సావర్కర్‌పై వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ ప్రతిపక్షాల ఐక్యతకు గండికొట్టారా?

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, సల్మాన్ రావీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం సాయంత్రం రాజ్యసభలోని ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే నివాసానికి చేరుకున్నప్పుడు, సోనియా గాంధీ, 18 విపక్షాల నాయకులు అక్కడే ఉన్నారు.

అయితే, అక్కడకు ఒక విపక్షం ప్రతినిధులను పంపకపోవడంపై మీడియాలో చర్చ జరిగింది. ఆ విపక్షమే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన.

ఆ సమావేశానికి ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి ఎంపీ లేదా ప్రతినిధులు ఎవరూ హాజరుకాలేదు.

ఖర్గే నివాసంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఉద్ధవ్ ఠాక్రేనే స్వయంగా హాజరుకావాల్సి ఉంది. కానీ, ఆయన రాలేదు.

దిల్లీలోని అక్బర్ రోడ్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వేదికగా శనివారం సాయంత్రం రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘నా పేరు సావర్కర్ కాదు. నేను రాహుల్ గాంధీని. గాంధీలు ఎవరికీ క్షమాపణలు చెప్పరు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

మోదీ ఇంటి పేరుతోపాటు ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని పార్లమెంటులో అధికారపక్షం రాహుల్‌ను డిమాండ్ చేస్తోంది. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ రాహుల్ తాజా వ్యాఖ్యలు చేశారు.

సావర్కర్‌పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడంతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ కూటమిలో భాగమైన ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విపక్షాల సమావేశానికి హాజరుకాకుండా రాహుల్‌కు ఉద్ధవ్ స్పష్టమైన సందేశం పంపించారు.

సావర్కర్‌ను పదేపదే అవమానించడం మానుకోవాలని మీడియా వేదికగా రాహుల్‌కు ఉద్ధవ్ ఠాక్రే సూచించారు.

ఉద్ధవ్ ఠాక్రే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉద్ధవ్ ఠాక్రే

ఉద్ధవ్ ఏం చెప్పారు?

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ.. ‘‘అండమాన్‌లోని కాలాపానీ జైలులో సావర్కర్ చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆయన మాకు దేవుడు లాంటివారు. ఆయన్ను అవమానిస్తే, మేం సహించబోం’’అని ఉద్ధవ్ చెప్పారు.

సావర్కర్‌ను ఇలా అవమానిస్తే, విపక్షాల్లో చీలిక తప్పదని కూడా ఉద్ధవ్ ఠాక్రే స్పష్టంగా సంకేతాలు ఇచ్చారు.

మహారాష్ట్రలోని మాలేగావ్‌లో సోమవారం ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇక్కడ శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ జట్టుకట్టాయి. కానీ, రాహుల్‌ను కొందరు రెచ్చగొడుతున్నారు. ఆయన ఇలాంటి అంశాలపై కాలం వృథా చేస్తే, ప్రజాస్వామ్యం కథే ముగిసిపోతుంది’’అని ఆయన అన్నారు.

మరోవైపు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని విడిగా కలిసి, ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచిస్తామని ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు.

సావర్కర్ విషయంలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన వైపే ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వానికి తమ అభ్యంతరాలను పవార్ కూడా చేరవేశారు.

ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్

ఫొటో సోర్స్, Getty Images

మహారాష్ట్రలో సావర్కర్‌కు ఎందుకంత ప్రాధాన్యం?

పీటీఐ వార్తా సంస్థ సమాచారం ప్రకారం, మార్చి 27న విపక్షాల సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పిలుపునిచ్చారు.

ఈ సమావేశానికి శరద్ పవార్ హాజరయ్యారు. మహారాష్ట్రలో సావర్కర్‌కు ప్రజాదరణ చాలా ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం కూటమికి మంచిదికాదని ఆయన కాంగ్రెస్ నాయకత్వానికి సూచించారని మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇదివరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్రలో ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే పాల్గొన్నారు. అయితే, ఆ యాత్ర సమయంలోనూ సావర్కర్‌పై రాహుల్ విమర్శలు చేశారు. ఈ విషయంపై ఉద్ధవ్ ఠాక్రే శివసేన అధికార పత్రిక ‘‘సామ్నా’’లో రాహుల్ గాంధీని విమర్శిస్తూ కథనం ప్రచురించారు.

మహావికాస్ అఘాడీలో భాగస్వాములం అయినంత మాత్రాన, సావర్కర్‌పై రాహుల్ చేసే వ్యాఖ్యలను సహించబోమని ఆ కథనంలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన వ్యాఖ్యానించింది.

‘‘నేను సావర్కర్‌ను కాదని రాహుల్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసినంత మాత్రన, ప్రజల్లో సావర్కర్‌పై ఉండే అభిమానం ఏ మాత్రమూ తగ్గిపోదు’’అని సామ్నా కథనంలో వ్యాఖ్యనించారు.

తాజా వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ రాజకీయంగా ఇంకా పరిపక్వత సాధించలేదని ఆయన్ను వ్యతిరేకించేవారు విమర్శలు చేసేందుకు ఒక అవకాశం ఇచ్చినట్లయిందని సీనియర్ జర్నలిస్టు రషీద్ కిద్వాయి వ్యాఖ్యానించారు.

‘‘ఒక అంశంపై చాలా పార్టీలు కలిసి మాట్లాడేందుకు సిద్ధమైనప్పుడు, తమ సిద్ధాంతాలను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఎదుటి పార్టీలో కొన్ని అంశాలపై మనం ఏకీభవించాల్సి ఉంటుంది’’అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కంటైనర్ల కాన్వాయ్ ఎందుకు?

రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు?

