ఏడీఆర్ రిపోర్ట్: అప్పుడూ, ఇప్పుడూ తెలుగు నేతలే కుబేరులు

జగన్

ఫొటో సోర్స్, YS Jagan Mohan Reddy

దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్న సీఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు.

అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్ఈడబ్ల్యూ) సంస్థలు ధనిక ముఖ్యమంత్రుల జాబితాను విడుదల చేశాయి.

ఈ జాబితాలో 510 కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో ఏపీ సీఎం జగన్ టాప్‌లో ఉన్నారు.

గత ఎన్నికల్లో ముఖ్యమంత్రులు స్వయంగా దాఖలు చేసిన ఎలక్షన్ అఫిడవిట్‌లను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించినట్లు ఏడీఆర్ తెలిపింది.

దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 30 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను ఏడీఆర్ వెల్లడించింది.

పెమా ఖండూ

ఫొటో సోర్స్, PemaKhandu

ధనిక ముఖ్యమంత్రుల జాబితాలో తొలిస్థానంలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 510 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్లు తన అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు ఏడీఆర్ తెలిపింది.

ఆయన తర్వాత అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి పెమా ఖండు రెండోస్థానంలో ఉన్నారు. ఆయన 163 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారని ఏడీఆర్ వెల్లడించింది.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 63 కోట్ల రూపాయలతో మూడో స్థానంలో ఉన్నట్టు పేర్కొంది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ తాజా నివేదిక వెల్లడించింది.

ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ సగటు రూ. 33 కోట్ల 96 లక్షలుగా పేర్కొంది.

చంద్రబాబు

ఫొటో సోర్స్, NaraChandrababuNaidu

ఫొటో క్యాప్షన్, 2018లో ఏడీఆర్ విడుదల చేసిన రిపోర్టులో చంద్రబాబు సంపన్న సీఎంగా నిలిచారు.

గతంలో చంద్రబాబు టాప్

2018లో ఏడీఆర్ విడుదల చేసిన ధనిక ముఖ్యమంత్రుల జాబితాలోనూ అప్పటి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు టాప్‌లో నిలిచారు.

177 కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో సంపన్న సీఎంగా ఏడీఆర్ పేర్కొంది.

ఐదేళ్ల తర్వాత 2023లో తాజాగా విడుదల చేసిన జాబితాలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది.

2018నాటి నివేదికలో కూడా పెమా ఖండూ రెండో స్థానంలో నిలవగా, తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రుల్లో మాణిక్ సర్కార్ టాప్‌లో నిలిచారు.

ఆస్తుల్లో తెలుగు ఎంపీల హవా

ప్రస్తుత 17వ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల్లో సంపన్నుల జాబితాలో తెలుగు ఎంపీలు టాప్‌లో ఉన్నట్లు గతంలో విడుదల చేసిన ఓ రిపోర్టులో ఏడీఆర్ తెలిపింది.

భారత రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ ఎంపీ, ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో డ్రగ్స్ చైర్మన్ డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి 5 వేల 300 కోట్ల విలువైన ఆస్తులతో మొదటి స్థానంలో ఉన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి 2 వేల 577 కోట్ల విలువైన ఆస్తులతో సంపన్న ఎంపీల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఈయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ 1,001 కోట్ల రూపాయల విలువైన ఆస్తితో ధనిక ఎంపీల జాబితాలో మూడో ప్లేస్‌లో ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది.

కాంగ్రెస్ ఎంపీలు నకుల్ నాథ్ 660 కోట్ల రూపాయలు, డీకే సురేశ్ 338 కోట్ల రూపాయలు, వైఎస్సార్‌సీపీ ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణ రాజు 325 కోట్ల రూపాయలతో తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు ఏడీఆర్ తెలిపింది.

రాజ్యసభ, లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 269 మంది ఎంపీలు పది కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది.

లోక్‌సభ ఎంపీల సగటు ఆస్తుల విలువ 20 కోట్ల 47 లక్షలుగా పేర్కొంది. రాజ్యసభ సభ్యుల సగటు ఆస్తుల విలువ లోక్‌సభ సభ్యుల యావరేజ్ కంటే నాలుగు రెట్లు అధికం.

రాజ్యసభ సభ్యులు సగటున 79 కోట్ల 54 లక్షల విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది.

మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, Mamata Banerjee

ఫొటో క్యాప్షన్, తక్కువ ఆస్తులున్న సీఎంగా మమతా బెనర్జీ నిలిచారు.

ఇక తాజా ఏడీఆర్ రిపోర్టులో అత్యంత తక్కువ ఆస్తులతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరి స్థానంలో ఉన్నారు.

ఆమె ఆస్తుల విలువ 15 లక్షల 38 వేల రూపాయలుగా ఏడీఆర్ పేర్కొంది.

కోటి 18 లక్షల రూపాయల విలువైన ఆస్తులతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కోటి 27 లక్షల విలువైన ఆస్తులతో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది.

అప్పులు ఎక్కువగా ఉన్న ముఖ్యమంత్రుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మొదటి స్థానంలో ఉన్నారు.

సుమారు 8 కోట్ల 88 లక్షల రూపాయలకు పైగా అప్పులు ఉన్నాయని కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు ఏడీఆర్ తెలిపింది.

కేసీఆర్ ఆస్తుల విలువ 23 కోట్ల 55 లక్షలుగా పేర్కొంది.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై 4 కోట్ల 99 లక్షల రూపాయలతో అప్పులు ఎక్కువగా ఉన్న సీఎంలలో రెండో స్థానంలో ఉన్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శంభాజీ శిందే 3 కోట్ల 74 లక్షల రూపాయల అప్పుతో మూడో స్థానంలో ఉన్నారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, Telangana CMO

ఏడీఆర్ తాజా నివేదికలో మొత్తం 30 మంది ముఖ్యమంత్రుల్లో ముగ్గురు 50 కోట్లు, అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది.

మరో ఎనిమిది మంది ముఖ్యమంత్రులు 10 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలలోపు ఆస్తులు కలిగి ఉన్నారు. ఒక కోటి నుంచి 10 కోట్ల రూపాయలలోపు ఆస్తులు ఉన్న సీఎంలు అత్యధికంగా 18 మంది ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది.

ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే కోటి రూపాయలలోపు ఆస్తులు కలిగి ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారని ఏడీఆర్ నివేదిక తెలిపింది.

ఇవి కూడా చదవండి: