భారత్-చైనా సంబంధాలు: దలైలామాకు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు ఎందుకు చెప్పారు, చైనాకు కోపం వస్తుందని తెలిసే అలా చేశారా?

దలైలామా 86వ జన్మదిన సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు

ఫొటో సోర్స్, SAM PANTHAKY

ఫొటో క్యాప్షన్, దలైలామా 86వ జన్మదిన సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు
    • రచయిత, రాఘవేంద్ర రావు
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

భారత ప్రభుత్వం 2018లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ నేతలు, ఉన్నతాధికారులు 'థాంక్యూ ఇండియా' కార్యక్రమానికి దూరంగా ఉండాలని నోటీసు జారీ చేసింది.

బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా భారత్‌లో ప్రవాసిగా 60 ఏళ్లు అవుతున్న సందర్భంగా టిబెట్ ప్రభుత్వం 'థాంక్యూ ఇండియా' కార్యక్రమాన్ని ఆ ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో దిల్లీలో నిర్వహించాలని భావించింది.

అప్పుడు భారత్ - చైనా సంబంధాలు సున్నితంగా మారడంతో, భారత్‌లోని సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ 'థాంక్యూ ఇండియా' కార్యక్రమాన్ని దిల్లీలో కాకుండా హిమాచల్‌ప్రదేశ్‌లోని తమ ప్రధాన కార్యాలయమైన ధర్మశాలలోనే నిర్వహించింది.

ప్రధాని నరేంద్ర మోదీ ఆ ఏడాది ఏప్రిల్ నెలలో చైనా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. బహుశా, ఆ పరిస్థితుల్లో చైనాను సంతోషపెట్టేందుకు టిబెట్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వకూడదని మోదీ నిర్ణయించుకొని ఉండవచ్చు.

కాగా, గత మంగళవారం దలైలామా 86వ జన్మదినం సందర్భంగా మోదీ ఆయనకు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలుపడమే కాకుండా, ఆ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపారు.

అంతకు ముందు అనేకమార్లు దలైలామాకు బహిరంగంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మోదీ, గత కొన్నేళ్లుగా అలా చేయడం మానేశారు. మళ్లీ ఇప్పుడు బహిరంగంగా శుభాకాంక్షలు తెలిపారు.

గత కొన్నేళ్లుగా చైనాతో సంబంధాలను మెరుగు పరచుకునే దిశలో భారతదేశం అన్ని వివాదాస్పద అంశాల్లోనూ జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తోందని నిపుణుల అభిప్రాయం.

అయితే, గత ఏడాది కాలంగా చైనా, భారత సంబంధాల్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో దలైలామాకు మోదీ బహిరంగంగా శుభాకాంక్షలు తెలుపడం ఆసక్తికరంగా మారింది.

దలైలామా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, దలైలామా

భారత, టిబెట్ సంబంధాలు

స్వయంప్రతిపత్తి గల టిబెట్ ప్రాంతాన్ని చైనాలో భాగంగా భారతదేశం పరిగణిస్తుంది. చైనా దలైలామాకు వ్యతిరేకి. ఆయనను వేర్పాటువాదిగా చూస్తూ ఆయనతో ఎలాంటి సంబంధాలకైనా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.

దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై కూడా ఎప్పటికప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది.

గత ఏడాది తూర్పు లద్దాఖ్‌లో భారత, చైనాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించారు.

మొదట్లో తమ సైనికుల గురించి చైనా పెదవి విప్పలేదుగానీ, తరువాత నలుగురు మరణించినట్లు వెల్లడించింది. అయితే, అంతకన్నా ఎక్కువ మందే చైనా సైనికులు మరణించినట్లు భారత్ చెబుతోంది.

రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తూ ఉన్న సమయంలో, కిందటి ఏడాది సెప్టెంబర్‌లో పాంగోంగ్ సో సరస్సు దక్షిణ ఒడ్డున ఉన్న స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (ఎస్ఎఫ్ఎఫ్‌) వికాస్ రెజిమెంట్ కంపెనీ లీడర్ నీమా తెంజిన్ మరణించారన్న వార్త తెలిసింది.

టిబెట్‌కు చెందిన నీమా తెంజిన్, పాంగోంగ్ సరస్సు వద్ద చైనా పీపూల్స్ లిబరేషన్ ఆర్మీకి, భారత సైన్యానికి మధ్య జరిగిన ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయారని ప్రవాస టిబెటన్ సభ్యులు నాండోల్ లాగయరీ తెలిపారు.

నీమా తెంజిన్ భౌతికకాయంపై భారత, టిబెట్ జెండాలు రెండూ కప్పారు. ఆయన అంత్యక్రియలు లేహ్‌లో జరిగాయి.

ఆయన అంత్యక్రియలకు బీజేపీ నేత రామ్ మాధవ్ హాజరు కావడం, వేలాది మంది టిబెటన్లకు ఆశ్రయం ఇచ్చిన భారతదేశం టిబెటన్ సమాజానికి అండగా నిలుస్తుందనే సందేశాన్ని ఇచ్చిందని పలువురు భావించారు.

ఈ సంఘటనతో స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ఏమిటనే దానిపై ఆసక్తి పెరిగింది.

1962లో ఇండో-చైనా యుద్ధం తరువాత ఈ ఫోర్స్ ఏర్పాటు చేశారు. టిబెట్ నుంచి పారిపోయి వచ్చి భారతదేశంలో ఆశ్రయం పొందిన వారిని ఇందులో నియమించారు.

వాస్తవానికి ఇది భారత సైన్యంలో భాగం కాదు. కానీ, భారత ఇంటెలిజెన్స్ ఏజన్సీ.. రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా)లో భాగం.

ఈ సంస్థ కార్యకలాపాలను చాలా రహస్యంగా ఉంచుతారు. బహుశా భారత సైన్యానికి కూడా తెలియకపోవచ్చు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ ద్వారా వీరు ప్రధాన మంత్రికి నేరుగా రిపోర్ట్ చేస్తారు. టిబెట్ సరిహద్దుల మీదుగా గూఢచర్య కార్యకలాపాలు నిర్వహించడమే ఈ ఫోర్స్ విధి అని భావిస్తారు.

2013 సిమ్లా పర్యటన సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ను కలిసిన కసూర్ గ్యారీ డోల్మా

ఫొటో సోర్స్, GYARIDOLMA.COM

ఫొటో క్యాప్షన్, 2013 సిమ్లా పర్యటన సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ను కలిసిన కసూర్ గ్యారీ డోల్మా

టిబెట్ నాయకులు ఏమంటున్నారు?

టిబెటన్ పండితుడు, నాయకుడు లోబ్సాంగ్ సంగే 2011లో సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్‌ (సీటీఐ) అధినేత అయ్యారు. బౌద్ధ సన్యాసి కాని, టిబెట్ వెలుపల జన్మించిన వ్యక్తి ఈ పదవిని పొందడం ఇదే తొలిసారి.

తరువాత ఆయన 2012 నుంచి 2021 వరకు సీటీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సంవత్సరం మేలో ఆ పదవి నుండి తప్పుకున్నారు.

టిబెట్ సమస్యలకు భారత ప్రజలు, ప్రభుత్వం అండగా ఉంటున్నారని ఆయన బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

అయితే, ఈసారి మోదీ బహిరంగంగా శుభాకాంక్షలు తెలుపడంతో టిబెట్ పట్ల భారత వైఖరి ఏమిటో ప్రపంచానికి మరింత స్పష్టంగా తెలిసిందని ఆయన అన్నారు.

"దలైలామా తనను తాను భారతదేశ పుత్రుడిగా చెప్పుకుంటారు. భారత ప్రభుత్వం ఆయనను తమ అతిథిగా గౌరవిస్తుంది. ఆయన జన్మదినం సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలుపడం భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌద్ధులందరికీ సానుకూల సందేశాన్ని అందిస్తుంది. చైనా ఒత్తిడికి భారతదేశం లొంగదని ఆ దేశానికి కూడా సందేశం ఇచ్చినట్లయింది." అని సాంగే అన్నారు.

సీటీఐ మాజీ హోం మంత్రి కసూర్ గ్యారీ డోల్మా ఈ ఏడాది జరిగిన అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేశారు.

"భారత ప్రధాని మోదీ, దలైలామాకు ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలుపడం మా అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. వీరిద్దరి మధ్య స్నేహం ఈనాటిది కాదు. మోదీ ప్రధాని కాక ముందు కూడా దలైలామాకు శుభాకాంక్షలు తెలిపేవారు.

దలైలామా శాంతికి ప్రతీక. ఆయనను భారతీయ వారసత్వానికి రాయబారిగా ప్రపంచం భావిస్తుంది. మోదీ, దలైలామాల మధ్య ఆధ్యాత్మిక స్నేహం ఉంది. ఇప్పుడు మోదీ శుభాకాంక్షలు తెలుపడాన్ని రాజకీయంగా కాక ఆధ్యాత్మికంగా చూడాలని నా అభిప్రాయం. టిబెట్, భారతదేశాల సంస్కృతి, చరిత్ర మా సంబంధాలకు ప్రతీకలు" అని గ్యారీ డోల్మా అన్నారు.

దలైలామాను ఆరాధించే టిబెటన్లు భారత దేశంలో చాలామంది ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దలైలామాను ఆరాధించే టిబెటన్లు భారత దేశంలో చాలామంది ఉన్నారు.

"థాంక్యూ ఇండియా" చేదు అంశాలు

"థాంక్యూ ఇండియా" కార్యక్రమానికి సంబంధించి "చైనా భారత్‌పై ఏదో ఒక విధమైన ఒత్తిడి పెట్టే ఉంటుందని" సాంగే అన్నారు.

ఆ కార్యక్రమానికి దూరంగా ఉండమని భారత ప్రభుత్వం సూచించినప్పటికీ కేంద్ర క్యాబినెట్ మంత్రి మహేష్ శర్మ, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని సాంగే గుర్తు చేశారు.

అయితే, ఈ మొత్తం విషయం టిబెట్ ప్రజలకు ఒక తప్పుడు సందేశాన్ని పంపించిందని, అపోహలకు దారి తీసిందని సాంగే భావిస్తున్నారు.

రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, 2018లో జరిగిన దాని కారణంగా భారత, టిబెట్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని అనుకోకూడదని డోల్మా అన్నారు.

"అన్నదమ్ముల మధ్య కొన్ని పరిస్థితుల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. ఇది చాలా సహజం. దీని గురించి మీడియాలో కూడా చాలా చర్చ జరిగింది. ఆ సమయంలో మోదీ చైనా వెళ్లవలసి ఉంది. అనవసర ఇబ్బందులేవీ తలెత్తకూడదనే ఉద్దేశంతో అలా చెప్పి ఉండవచ్చు. ఇందులో అర్థం కాకపోవడానికేమీ లేదు. ఈరోజు చైనా ఎవరికైనా భయపడుతుందంటే అది దలైలామాకు మాత్రమే. దలైలామాకు సంబంధించిన విషయాల్లో చైనా అనవసరంగా ఉలిక్కి పడుతుంటుంది. ఇది విచారకరం" అని డోల్మా అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు మోదీ, దలైలామాకు బహిరంగంగా శుభాకాంక్షలు తెలుపడం వలన భారత-చైనాల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తాయా?

"దీన్ని చైనా ఎలా చుస్తుందనే దానిపై ఏం జరుగుతుదనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ చైనా దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలనుకుంటే, దలైలామాతో ప్రధాని మోదీకి ఉన్న సన్నిహిత సంబంధం చైనాకు సానుకూల సంకేతంగా భావించాలి. దురదృష్టవశాత్తు, ప్రస్తుత చైనా ప్రభుత్వం అలా చూడట్లేదు" అని డోల్మా అన్నారు.

భారతదేశపు మెతక వైఖరిని బలహీనతగా భావించరాదని మోదీ చైనాకు సందేశం పంపారా?

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశపు మెతక వైఖరిని బలహీనతగా భావించరాదని మోదీ చైనాకు సందేశం పంపారా?

చైనాకు మోదీ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?

దలైలామాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలపడం టిబెట్ విషయంలో భారత వైఖరి మార్పుకు నిదర్శనమని చెప్పడం తొందరపాటు అవుతుందని డాక్టర్ అల్కా ఆచార్య అన్నారు. అల్కా ఆచార్య జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్‌లోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

ఆమె అభిప్రాయం ప్రకారం ఇది ఒక సందేశం మాత్రమే. దీని ఉద్దేశం కొన్ని సున్నితమైన విషయాలలో తనను ఇబ్బంది పెడితే, తాను అలాగే చేయగలనని చైనాకు చెప్పడం కావచ్చని అల్కా ఆచార్య అన్నారు.

సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్, దలైలామాలతో భారత దేశ సంబంధాలు చైనాకు ఎప్పుడూ ఇబ్బందికరంగానే ఉంటాయని అల్కా ఆచార్య అన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ అలా చేయకపోయినా, మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలపడం ద్వారా ఓ సందేశం ఇవ్వాలనుకున్నారని అల్కా అన్నారు.

''ఇది ఒక రకంగా దేశ ప్రజలకు కూడా మోదీ ఇచ్చిన సందేశం. ప్రభుత్వం చైనా విషయంలో మెతకగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తున్న వారికి ఇది సమాధానం. టిబెట్ విషయంలో దలైలామాకు సానుభూతి పరులు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. అలాగే, భారత్‌లో టిబెటన్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు ప్రభుత్వంపై కొంత అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి, ఇది అందరికీ పంపిన సందేశం అనుకోవచ్చు'' అన్నారు అల్కా ఆచార్య

ఇదొక గణనీయమైన మార్పు అన్న అంశాన్ని ప్రొఫెసర్ అల్కా ఆచార్య అంగీకరించడం లేదు. ''మేం మీ చర్యలను సహించాము. కానీ, మీరు దానికి ప్రతిఫలంగా ఏమీ చేయలేదు. మీరు అలాగే ఉంటే మేం కూడా మా వైఖరిని సమీక్షించుకోవాల్సి ఉంటుంది అన్నదే ఇందులో సందేశం'' అన్నారు ప్రొఫెసర్ అల్కా.

మరి ఇలాంటి ధోరణి వల్ల భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరగవా ? ఇది చెప్పడం చాలా కష్టమని, ఇందులో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని అల్కా ఆచార్య అన్నారు.

''దలైలామ పుట్టిన రోజుకు శుభాకాంక్షలు చెప్పడం, చైనా 100 ఏళ్ల వార్షికోత్సవం ఆ దేశానికి ఎలాంటి అభినందనలు పంపకపోవడం అనేది పెద్ద సందేశం లాంటిది. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇప్పుడు గొప్పగా లేవు. రేపు చైనా కూడా మరో విధంగా స్పందించ వచ్చు. అది కాస్త బెదిరింపు ధోరణి లేదా హెచ్చరిక లాగా ఉండొచ్చు. అయితే, భారత విదేశాంగ శాఖ నుంచి కూడా ప్రతి స్పందన రావొచ్చు. మా దేశ విశిష్ట అతిధికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాం. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని వివరణ ఇవ్వొచ్చు'' అన్నారామె.

దీనిపై దలైలామా ఏదైనా స్పందిస్తే తప్ప, ఇది ఇంకా ముందుకు పోతుందని తాను అనుకోవడం లేదని ప్రొఫెసర్ అల్కా అన్నారు. ''రెండు దేశాల మధ్య సంబంధాలు కొత్తగా చెడిపోవడానికి ఏమీ లేదు. ఇప్పటికే చెడి ఉన్నాయి'' అన్నారామె.

''చైనాకు ఇది ఒక సందేశం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ మోదీ దలైలామాకు శుభాకాంక్షలు చెప్పలేదు. భారత మాజీ ప్రధాన మంత్రులు దలైలామాను కలుసుకున్నారు. ఆయన్ను కలిసే వారిలో మతపెద్దలు, ధార్మికులు అనేకమంది ఉన్నారు. భారత్, చైనాల మధ్య గత సంవత్సరం నుంచి సంబంధాలు చెడ్డాయి. ఈ సమయంలో ఇలాంటి సందేశం ఇవ్వడం అవసరమే'' అన్నారు అశోక్ బన్సాల్.

ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ పని చేస్తున్న అశోక్ బన్సాల్ స్ట్రాటజీ ఎనలిస్ట్ కూడా.

బన్సాల్ అభిప్రాయం ప్రకారం..దౌత్యం అనేది ఒక శిల కాదు. అందులో ఎప్పుడూ మార్పులు జరుగుతుంటాయి.

''2014 లో మోదీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగినప్పుడు లోబ్సాంగ్ సాంగే హాజరయ్యారు. ఆ సమయంలో భారతదేశం-చైనా సంబంధాలు మెరుగుపడే దిశగా పయనిస్తున్నట్లు అనిపించింది. అందువల్ల చైనాతో కాస్త మెతకగా వ్యవహరించాల్సి వచ్చింది. కానీ భారత్ మెతక దనాన్ని చైనా బలహీనతగా చూసింది. అందుకే తాను కూడా దీనికి ప్రతిగా ఏదో ఒకటి చేయగలనని భారత్ సందేశం పంపింది'' అన్నారు బన్సాల్.

రెండు దేశాల మధ్య సంబంధాల విషయంలో భారత్ తాను చేయగలిగినంత చేసిందని, ఇప్పుడు బాధ్యత చైనా మీదే ఉందని బన్సాల్ అభిప్రాయడ్డారు.

''దశాబ్దాల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న సందర్భంలో చైనా తూర్పు లద్ధాఖ్ ప్రాంతంలో ఘర్షణలకు దిగింది. ఈ విషయంలో తప్పు చైనాదే. ఎందుకంటే, రెండు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ గీయాలని భారత్ ప్రదిపాదించింది. దానికి చైనా ఒప్పుకోలేదు. అలాంటప్పుడు సరిహద్దుల్లో చైన సంయమనం పాటించడం అవసరం'' అన్నారు బన్సాల్

''చారిత్రకంగా చూసినా సరిహద్దు విషయంలో భారత్ వాదన బలంగా ఉంది. చైనా వాదనను ఎవరూ సమర్ధించరు. పైగా, చైనా ఎప్పటికప్పుడు తన వాదనను మార్చుకుంటూ వస్తోంది'' అన్నారు బన్సాల్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)