మూల కణాల మార్పిడి: క్యాన్సర్‌తోపాటు హెచ్‌ఐవీ నుంచి కోలుకున్న అమెరికన్ కథ

ఫొటో సోర్స్, CORTESIA/CITY OF HOPE
హెచ్ఐవీ నుంచి ఒక అమెరికన్ కోలుకున్నట్లుగా జులై 2022లో పరిశోధకులు ప్రకటించారు. ఎయిడ్స్‌ను పూర్తిగా నయంచేసే చికిత్సను కనిపెట్టడంలో ఈ కేసు కొత్త ఆశలు చిగురింపచేస్తోంది.
ప్రపంచంలో మూల కణాల మార్పిడి చికిత్స ద్వారా లుకేమియా, హెచ్ఐవీ నయమైనట్లు కనిపిస్తున్న ఐదుగురు రోగుల్లో ఆయన ఒకరు. వీరిలో ఆయనే పెద్దవారు.
ఆయన పేరు పాల్ ఎడ్మండ్స్. ఆయనకు అప్పుడు 66 ఏళ్లు.
ఆయనకు 1988లో ఎయిడ్స్ వ్యాధి సోకింది.
ఈ వ్యాధి నుంచి కోలుకున్నానని తెలిసినప్పుడు ఆయన తన గుర్తింపును బయటికి చెప్పలేదు. ఏడాది తర్వాత పాల్ ఎడ్మండ్స్ తనకు సోకిన వ్యాధి గురించి ప్రజలకు తెలపాలనుకున్నారు. బీబీసీ న్యూస్ బ్రెజిల్‌కు ఆయన తన తొలి ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘‘ఎయిడ్స్ బాధితులకు నేను స్ఫూర్తిగా నిలవాలనుకున్నాను. ఈ వ్యాధితో చనిపోయిన వారికి గౌరవమిచ్చేలా చేయాలనుకున్నాను’’ అని ఎడ్మండ్స్ చెప్పారు.
హెచ్ఐవీ అనేది హ్యుమన్ ఇమ్యూనోడెఫిషియెన్సీ వైరస్. ఇది రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
ఈ వ్యాధి ముదిరినప్పుడు, ఇది ఎయిడ్స్‌గా(అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియెన్సీ సిండ్రోమ్‌గా) మారుతుంది.
దీని వల్ల రోగుల రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఒక వ్యాధి తర్వాత మరో వ్యాధి వచ్చేలా చేస్తుంది.
పాల్ కేసులో పరిస్థితి మరింత జఠిలంగా ఉంది. హెచ్ఐవీ సోకినట్లు తెలిసే సమయానికే ఆయనకు ఎయిడ్స్ కూడా వచ్చింది.
ఇటీవల దశాబ్దంలో కొత్త చికిత్సలు ప్రభావం చూపుతున్నాయి. ఈ వైరస్ సోకిన ప్రజలు గతంతో పోలిస్తే ఎక్కువ కాలమే బతకగలుగుతున్నారు. హెచ్ఐవీ సోకిన చాలా మందికి ఎయిడ్స్ రావడం లేదు.
అయితే, దీన్ని పూర్తిగా నియంత్రించేందుకు ఇప్పటివరకు ఎలాంటి చికిత్సా లేదు. ఈ వ్యాధి సోకిన రోగులు తమ జీవిత కాలం మందులతో బతకాల్సిందే.
2018లో ఎడ్మండ్స్‌కు మరో ప్రాణాంతక వ్యాధి సోకింది. అదే లుకేమియా. ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడం అద్భుతమని ఆయన చెప్పారు.
లుకేమియా ఒక రకమైన క్యాన్సర్. ఇది ఎముకలు, రక్త కణాలపై ప్రభావం చూపుతుంది.
మూల కణాల మార్పిడి చికిత్సను డాక్టర్లు ఎడ్మండ్స్‌కు సూచించారు. ఇది చాలా క్లిష్టతరమైన చికిత్స. అయితే, ఎయిడ్స్ నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గమని చెప్పారు.
కాలిఫోర్నియాలో సిటీ ఆఫ్ హోమ్ క్యాన్సర్ సెంటర్‌లో ఎడ్మండ్స్‌కు 2019లో ఈ చికిత్స చేశారు.
ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2021లో ఆయన హెచ్ఐవీ ఔషధాలను తీసుకోవడం నిలిపివేశారు.
