

ఫొటో సోర్స్, TWITTER/INC

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే నెలలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపోటములు బీజేపీ కన్నా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ మీదే జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే దానర్ధం, బీజేపీకి ఈ ఎన్నికలలో అడ్డంకులు లేవని కాదంటున్నారు.

కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధిస్తే, అది పార్టీలో నూతనోత్సాహాన్ని నింపుతుందని, రాబోయే రోజుల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ లాంటి రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికల్లో కార్యకర్తలు "ఉత్సాహంగా" పాలుపంచుకుంటారని ఎన్నికల విశ్లేషకుడు సంజయ్ కుమార్, రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ అభిప్రాయపడుతున్నారు.

చారిత్రకంగా చూసుకుంటే దక్షిణ భారత రాష్ట్రాలలో ఓటింగ్ సరళి ఉత్తర రాష్ట్రాలకు భిన్నంగా ఉంటూ వచ్చింది.

ఒక రకంగా, కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ మీద పెద్దగా ఉండకపోవచ్చు. అయితే, విశ్లేషకుల అభిప్రాయం పూర్తిగా భిన్నంగా ఉంది.

“ఈ ఎన్నికలలో కనుక బీజేపీ ఓటమి పాలైతే కాంగ్రెస్ పార్టీకి, విపక్షాలకు జీవం పోసినట్టు అవుతుంది. వాళ్లు నూతన ఉత్సాహంతో పనిచేయడం మొదలుపెడతారు. అయితే, బీజేపీకి ఇది ఒక ఎదురుదెబ్బ మాత్రమే అవుతుంది. వారి మీద పెద్ద ప్రభావంమేమీ ఉండదు. కానీ కాంగ్రెస్ ఓటమి పాలైతే, వారికిది చావు దెబ్బే అవుతుంది. ఈ ఓటముల నడుమ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ వాదనని నిర్మించడం, ప్రచారం చేయడం కష్టమవుతుంది” అని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ మాజీ డైరక్టర్ సంజయ్ కుమార్ బీబీసీతో అన్నారు.

"2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ఏ ప్రచారంతో ముందుకు రాబోతుందో వీలైనంత త్వరగా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. వరుసగా ఓటములు ఎదురవుతుంటే సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం కష్టమవుతుంది. అందుకే ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ముఖ్యమైనవి” అని ఆయన అన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

బీజేపీకి ఎదురవుతున్న సవాళ్లు

ఈ ఎన్నికలలో ఓటమి ప్రభావం కాంగ్రెస్ మీదున్నట్టు బీజేపీ మీద ఎందుకు ఉండదు అనే దానికి డాక్టర్ సంజయ్ కుమార్ ఒక ఉదాహరణ ఇచ్చారు.

" క్లాస్‌లో టాపర్ ఒక సబ్జెక్ట్‌లో సరిగా మార్కులు సంపాదించకపోయినా కూడా తన టాపర్ స్టేటస్‌కు వచ్చిన ఢోకా ఏమి ఉండదు. ఇదీ అంతే" అని ఆయన అన్నారు.

కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి పాలైతే, అది ఆ పార్టీకి “పెద్ద దెబ్బ” అని డాక్టర్ సంజయ్ కుమార్ చెప్పినదానితో అజీమ్ ప్రేమజీ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఎ. నారాయణ ఏకీభవించారు.

“బీజేపీ ఓటమి పాలైతే, దక్షిణ భారతదేశంలో తమ ప్రభావం చూపలేకపయింది అనుకోవచ్చు. గెలిస్తే మాత్రం పక్క రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఆ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం భారీ స్థాయిలో పెరుగుతుంది” అని నారాయణ అన్నారు.

“బీజేపీకి దక్షిణ భారతదేశంలో ఇంకా పూర్తి స్థాయిలో అవకాశం దొరకలేదు. ప్రస్తుతం కర్ణాటక కేంద్రంగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నాలలో ఉంది” అని అన్నారు.

కర్ణాటక

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP

భారత ప్రజాస్వామ్య చరిత్రలో కర్ణాటక ఓటర్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1984లో రాజీవ్ గాంధీ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో గెలిపించారు. కానీ, తొమ్మిది వారాలలోనే 1985 జనవరిలో జరిగిన ఎన్నికలలో జనతా పార్టీకి చెందిన రామకృష్ణ హెగ్డేకి రాష్ట్ర స్థాయిలో విజయాన్ని అందించారు.

ఈ ఎన్నికలలో ఆ విధంగా బీజేపీ గెలుస్తుంది అని అనుకోవచ్చా?

“ఒకదాని తరువాత ఒకటిగా ఎన్నికలను ఒక క్రమంలో గెలిచే సత్తా బీజేపీకి రెండు,మూడు సంవత్సరాల క్రితం వరకు బాగా ఉండేది. ఇప్పుడు ఆ సామర్ధ్యం తగ్గింది. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పాలన ఏ విధంగా ఉన్నా, వరుసగా ఎన్నికల్లో గెలిచే బలం బీజేపీకి ఈనాడు లేదు. ఇలా గెలిచే సామర్ధ్యం 2015-19 మధ్య ఉండేది. ప్రభుత్వ పనితీరు బాగులేకపోతే, సవాళ్లును ఎదుర్కోక తప్పదు” అని డాక్టర్ సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

1999 నుంచి కర్ణాటకలో ఉన్న 28 లోక్‌సభ నియోజకవర్గాలలో రెండు అంకెల్లో సీట్లను బీజేపీ గెలుస్తూ వస్తోంది. దానికి ఒక ముఖ్య కారణం, హెగ్డే లోక్ శక్తి పార్టీని బీజేపీ ఆధ్వర్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో విలీనం చేసిన లింగాయత్ కుల ఓటు బ్యాంకును తిరిగి బీజేపీ గూటికి చేర్చటమే.

1999లో 13 సీట్లు గెలుచుకున్న బీజేపీ 2019 ఎన్నికలలో 25 సీట్లతో విజయభేరి మోగించింది.

అలాగే, బీజేపీ సంకీర్ణంలో కానీ, కాంగ్రెస్ సంకీర్ణంలో కానీ కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో కర్ణాటకకు మంచి ప్రాతినిధ్యం లభించింది.

దానితో పాటు విదేశాంగ శాఖ, రైల్వే శాఖ, సామాజిక న్యాయం, కార్మిక శాఖ, ఆహార శుద్ధి శాఖ లాంటి కీలకమైన శాఖలు కూడా లభించాయి.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై

ఫొటో సోర్స్, BASAVARAJ S BOMMAI

ఫొటో క్యాప్షన్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై

ప్రజాస్వామ్య క్షేత్రం మీద కర్ణాటక ఎన్నికల ప్రభావం

కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రభావం వివిధ రంగాల్లో రాబోయే రోజులలో కనిపిస్తుంది అని యోగేంద్ర యాదవ్ అభిప్రాయపడ్డారు.

“మన సార్వభౌమ దేశం తునాతునకలు అవుతున్న పరిస్థితి నేడు ఉందని నేను స్పష్టంగా చెబుతున్నా. రాజ్యాంగం చెప్పిన సమాన పౌరసత్వం అనే దానిని ఇప్పటికే పాతరేశారు. స్వేచ్ఛను కాలరాశారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలను బలహీనపరుస్తున్నారు. అందువలన ఇప్పుడు సవాలు కేవలం ప్రజాస్వామ్యానికే కాదు. మన సార్వభౌమ దేశమే సవాళ్లను ఎదుర్కుంటున్నది. భారతదేశం అనే ఒక రాజకీయ విశ్వాసాన్ని, వ్యవస్థని నేడు వీళ్లు ధ్వంసం చేస్తున్నారు.

ఈ కారణంగా మన సార్వభౌమ దేశాన్ని మనం తిరిగి మన సొంతం చేసుకోవాలి. కర్ణాటక ఎన్నికలలో బీజేపీ ఓటమితోనే ఈ ప్రక్రియ నిర్ణయాత్మకంగా ముందడుగు వేయగలదు. రాహుల్ గాంధీ 'భారత్ జోడో' యాత్ర ఒక ఊపుని అయితే ఇచ్చింది. ఒక రకంగా బీజేపీ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, వాళ్ల విధ్వంసానికి అడ్డుకట్ట వేసింది. ఈ ఊపుని ముందుకు తీసుకువెళ్లటం అనేది కర్ణాటక ఓటర్ల మీద ఆధారపడి ఉంది” అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి: