భారత్, చైనా యుద్ధం కారణంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా ఎలా చీలింది

భూపేశ్ గుప్తా. అజయ్ ఘోష్

ఫొటో సోర్స్, CPI

ఫొటో క్యాప్షన్, ఫొటోలో ఎడమవైపు ఉన్న వ్యక్తి భూపేశ్ గుప్తా. కుడివైపు పేపర్ పట్టుకుని ఉన్న వ్యక్తి ప్రముఖ వామపక్ష నాయకుడు అజయ్ ఘోష్
    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) తొలి జాతీయ సమావేశం 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో జరిగింది. కానీ 1920 అక్టోబర్ 17న ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో ఈ పార్టీకి పునాది పడింది. ఉజ్బెకిస్తాన్‌ అప్పుడు సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండేది.

ఈ పార్టీ ఆవిర్భావం వెనుక కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ కీలక పాత్ర పోషించింది. భారత స్వతంత్ర పోరాటంలో కమ్యూనిస్టుల పాత్రపై అనేక సందేహాలు తలెత్తడానికి బహుశా ఇదే కారణం కావచ్చు.

1942లో మహాత్మాగాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇచ్చారు. మరోవైపు రెండవ ప్రపంచయుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి భారత కమ్యునిస్టులు సహాయం అందించాలంటూ సోవియట్ యూనియన్ పిలుపునిచ్చింది.

ఈ ఆప్షన్లలో రెండో దానివైపే భారత కమ్యూనిస్టులు మొగ్గు చూపారు. అందుకే వారు భారత స్వతంత్ర పోరాటం నుంచి వేరు పడ్డారు.

1950, 60లలో సోవియట్, చైనాల మధ్య సంబంధాలు సన్నగిల్లడం ప్రపంచవ్యాప్తంగా వామపక్ష భావజాలాన్ని ప్రభావితం చేసింది.

ఆ తర్వాత సోవియట్ యూనియన్ భారత్‌కు స్నేహ హస్తం అందించింది. నెహ్రూ విదేశీ విధానాలకు మద్దతు ఇవ్వాలని సీపీఐని కోరింది. అయితే భారత కమ్యూనిస్టుల్లో కొందరు సీనియర్ సభ్యులు కాంగ్రెస్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు.

సోవియట్ యూనియన్ అభ్యర్థన నచ్చనివారు, నెహ్రూ అంటే పడని కమ్యూనిస్టులు మార్గదర్శకత్వం కోసం చైనా వైపు చూడడం ప్రారంభించారు.

Mohit Sen's autobiography 'A Traveler and the Road'

ఫొటో సోర్స్, Rupa Publication

ఫొటో క్యాప్షన్, మోహిత్ సేన్ ఆత్మకథ 'ఎ ట్రావెలర్ అండ్ ద రోడ్'

మోహిత్ సేన్‌ను ముందే చైనా పంపారు

అయితే ఇది జరగడానికి ముందే 1950లో భారత కమ్యూనిస్ట్ పార్టీలో ఎదుగుతున్న నాయకుడు మోహిత్ సేన్‌ను చైనాలో ఉండమని పంపించారు.

మోహిత్ సేన్ తన ఆత్మకథ 'ఎ ట్రావెలర్ అండ్ ద రోడ్'లో ఆ వివరాలన్నీ రాశారు.

"పీఎల్ఏ నిర్వహించిన ఒక సమావేశంలో తొలిసారి ఛైర్మన్ మావోను చూశాం. ఆ సమావేశంలో ఆయన ప్రసగించలేదు. కానీ సభలో ప్రసగించినవారెవరూ ఆయన ప్రస్తావన లేకుండా మాట్లాడలేదు. మావో పేరెత్తినప్పుడల్లా అందరూ చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలు చేశారు.

చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసిన స్వాగత సభలో మళ్లీ ఆయనను చూశాం. అక్కడకు వచ్చిన ప్రతినిధుల బృందాలను ఒక్కొక్కరిగా ఆయనకు పరిచయం చేశారు. నా వంతు వచ్చినప్పుడు మావో చిరునవ్వుతో పలకరించారు. చైనా భాషలో "హిందూ రెన్మిన్ హంగ్ హావో" అన్నారు. అంటే "భారత ప్రజలు చాలా మంచివాళ్లు" అని అర్థం.