‘‘రాహుల్ గాంధీ తమ సొంత కుటుంబాన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. భిన్న పార్టీలతో ఎలా ముందుకు వెళ్లాలో జవహర్‌లాల్ నెహ్రూను చూస్తే తెలుస్తుంది. ఈ విషయంలో ఇందిరా గాంధీ కూడా చాలా మెరుగ్గా పనిచేశారు. సావర్కర్‌పై ఆమె ఒక పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేశారు’’అని రషీద్ అన్నారు.

రాహుల్ గాంధీ సైద్ధాంతికంగా కూడా కాస్త పట్టువిడుపులు ప్రదర్శించాలని, అప్పుడే భిన్న పార్టీలతో కలిసి వెళ్లడం సాధ్యం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అడ్వాణీ

ఫొటో సోర్స్, Getty Images

అడ్వాణీ ఏం చేశారు?

‘‘పాకిస్తాన్ పర్యటకు వెళ్లినప్పుడు అడ్వాణీ కూడా ఇలాంటి తప్పులే చేశారు. ఆయన అక్కడ మహమ్మద్ అలీ జిన్నాను స్వాతంత్ర సమరయోధుడిగా కొనియాడారు. కొన్నిసార్లు మనం ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్త వహించాలి. ఫలితంగా ఏమైంది. ఆయన రాజకీయ ప్రస్థానంపై ఆ వ్యాఖ్యలు ప్రభావం చూపించాయి’’అని రషీద్ అన్నారు.

‘‘సైద్ధాంతికంగా విభేదాలు ఉన్నప్పటికీ, ఆపరేషన్ బ్లూస్టార్ విషయంలో బాలాసాహెబ్ దేవరాస్, నానాజీ దేశ్ ముఖ్‌లు ఇంధిరా గాంధీపై ప్రశంసలు కురిపించారు. అయితే, అప్పటికి వారి మధ్య చాలా విభేదాలు ఉండేవి’’అని ఆయన చెప్పారు.

‘‘కొన్నిసార్లు అసలు పెద్దగా ఆలోచించకుండానే రాహుల్ గాంధీ ఏదో మాట్లాడేస్తుంటారని ఆయన్ను వ్యతిరేకించేవారు అంటుంటారు’’అని ఆయన అన్నారు.

‘‘బహుశా అందుకేనేమో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లతో ఆయనకు అంత మంచి సంబంధాలు లేవు. రాజకీయాల్లో కొనసాగాలంటే భిన్న పార్టీలను కలుపుకొని వెళ్లేలా ఉండాలి. మీరు ఆ పార్టీ సిద్ధాంతాలతో ఏకీభవించకపోవచ్చు.. కానీ, వారిని మనసు గాయపడేలా వ్యాఖ్యలు చేయకూడదు’’అని ఆయన అన్నారు.

ఏక్‌నాథ్ శిందే

ఫొటో సోర్స్, ANI

దూకుడు పెంచిన బీజేపీ

మరోవైపు తాజా వ్యాఖ్యలతో తనను విమర్శించేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాహుల్ మరింత అవకాశం ఇచ్చారు.

సావర్కర్‌పై వ్యాఖ్యల విషయంలో చాలా మంది మంత్రులు, బీజేపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా రాహుల్‌పై విమర్శలు చేశారు.

కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ మాట్లాడుతూ.. ‘‘మీరు కలలో కూడా సావర్కర్ కాలేరు. ఎందుకంటే దీని కోసం చాలా ఆత్మవిశ్వాసం, దేశంపై ప్రేమ, నిబద్ధత కావాలి’’అని వ్యాఖ్యానించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కూడా ఆ వ్యాఖ్యలను చూపించి ఉద్ధవ్ ఠాక్రే శివసేనపై విమర్శలు చేశారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ‘‘సావర్కర్ గౌవర యాత్ర’’ను చేపడతామని వీరిద్దరూ ప్రకటించారు.

వీడియో క్యాప్షన్, తెలంగాణలో భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీని కలిసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

శివసేనలో వర్గాల మధ్య..

ఇటీవల మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాల సమయంలోనూ సావర్కర్‌పై శివసేన ఏక్‌నాథ్ శిందే విభాగం నాయకుడు, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే మాట్లాడారు. ‘‘రాహుల్ పదేపదే సావర్కర్‌ను అవమానిస్తున్నారు. కానీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎంపీలు మాత్రం అసలేమీ మాట్లాడటం లేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, దీనిపై ఉద్ధవ్ ఠాక్రే శివసేన అధికార ప్రతినిధి మనీషా కాయాందే బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ సీఎం, డిప్యూటీ సీఎం మాలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, మేం ఆ అవకాశాన్ని ఇవ్వబోం’’అని అన్నారు.

‘‘గత ఎనిమిదేళ్లలో సావర్కర్‌కు బీజేపీ ఎందుకు భారత రత్న ఇవ్వలేకపోయింది? ఈ ప్రశ్నను ప్రజలు అడుగుతున్నారు. ఓట్ల కోసమే వీరు సావర్కర్ పేరును వాడుకొంటున్నారు. వీరు ప్రజల మధ్యకు వెళ్తే గోవా, నాగాలాండ్‌తోపాలు కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో గోమాంస విధానాలపై ప్రజలు ప్రశ్నలు అడుగుతారు’’అని ఆమె అన్నారు.

సావర్కర్‌పై వ్యాఖ్యల విషయంలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన అభ్యంతరాలు వ్యక్తంచేసిందని, ప్రతిపక్షాల సమావేశానికి కూడా అందుకే వెళ్లలేదని మనీషా అన్నారు.

‘‘సావర్కర్‌ను మేం ఎప్పుడూ అభిమానిస్తూనే ఉంటాం. కానీ, కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూపోతే.. ప్రతిపక్షాల ఐక్యత అనేది కలగానే మిగిలిపోతుంది’’అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)