బాలుడి పెదాల మీద దలైలామా ముద్దు పెడుతున్న వీడియోపై వివాదం.. క్షమాపణలు చెప్పిన బౌద్ధ మత గురువు

దలైలామా

ఫొటో సోర్స్, Getty Images

బాలుడికి తాను ముద్దుపెడుతున్న వీడియో ఒకటి వివాదాస్పదం కావడంతో బౌద్ధ మత గురువు దలైలామా క్షమాపణ చెప్పారు.

దలైలామా తన నాలుకను బయటకు తీసి, నోటితో టచ్ చేస్తావా అని భారత్‌కు చెందిన ఆ బాలుడిని అడుగుతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.

దలైలామా మాటలు బాలుడిని, అతని కుటుంబ సభ్యులను బాధించి ఉండొచ్చని, వారికి ఆయన క్షమాపణలు చెబుతున్నారని ఆయన కార్యాలయం తెలిపింది.

దలైలామా ఆ బాలుడి పెదాలపై ముద్దుపెడుతున్నట్టు వీడియోలో ఉంది.

"తనను కలిసిన వారిని దలైలామా అమాయకంగా, సరదాగా ఆట పట్టిస్తుంటారు. జనం సమక్షంలో, కెమెరాల ముందు కూడా ఇలా చేస్తుంటారు. తాజా ఘటనపై ఆయన విచారం వ్యక్తంచేస్తున్నారు" అని ఆయన కార్యాలయం తెలిపింది.

వీడియో క్యాప్షన్, బాలుడి పెదాల మీద ముద్దు పెడుతున్న వీడియోపై వివాదం.. క్షమాపణలు చెప్పిన దలైలామా

వివాదమేంటి?

బాలుడి పెదాల మీద దలైలామా ముద్దు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. ఇది అనుచితమని, కలవరపరిచేలా ఉందని చాలా మంది సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. ఆయన్ను అరెస్టు చేయాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి.

తన ప్రవర్తనపై తీవ్ర విమర్శలు రావడంతో దలైలామా స్పందించారు. ఆ బాలుడికి, అతని కుటుంబానికి క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు.

హిమాచల్‌ప్రదేశ్‌లోని ధరమ్‌శాలలో ఉన్న దలైలామా ఆలయంలో ఫిబ్రవరి 28న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఎం3ఎం ఫౌండేషన్ నిర్వహించిన నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న దాదాపు 120 మంది విద్యార్థులతో దలైలామా మాట్లాడుతున్న సందర్భంగా ఈ ఘటన జరిగింది.

ఈ ఫౌండేషన్ రియల్ ఎస్టేట్ సంస్థ ఎం3ఎం గ్రూప్‌కు చెందినది. ఈ కార్యక్రమ ఫొటోలు, వీడియోలను ఫౌండేషన్ మార్చిలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.

ఇప్పుడు వైరల్ అయిన వీడియోలోని బాలుడిని దలైలామా ఆలింగనం చేసుకొంటున్న విజువల్ కూడా వీటిలోదే.

దలైలామా

ఫొటో సోర్స్, Getty Images

నాలుకను బయటకు చాపడం చాలా దేశాల్లో సరైనదిగా భావించకపోవచ్చు. అయితే టిబెట్‌ ప్రాంతంలో నాలుకను బయటకు చాపి పలకరించుకొనే పద్ధతి తొమ్మిదో శతాబ్దం నుంచే ఉందని చరిత్ర చెబుతోంది.

దాదాపు నాలుగేళ్ల క్రితం కూడా దలైలామా ఓ వివాదంలో చిక్కుకున్నారు. భవిష్యత్తులో ఎవరైనా మహిళ దలైలామాగా బాధ్యతలు చేపట్టే పక్షంలో ఆమె ఆకర్షణీయంగా ఉండాలని, లేకపోతే ఉపయోగం లేదంటూ 2019లో బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి.

ఈ వ్యాఖ్యలకు దలైలామా క్షమాపణ చెప్పారు.

1959లో టిబెట్‌ను స్వాధీనం చేసుకునేందుకు చైనా సాయుధ దళాలను పంపినపుడు, దలైలామా అక్కడి నుంచి భారత్‌కు వచ్చేశారు. అప్పట్నుంచి ఇండియాలోనే ఆశ్రయం పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)