అదే సమావేశంలో చైనా నాయకులైన లియు షావో క్వి, జౌ ఎన్‌లై‌లను కలుసుకునే అవకాశం లభించింది. డెంగ్ జియావోపింగ్ కూడా అక్కడే ఉండి ఉండవచ్చు. కానీ, అప్పటికి ఆయన ఇంకా అంత ప్రసిద్ధి చెందలేదు కాబట్టి మాకు పరిచయం చేయలేదు" అని తన ఆత్మకథలో మోహిత్ సేన్ రాశారు.

Indian Ambassador to China Pannekar with Mao

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మావోతో చైనాలో భారత రాయబారి పన్నీకర్

మ్యాపుల కారణంగా మొదలైన వివాదం

మోహిత్ సేన్ చైనాలో మూడేళ్లపాటు ఉన్నారు. భారత్, చైనా యుద్ధానికి నాలుగేళ్ల ముందే ఇరు దేశాల సంబంధాలు క్షీణించడం మొదలైంది. భారతదేశ ఈశాన్య, వాయువ్య భూభాగాల్లో పెద్ద మొత్తాన్ని చైనా తమ దేశ పటంలో చూపించడం ప్రారంభించింది.

అప్పటి భారత రక్షణమంత్రి కృష్ణ మీనన్ భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను సంప్రదించి, ఈ విషయంపై చైనా కమ్యూనిస్ట్ పార్టీతో చర్చించమని కోరారు. దీని వలన ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారిపోతున్నాయని నచ్చజెప్పమన్నారు.

ఇదే అంశంపై కమ్యూనిస్ట్ పార్టీ శ్రేయోభిలాషులైన ఫిరోజ్ గాంధీ, ప్రొఫెసర్ కేఎన్ రాజ్‌లతో కూడా చర్చించారు.

"భారత కమ్యూనిస్ట్ నాయకులు, చైనా నాయకులతో మాట్లాడారుగానీ అది పెద్ద ప్రభావం చూపలేదు. కొన్ని రోజుల తరువాత, తమ దేశపటంలో చూపిన ఆ భూభాగం ఎప్పుడూ చైనాలోనే ఉండేదని, బ్రిటిష్ వలసపాలకులు దాన్ని స్వాధీనం చేసుకున్నారని చైనా ప్రభుత్వం, భారత ప్రభుత్వానికి తెలియజేసింది.

1914లో ఏర్పాటు చేసిన మెక్‌మోహన్ లైన్‌ను చైనా ఎప్పుడూ అంగీకరించలేదు. చైనా వ్యవహారం భారత కమ్యూనిస్టులతో పాటు, చైనాను మిత్రదేశంగా భావించే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. చైనా తన మొండిపట్టును ఎప్పటికీ విడువలేదు" అని బిద్యుత్ చక్రవర్తి తన పుస్తకం 'కమ్యూనిజం ఇన్ ఇండియా 'లో రాశారు.

పార్లమెంట్

ఫొటో సోర్స్, eparlib.nic.in

ఫొటో క్యాప్షన్, భారత పార్లమెంట్

నెహ్రూ విధానాలపై దాడి

ఈ విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకూడదని నెహ్రూ భావించారు. భారత, చైనాల మధ్య కొన్ని అపార్థాలు చోటు చేసుకున్నాయి. అవి త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆయన విశ్వసించారు.

కమ్యూనిస్టులు తప్ప ప్రతిపక్షం మొత్తం నెహ్రూ ఆలోచనా విధానాన్ని తీవ్రంగా దుయ్యబట్టింది.

1959లో చైనా బహిరంగంగా నెహ్రూ విధానాలపై దాడి చేసి మరోసారి అందరినీ విస్తుపోయేట్లు చేసింది.

చైనా వార్తాపత్రిక 'పీపుల్స్ డైలీ' లో నెహ్రూ విధానాలను విమర్శిస్తూ సంపాదకీయాలు వెలువడ్డాయి. బూర్జువా, జమీందార్లకు నెహ్రూ ప్రాతినిథ్యం వహిస్తున్నారని వాటిలో రాశారు.