ఇప్పటి వరకు ఆయనకు హెచ్ఐవీ లక్షణాలు కానీ, లుకేమియా లక్షణాలు కానీ కనిపించలేదు.
ఎడ్మండ్స్, ఇతర నలుగురు రోగులలో కనిపిస్తున్న ఫలితాలు, ఎయిడ్స్ వ్యాధికి సరికొత్త చికిత్సా విధానాలు కనుగొనేలా వైద్యులలో, పరిశోధకులలో మరిన్ని ఆశలు కల్పిస్తున్నాయి.
మూల కణాల మార్పిడి చాలా క్లిష్టతరమైన విధానమని, దీని వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఎడ్మండ్స్‌కు చికిత్స చేసిన వైద్యుల బృందంలోని డాక్టర్ జానా డిచర్ చెప్పారు.
చాలా మంది హెచ్‌ఐవీ రోగులకు ఇది సరైన విధానం కాదన్నారు. బ్లడ్ క్యాన్సర్ ఉన్న రోగులకు ఇదొక ఆప్షన్ అని చెప్పారు. దీని నుంచి ప్రయోజనం పొందవచ్చని తెలిపారు.

ఫొటో సోర్స్, CORTESIA/CITY OF HOPE
హెచ్ఐవీతో కలిసి జీవించడం
జార్జియాలోని టోకోవా పట్టణంలో ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగారు ఎడ్మండ్స్. ఇక్కడ జనాభా కేవలం 10 వేల మంది మాత్రమే.
ఆధ్యాత్మికత, పట్టింపులు ఎక్కువున్న సమాజంలో పెరిగినప్పటికీ, ఆయన తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఎడ్మండ్స్‌ను ఏ విషయంలోనూ కుంగిపోయేలా చేయలేదు.
ఎడ్మండ్స్ స్వలింగ సంపర్కుడని తెలిసినప్పటికీ, ఆయన తల్లిదండ్రులు తనని తిరస్కరించలేదు.
1976లో 21 ఏళ్ల వయసులో ఎడ్మండ్స్ కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరానికి తరలి వెళ్లారు. అప్పుడు అక్కడ గే ఉద్యమం చాలా ఉధృతంగా సాగేది.
కానీ, 1980లో చాలా మంది అనారోగ్యం బారిన పడ్డారు. ‘‘ఇది చాలా భయంకరంగా అనిపించింది. ఏం జరుగుతుందో ఎవరికి తెలియలేదు. ప్రజలు ఇదొక కొత్త వ్యాధి, ‘గే క్యాన్సర్’గా పిలిచేవారు. ప్రజలెంతో భయపడ్డారు’’ అని ఎడ్మండ్స్ ఆ రోజులను గుర్తుకు చేసుకున్నారు.
ఈ వ్యాధిని బయటపడిన కొద్ది కాలంలోనే చాలా మంది హెచ్ఐవీ పేషెంట్లు మరణించేవారు.
మరణాలు భారీగా పెరిగాయి. వార్తాపత్రికల్లో స్నేహితులు, సహచరుల పేర్లు చూసి చాలా భావోద్వేగానికి లోనయ్యేవాడినని ఎడ్మండ్స్ చెప్పారు.
1988లో ఆయన హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో తనకసలు ఎలాంటి లక్షణాలూ లేవన్నారు. కానీ, ఈ వైరస్ తన శరీరంలో ఉండి ఉండొచ్చనే అనుమానంతో తాను ఈ పరీక్ష చేయించుకున్నట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, CORTESÍA CITY OF HOPE
క్లినిక్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న ఒక అమ్మాయి వచ్చి తన పరీక్షా ఫలితాలను ఇచ్చిందని ఎడ్మండ్స్ చెప్పారు.
‘‘నాకెలా చెప్పాలో ఆమెకసలు అర్థం కాలేదు. ఆమెకిది చాలా కష్టంగా అనిపించింది. ఆ విషయం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. నాకు కూడా ఇది షాక్‌గా అనిపించింది.’’ అని ఎడ్మండ్స్ తెలిపారు.