ఇవన్నీ ఛైర్మన్ మావో ఆమోద ముద్రతోనే ప్రచురించారని భారత కమ్యూనిస్టులకు తెలిసింది.

అప్పటివరకు చైనా తీసుకున్న స్టాండ్‌కు ఇది పూర్తిగా విరుద్ధం.

1957లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్టులకు రాసిన ఒక లేఖలో "భారత ప్రభుత్వం ప్రగతిశీల విధానాలను అవలంభిస్తున్నప్పటికీ మీరెందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారో మాకర్థం కావట్లేదని" రాసింది.

అంతకుముందు, 1956లో జరిగిన ఎనిమిదవ కాంగ్రెస్‌లో, ప్రపంచ శాంతిని పునరుద్ధరించడానికి, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడానికి భారతదేశంతో వ్యూహాత్మకంగా చేతులు కలపాలని చైనా కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించింది. ఆ సమావేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఈఎంఎస్ నంబూద్రిపాడ్, పి. సుందరయ్య పాల్గొన్నారు.

భూపేశ్ గుప్తా

ఫొటో సోర్స్, CPI

ఫొటో క్యాప్షన్, భూపేశ్ గుప్తా

మాస్కో, ఆ తరువాత చైనా వెళ్లిన భూపేశ్ గుప్తా, అజయ్ ఘోష్‌

చైనా కమ్యూనిస్ట్ పార్టీ విధానాలలో మార్పులు చూసి కంగారుపడిన భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ తమ నాయకులు భూపేశ్ గుప్తా, అజయ్ ఘోష్‌లను మాస్కోకు పంపింది. వారు క్రుష్చెవ్, సుస్లోవ్, ఇతర సోవియట్ నాయకులతో చైనా విషయం చర్చించారు. అయితే నేరుగా చైనాతోనే మాట్లాడమని వారు సలహా ఇచ్చారు.

వారిద్దరూ చైనా వెళ్లారుగానీ ఆ దేశ నాయకుల్లో మార్పు తీసుకురావడంలో విఫలమయ్యారు అని 2011 డిసెంబర్ 6న ఫ్రంట్‌లైన్‌ మ్యాగజీన్‌కు రాసిన ఒక కథనంలో ఏజీ నూరాని వివరించారు.

"భారతదేశం స్వాధీనం చేసుకున్న తమ భూభాగంలో తమ పూర్వీకుల సమాధులు ఉన్నాయి. వాటిని రక్షించాలని మేము కంకణం కట్టుకున్నాం. మా పూర్వీకుల అస్థికలు, భారతదేశంతో స్నేహం కన్నా విలువైనవి" అంటూ చైనా నాయకులు వాదించారు.

తరువాత భూపేశ్ గుప్తా, అజయ్ ఘోష్‌, చైర్మన్ మావోను కలిసి మాట్లాడారు. ఆయనతో మాట్లాడాక, పరిస్థితులు అనుకున్నంత దిగజారిపోలేదని గ్రహించారు.

భారత్ చైనా

ఫొటో సోర్స్, Getty Images

భారత సైనికుల మరణం

చైనా నుంచి తిరిగి వచ్చాక అజయ్ ఘోష్ 'న్యూ ఏజ్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో "మావో మా మాటలను శ్రద్ధగా విన్నారు. భారత, చైనాల మధ్య సంబంధాలపై ఆందోళన చెందడం సహజమేనని అంగీకరించారు. అయితే ఈ అపార్థాలు పరస్పర అవగాహన ద్వారా మాత్రమే పరిష్కరించబడాలి. జియాంగ్, గంగా నదులు ప్రవహించినంత కాలం చైనా, భారతదేశాల మధ్య స్నేహం కొనసాగుతుంది" అని చెప్పారు.

ఈ ఇంటర్వ్యూ ప్రచురించిన అదే రోజున, కోంగ్కా పాస్ సమీపంలో చైనా సైన్యం చేపట్టిన ఆకస్మిక దాడిలో 19 మంది భారత సైనికులు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.

ఈ చర్యపై భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చైనాను వివరణ కోరారు. కానీ అటు నుంచి ఎలాంటి జవాబు రాలేదు. ఈ ఘటనపై చైనా విచారం వ్యక్తం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ విజ్ఞప్తి చేసింది.

ఈ ఘటనలో జరిగిన ప్రాణ నష్టం పట్ల ఎలాంటి సంతాపం తెలియజేయబోమని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ అధికారులు చెప్పారు.

ప్రసంగిస్తున్న భూపేశ్ గుప్తా

ఫొటో సోర్స్, CPI

ఫొటో క్యాప్షన్, ప్రసంగిస్తున్న భూపేశ్ గుప్తా

భారత కమ్యూనిస్ట్ పార్టీలో చైనా గురించి తీవ్ర అభిప్రాయబేధాలు

కమ్యూనిస్ట్ పార్టీలో భారత, చైనా సంబంధాల పట్ల లోతైన విభేదాలు బయటపడ్డాయి. చైనాను బహిరంగంగా విమర్శించవద్దని వారిస్తున్న పలువురు కమ్యూనిస్టు నాయకుల వైఖరిని శ్రీపాద్ అమృత్ డాంగే, ఎస్.జి. సర్దేశాయ్ నిరసించారు.

కాగా ఈ మొత్తం వ్యవహారంలో చైనా తప్పు లేదని సుందరయ్య నేతృత్వంలోని ఒక విభాగం అభిప్రాయపడింది.

చైనా వాదనలో నిజం ఉందని పాత మ్యాపులు, పత్రాల ద్వారా నిరూపించేందుకు సుందరయ్య ప్రయత్నించారు అని బిద్యుత్ చక్రవర్తి తన పుస్తకం 'కమ్యూనిజం ఇన్ ఇండియా' లో రాశారు.

చైనా నాయకులు దూకుడుగా ఆలోచించరని, సామ్రాజ్యవాదానికి కొమ్ము కాస్తున్న నెహ్రూ పక్షాన మనం నిలబడకూడదని సుందరయ్య వాదించారు. బీటీ రణదీవ్, బసవపున్నయ్య, ప్రమోద్ దాస్‌గుప్తా, హరికిషన్ సింగ్ సూర్జిత్ తదితరులు సుందరయ్యకు మద్దతు తెలిపారని బిద్యుత్ చక్రవర్తి తన పుస్తకంలో పేర్కొన్నారు.

అజయ్ ఘోష్, రాజేశ్వర్ రావు, భూపేశ్ గుప్తా, ఎంఎన్ గోవిందన్ నాయర్, అచ్యుత మీనన్ తదితరులు సుందరయ్యను వ్యతిరేకించారు.

కామ్రేడ్ శ్రీపాద్ అమృత్ డాంగే

ఫొటో సోర్స్, eparlib.nic.in

ఫొటో క్యాప్షన్, కామ్రేడ్ శ్రీపాద్ అమృత్ డాంగే

మరోపక్క, అమృత్ డాంగే చైనాను బహిరంగంగా విమర్శించడం మొదలుపెట్టారు.

చైనా భారత్‌పై దాడి చేసిన వెంటనే ఈఎంఎస్ నంబూద్రీపాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో దిల్లీలో ఉన్న అమృత్ డాంగేకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

చైనా దాడి గురించి మీరు ఏమనుకుంటున్నారు అని ఒక జర్నలిస్ట్ ఈఎంఎస్‌ను అడిగారు. తమదని భావిస్తున్న ప్రాంతంలోకి చైనా ప్రవేశించింది. భారతీయులు తమ భూమిని రక్షించుకునేందుకు ప్రతిఘటించారు అని వాళ్లు సమాధానం ఇచ్చారు అని మోహిత్ సేన్ తన ఆత్మకథ 'ఎ ట్రావెలర్ అండ్ ద రోడ్'లో రాశారు.

నంబూద్రీపాద్ సమాధానం చెబుతుండగానే డాంగే మధ్యలో కల్పించుకుని ఈ భూమిపై మీ అభిప్రాయం ఏమిటని వెటకారంగా ప్రశ్నించారు.

నంబూద్రీపాద్ సమాధానం ఇచ్చేలోగా.. భారత దేశమే కాదు భారత భూభాగాన్ని రక్షించుకోవాలని, చైనాకు తగిన సమాధానం ఇవ్వాలన్న నెహ్రు విజ్ఞప్తికి కమ్యూనిస్టులు కూడా మద్దతు ఇస్తున్నారు అని డాంగే చెప్పారు అని మోహిత్ సేన్ తన పుస్తకంలో రాశారు.

నికిత క్రుష్చెవ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నికిత క్రుష్చెవ్

సోవియట్ కమ్యూనిస్టులు చైనాకు వ్యతిరేకంగా నిలిచారు

డాంగే అక్కడితో ఆగకుండా మాస్కో వెళ్లి సోవియట్ కమ్యూనిస్ట్ నాయకులతోనూ, ఇతర దేశాలకు వెళ్లి అక్కడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతోనూ మాట్లాడారు. చైనా నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. భారతదేశానికి మద్దతుగా నిలబడాలని వారిని కోరారు.

దీనిపై చైనా స్పందిస్తూ "అసలైన కమ్యూనిస్టులు" అందరూ నెహ్రూ నాయకత్వాన్ని వ్యతిరేకించాలని, ఆయనను పదవి నుంచి దించేందుకు సహాయపడాలని కోరింది.

దీని తరువాత కమ్యూనిస్ట్ పార్టీ నేషనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అందులో డాంగేకు పలువురు మద్దతు తెలిపారు.

సుందరయ్య, ప్రమోద్ దాస్‌గుప్తా తదితరులు మరోవైపు నిలబడ్డారు.

ఈ రెండు వర్గాల్లోకి వెళ్లకుండా తటస్థంగా ఉండిపోయినవారు కొందరు.. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు, వ్యతిరేకించకూడదు అంటూ ప్రతిపాదించారు. భూపేష్ గుప్తా, నంబూద్రీపాద్ తదితరులు ఈ తటస్థ బృందాన్ని సమర్థించారు.

మరోపక్క చైనా నాయకులు మావో, చు ఎన్‌ లైలతో మాట్లాడి, చైనా సైన్యం భారత భూభాగం నుంచి వైదొలగకపోతే చైనాకు చమురు సరఫరా నిలిపివేస్తామని రష్యా నాయకుడు క్రుష్చెవ్ హెచ్చరించారు.

రష్యా హెచ్చరికతో చైనా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించింది.

Deng Xiao Ping

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డెంగ్ జియావో పింగ్

చైనా సలహా మేరకు పార్టీలో విభజన

డాంగే వైఖరితో విభేదించిన కొందరు నాయకులు బయటికొచ్చి మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు. వీరంతా చైనాకు మద్దతినిచ్చారు. భారత సైన్యంపై దాడి చేయడం ద్వారా చైనా ఎలాంటి తప్పూ చేయలేదని వాదించారు.

చైనా దాడితో కమ్యూనిస్ట్ పార్టీలో ఒక వర్గం జాతీయవాదానికి దగ్గరైంది. మరోవర్గం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలిచింది.

కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు హరికృష్ణ కోనార్ చైనా కమ్యూనిస్ట్ నాయకులను కలిసేందుకు అక్కడకు వెళ్లారు.

పార్టీలో అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు విడిపోవడమే మంచిదని చైనా నాయకులు సూచించారు.

EMS Namboodiripad taking oath as Chief Minister

ఫొటో సోర్స్, gad.kerala.gov.in

ఫొటో క్యాప్షన్, కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈఎంఎస్ నంబూద్రిపాద్

1964లో పార్టీ విడిపోయిన తరువాత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ - సీపీఐ (ఎం)ని ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్, కేరళ నాయకులు అనేకమంది ఇటు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో సగం మంది సీపీఎంకు వెళ్లారు.

భూపేష్ గుప్తా, నంబూద్రిపాద్ వంటి కొందరు నాయకులు మాత్రం ఈ విభజన జరగకూడదని ఆశించారు.

నంబూద్రిపాద్ సైద్ధాంతికంగా విభజనను వ్యతిరేకించినప్పటికీ, డాంగేతో ఉన్న వైరుధ్యం వల్ల మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు.

మరోవైపు, డెంగ్ జియావో పింగ్ నాయకత్వంలోని చైనా కమ్యూనిస్ట్ పార్టీ, మావో తీసుకున్న అనేక నిర్ణయాలను తోసిపుచ్చింది. కానీ, భారతదేశం పట్ల అదే వైఖరిని కొనసాగించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)