‘‘అది మాత్రమే కాదు, నాకు ఎయిడ్స్ కూడా సోకినట్లు తెలిసింది. ఎందుకంటే నా టీ లింఫోసైట్ కౌంట్(సీడీ4) 200 (ప్రతి క్యూబిక్ మిల్లీమీటర్ రక్తానికి) కంటే తక్కువగా ఉంది. దీన్ని అధికారికంగా ఎయిడ్స్‌గా పేర్కొంటారు’’ అని ఎడ్మండ్స్ చెప్పారు.
స్నేహితుల మాదిరే తన పరిస్థితి కూడా మారుతుందని ఎడ్మండ్స్ తీవ్ర మనస్తాపం చెందారు.
ఈ సమయంలో ఆయన బాగా మద్యం అలవాటు చేసుకున్నారు.
కానీ, ఆ తర్వాత ఇలా ఉండటం సరికాదని భావించి, తన ఆరోగ్యంపై దృష్టిపెట్టారు . క్రమం తప్పకుండా చికిత్స తీసుకున్నారు.
‘‘కొత్త మెడిసిన్ వచ్చిందని తెలిసినప్పుడు, అవి తీసుకోవడం ప్రారంభించాను. అవి తీసుకున్నప్పుడు చాలా బాధాకరంగా అనిపించేది. ఎందుకంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. వాటి నుంచి తప్పించుకునేందుకు, చికిత్సలో గంజాయిని కూడా నేను తీసుకునే వాడిని’’ అని ఎడ్మండ్స్ చెప్పారు.
1992లో ఆయన తన భాగస్వామి అర్నోల్డ్ హౌస్‌ను కలిశారు. ఆయన్ను కూడా హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవాలని ఎడ్మండ్స్ ఒప్పించారు.
‘‘ఆయనకు కూడా పాజిటివ్ అని వచ్చింది. ఇది షాక్‌కు గురి చేయడం కంటే తక్కువేమీ కాదు. కానీ, ఆయన పట్టుదలగా, జీవితాన్ని ముందుకు సాగించారు’’ అని ఎడ్మండ్స్ చెప్పారు.
2014లో ఎడ్మండ్స్ తన భాగస్వామిని చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. చూడగానే మనం ఒక్కసారిగా ఏ ఆకర్షణకు లోనవుతామో, అది అలానే నిలిచిపోతుందన్నారు. తాము కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విడిగా ఉండలేదన్నారు.

ఫొటో సోర్స్, CORTESÍA CITY OF HOPE
దాతల కోసం అన్వేషణ
2018లో క్యాన్సర్‌గా మారే అవకాశమున్న మైలోడిస్‌ప్లాస్టిక్ సిండ్రోమ్ (ఎండీఎస్) ఎడ్మండ్స్‌కు సోకింది. ఆ తర్వాత కాలంలో మైలోయిడ్ లుకేమియాగా మారింది.
ఆయనలో ఎలాంటి లక్షణాలూ కనిపించేవి కాదు. ఆయన మాత్రం త్వరగా అలసిపోతుండేవారు. అప్పుడే ఈ క్యాన్సర్‌కు చికిత్సతో హెచ్ఐవీ కూడా తగ్గే అవకాశముందని వైద్యులు ఆయనకు చెప్పారు.
‘‘మూల కణాల మార్పిడి చికిత్సలో దాతల మూలకణాలను కాన్సర్ రోగి ఎముకల మూలకణాలతో మార్పిడి చేస్తారు’’ అని డాక్టర్ జనా చెప్పారు.
దీంతో హెచ్ఐవీపై వ్యాధినిరోధకత కలిగిన దాతల కోసం అన్వేషణ మొదలైంది. అయితే, ఇలాంటి వారు మొత్తం జనాభాలో ఒకటి నుంచి రెండు శాతం లోపే ఉంటారని వైద్యులు చెబుతున్నారు.
ఎడ్మండ్స్ ఆరోగ్య పరిస్థితి కూడా కాస్త క్లిష్టమైనది. క్యాన్సర్ చికిత్సగా ఆయనకు కీమోథెరపీ ఇవ్వాల్సి వచ్చింది. దీని వల్ల ఆయనలో రోగ నిరోధక శక్తి మరింత తగ్గింది. అప్పటికే హెచ్ఐవీ వల్ల ఆయనలో రోగ నిరోధక శక్తి చాలా తగ్గిపోయింది.
మొత్తానికి 2013లో 63 ఏళ్ల దాత దొరికారు. దీంతో మూలకణ మార్పిడి చికిత్స కూడా విజయవంతమైంది.
ప్రతికూల ప్రభావాలను పట్టించుకోకుండా కేవలం చికిత్సపైనే ఎడ్మండ్స్ దృష్టి సారించారు. ఆయనకు చాలా మంది నుంచి మద్దతు లభించింది.
ఇంతలో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి మొదలైంది. దీంతో హెచ్ఐవీ చికిత్స మధ్యలో నిలిపేయాల్సి వచ్చింది.
రెండేళ్ల తర్వాత మార్చి 2021లో యాంటీరెట్రోవైరల్ థెరపీని ఎడ్మండ్స్ పూర్తిగా నిలిపేశారు.
అప్పటి నుంచి హెచ్ఐవీ, లుకేమియాల ప్రభావాల నుంచి ఆయనకు విముక్తి లభించింది. అయితే, దీన్ని పూర్తి విముక్తి లభించడం కంటే ‘లాంగ్ రికవరీ’గా చెప్పాలని వైద్యులు అంటున్నారు.
‘‘ఆయన హెచ్ఐవీ నుంచి పూర్తిగా కోలుకున్నారని మేం చెప్పడం లేదు. రెండేళ్ల నుంచి ఆయన మందులు తీసుకోలేదు. అయినప్పటికీ ఆయన శరీరంలో హెచ్ఐవీ జాడలు మాకు కనిపించలేదు’’ అని డాక్టర్ జానా అన్నారు.
ఎడ్మండ్స్ పూర్తిగా కోలుకున్నారని నిర్ధారించడానికి మరింత డేటా అవసరమని నిపుణులు అంటున్నారు.
మరో ఐదేళ్ల తర్వాత కూడా ఆయనలో లక్షణాలు కనిపించకపోతే, పూర్తిగా ఆయన హెచ్ఐవీ నుంచి కోలుకున్నట్లుగా వైద్యులు నిర్ధరిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త ఆశలు
ఈ విధానంలో ప్రపంచవ్యాప్తంగా 15 మంది హెచ్ఐవీ బాధితులకు చికిత్స అందించారు. వీరిలో ఎనిమిది మంది మరణించారు. ఎడ్మండ్స్‌తోపాటు ఐదుగురు కోలుకున్నారు. మరో ఇద్దరు ఇప్పటికీ హెచ్ఐవీ మందులు తీసుకుంటున్నారు’’అని డాక్టర్ జానా చెప్పారు.
ఎడ్మండ్‌ను ‘‘సిటీ ఆఫ్ హోప్’’ పేషెంట్‌గా పిలుస్తున్నారు. మిగతావారు బెర్లిన్, లండన్, న్యూయార్క్, డెసెల్‌డార్ఫ్‌లకు చెందినవారు.
ఈ చికిత్సా విధానం ప్రస్తుతం చాలా మంది ప్రజలకు అందుబాటులో లేదు. ఎందుకంటే దీనిలో ముప్పు ఎక్కువ. పైగా దాతలను వెతికి పట్టుకోవడం కూడా చాలా కష్టం.
అందుకే క్యాన్సర్‌తో బాధపడుతున్న హెచ్ఐవీ రోగులకు మాత్రమే ప్రస్తుతం ఇది పరిమితమైంది. అయితే, ఇది విజయవంతంకావడంతో వైరస్ గురించి మరింత సమాచారం కూడా అందుబాటులోకి వస్తోంది. మిగతా రోగుల్లోనూ ఇది ఆశలను నింపుతోంది.
ఎడ్మండ్స్ మరికొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. కొన్ని అధ్యయనాల్లోనూ ఆయన పాలుపంచుకుంటారు.
‘‘క్యాన్సర్‌తో బాధపడే హెచ్‌ఐవీ రోగులకు చికిత్స దొరకడం చాలా కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇతర రోగుల్లోనూ ఇది ఆశలు చిగురింపచేస్తోంది’’ అని డాక్టర్ జానా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కెంటన్ పాట్స్: పెర్ల్ హార్బర్ దాడిలో మృతదేహాలను సేకరించిన వ్యక్తి... ఇప్పుడెలా మరణించారంటే
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- కేశవానంద భారతి: ఈ ఆధ్యాత్మిక గురువును ‘రాజ్యాంగ రక్షకుడు’ అని ఎందుకన్నారంటే
- ఐపీఎల్: DRS అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్'.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














